సాగరం మీద సంతకం

సాగరం మీద సంతకం

సముద్ర మార్గాలను ఉపయోగించుకుని సుదూర దేశాలతో సంబంధాలు నెలకొల్పుకొనే సంప్రదాయం భారతదేశంలో నాలుగువేల ఏళ్ల క్రితమే ఉంది. వాణిజ్య, దౌత్య సంబంధాలు రెండింటికీ కూడా సముద్రయానం ఉపకరించింది. కానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే ధోరణి భారతీయులకు తొలి నుంచీ లేదు. ‘సముద్ర మహారాజ్ఞి’కి (బ్రిటన్‌) ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు శతాబ్దాలు ఊడిగం చేసినా కూడా సముద్ర సంబంధ వ్యవహారాలు మన బుద్ధికి చేరలేదు. ఇదొక చారిత్రక వైచిత్రి. స్వతంత్ర భారతంలో ఎక్కువ కాలం అధికారం వెలగబెట్టిన వారు ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేశ ప్రయోజనాలలో, ముఖ్యంగా భద్రత కోణంలో పెద్ద అగాధమే ఏర్పడింది. అలా అని ఈ ఏడు దశాబ్దాల లోను ఆ అంశం పట్ల ఇదే ధోరణి కొనసాగింది అని చెప్పడం మాత్రం తొందరపాటు. ఈ లోటును గుర్తించిన వారు పలువురు ఉన్నా, ఇద్దరు గుజరాతీల దృష్టిని గురించి ప్రత్యేకంగా సమీక్షించుకోవాలి. ఈ ఇద్దరిలో మొదటివారు తొలి హోంశాఖ మంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్‌ పటేల్‌. రెండోవారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.

ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే లక్షద్వీప్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేయవలసిందని సర్దార్‌ పటేల్‌ రాయల్‌ ఇండియన్‌ నేవీ (అప్పుడు కూడా మన నావికాదళాన్ని ఆంగ్లేయులే నిర్వహించారు) అధికారులను ఆదేశించారు. అలా అక్కడ మన జెండా ఎగిరింది. కానీ ఆ ద్వీప సమూహంలోనే తన పతాకాన్ని ఎగరవేయడానికి పాకిస్తాన్‌ నౌక కూడా దాదాపు అదే సమయంలో అక్కడికి చేరిన విషయాన్ని చదివితే పటేల్‌ దూరదృష్టికి కైమోడ్పులు అర్పించకుండా ఉండలేం. లక్షద్వీప్‌ ముస్లింలు అధికంగా ఉన్న ద్వీపసమూహమన్న వాస్తవాన్ని ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచంలోనే చాలా అరుదుగా భారత్‌కు రెండు సముద్ర తీరాలు ఉన్నాయి. అయినా స్వతంత్ర భారతదేశంలో సముద్ర తీరం, జాతీయ ప్రయోజనాలు, భద్రతాంశాలు, వాణిజ్య ప్రయోజనాలు చిరకాలం నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. ఈ కీలక అంశం పట్ల దేశ పాలకులకు శ్రద్ధ లేకపోయింది. మాల్దీవులలోని ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్‌ ప్రేరేపిత ముస్లిం ఫండమెంటలిస్టులు చెట్టాపట్టాలేసుకోగలడం, శ్రీలంక తమిళపులులతో పీపుల్‌వార్‌ నక్సలైట్ల ఆలింగనాలు, ఆఖరికి పాక్‌ నుంచి బొంబాయి తీరం చేరి తాజ్‌ ¬టల్‌లో, శివాజీ టెర్మినస్‌లో, ట్రైడెండ్‌ హోటర్‌ తదితర చోట్ల రక్తపాతం సృష్టించి 166 మందిని బలి తీసుకోవడం – ఇవన్నీ కూడా సముద్ర తీరం పట్ల వహించిన నిర్లక్ష్యం ఫలితాలే. వీటితో భారత్‌ చెల్లించిన మూల్యం అంచనాకు అందదు. మళ్లీ తీరానికి ఉన్న ప్రాధాన్యం పట్ల సునిశిత దృష్టిని కనపరచిన నాయకుడు నరేంద్ర మోదీ. ఈ కోణంలో మోదీ చూపిన శ్రద్ధ, మారిన విదేశాంగ విధానం, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులను వివరించిన అరుదైన పుస్తకం ‘ఇండియాస్‌ ఓషన్‌ నైబర్‌హుడ్‌: నరేంద్ర మోదీస్‌ స్ట్రేటజీ ఇనిషియేటివ్స్‌’. ఆచార్య ఎస్‌వి శేషగిరిరావు ఈ పుస్తకం రచించారు. ‘ఎండ్‌ ఆఫ్‌ కమ్యూనిస్టు ఉటోపియా’, ‘పొలిటికల్‌ ఇస్లాం ఇన్‌ ఇండియా’ వంటి గహనమైన అంశాలతో పుస్తకాలు రాసిన రచయిత ఆచార్య శేషగిరిరావు. ఇప్పుడు ఈ పుస్తకం కూడా అదే లోతుతో, అదే చిక్కదనంతో మనకు అందించారు. మోదీ విదేశ వ్యవహారాల గురించి అనాలోచితంగా మాట్లాడు తున్నవారికి ఇదొక అద్భుతమైన జవాబు.

హిందూ మహాసముద్ర ప్రాంతం, ‘ఏసియన్‌’ కూటమి దేశాలతో భారత్‌ బంధాలు అనే అంశం ఇందులో ప్రధానంగా చర్చించారు రచయిత. ఆసియా దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కీలకమైనది హిందూ మహాసముద్రం. కానీ ఉత్తరపు పొరుగు పాకిస్తాన్‌, చైనాలను మాత్రం దృష్టిలో ఉంచుకుని మిగిలిన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని తొలినాటి ప్రధానులు నిర్లక్ష్యం చేశారు. 1960లో రక్షణ బడ్జెట్‌లో నావికాదళం వాటా 4 శాతం. దీనినే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి చేర్చారు. అంటే మోదీ వచ్చిన తరువాత పరిణామం. మోదీ అధికారం చేపట్టిన సంవత్సరమే (2014) యాక్ట్‌ ఈస్ట్‌ విధానం ప్రకటించారు. మైన్మార్‌లోని నే పి టాలో జరిగిన 12వ ఏసియన్‌ కూటమి సమావేశంలో ఆయన భారత్‌ కొత్త విధానం ప్రకటించారు. ‘భారత్‌లో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీ కరణ, వాణిజ్యరంగాలకు సంబంధించి కొత్తశకం ఆరంభమైంది. బయట ప్రపంచానికి సంబంధించి లుక్‌ ఈస్ట్‌ (1993లో పీవీ ప్రకటించినది) విధానం యాక్ట్‌ ఈస్ట్‌ విధానంగా మారిందని చెప్పారు. ఏసియన్‌ సభ్య దేశాలతో, తూర్పుదేశాలతో ఆర్థిక, సైనిక సంబంధాలను విస్తరించుకోవడమే ఈ విధానంలో కీలకం. ఆసియా, పసిఫిక్‌ దేశాలతో స్నేహ సంబంధాలు ముఖ్యం. నిరంతర చర్చలతో దీనిని సాధించాలని కూడా నిర్దేశించుకున్నారు. నిజానికి ఏసియన్‌ కూటమిలో భారత్‌ సభ్య దేశం కాదు. కానీ ఈ కూటమి దేశాలతో చైనా పెంచు కుంటున్న సంబంధాలను బట్టి భారత్‌ చొరవ చూపవలసి వచ్చింది. మారిన ప్రపంచ పరిస్థితులు కూడా ఇందుకు మరో కారణం. సముద్ర తీరానికి సంబంధించి చైనాతో విభేదాలు కలిగిన పది దేశాలు ఏసియన్‌ కూటమిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చిన అంశమైంది. అప్పటి నుంచి భారత్‌ విదేశాంగ విధానం, సముద్ర విధానం కొత్త మలుపు తిరిగాయి. వాణిజ్యానికి ప్రాధాన్యం ఇచ్చే నేతగా మోదీకి ప్రపంచ దేశాలలో ఖ్యాతి దక్కింది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత భారత ప్రాధాన్యం ఎంతో పెరిగింది. హిందూ మహాసముద్రం ద్వారా జరిగే వాణిజ్యం పెరిగింది. ఏసియన్‌ దేశాలతో ఇప్పుడు భారత్‌ 80 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం నిర్వహిస్తున్నది. ఇది భవిష్యత్తులో 200 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఆ విధంగా కూడా హిందూ మహా సముద్రం అంశంలో ఒక స్పష్టమైన విధానాన్ని మోదీ అమలు చేయడానికి నిశ్చయించుకున్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత (1990) ఇలాంటి ఒక పరిణామం అంతర్జాతీయ సంబంధాలలో చోటు చేసుకుంది. భారత్‌, చైనా ఆర్థిక వ్యవస్థలుగా బలపడుతున్న క్రమం ఇందుకు దోహదం చేసింది. ఇంకోమాటలో చెప్పాలంటే చైనా దుందుడుకు విదేశాంగ విధానమే మోదీ చేత ఇలాంటి వ్యూహాత్మక విధానం వైపు అడుగులు వేయించింది.

ఆచార్య శేషగిరిరావుగారి పుస్తకంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. తొలి అధ్యాయం హిందూ మహాసముద్ర ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని కూలంకషంగా ఆవిష్కరించింది. రెండో అధ్యాయం ఆర్థిక జోన్ల గురించి. భారత్‌, భారత్‌ ఇరుగుపొరుగు దేశాల సముద్ర సరిహద్దులను గురించి మూడో అధ్యాయం వివరించింది. నాలుగో అధ్యాయం భారత అధీనంలోని తీరంలోని ఆర్థిక జోన్‌లలో వనరులను వివరిస్తుంది. ఐదో అధ్యాయం హిందూ మహాసముద్ర తీరంలోని దేశాల సుస్థిరత గురించి తెలియచేసింది. ఆరో అధ్యాయం చైనా హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకు రావడానికి చేస్తున్న యత్నాలను వర్ణించింది. ఏడో అధ్యాయం తీరదేశాలలో భారత్‌ వ్యూహాత్మక వనరుల గురించి వివరించింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ ప్రాంతంలో పెరిగిన భారతీయ ప్రాబల్యం గురించి చెప్పింది ఎనిమిదో అధ్యాయం. తొమ్మిదో అధ్యాయంలో భారతీయ నావికా దళ పాటవం వివరించారు. ఈ అంశాలన్నీ మ్యాప్‌ల సాయంతో వివరించడం వల్ల పాఠకులు సులభంగానే గ్రహించ గలుగుతారు.

చైనా వైఖరిని, అది ఆసియా రాజ్యాలలోకి చొచ్చుకు వస్తున్న తీరును గమనిస్తే ఒకింత కలవరం కలుగుతుంది. ఈ అంశం కూడా శేషగిరిరావుగారు లోతుగా చర్చించారు. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్‌లో నౌకాశ్రయం నిర్మించి ఇచ్చింది. శ్రీలంకలోని హంబంటోటాలో కూడా నౌకాశ్రయం నిర్మించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో కూడా ఒక నౌకాశ్రయం ఏర్పాటు చేసింది. అంటే భారత్‌కు మూడు పక్కల చైనా తన పాగా వేయడానికి పునాదులు నిర్మించి ఉంచింది. అయితే భారత చరిత్రలో కనిపించే విధంగానే వాణిజ్య ప్రయోజనాల కోసం సముద్ర తీరాన్ని శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగించు కోవాలన్నది భారత్‌ విధానం. కొన్ని భౌగోళిక పరిస్థితులు ఒక దేశానికి కనిపించని శక్తిగా నిలబడుతూ ఉంటాయి. సముద్రతీరం కూడా అంతే. ఈ తీరాన్ని దేశ రక్షణకు, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తెలియాలి. ఆ వాస్తవాన్ని బలంగా గుర్తించినవారు మోదీ. సముద్రతీరంలోని ఇరుగుపొరుగులతో నెరిపే సంబంధాలకు ఉన్న ప్రాధాన్యం గురించే, ఆ ప్రాధాన్యాన్ని మోదీ గుర్తించిన తీరు గురించే ఆచార్య శేషగిరిరావు వివరించారు. ఇందులో ఆర్థికాభివృద్ధి కోణం ఉంది. రక్షణ ప్రయోజనాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రం ఇప్పుడు అణు జలాంతర్గాములతో నిండిపోయి ఉందట. అవన్నీ భారత్‌ పేరు చెబితే నిరంతరం కాలుదువ్వుతూ ఉండే చైనాకు చెందినవన్న వాస్తవం కూడా మనలను కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో మోదీ తీసుకున్న యాక్ట్‌ ఈస్ట్‌ ఎంత వాస్తవిక విధానమో దేశం గుర్తించాలి. ఈ పుస్తకం చదివితే దేశ ప్రయోజనాల విషయంలో తీసుకునే నిర్ణయా లను విమర్శించేటప్పుడు సంయమనం పాటించా లన్న తెలివిడి, ఇంగిత జ్ఞానం ఉండాలని అర్థమవు తుంది. లోతైన పరిశోధన, సరళమైన ఆంగ్లం వల్ల, మ్యాప్‌ల వల్ల ఈ పుస్తకం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా ఆసక్తిగా చదవగలరు.

ఇండియాస్‌ ఓషన్‌ నైబర్‌హుడ్‌

నరేంద్ర మోదీస్‌ స్ట్రేటజీ ఇనిషియేటివ్స్‌

రచన : ఎస్‌వి శేషగిరిరావు,

పుటలు :186

వెల : రూ.200/-

ప్రచురణ : విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఘట్‌కేసర్‌, మేడ్చెల్‌ మండల్‌- 501 301, తెలంగాణ.

 

 

– ఎస్‌.వి. శేషగిరిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *