మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

భారతదేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాలలో యువతకు, రైతులకు, రైతు కూలీలకు ఉపాధిని కల్పించే ఉత్తమ గ్రామీణ పరిశ్రమ వ్యవసాయమే. వ్యవసాయ ఉత్పత్తులు మానవాళి మనుగడకు, పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా చేయుటకు, తద్వారా గ్రామీణ భారతావని ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అందుకే వ్యవసాయం, గొడ్డు-గోదా, ఆవు-దూడ సంరక్షణ మన సంస్కృతిలో భాగం అయ్యాయి.

అందుకే పెద్దలంటారు భారతదేశ ప్రగతిని పల్లెల్లో దర్శించవచ్చు అని. కానీ ఇంతటి మ¬న్నతమైన, గౌరవ ప్రదమైన, జీవనాధారమైన మన వ్యవసాయరంగం పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైంది. మద్దతు ధరలు లేక వ్యవసాయం భారమై ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలస పోతున్నారు. వ్యవసాయ దిగుబడులు రానురాను పడిపోతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధి గణనీయంగా జరిగితే, దేశాభివృద్ధితో పాటు ప్రజల జీవన స్థితిగతులు కూడా గణనీయంగా పెరుగుతాయనేది అందరికి తెలిసిందే. అయినా రైతులకు కావలసిన కనీస సౌకర్యాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పూర్తిస్థాయి దృష్టి పెట్టకపోవడంతో నష్టాలు, అప్పులు ఎక్కువయి, రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమైన విషయం. కంటి తుడుపు చర్యల్లో భాగంగా కొన్ని కమిటీల సిఫారసులను పాక్షింగా అమలు చేసే ప్రయత్నాలు జరిగినప్పటికి రైతులపై గత ప్రభుత్వాలకు తగినంత చిత్తశుద్ధి లేకపోవటం విచారకరం.

2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భాజపా ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా పలు పథకాలు ప్రకటించింది. ప్రతి సంవత్సరం మద్దతు ధరల పెంపు, పంటల బీమా, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సౌకర్యాలు, కృషి సించాయి యోజన, తాజాగా పెట్టుబడి సాయం వంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వటం ప్రారంభమయ్యాయి. దీంతో రైతుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి.

రైతు అభిలషించేది కేవలం పంట నుండి అధిక ఉత్పత్తి, దానిని సకాలంలో మంచి ధరకు అమ్ముకోవటం, డబ్బు వెంటనే చేతికందటం, ప్రకృతి ఒడిదుడుకులు వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం నుండి తగిన రక్షణ.

వ్యవసాయాభివృద్ధి జరిగి, రైతు సంక్షేమంగా ఉండాలంటే రైతుకు ప్రధానంగా కావలసినవి సారవంతమైన నేల, సాగునీరు, పెట్టుబడి, ఆయా ప్రాంతాలకు అనువైన పంటలపై అవగాహన, పంట అధికోత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పంటకు అవసరమైన వనరులు (ఎరువులు, విత్తనాలు, కీటక నాశినులు మొదలైనవి), గిట్టుబాటు ధర, మౌలిక సదుపాయాలు (గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, మార్కెట్‌ యార్డులు మొదలైనవి), వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు, ప్రాసెసింగ్‌ కేంద్రాలు మొదలైనవి. వీటిని దృష్టిలో యుంచుకొని మోదీ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా పలు పథకాలను ప్రకటించింది. వీటిని సమర్థంగా అమలుచేసి 2022 సంవత్సరానికి రైతు ఆదాయాన్ని రెండింతలు చేయాలని సంకల్పించింది.

వ్యవసాయాన్ని వృద్ధిబాట పట్టించటానికి ప్రధానమైంది పెట్టుబడి. వ్యవసాయంపై గత యుపిఏ ప్రభుత్వం 2008-14 మధ్య కాలంలో రూ.1,21,082 కోట్లు ఖర్చుచేయగా మోదీ ప్రభుత్వం 2014-18 మధ్య రూ.2,11,684 కోట్లు కేటాయించింది. అంటే కేటాయింపులు రెండింతలు పెంచటం గమనార్హం. మరో ప్రత్యేకమైన విశేషం ఏమంటే 2019-20 సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యవసాయ (తదితర రంగాలతో కలిపి) రంగ బడ్జెట్‌ రూ.1.41 లక్షల కోట్లు కాగా- ఇది యుపిఏ ప్రభుత్వంలో 2009-14 5 సంవత్సరాల్లో కలిపి కేటాయించిన బడ్జెట్‌ రూ.1.21 కోట్ల కన్నా ఎక్కువ అంటే ఆశ్చర్యమే. వ్యవసాయ ఋణాలు 2018-19 సంవత్సరానికి 11.68 లక్షల కోట్లు కేటాయించారు. కేటాయించిన మొత్తం 11.68 కోట్ల ఋణం ఇవ్వటం విశేషం. ఈ కేటాయింపుల వల్ల ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 279.51 మి.టన్నులు (2017-18) జరిగింది. పప్పుధాన్యాల నిల్వ 1.5 లక్షల టన్నుల నుండి 2 లక్షల టన్నులకు పెరిగింది. అదేవిధంగా పాల ఉత్పత్తి 2013-14 సంవత్సరం కన్నా 2016-17 సంవత్సరంలో 18.81 శాతం పెరిగింది.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి

రైతులకు సాగుకు అవసరమైన పెట్టుబడులు ప్రధానంగా పంట ఋణాల రుణాల రూపంలో కల్పిస్తారు. ఇందుకు అదనంగా రైతుకు భరోసా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకాన్ని రూ.75 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపుతో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు పొలం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఈ నగదు బదిలీ కార్యక్రమం సంవత్సరంలో మూడు దఫాలుగా జరుగుతుంది. మొదటి దఫాగా ఇప్పటికే ప్రభుత్వం రూ.5 వేల కోట్ల డబ్బును 2.6 కోట్ల రైతులకు జమ చేశారు. ఈ బృహత్తర పథకం ద్వారా సుమారు 12 కోట్ల పైనే ఉన్న కుటుంబాలకు చేయూత అందుతుంది. ఈ సాధారణ సాయం వల్ల రైతు కొంత ఉత్సాహాన్ని పొందగలడనేది ప్రభుత్వ భావన. ఆ ఉత్సాహంతో ఉత్పాదకతను, ఉత్పత్తులను పెంచి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తాడని ఆలోచన.

ఋణాలకు వడ్డీ రాయితీ

రైతులు తీసుకొనే పంట ఋణాలపై ఒక ఏడాదిపాటు మూడు లక్షల వరకు వడ్డీ రాయితీని కల్పిస్తున్నారు. రైతులు ఋణాలను సకాలంలో చెల్లిస్తే 3 శాతం రాయితీ కల్పించి, 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 2శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. సాగు కోసం అవసరమైన రుణాన్ని సకాలంలో పొందేందుకు వీలుగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రైతులకు అందించారు. దీనిద్వారా అవసరమైన రుణాన్ని బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అప్పటికప్పుడు రైతు డ్రా చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ పంట రుణాల పరిమితిని ఇంటి అవసరాల నిమిత్తం పెంచే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

భూసారాన్ని తెలిపే కార్డులు

పంటలో అధిక దిగుబడి సాధించటానికి భూమి సారవంతంగా ఉండటం అవసరం. అందుకోసం పొలంలో పోషకాల స్థితిగతులను తెలుసుకొనుటకు ప్రభుత్వం భూసార ఆరోగ్య కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులు పొలంలో ఉన్న పోషక విలువలను నిర్ధారించి, ఆయా పొలాల్లో ఏ ఏ పంటలు వేసు కొంటే లాభసాటిగా ఉంటుందో, ఏ ఏ మోతాదుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్‌, గంధకం, జింక్‌, కాల్షియం, ఇతర సూక్ష్మధాతు పోషకాలను పొలాల్లో వేయాలో తెలియజేస్తాయి. వీటిని 2015-18 సంవత్సరాల్లో 13 కోట్ల మంది రైతులకు అందజేశారు. దీనిద్వారా విచక్షణా రహితంగా వాడే ఎరువులను తగ్గించి రైతుకు ఖర్చు తగ్గి, పంటలకు సమతుల్యంగా పోషకాలు అంది, మంచి దిగుబడి పొందేందుకు వీలయింది.

యూరియాకు వేపపూత – తగ్గిన ఖర్చు

ఇందులో భాగంగానే నత్రజని వినియోగశాతాన్ని పెంచటానికి యూరియాకు వేపపూత పూశారు. దీనివల్ల యూరియాలోని నత్రజని ఒకేసారిగా మొత్తం విడుదల కాకుండా మొక్కకు కావలసినంత మాత్రమే విడుదలవుతుంది. అలా యూరియా నుండి మొక్కకు ఎప్పుడు ఎంత కావాలో అంత విడుదల అవుతుంది. దీనివలన నత్రజని వృథాగా పోకుండా యూరియాలో నిల్వ ఉంటుంది. దానితో నత్రజని కోసం మాటిమాటికీ యూరియా వాడవలసిన అవసరం రైతుకు తగ్గుతోంది. అదేవిధంగా పొలంలో అధికంగా నత్రజని ఇంకిపోయే ప్రమాదం లేనందున, భూమి త్వరగా దెబ్బతినకుండా ఉండటం వీలవుతుంది.

ఎరువుల నిరంతర సరఫరా

రైతులకు రాయితీలపై ఎరువులను వేగంగా సరఫరా చేయుటకు, ఎరువుల కర్మాగారాలకు ఇవ్వవలసిన సబ్సిడీ బకాయిల కోసం మోదీ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనితో రైతులకు కావలసిన ఎరువుల సరఫరా నిరాటంకంగా జరుగుతున్నది.

సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం

‘పరంపరాగత కృషి యోజన పథకం’ ద్వారా ప్రాచీన కాలం నుండి అమలులో ఉన్న సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఆరోగ్యకర పంటల ఉత్పత్తులను మంచి పోషకాలతో, వినియోగదారులకు అందుబాటులోకి తేవటంతో పాటు, భూసారాన్ని దీర్ఘకాలం కాపాడుతుంది. సేంద్రియ పంటల వల్ల ప్రజల ఆరోగ్యమూ కుదుటపడుతుంది. ఈ పథకం కింద సిక్కింలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టారు. సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టిన పలు ప్రాంతాల్లో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతున్నట్లు అందుతున్న సమాచారం భూసారానికి, కాలుష్య రహిత వాతావరణానికి చిహ్నం. ఇది మెల్లగా దేశవ్యాప్తంగా ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం వేగంగా జరుగుతోంది.

సాగునీరు – కృషి సించాయి యోజన

పంటల సాగుకు భూమి తర్వాత అత్యంత అవసరమైనది సాగునీరు. ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన సాగునీరు అందించటానికే ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 28.5 లక్షల హెక్టార్లలో పంటలకు సాగునీటిని అందుబాటులోకి తెచ్చారు.

వ్యవసాయం సాఫీగా సాగి పంటల నుండి ఆశించిన దిగుబడులు సాధించాలంటే సాగునీటి లభ్యత ఆవశ్యం. వ్యవసాయ ఆధారమైన మన దేశంలో నేటికీ 50-60 శాతం పొలాలు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందువలన రైతులు ప్రకృతి కరుణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అనావృష్టి ఎదురైతే పంట చేతికి రాక అష్టకష్టాలు పడుతూ దుర్బర జీవితాన్ని గడపటం మనందరికి తెలిసిందే. వర్షాధారపు వ్యవసాయంలో కూడా వృద్ధిని సాధించి రైతులకు అండగా నిలబడేందుకు స్వతంత్ర జాతీయ వర్షాధారపు వ్యవసాయ సంస్థ ద్వారా ప్రభుత్వం ఇతోధికంగా సేవలందిస్తోంది. ఇందులో భాగంగా ఫారంపాడ్స్‌ ఏర్పాటు ద్వారా పంటలకు తడిని అందిస్తారు. దీనిద్వారా నీటి వృథా తగ్గి, ప్రతి పొలానికి నీరు అందుతుంది. ‘క్రిషి సించాయి యోజన’ పేరుతో అమలుచేస్తూన్న ఈ పథకం ద్వారా ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు వస్తున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానం

భూమి, నీటి సౌకర్యం, పెట్టుబడులతోపాటు భూమి స్థితి, ఆయా వాతావరణానికి అనువైన పంటలపై అవగాహన, వాటి సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు, విత్తే సమయం, ఎరువులు, నీటి తడులు, మొక్కల సాంద్రత, వ్యవసాయ పనిముట్లు, చీడ పీడల యాజమాన్యం, పంట కోత, తదనంతర ప్రాసెసింగ్‌ నుండి అమ్మకం వరకు అన్ని అంశాలపై సమగ్ర పరిశోధనల ద్వారా రూపొందించి తగిన పరిజ్ఞానాన్ని రైతులకు సకాలంలో అందించాలి. దీనికోసం జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ద్వారా ఉత్తమమైన, నాణ్యమైన విత్తనాలను, పరిజ్ఞానాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో రైతులకు అందుబాటు లోనికి తెస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సూచనలు, మార్కెట్‌ ధరల సమాచారాన్ని నిత్యం రైతులకు తెలియచేస్తున్నారు.

ఫసల్‌ భీమా యోజన

అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, చీడపీడల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించడంపై కూడా మోదీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనికోసం ‘ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన’ ప్రవేశపెట్టారు. దీనిని ఒకరకంగా పంట బీమా అని కూడా అనుకోవచ్చు. పంటల బీమా ఎన్నో ఏళ్ల నుండి అమలులో ఉన్నప్పటికి ప్రస్తుత పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మలిచి ఆచరణలోకి తెచ్చారు. దీనికోసం రైతు భరించగల నామమాత్రపు ప్రీమియం తీసుకుంటున్నారు. రైతు పై పరిస్థితుల్లో నష్టపోతే ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది.

గిట్టుబాటు ధరలు

రైతు సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషిస్తాడు. ఆ దిశలో మోదీ ప్రభుత్వం ఆలోచించి 22 రకాల పంటలకు సాగు ఖర్చు కన్న 50 శాతం అధికంగా లాభాన్ని చేర్చి, గణనీయంగా మద్దతు ధరలు నిర్ణయించింది. ఈ పెంచిన అదనపు ధరలు ఆయా పంటనుబట్టి 50.09 శాతం నుండి 112.5 శాతం వరకూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా వర్షాధార పంటలైన చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలకు ధరలు అధికంగా పెంచారు. దీనివల్ల వర్షధార పంటలపై ఆధారపడిన రైతుల జీవనం మెరుగుపడుతున్నది. ముందుముందు ఈ మద్దతు ధరలను మరింత పెంచేవిధంగా ప్రభుత్వం యోచిస్తున్నది.

ఇ-మార్కెట్‌

అయితే పెంచిన మద్దతు ధరల నుండి రైతులు పూర్తిస్థాయిలో లాభం పొందాలంటే దేశవ్యాప్తంగా మార్కెట్‌ ధరల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసు కోవాలి. దీనివల్ల ఎక్కడ ఖర్చు కన్నా ధర అధికంగా వస్తుందో తెలుసుకుని అక్కడ అమ్ముకునే విధంగా వీలవుతుంది. ఇలా మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న 585 మార్కెట్‌ యార్డులను వెబ్‌సైట్‌ ద్వారా అనుసంధానం చేశారు. దీనినే ఈ-మార్కెట్‌ అంటున్నారు. దీనిద్వారా ఇప్పటికి 87 లక్షలమంది రైతులు 164.5 లక్షల టన్నులు వ్యవసాయ ఉత్పత్తులపై కొనుగోలు అమ్మకాల లావాదేవీలు జరిపి లాభాలు పొందారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 22 వేల చిన్న కొనుగోలు యూనిట్లను గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌లుగా రూపొందించి, వీటిని కూడా జాతీయ మార్కెటింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేసి, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మంచి ధరలు వచ్చే విధంగా తోడ్పడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు అనుబంధంగా శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటి మాలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. దీనివల్ల రైతులకు మరింత అధికధర లభించే అవకాశం ఉంది.

అయితే ఈ సౌకర్యం ద్వారా రైతులు లబ్ది పొందాలంటే, వారు పండించిన పంట ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం అనుమతి పొందిన సంస్థల ద్వారానే కొనుగోలు, అమ్మకాలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చూపిన శ్రద్ధ వలన 2014-15 నుండి 2018-19 మధ్య 93.87 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాలను రూ.44142.5 కోట్ల విలువకు ప్రభుత్వం సేకరించగలిగింది. ఇది 2008-10 నుండి 2013-14 యుపిఎ కాలంలో 7.28 లక్షల మెట్రిక్‌ టన్నులు రూ.3117.38 కోట్ల విలువే కావటం గమనార్హం. ఎన్‌డిఎ కాలంలో 13 రెట్లు పెరగటం ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియచేస్తోంది.

రైతు సంక్షేమం కోసం, వ్యవసాయంలో వృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఇటువంటి వినూత్న పథకాలను చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. తద్వారా రైతులకు ఏటా లభించే ఆదాయాన్ని 2022 సంవత్సరానికి రెండింతలు చేసే దిశగా పురోగ మిస్తుంది. ప్రస్తుతం రైతు తాను ఒంటరివాడిననే భావన నుండి బయటపడి ప్రభుత్వ అండతో ధైర్యంగా ముందుకెళుతున్నాడు.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, 9989625230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *