నీటి సమస్యను ఎలా అధిగమించాలి – ఇజ్రాయిల్‌ నేర్పుతున్న పాఠాలు

నీటి సమస్యను ఎలా అధిగమించాలి – ఇజ్రాయిల్‌ నేర్పుతున్న పాఠాలు

నీరు దేశ సంపద. వ్యక్తులది కాదు. ఇది భారతదేశం ఇజ్రాయెల్‌ నుంచి నేర్చుకోవలసిన గుణపాఠం. దేశవ్యాప్తంగా ఉన్న నదులలోని నీరు ఏ రాష్ట్రపు సొంత ఆస్తి కాదు. సమగ్ర భారతదేశానికి చెందిన జాతీయ సంపద. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు జాతీయ జల అనుసంధాన, జలాశయ నిర్మాణ ప్రక్రియల ద్వారా సరఫరా జరగాలి. అలా జరిగితే ప్రస్తుతం నీటి కోసం రాష్ట్రాల మధ్య నలుగుతున్న పోరాటాలకు తావుండదు. పైగా లాభార్జన జరుగుతుంది.

మనం నివసిస్తున్న భూగోళం సూర్యునికి ఉపగ్రహం. ఈ భూమిపై జీవరాశుల మనుగడకు నీరు, గాలి అవసరం. భూమి ఉపరితలంపై 71 శాతం సముద్ర నీటితో ఆవరించి ఉంది. కేవలం 29 శాతం మాత్రమే నేల. ఈ భూమిపైన వందలాది పెద్ద నదులు, వేల సంఖ్యలో ఉప నదులు, కొన్ని వందల సరస్సులు ఉన్నాయి. సముద్రాలు, నదులు, సరస్సులలోని నీరు సూర్యరశ్మి వలన ఆవిరి అయి పైపైకి లేచి, నిర్ణీత సమయాలలో వర్షం రూపంలో మళ్లీ భూఉపరితలంపై పడుతుంది. అలా పడిన నీరు నదులలో ప్రవహిస్తుంది. సరస్సులలో నిలువ ఉంటుంది. అలా జీవరాశులకు కావలసిన నీరు అందుతుంది. అరణ్యాలు ఎంత ఎక్కువైతే, ఆ ప్రాంతాలలో వర్షం అంత అధికంగా కురుస్తుంది. మానవుల ఉనికికి, అభివృద్ధికి, ఆహారోత్పత్తికి, త్రాగటానికి నీరు ఎంతో అవసరం. భూమికింద ఉన్న ఖనిజాల సేకరణకు, వివిధ దేశాలలో ఎన్నో రూపాలలో ఉన్న సంపదను ఉపయోగించుకోవడానికి దేశాల మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యుద్ధాలు జరుగుతున్నాయి.

20వ శతాబ్దం ఆదిలో ప్రపంచపు జనాభా 100 కోట్లు. గత 118 సంవత్సరాలలో ఇది బాగా పెరిగి ప్రస్తుతం 750 కోట్లకు చేరింది. ఒక్క భారతదేశంలోనే 20 కోట్ల నుండి 125 కోట్లకు పెరిగింది. ఇంత జనాభాకు సరిపడ ఆహార ధాన్యాలు ఉత్పత్తికీ, త్రాగుటకు, శుభ్రతకు కావలసినంత నీరు తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు ఖనిజాల కోసం, భూమిపై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగితే, ప్రస్తుతం నీటి కోసమే యుద్ధాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు జోర్డాన్‌ నదికి ఉపనది అయిన బనస్‌ నదిపై టర్కీ దేశం జలాశయాన్ని నిర్మించబోతుంటే, దానివలన తమకు కావలసిన నీరు జోర్డాన్‌ నదిలో మిగలదని ఇజ్రాయిల్‌ అభ్యంతర వ్యక్తం చేసింది. జలాశయం కోసం నిర్మించబోయే డ్యామ్‌ను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. దాంతో టర్కీ జలాశయ నిర్మాణాన్ని చేపట్టలేదు. అయితే ఇజ్రాయిల్‌కు బద్ధ శతృవైన సిరియా జోర్డాన్‌ నదీ ప్రవాహాన్ని దారి మళ్లించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇజ్రాయిల్‌ ఆ ప్రాజెక్టుని బాంబుల వర్షంతో ధ్వంసం చేసింది.

ఇక మన దేశానికి వస్తే.. కృష్ణా, గోదావరి, కావేరి జలాలను పంచుకోవడంలో నదీ ప్రవాహక రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగి చివరకు పోలీసు మోహరింపుల వరకు వచ్చింది. మనవద్దే కాదు, వివిధ దేశాల మధ్య, దేశంలోని ప్రాంతాల మధ్య నదీ జల వివాదాలు పెరుగుతున్నాయి. జనాభా ఎక్కువైపోతుండడం మూలాన, అరణ్యాల వైశాల్యం తగ్గి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా అమెరికాలోని అతిపెద్ద నది మిస్సోరి మిస్సిసిపి కొన్ని సంవత్సరాలుగా సముద్రాన్ని చేరడమే లేదట. ఈ నది ఎగువ ప్రాంతంలో ఒక జలబంధాన్ని (డ్యామ్‌)ను నిర్మించి, నీటిని మళ్లించి కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజిలిస్‌ నగరానికి నీటి సదుపాయం కల్పించారు. ఇలా నీటి ఎద్దడి ఎక్కువైన దేశాలలో మనదేశం ఒకటి. ఇక్కడ నదుల అనుసంధాన పథకాన్ని అత్యవసరంగా అమలు చేయాలని యోచిస్తున్నారు.

జలాభావాన్ని అధిగమించడం విషయంలో ఇజ్రాయిల్‌ దేశం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రస్తుత ఇజ్రాయెల్‌ భూభాగం ఇంతకుముందు అతి ప్రాచీనమైన పాలస్తీనా దేశంలో ఉండేది. ఆ ప్రాంతానికి చెందిన యూదు జాతీయులు 1900 సంవత్సరానికి ముందు వివిధ దేశాలకు వలస వెళ్లిపోయారు. అక్కడ నానారకాల బాధలకు గురయ్యారు. తిరిగి తమ ప్రాంతానికి చేరుకోవాలని అనుకున్నారు. 1930 నుండి తిరిగి రావడం ప్రారంభించారు. అయితే వారు తిరిగి వచ్చి సాగు చేసుకోవాలనుకున్న ప్రాంతం 60 శాతానికి పైగా ఎడారి. ఆ ప్రాంతం, ఇతర పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్‌వారి అధీనంలో ఉండేది. అది ఎడారి కావడంతో బ్రిటిష్‌ పాలకులు పాలస్తీనా ఎంత జనాభాను పోషించగలదని లెక్కలు వేశారు. వారి లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో జలాభావం వల్ల 20 లక్షల మంది కన్నా ఎక్కువమంది జీవనం సాగించలేరని తేల్చారు. తదనుగుణంగా యూదుల వలసను నియంత్రించేవాళ్లు. అక్కడ 1948లో బ్రిటిష్‌ పాలన అంతమయ్యాక వలస వచ్చిన యూదులు తమ ప్రాంతాన్ని ప్రత్యేక ఇజ్రాయెల్‌ దేశంగా ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముఖ్యంగా జలాభావ సమస్యను అధిగమించేందుకు కృషి చేశారు. దానితో అప్పుడు 20 లక్షల కన్నా ఎక్కువమంది ఉండజాలరనుకున్న విస్తీర్ణంలో ప్రస్తుతం 120 లక్షల మంది నివసిస్తున్నారు. అప్పుడు ఎడారులతో కూడిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు ఒక అద్భుతమైన దీర్ఘకాలిక, శాస్త్ర సాంకేతికతతో నీటిని పుష్కలంగా ఉత్పత్తి చేసుకుని సస్యశ్యామలంగా మారింది. తమకు సరిపోగా మిగిలిన నీటిని పక్కనే ఉన్న జోర్డాన్‌ నది పశ్చిమ తీర పాలస్తీనాకు, జోర్డాన్‌ దేశానికీ, గాజాకు ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తోంది. జలాభావాన్ని ఏ విధంగా అధిగమించ వచ్చో భారతదేశంతో సహా ఇతర దేశాలకు నేర్పుతున్నది. ప్రపంచం అంతటా అరణ్యాల విస్తీర్ణం తగ్గుతూ, ఎడారుల విస్తీర్ణం పెరుగుతుంటే; జలాభావంతో సంక్షోభాలు తలెత్తుతుంటే; ఇజ్రాయిల్‌ మాత్రం ఎడారిని తగ్గించి, అరణ్యప్రాంతం పెంచింది. సమస్యనే సంపదగా మలుచుకుంది. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

ఇజ్రాయిల్‌ దేశంలో పడుతున్న వర్షం, నదులలో ఉన్న నీరు, చివరకు ఇంటి మీద ఉన్న కుండలలో పడిన నీరు కూడా వ్యక్తి సంపదగా కాక, దేశ సంపదగా పరిగణిస్తారు. స్వతంత్ర దేశంగా ఏర్పడక ముందు నుంచే అంటే 1930వ దశకం నుంచే National water carrior అనే పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అమలుచేయడం ప్రారంభించారు. ఈ పథకం కింద కొన్ని యుగాల ముందు 8 వేల అడుగుల లోతులో రాతి పొరల కింద ఉన్న నీరును; మధ్యధరా సముద్రం నుంచి ఇజ్రాయిల్‌ దేశ తీర ప్రాంతాలలో భూమిక్రిందకు చొచ్చుకువచ్చిన ఉప్పు నీరును; నగరాలలో, పట్టణాలలో, భవనాలలో, ఇళ్లల్లో ఉత్పన్నమౌతున్న మురుగు నీరును శాస్త్రీయంగా, సాంకేతికంగా శుద్ధి చేస్తారు. ఆ నీటిని సేద్యానికి, తాగడానికి, పరిశ్రమలకు ఉపయోగిస్తారు. వ్యవసాయానికి నీటి పారుదల పద్ధతిగా కాక, బిందు సేద్యం ద్వారా, అది కూడా మొక్కల వేళ్లకు మాత్రమే సరఫరా చేసే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇలా చేసి ఎడారులను దట్టమైన హరిత ప్రాంతాలుగా మార్చారు, ఇంకా మారుస్తున్నారు. దేశంలో సగం వైశాల్యంతో ఉన్న నెగెవ్‌ ఎడారిలో కొన్ని వేల అడుగుల లోతు నుంచి నీటిని పైకి తెచ్చి చేపకొలనులు సృష్టిస్తున్నారు. గోధుమ బార్లీ పంటలను, అరటి పండ్లతో సహా వివిధ రకాలైన పండ్లతోటలను సాగుచేసి ఆహార సమృద్ధి సాధించారు. అంతేగాక మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

ప్రపంచంలో కెల్లా అత్యంత మందంగా ఉన్న మధ్యధరా సముద్ర జలాలను, మంచినీరుగా తయారుచేసే ‘Desalination Plants’ (ఉప్పు నీటి శుద్ధి కర్మాగారాలు)ను నెలకొల్పి విజయం సాధించారు. అమెరికా వంటి దేశాలలో కూడా ఇటువంటి కర్మా గారాలను ఇజ్రాయిల్‌ కంపెనీలు నిర్మిస్తు న్నాయి. ఈ కర్మాగారాల ద్వారా శుద్ధి అయిన నీరు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ పైపుల ద్వారా సరఫరా అవుతోంది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల శుభ్రత కోసం 75 శాతం నీటిని ఉపయోగిస్తున్నారు. దీనిని సగానికి తగ్గించడం కోసం కొత్త రకమైన flush tank (నీటిని అమిత వేగంతో పంపే యంత్రం) తయారు చేస్తున్నారు. సామాన్యంగా 30 శాతం నీరు సరఫరాకు ఉపయోగించే పైపులలో నుంచి లీకు అవుతుందట. దీన్ని సంపూర్ణంగా నిరోధించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో రంధ్రాలు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి, వెంటనే రిపేరు చేస్తున్నారు. పక్క దేశాల నుంచి మురుగునీటిని దిగుమతి చేసుకొని, శుద్ధి చేసి, తిరిగి ఆ దేశానికి అమ్ముతున్నారు. జాతీయ నీటి సరఫరా విధానాన్ని (National water carrior system) రూపొందించి, నిర్మించడం అత్యవసరంగా భావించి, దానికోసం దేశంలో సంవత్సరానికి ఉత్పత్తి చేసే సంపదలో 5 శాతాన్ని ఉపయోగించారు. ఈ ప్రణాళిక నిర్మాణ సమయంలో దేశంలోని 7 నుండి 14 శాతం మంది ప్రజలు శ్రామికులుగా పని చేశారు.

వ్యవసాయ పద్ధతులలో కొత్త సాంకేతికతను సృష్టించారు. ఫెర్టిగేషన్‌ను (Fertigation) కనిపెట్టారు. అంటే ఎరువులను నీటితో కలిపి మొక్కలకు అందించడం. Nutrigation అంటే పోషక పదార్థాలను నీటిలో కలిపి మొక్కలకు చేరవేస్తారు. మొక్కలకు నీరు కావలసిన సమయాన్ని యాంత్రికంగా కనిపెట్టి ఆ సమయంలో నీటి బిందువులను సరఫరా చేస్తారు. తక్కువ నీటిని కోరే, తక్కువ ఎత్తులోనే ఫలించే విత్తనాలను కనిపెట్టారు. శాస్త్రీయ సాంకేతిక నిపుణత ద్వారా నీటిని మనిషికి పనికొచ్చే పద్ధతిలో సేకరించి ఉపయోగించే పద్ధతిని ప్రపంచానికి నేర్పుతున్నారు. ఇజ్రాయెల్‌లో ఉపయోగించే నీటిలో 62 శాతం యాంత్రికంగా ఉత్పత్తి చేసినదే. మిగతా 38 శాతం వర్షాల వల్ల, నదులు, సరస్సుల నుంచి లభ్యమవుతోంది.

నీరు దేశ సంపద. వ్యక్తులది కాదు. ఇది భారతదేశం ఇజ్రాయెల్‌ నుంచి నేర్చుకోవలసిన గుణపాఠం. దేశవ్యాప్తంగా ఉన్న నదులలోని నీరు ఏ రాష్ట్రపు సొంత ఆస్తి కాదు. సమగ్ర భారతదేశానికి చెందిన జాతీయ సంపద. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు జాతీయ జల అనుసంధాన, జలాశయ నిర్మాణ ప్రక్రియల ద్వారా సరఫరా జరగాలి. అలా జరిగితే ప్రస్తుతం నీటి కోసం రాష్ట్రాల మధ్య నలుగుతున్న పోరాటాలకు తావుండదు. పైగా లాభార్జన జరుగుతుంది.

–  డా.త్రిపురనేని హనుమాన్‌ చౌదరి,  ప్రముఖ సాంకేతిక నిపుణులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సాంకేతిక సలహాదారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *