పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

ఇరవై ఒక్క మాసాలు దేశాన్ని అంధకారంలో మగ్గేటట్టు చేసిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి 1977 జనవరిలో తొలగిపోయింది. లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసేతర పక్షాల కలయికతో జనతా పార్టీ అవిర్భవించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించారు. ఆ ఎన్నికలు స్వతంత్ర భారత చరిత్రలోనే కీలకమైనవి. ఊహించినట్టే వాటి ఫలితాలు భారత రాజకీయాలకి కొత్త దిశను నిర్దేశించాయి. కానీ, ముజఫర్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి జాడ లేదు. ఒక కటౌట్‌ని చూపిస్తూ అభిమానులు ప్రచారం చేశారు. జైలు గది, అందులో సంకెళ్లతో ఉన్న తమ అభ్యర్థి కటౌట్‌ అది. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారాయన. అప్పుడు ఆయనను తీహార్‌ జైలు నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వదిలిపెట్టారు. కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనతా పార్టీ చేసిన అనేక రాజకీయ, చారిత్రక అద్భుతాలలో ఇదొకటి. ఈ అపురూప ఘట్టానికి కేంద్రబిందువు జార్జ్‌ ఫెర్నాండెజ్‌.

జార్జ్‌ ఫెర్నాండెజ్‌ (జూన్‌ 3,1930 – జనవరి 29, 2019) స్వతంత్ర భారత రాజకీయాలలో భిన్నధ్రువాలను ఒకే రకమైన తాదాత్మ్యంతో ముద్దాడుతూ సాగిపోయే స్వేచ్ఛా భావనిలయునిగా కనిపిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం చేయించిన ఇంగ్లండ్‌ చక్రవర్తి ఐదో జార్జ్‌ అంటే ఫెర్నాండెజ్‌ తల్లికి ఆరాధన. అందుకే కొడుక్కి ఆ పేరు. కానీ భవిష్యత్తులో ఆయన సామ్రాజ్యవాదానికి బద్ధ వ్యతిరేకిగా మారతారని, సోషలిజాన్ని ఆరాధిస్తారని వారికి తెలియదు. మెట్రిక్యులేషన్‌ తరువాత తండ్రి న్యాయశాస్త్రం చదవమన్నారు.ఫెర్నాండెజ్‌కు ఇష్టం లేదు. కేథలిక్‌ చర్చ్‌ పూజారిగా శిక్షణ తీసుకుంటా నంటే కొడుకుని బెంగళూరు పంపించారు. పూజారి పనికి పూర్తి విరుద్ధంగా, పొంతన లేని విధంగా కార్మిక నాయకుడిగా అవతరించారు. పరిశ్రమల యాజ మాన్యాలతో నిత్యం సంఘర్షించే సంస్కృతిని పుణికి పుచ్చుకున్న ఆయనే కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు అమెరికా బహుళజాతి సంస్థలను దేశం నుంచి నిష్క్రమించే టట్టు చేశారు. అందులో ఒకటి ప్రథమ ప్రధాని, గొప్ప సామ్యవాదిగా చరిత్ర ప్రసిద్ధుడైన నెహ్రూ ఈ దేశానికి ఆహ్వానించినది కావడం, దానిని నెహ్రూ విధానాలను, ఆలోచనలను నిలువెల్లా ద్వేషించే ఈ కొత్త సోషలిస్టు దేశం నుంచి ఖాళీ చేయించడమే వైచిత్రి. జనతా ప్రభుత్వ పతనంలో కీలకమైన ద్వరద్వ సభ్యత్వం రగడకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకుని, మళ్లీ పాత జనసంఘ్‌ సభ్యులతో చివరికంటా ప్రయాణం సాగించడం ఫెర్నాండెజ్‌ జీవితంలో కనిపించే వైరుధ్యమే. కానీ స్థూలంగా చూస్తే ఫెర్నాండెజ్‌ కాలానికీ, దేశానికీ అవసరమైన విధంగా తన ఆలోచనను మార్చుకున్నారని అర్థమవుతుంది.

ఉత్తర కర్ణాటకలోని మంగళూరు ఫెర్నాండెజ్‌ స్వస్థలం. తండ్రి జాన్‌ జోసెఫ్‌ ఫెర్నాండెజ్‌, తల్లి ఏలిస్‌ మార్తా. 1946లో ఫెర్నాండెజ్‌ కేథలిక్‌ పూజారిగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరులోని సెయింట్‌ పీటర్స్‌ సెమినరీకి వెళ్లారు. పూజారి కావడం మాట అటుంచి, అసలు మతం మీదే నమ్మకం కోల్పోయారు. శిక్షణ పూర్తి కాకుండానే బయటపడ్డారు. అక్కడ రెక్టార్లు విద్యార్థుల కంటే మంచి భోజనం చేయడం, ఎత్తయిన ఆసనాల మీద కూర్చోవడం ఆయనను వేధించింది. ‘చర్చ్‌కి సంబంధించి నాకు భ్రమలుండేవి. కానీ అక్కడ ప్రబోధాలకీ, ఆచరణకీ ఆమడ దూరం ఉంది’ అని తరువాత ఎప్పుడో కారణం చెప్పారు. ఆపై తర్కమే ప్రాతిపదికగా సత్యం కోసం అన్వేషించే చింతకునిగా జీవితాంతం ఉండిపోయారు. 1949లో ఉద్యోగం వెతుక్కుంటూ బొంబాయి వెళ్లారు. అక్కడ హోటళ్లలో పనిచేస్తూ, రాత్రిళ్లు చౌపట్టి బీచ్‌ బెంచీల మీద నిద్రించేవారు (రోజూ బీటు పోలీసుల వచ్చి లేవగొట్టే వారు). నిజానికి సెమినరీ నుంచి తిరిగి వచ్చేసిన తరువాత మంగళూరులోనే కార్మిక నేతగా ఆయన తొలి అడుగు వేశారు. అక్కడ దోపిడీకి గురి అవుతున్న హోటల్‌, రవాణా కార్మికులను ఏకం చేయడానికి ప్రయత్నించారు. బొంబాయిలో కొన్ని కష్టాలతరువాత ఒక పత్రికలో ప్రూఫ్‌రీడర్‌ ఉద్యోగంలో చేరారు. తరువాత నుంచి కార్మికరంగంలోనే పనిచేయడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రఖ్యాత కార్మిక నాయకుడు ప్లాసిడ్‌ డిమెల్లో ప్రాపకం దొరికే వరకు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక సిద్ధాంత పరంగా ఆయనను బాగా ప్రభావితం చేసినవారు రామమనోహర్‌ లోహియా. అందుకే సోషలిస్టుల కార్మిక సంఘాల లోనే పనిచేశారు. 1950-1960 మధ్య ఆయన అనేక బంద్‌లు, సమ్మెలు, హర్తాళ్‌లు చేయిం చారు. ఆయన చిటిక వేస్తే అక్షరాలా లక్షన్నర మంది కార్మికులు వచ్చి వాలేవారు. 1961-67 మధ్య బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యునిగా కూడా పనిచేశారు. అనేక ప్రజా సమస్యల మీద మేయర్‌ను నిలదీశారు. 1967లోనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ బొంబాయి నియోజక వర్గం నుంచి ఫెర్నాండెజ్‌ సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని నాయకునిగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌కె పాటిల్‌ని ఓడించి ‘జార్జ్‌ ది జెయింట్‌ కిల్లర్‌’గా పేరు సంపాదించారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 48.5 శాతం.


మీ గురించి మీరే

1998వ సంవత్సరం. ఆనాటి ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీ అవతరించింది. వాజపేయి ప్రధాని. సభ ముందుకు విశ్వాస తీర్మానం వచ్చింది. ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్‌, సీపీఎం జమిలిగా నిర్ణయించు కున్నాయి. ఎన్‌డిఏ తరఫున ఎవరు మాట్లాడుతున్నా ఆ రెండు పార్టీల సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. అప్పుడే ఫెర్నాండెజ్‌కు మాట్లాడే అవకాశం వచ్చింది. ‘స్పీకర్‌ గారూ! కాంగ్రెస్‌ ఎంత బలహీనమైనదో నేను తెలియచేస్తాను’ అంటూ ఒక పుస్తకం చదవడం ఆరంభించారు. ‘గడచిన యాభయ్‌ ఏళ్లలో ఆ పార్టీ (కాంగ్రెస్‌) అవినీతిలో కొత్త రికార్డులు సృష్టించింది…’ అన్నీ ఇలాంటి వాక్యాలే. ఆ రెండు పార్టీల సభ్యులు అరుపులు ఆరంభించారు. ముద్రా కుంభకోణం, చూర్హాత్‌ లాటరీ కుంభకోణం, బొఫోర్స్‌, సుఖ్‌రాం టెలిఫోన్‌ కుంభకోణం, హర్షద్‌ మెహతా కుంభకోణం, జేఎంఎం లంచం, హవాలా కుంభకోణం.. వీటిలో మంత్రులంతా చిక్కుకున్నారు…. ఇలా సాగుతోంది ఫెర్నాండెజ్‌ ప్రసంగం. ఆ రెండు పార్టీల సభ్యులు ‘స్పీకర్‌! ఆ పుస్తకం పేరు చెప్పమనండి. పేరు చెప్పకుండా అందులో అంశాలు చదవడం నిబంధనలకు విరుద్ధం’ అంటూ అరిచారు. దీనితో ఫెర్నాండెజ్‌, దయచేసి అసహనానికి గురి కావద్దు. తప్పనిసరిగా చెబుతాను. కానీ ముందు ఇందులో ఉన్నదేదో చదవనివ్వండి అని కోరారు. సెక్యుల రిజం మీద కాంగ్రెస్‌ రికార్డు కూడా అందులో ఉంది. కాంగ్రెస్‌ గూండాలు ఢిల్లీ వీధులలో 3000 మంది సిక్కులను చంపిన ఉదంతం ఉంది. రాజీవ్‌ నిశ్శబ్దంగా చూడడం గురించి ఉంది. మళ్లీ గోల తారస్థాయికి చేరింది. ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడి చివరికి ఆ పుస్తకం పేరు చెప్పారు జార్జ్‌. అది- సీపీఎం మ్యానిఫెస్టోనే. చివరికిగా జార్జ్‌ ప్రశ్నించారు! మీకు సిగ్గుందా? మీరు కాంగ్రెస్‌తో కలవడానికి సిగ్గుందా? మీ మ్యానిఫెస్టో మీరు చదవలేదు. సిగ్గుందా?


1974లో ఫెర్నాండెజ్‌ చేయించిన రైల్వే సమ్మె దేశాన్ని అక్షరాలా స్తంభింపచేసింది. అప్పుడు ఆయన అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు. 1947 నుంచి 1974 వరకు మూడు వేతన సవరణ సంఘాల నివేదికలు వచ్చాయి. కానీ రైల్వే ఉద్యోగుల పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. దీనితో రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమాఖ్య మే 8, 1974న సమ్మె ఆరంభించింది. మే 27 వరకు సమ్మె సాగింది. 17 లక్షల మంది పాల్గన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. 30,000 మంది రైల్వే ఉద్యోగులను, నాయకులను అరెస్టు చేశారు. కొన్ని తప్పని పరిస్థితులలో సమ్మె విరమణ జరిగింది. కానీ అప్పటికి పీకల్లోతు కష్టాలలో ఉన్న ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫెర్నాండెజ్‌ మీద ప్రతీకార చర్యలు ఆరంభించింది. ఫలితమే బరోడా డైనమైట్‌ కేసు బనాయింపు. ఆయన డైనమైట్లు దిగుమతి చేయలేదు. కానీ కాంగ్రెస్‌ శిబిరం పాలిట పార్లమెంట్‌లో మాటల డైనమైట్‌గా మారారు.

ప్రభుత్వ ఆస్తులు, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడానికి ఫెర్నాండెజ్‌, మరో 24 మంది డైనమైట్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారని సీబీఐ ఆరోపణ. ఇందులో వీరేన్‌ జె షా (తరువాత బీజేపీ మంత్రి వర్గంలో సభ్యుడు, బెంగాల్‌ గవర్నర్‌), సీజీకె రెడ్డి, జిజి పారిఖ్‌ వంటి ప్రముఖులను కూడా ఈ కుట్ర కేసులో ప్రభుత్వం ఇరికించింది. అప్పుడు, అంటే 1975లోనే ఇందిర అత్యవసర పరిస్థితి ప్రకటిం చారు. ఫెర్నాండెజ్‌ అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. 1976లో పట్టుకుని తీహార్‌ జైలుకు తరలించారు.

ఆయన జైలు నుంచి ఎంపిక కావడం ఒక సంచలనం. మొరార్జీ నాయకత్వంలోని జనతా ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు మరొక సంచలనం. నిజానికి జనతా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియగానే చాలా బహుళ జాతి కంపెనీలు మూటా ముల్లె సర్దేసాయని చెబుతారు. కానీ ఇక్కడే కొనసాగడానికి అవసరమైన చర్చల కోసం ప్రయత్నిస్తున్న కంపెనీలు రెండు- కోకాకోలా, ఐబీఎం. ఈ రెండూ విదేశీ మారకం అదుపు చట్టం (ఫెరా) నిబంధనలకు వ్యతిరేకం. ఈ కారణం చూపించి ఫెర్నాండెజ్‌ ఆ కంపెనీలను పంపించేశారు. కోకాకోలా తాగడం దేశంలో ఒక సంస్కృతిగా మారిపోయిన తరుణంలో ఆయన ఈ పని చేయగలిగారు. ఇక ఐబీఎం. ఈ సంస్థను 1951లో పండిట్‌ నెహ్రూ దేశానికి ఆహ్వానించారు. 1960 నాటికే ఎంతో విస్తరించింది. రైల్వేలతో సహా చాలా ప్రభుత్వ శాఖలలో ఇది చోటు సంపాదించింది. చాలా ఆధునాతన కంప్యూటర్లను అందించింది. కానీ ఫెర్నాండెజ్‌ ఉద్దేశం వేరు. కంప్యూటర్లను పెంచు కుంటూ పోతే, జనాభా ఎక్కువ ఉన్న భారతదేశంలో ఉద్యోగాలు పోతాయి. నిరుద్యోగులు పెరుగుతారు. ఒక్క ఫెర్నాండెజ్‌ మాత్రమే కాదు, జనతా ప్రభుత్వంలో పరస్పర విరుద్ధాంశాలు కలిగిన వారికి కొదవ లేదు. జనసంఘ్‌ సభ్యులను బయటకు పంపాలన్న ఉద్దేశంతో ద్వంద్వ సభ్యత్వం సమస్యను లేవనెత్తారు. అంతకు ముందురోజు మొరార్జీ ప్రభుత్వ తరఫున అనర్గళంగా, గంభీరంగా ప్రసంగించిన ఫెర్నాండెజ్‌ కొన్ని గంటల తరువాత ద్వంద్వ సభ్యత్వ అనుకూల, కాంగ్రెస్‌ అనుకూల వర్గీయుల శిబిరంలో చేరిపోయారు. అంటే చరణ్‌సింగ్‌ పంచన చేరారు. తరువాత జనతా దళ్‌ ప్రభుత్వంలో వీపీ సింగ్‌ వద్ద రైల్వే మంత్రిగానే ఫెర్నాండెజ్‌ పనిచేయడం విశేషం. ఆపై సమతా పార్టీ స్థాపించారు.

ఆయన రాజకీయ జీవితంలో చివరి అంకం ఎన్‌డిఏ. 1998ా2004 మధ్య ఆయన వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రి. కార్గిల్‌, పోఖ్రాన్‌ ా2 ఆయన హయాంలోనే జరిగిన సంగతిని మరచిపోరాదు. ఆయన సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి పరమ వ్యతిరేకం. అణు పాటవం కలిగిన ఐదు దేశాలు (ఇందులో చైనా ఒకటి) భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని ఆయన నమ్మారు. తన మంత్రిత్వ కార్యాలయంలో హిరోషిమా అణు విస్ఫోటనం పటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రక్షణ వ్యవహారాలకు తిరుగులేని విధంగా మద్దతు ఇచ్చారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన యుద్ధ రంగం సియాచిన్‌. భూ ఉపరితలం నుంచి 6,600 అడుగులు. అది కూడా హిమాలయా లలో. ఇలాంటి చోటికి ఆయన 18 పర్యాయాలు వెళ్లి వచ్చారు. అక్కడ సైనికులు, దేశ రక్షణలో ఉన్న సైనికులకు సరైన బూట్లు కూడా లేకపోవడం ఆయనను కలచి వేసింది. ఢిల్లీ వచ్చి వెంటనే అన్నీ ఏర్పాటు చేయించారు. నిజానికి అంకితమయ్యారు. కేవలం పైజమా లాల్చీతో ఉండే ఫెర్నాండెజ్‌ నిరాండబరతకి ఎప్పటికీ నమూనాగానే నిలుస్తారు. ఏ విధంగా చూసినా ఫెర్నాండెజ్‌ అద్భుత రాజకీయ వేత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *