తీర్మానం – 1

తీర్మానం – 1

భారతీయ కుటుంబ వ్యవస్థ మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక

కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక అరుదైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ, వసుధైక కుటుంబకం అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది. సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది.

పవిత్రమైన సాంస్కృతిక వారసత్వానికి అత్యుత్తమ ప్రతీక అయిన మన కుటుంబ వ్యవస్థ ఇటీవల విచ్ఛిన్నం అవుతున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి ప్రధాన కారణం స్వార్థం, భౌతిక వాద ధోరణి. భౌతికమైన అవసరాలపై దృష్టి పెట్టే ఆలోచన కారణంగా, స్వార్థ పూరితమైన, అసహ్యమైన ప్రవర్తన, అదుపులేని కోరికలు, దురాశ, ఒత్తిడి మొదలైనవి పెరిగిపోతున్నాయి. మన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారి పోతున్నాయి. అతి చిన్న వయసులోనే పిల్లలను హాస్టల్‌లో వదలి పెట్టే ధోరణి కూడా పెరుగుతోంది. కుటుంబం నుంచి వచ్చే మానసికమైన భద్రత కరువై విడాకులు, యువతరంలో ఒంటరితనం పెచ్చరిల్లుతోంది. దీని కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడడం, హింస, హేయమైన నేరాలు, ఆత్మహత్యలు ఆందోళనకరమైన స్థాయికి చేరుతున్నాయి. కుటుంబ రక్షణ లేక వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం.

మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన, విలువలతో కూడిన ప్రవృత్తిని కాపాడేందుకు సమగ్రమైన, పటిష్టమైన ప్రయత్నం జరగాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. మన రోజువారీ ప్రవర్తన, నడవడిక ద్వారా మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని, జీవన విలువలను పెంపొందించి, పరస్పర సంబంధాలను పటిష్ఠ పరచేలా చూసుకోవాలి. భోజనం, ప్రార్థన, పండుగలు, తీర్థయాత్రల ద్వారానూ, మాతృభాష వాడకం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, కుటుంబ సామాజిక సంప్రదాయాలను కాపాడడం ద్వారా కుటుంబ జీవనం మనకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబం, సమాజం పరస్పర పూరక మైనవి. సామాజిక బాధ్యత ఉండేలా ప్రేరేపించడం, సామాజిక, ధార్మిక, విద్యా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కుటుంబ వ్యవస్థలో ప్రవృత్తిగా మారాలి.

తల్లి మన కుటుంబ వ్యవస్థకు కీలకం. మాతృశక్తిని గౌరవించడం ప్రతి కుటుంబ సభ్యుడికి నేర్పించాలి. సమష్టి నిర్ణయాలు కుటుంబంలో అలవాటు కావాలి. హక్కులు కాక, బాధ్యతలు, విధులు ప్రాధాన్యంగా భావించి కుటుంబంలో చర్చలు జరగాలి. మన విధులను మనం నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కుల పరిరక్షణ జరుగుతుంది.

కాలం గడుస్తున్న కొద్దీ మన సమాజంలోకి కొన్ని వక్రీకరణలు, కొంత ప్రతికూలత వచ్చి చేరాయి. వరకట్నం, అంటరానితనం, వివక్ష, భారీగా దుబారా ఖర్చు, మూఢనమ్మకాలు మొదలైనవి మన సమాజం సర్వతోముఖాభివృద్ధికి ఆటంకాలుగా పరిణ మించాయి. మన కుటుంబాల నుంచి సమాజం వరకు అందరూ ఈ దురాచారాలను, లోపాలను పెకలించి, విలువల ఆధారంగా ఉండే సామరస్య పూర్వకమైన సమాజం కోసం కృషి చేయాలని అ.భా. ప్రతినిధి సభ పిలుపునిస్తోంది.

పరమ పూజనీయులైన సాధువులు, సామాజిక, మత, విద్యా, వైజ్ఞానిక సంస్థలు సామాజికాభివృద్ధిలో ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కుటుంబాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నించాలని ప్రతినిధి సభ వారిని కోరుతోంది. సమాజానికి విలువలు నేర్పడంలో మీడియా మంచి సాధనం. ఆ రంగంలో ప్రముఖులు కుటుంబ వ్యవస్థ మూలాలను బలపరచాలని, అలాగే చిత్ర పరిశ్రమ రంగంలోని ప్రముఖులు కొత్తతరం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చూసేందుకు స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం, ఇతర కార్యక్రమాలు రూపొం దించడం చేయాలనీ ప్రతినిధి సభ కోరుతోంది. విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు, కుటుంబ సంబంధ చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా ఆలోచించా లని కూడా కోరుతోంది.

పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాల్లో ఉండేవారు తమ పూర్వీకుల కుటుంబంలోని అందరితో సంబంధాలు పెట్టుకుని, వీలైనప్పుడల్లా ఉమ్మడిగా వారితో సమయం గడపాలి. మన పూర్వీకుల స్థలంతో సంబంధం కలిగి ఉండడం అంటే మన మూలాలను మళ్లీ స్పృశించినట్లే. అందువల్ల కుటుంబంగా ఉండడం, కలిసి సేవా కార్యక్రమాలు చేయడం వంటివి జరపాలి. కుటుంబ సామాజిక బంధాలను దృఢం చేసేందుకు పిల్లల ప్రాథమిక విద్య స్థానిక వాతావరణంలో జరగాలి. మనం నివసించే ప్రాంతాల్లో పండుగలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకి కూడా పెద్ద కుటుంబంలో భాగం అన్న భావన కలుగు తుంది. చిన్న పిల్లలు, కిశోర బాలలకు బాలగోకులం, సంస్కార వర్గ వంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల వారి పెరుగుదల సమతూకంతో జరుగుతుంది.

త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, పరస్పర సహకారం సంతోషకరమైన కుటుంబానికి ప్రాతిపదికలు. ఈ లక్షణాలన్నీ కల కుటుంబం తన సభ్యులందరికీ ఆనంద జీవనం అందించ గలుగుతుంది. అత్యంత విలువైన కుటుంబ వ్యవస్థను మరింత విలువలతో కూడుకున్న చైతన్యవంతమైన వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలనీ స్వయం సేవకులకు, ముఖ్యంగా యువతరానికి, యావత్‌ సమాజానికి అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది.

మన క్షేత్రంలో కార్యకర్తల బాధ్యతలలో మార్పు

ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా మన దక్షణమధ్య క్షేత్రంలో కార్యకర్తల బాధ్యతలలో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు దక్షిణమధ్య క్షేత్ర కార్యవాహగా ఉన్న దూసి రామకృష్ణ క్షేత్ర సహ సంఘచాలక్‌గాను, క్షేత్ర సహ కార్యవాహగా ఉన్న తిప్పేస్వామి (బెంగు ళూరు) క్షేత్ర కార్యవాహగా నియుక్తి అయ్యారు.

– అఖిల భారత స్థాయిలో గతివిధిగా పర్యావరణ విభాగం ప్రారంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *