పరిసరాల పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టనుంది

పరిసరాల పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టనుంది

మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి

అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశాలలో అనేక అంశాలతో పాటు సమకాలీన సమస్యల గురించీ చర్చించామని సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి సమావేశాల చివరి రోజు మీడియా సమావేశంలో చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేయబోతున్నదని చెప్పటంతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల గురించి విలేకరుల ప్రశ్నలకు భయ్యాజీ ఈ సమావేశంలో సమాధానా లిచ్చారు.

ఈసారి పర్యావరణం, పరిసరాలను కాపాడు కుంటూ, వాటిని పరిరక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని అన్నారు. ఇదేకాకుండా ‘సామాజిక సమరసత’ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. చేస్తున్న పని నేడు ఒక స్థాయిని చేరుకుంది. వివిధ రంగాలలో కార్య విస్తరణకు పూనుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నూతనంగా చేపట్టనున్న ఈ కార్యం గురించి వివరంగా చెబుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం, దాన్ని పోషించుకోవడానికి సమాజంతోపాటు కలిసి పనిచేయడానికి నిర్ణయాలు జరిగాయన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టనుంది.

1. జల పరిరక్షణ

2. జల నిర్వహణ

3. మొక్కలు నాటటం.

వీటితోపాటు ప్లాస్టిక్‌ మరియు నాన్‌బయో డీగ్రేడబుల్‌, థర్మోకోల్‌ లాంటి వస్తువులను తొలగించుట.

ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు భయ్యాజీ జోషి సమాధానమిస్తూ ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మా ఆలోచన స్పష్టంగా ఉందని అన్నారు. మందిరం ఎక్కడ నిర్మించాలని అనుకున్నారో అక్కడే నిర్మించాలి. ఆలయ నిర్మాణం జరిగేవరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణం సజావుగా కొనసాగటానికి ప్రభుత్వం, కోర్టులు మధ్యవర్తులను నియమిస్తే దానికి మా అభ్యంతర మేమీ ఉండదని అన్నారు. రామమందిర నిర్మాణ క్రమంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు కోర్టులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేము అభిలషిస్తున్నామని అన్నారు. మధ్యవర్తిత్వం వహించే వారు హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా ఆలయ నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఈ విషయంలో వారి నిబద్ధతపై మాకు ఎలాంటి సందేహం లేదని అన్నారు.

పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న టెర్రరిస్టు శిక్షణ కేంద్రాలపై జరిపిన మెరుపు దాడుల (సర్జికల్‌ స్ట్రైక్స్‌) ప్రక్రియను, భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని జోషి అన్నారు. భయం లేని జాతి మాత్రమే టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలో బుద్ధి చెప్పగలుగుతుంది అన్నారు.

370 ఆర్టికల్‌పై ప్రశ్నలకు సమాధానిమిస్తూ.. సెక్షన్‌ 35ఎ ఇంకా కోర్టు విచారణలో ఉన్నందున 370 గురించి ఏమి చెప్పలేమని అన్నారు. 35ఎ విషయమై కోర్టు తీర్పు వెలువడిన తరువాతే 370 గురించి చర్చలు జరిగే అవకాశముంటుందని అన్నారు.

ఎన్నికలలో మీ ప్రాత ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘మా పాత్ర స్పష్టం. మేము నూటికి నూరుశాతం ఓటింగ్‌ జరిగేలా ప్రయత్నిస్తాము. ప్రస్తుత సమాజం ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన చేస్తున్నది. ఈ దేశం బాగుపడడానికి ఎవరు కృషి చేస్తున్నారో ప్రజలకు తెలుసు.

ఈ మధ్య హిందువుల సంప్రదాయాలైన జల్లికట్టు, దీపావళి పటాసులు, శబరిమల వంటి వాటిపై కోర్టు తీర్పులు గురించి అడిగిన ప్రశ్నలకు జోషి జవాబిస్తూ ‘ఇలాంటి విషయాల్లో చట్టాన్ని అనుసరిస్తూనే ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి విషయాలలో మన విలువలు, మన సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *