5 రాష్ట్రాల ఎన్నికల చిత్రం

5 రాష్ట్రాల ఎన్నికల చిత్రం

‘ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదంలోని, బీజేపీ విధానంలోని ప్రయోజనం ఎంతటిదో 2018 సంవత్సరమే కళ్లకు కట్టింది. ఈ సంవత్సరం ఎన్నికలతో ఆరంభమైంది. ఎన్నికలతో ముగుస్తున్నది. ప్రధాని మోదీ తన పార్టీ కోసం పర్యటించడం అనివార్యం. లేదా పార్టీ మెరుగైన ఫలితాలను సాధించడానికి ఎంతో కొంత దష్టి పెట్టాలి. ఆ మేరకు ఆయన నిర్వర్తించే బాధ్యతల మీద వీటి ప్రభావం ఉంటుంది. 2018 ఎన్నికల జాతర నాగాలాండ్‌తో ఆరంభమైంది. త్రిపుర, మేఘాలయ, కర్ణాటక శాసనసభల ఎన్నికలు కూడా జరిగాయి. ఇవికాక లోక్‌సభకు ఉప ఎన్నికలు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అవే – రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, తెలంగాణ.

వీటిలో తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలు గడువు మేరకు ఎన్నికలు జరుపుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రద్దు చేయడం (సెప్టెంబర్‌ 6) వల్ల ముందస్తు ఎన్నికలు అనివార్యమైనాయి. రాజస్థాన్‌ (200 స్థానాలు), మధ్యప్రదేశ్‌ (280), ఛత్తీస్‌గఢ్‌ (90), మిజోరం (40), తెలంగాణ (119) ఎన్నికల ఫలితాలన్నీ డిసెంబర్‌ 11న వెలువడ తాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొదటిగా పోలింగ్‌ ప్రక్రియ రెండు విడతలలో నవంబర్‌ 12 ఆరంభమై, 20న ముగిసింది. మావోయిస్టు సమస్యతో, ఆ నిషేధిత సంస్థ సృష్టిస్తున్న విధ్వంసం మూలంగా ఎన్నికల సంఘం అక్కడ వ్యూహం మార్చింది. తెలంగాణలో డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 2018 చూస్తుందన్నమాట. కాబట్టి 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల సరళికి, ఈ ఎన్నికల ఫలితాలకు ముడి పెట్టకుండా ఎవరూ విశ్లేషణ చేయరు. మరొక అంశం కూడా ఈ ఎన్నికలకు ప్రాధాన్యం కల్పించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అనివార్యం. ఎందుకంటే మరో ఆరుమాసాలలోనే లోక్‌సభ ఎన్నికల నగరా మోగుతుంది. అందులో మరోసారి విజయం సాధించాలన్న బీజేపీ ఆశయం మీద ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావాన్ని చూపించకుండా ఉండవు. నరేంద్ర మోదీని నైతికంగా దెబ్బ తీయాలంటే మొదట ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను తారుమారు చేయాలి కాబట్టి కాంగ్రెస్‌ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నది. మిజోరం- ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం. అక్కడ తన వైభవాన్ని కొనసాగించాలని ఆ పార్టీ అభిలషిస్తున్నది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెరాస పాలన సాగింది.

ఇటీవలి కర్ణాటక పరిణామాలు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయని అనిపిస్తుంది. కర్ణాటక ఫార్ములా తమకు ఉపయోగపడుతుందని చిన్న చిన్న పార్టీలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న మాట నిజం. కర్ణాటకలో ఏమైందో తెలిసిందే కదా! బీజేపీకి 104 స్థానాలు వచ్చాయి. కానీ మెజారిటీ లేక విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయింది. కాంగ్రెస్‌ పార్టీది రెండో స్థానం, అంటే 78 స్థానాలు వచ్చాయి. ఆ తరువాత కేవలం 38 స్థానాలతో మూడో స్థానంలో జనతాదళ్‌ (సెక్యులర్‌) నిలబడింది. కమలదళానికి అధికారం దక్కనీయరాదన్న ఏకైక సూత్రంతో ద్వితీయ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌, తృతీయ స్థానంలో ఉన్న జేడీ(ఎస్‌)కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వారి వారి రాష్ట్రాలలో ఏర్పడాలని వేయి దేవుళ్లను మొక్కుకుంటున్నాయి చిన్నా చితకా పార్టీలు. ఇలాంటి ఒక అనైతిక పొత్తుతో అధికారం అందుకోవాలని చూస్తున్నవారిలో ఆద్యుడు అజిత్‌ జోగి. కానీ జోగి గమనించని ఒక వాస్తవం ఉంది. కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చిన తరువాత కుమారస్వామికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు వారాలు పట్టింది. ఆయన వలవల ఏడుస్తూ, ముక్కు చీదుతూ ‘ఇంత క్షోభ నేను ఎన్నడూ పడలేదు’ అని వేదిక మీదనే ఆక్రోశించిన సంగతి జోగి గమనించవలసిన అవసరం ఉంది.

అజిత్‌ జోగి ఛత్తీస్‌గఢ్‌ తొలి గిరిజన ముఖ్యమంత్రి. తొలి ముఖ్యమంత్రి కూడా. ఆయన సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. హఠాత్తుగా వేరు కుంపటి పెట్టారు. దానికి ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ అని పేరు పెట్టి, బీఎస్‌పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో బీఎస్‌పీకి అంతో ఇంతో బలం ఉంది. హంగ్‌ ఏర్పడి, బీజేపీ, కాంగ్రెస్‌ దేనికీ మెజారిటీ రాక కర్ణాటక రాజకీయ పరిస్థితి పునరావృతమవుతుందని జోగి గట్టి నమ్మకం. పైగా ఆయన కాంగ్రెస్‌ తనకు మద్దతు ఇస్తే తీసుకుంటానని పరోక్షంగా చెప్పారు కూడా. జోగి బీజేపీ కోసమే వేరు కుంపటి పెట్టారని కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించింది. దీనితో జోగి, తాను బీజేపీతో కలసే ప్రసక్తే లేదనీ, అంతకంటే మరణమే మేలని అన్నారు. అంతేకాదు, ఒకటీ రెండూ కాదు ఎనిమిది మతాల వారి పవిత్ర గ్రంథాలను తెచ్చి వాటి మీద ఆ మేరకు విలేకరుల సమావేశంలో ప్రమాణం కూడా చేశారు. కానీ అక్కడ మూడు పర్యాయాలు వరసగా బీజేపీ ప్రభుత్వం పాలించడం వల్ల కొంత అసమ్మతి ఉన్నా, ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌ ప్రతిష్ట చెక్కుచెదరకుండా ఉంది.

పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రతిష్ట చెక్కు చెదరకుండా ఉంది. అక్కడ కూడా వరసగా మూడు పర్యాయాలు బీజేపీ అధికారం చేపట్టింది. దీనితో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని త్వరలోనే తెలిసింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి ఎవరిని ప్రకటించాలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. అక్కడ చిత్రమైన సమీకరణ ఏర్పడింది. బీజేపీ హిందుత్వను , హిందుత్వతోనే ఎదుర్కొనాలన్న కొత్త వ్యూహానికి కాంగ్రెస్‌ మరలింది. ఆఖరికి ముఖ్యమంత్రిని విమర్శించడానికి కూడా హిందూ పురాణాలలోని రాక్షస పాత్రలనే కాంగ్రెస్‌ నేతలు ఎంచుకుంటున్నారు. బాలికలకు, మహిళలకు ఇతోధికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు చౌహాన్‌ను రాష్ట్రంలో ‘మామయ్య’ అని ఆప్యాయంగా పిలవడం ఆరంభమైంది. ఆయన మామయ్యే కానీ కంసుడు, శకుని వంటి మామ అని కాంగ్రెస్‌ ఎంపీ, గ్వాలియర్‌ సంస్థానాధీశుడు జ్యోతిరాదిత్య సింధియా విమర్శిస్తున్నారు.

రాజస్థాన్‌లో 1998 నుంచి ఒకే పార్టీ వరసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. కానీ అక్కడ రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉండడంతో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ఉంటున్నది. ఈసారి ఒక కొత్త ప్రయత్నం జరిగింది. అది కూడా కర్ణాటక అనైతిక ప్రయోగం ఫలితమే. రాజస్థాన్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అనే ఒక కూటమి ఏర్పాటయింది. సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌), సమాజ్‌ వాదీ పార్టీ, జనతాదళ్‌ (సెక్యులర్‌), రాష్ట్రీయ లోక్‌దళ్‌, మార్క్సిస్ట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎంసిపిఐ) ఈ ఫ్రంట్‌లో ఉన్నాయి. ఈ ఫ్రంట్‌ను మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ప్రారంభించడం ఇంకొక విశేషం. కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచే కషిలో కలసి వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ను కూడా చేరవలసిందిగా ఫ్రంట్‌ పెద్దలు తాజా చనువుతో పిలిచారు. వసంధరా రాజేను ఓడించడానికి తమకు ఎవరి సాయం అక్కరలేదని కాంగ్రెస్‌ చెప్పేసింది. బీఎస్పీని కూడా ఫ్రంట్‌ ఆహ్వానించింది. బీఎస్పీ ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌తో కలసి ప్రయాణించే ఉద్దేశంలో ఉన్నా, కాంగ్రెస్‌ ఫ్రంట్‌కు చెప్పిన సమాధానమే బీఎస్పీకీ చెప్పింది. దీనితో బీఎస్పీ, సీపీఐ కలసి పోటీ చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌, ఫ్రంట్‌ల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగు తుంది. ముఖ్యమంత్రి వసుంధర మీద పోటీ కోసం మానవేంద్రసింగ్‌ను కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. ఈయన బీజేపీ మాజీ ప్రముఖుడు జస్వంత్‌సింగ్‌ కుమారుడే.

ఈశాన్య భారతదేశంలో కాంగ్రెస్‌ చేతిలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఆ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క స్థానం కూడా లేదు. అయినా మొత్తం 40 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను నిలుపు తున్నది. అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కమలంతో సత్సంబంధాలు కలిగి ఉన్నది. క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్న బీజేపీ ఆశయానికి అడ్డంకులు ఏమీ లేవు.

తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మే నెలలో ఇక్కడ ఎన్నికలు జరగాలి. ‘ప్రజలలో మరింత విశ్వాసం నెలకొల్పేందుకు’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అసెంబ్లీని రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలు తెచ్చారు. ఇక్కడ పొత్తులను పరిశీలిస్తే నైతికత అనే పదాన్ని నిస్సంకోచంగా రాజకీయ పద నిఘంటువు నుంచి తొలగించవచ్చునని చెప్పవచ్చు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పొత్తుల భాగస్వాములంతా చెప్పేదొకటే. అది- మోదీని ఓడించడం.

– జాగృతి డెస్క్‌

 

‘ముందస్తు’ బాధ

తెలంగాణ ఏర్పడిన తరువాత జరుగుతున్న రెండవ అసెంబ్లీ ఎన్నికలివి. తెరాస అధినేతగా, తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చరిత్రకు ఎక్కింది. తొలి దఫా ప్రభుత్వం గడువు పూర్తి కాకుండానే ముందస్తు ఎన్నికలు తెచ్చిన నేతగా కూడా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. కేసీఆర్‌ తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు మాటలలో అయితే వారు పాలించినది మూడున్నర ఏళ్లే. మొదటి ఆరేడు మాసాలు ఏ ఒక్క ఫైలు మీద సంతకం చేయకుండా మోదీ తమని వేధించారని కేటీఆర్‌ ఆరోపించారు. తొమ్మిదినెలలు వీరు త్యాగం చేశారు.

తెలంగాణలో చతుర్ముఖ పోటీ జరుగుతున్నది. కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ, మహాకూటమి (పీపుల్స్‌ ఫ్రంట్‌), బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో మహా కూటమి ఏర్పడింది. మూడున్నర దశాబ్దాల వైరం విడిచిపెట్టి తెలుగుదేశం కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తున్నది. కాంగ్రెస్‌ నినాదం తమాషా అయినది. ఒక ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు, పాత వైరాన్ని మరచి మరొక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంతో జత కట్టినట్టు ఆ పార్టీ చెప్పుకుంది. ఇక్కడ కేసీఆర్‌ ఓటమి కాంగ్రెస్‌ ధ్యేయం. కానీ తెలుగుదేశానికి కేసీఆర్‌ ఓటమి కంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ఓటమే ముఖ్యం. అంటే తెదేపా అవగాహన లక్ష్యం ఈ ఎన్నికలు కాదు. 2019 లోక్‌సభ ఎన్నికలే. మహాకూటమిలో సీపీఐ, తెలంగాణ జన సమితి (తెజాస) కూడా ఉన్నాయి. సీపీఎం నాయకత్వంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ నగరంలో ఉనికిని గట్టిగా చాటుకోగలిగిన ఎంఐఎం ఎటు? పైకి చెప్పకపోయినా తెరాస, ఎంఐఎం మధ్య అవగాహన ఉంది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా తెరాస నోరు మెదపడం లేదు. పైగా మైనారిటీలకు తెలంగాణ అంత సురక్షిత రాష్ట్రం మరొకటి భారత్‌లోనే లేదు అని ఎంఐఎం నాయకులు తేల్చారు కూడా.

మహా కూటమిలో టిక్కెట్ల గొడవ తారస్థాయిని చేరుకుంది. తెరాస కూడా అసమ్మతి సెగతో విలవిల లాడింది. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ పరిశీలకులు టిక్కెట్లు ఇవ్వడానికి కోట్ల రూపాయలు లంచంగా అడిగారని కాంగ్రెస్‌ అసంతృప్తులు మీడియాలో బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు. పొన్నాల లక్ష్మయ్య 2014 ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు. కానీ ఈ ఎన్నికలలో అతి కష్టం మీద ఆయనకు జనగామ టిక్కెట్టు దక్కింది. ఇందుకు తెజస నాయకుడు కోదండరామ్‌ తన అభ్యర్థిత్వాన్ని ‘త్యాగం’ చేశారు. తనకు టిక్కెట్టు రాకపోవడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (టీపీసీసీ నేత) కారణమని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించడం పెద్ద పరిణామమే. తెలుగుదేశంలో కూడా ఇలాంటి అలజడి ఉంది. ప్రస్తుతం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్‌. రమణ పోటీ చేయడం లేదు. కారణం నియోజకవర్గం లేకపోవడమేనని అంటున్నారు. దివంగత తెలుగుదేశం నాయకుడు, ఎన్‌టీఆర్‌ కుమారుడు హరికృష్ణ తనయ సుహాసినికి కుకట్‌పల్లి నియోజక వర్గాన్ని చివరి క్షణంలో కేటాయించడం మరొక సంచలనం. ఇందుకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా చెప్పిన వివరణ, ‘కుటుంబ కారణాలు’. ఈ కూటమి ఏర్పాటులో తన కృషే ప్రధానమని మొదటి నుంచి చెప్పుకున్న సీపీఐ మూడు స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. ఐదు నుంచి నాలుగు, నాలుగు నుంచి మూడు స్థానాలకు ఆ పార్టీ రాజీ పడింది. తెజస పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కాంగ్రెస్‌ చాలా గడుసుగా మొదట మిత్రపక్షాలకు అనుకున్న స్థానాలలో కూడా తన అభ్యర్థులను ప్రకటించి సంకీర్ణ ధర్మాన్ని అలవోకగా ఉల్లంఘించింది. ఇక మింగాలేక కక్కాలేక భాగస్వాములు సర్దుకు పోయారు. కాంగ్రెస్‌ వంద స్థానాలకు బీఫారాలు ఇచ్చింది. తెజస కూడా నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువే జారీ చేసింది.వైఎస్‌ జగన్‌ అవినీతి మీద కోర్టుకు వెళ్లడానికి కాంగ్రెస్‌ పార్టీ బాగా ఉపయోగించుకున్న డాక్టర్‌ శంకరరావుకు కూడా ఈసారి టిక్కెట్టు కేటాయించకపోవడం కొసమెరుపు.

తెరాస మీద అసంతృప్తి ఉంది. మహా కూటమి సర్దుబాట్లతో సతమవుతూనే ఉంది. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నామమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితులలో చాలా వరకు సానుకూల వాతావరణం మధ్య బరిలో దిగిన బీజేపీకి తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతు న్నారు. దీనిని బీజేపీ ఎంతవరకు ఉపయోగించు కుంటుందో చూడాలి.

 

మధ్యప్రదేశ్‌లో ‘శివో’హం

మధ్యప్రదేశ్‌ మొదటి నుంచి బీజేపీకి కంచుకోట. అలాగే హిందూత్వ భావాలకు పుట్టినిల్లు. ఇక్కడ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాలుగో సారి ముఖ్యమంత్రి కావడానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉంది. కానీ కమల్‌నాథ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రజలు ముందు చూపుతున్నప్పటికీ ఇదే అంతిమ నిర్ణయం కాకపోవచ్చు.

ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చిత్రమైన సమీకరణ కనిపిస్తుంది. ‘హిందుత్వ’ పార్టీగా బీజేపీ ఎలాగూ బరిలో ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ కూడా హిందూ కార్డుతోనే పోటీ పడుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ శివభక్తుడి అవతారం ఎత్తారు. హిందువులు ‘టెర్రరిస్టులు’ అని ప్రకటించి పార్టీని దారుణంగా ఇరకాటంలోకి నెట్టేసిన దిగ్విజయ్‌సింగ్‌ను ప్రచారానికి దూరంగా ఉంచారు. ఆయన కూడా ఈ విషయాన్ని హుందాగా అంగీకరించారు. తాను ప్రచారానికి వెళితే ఉన్న ఓట్లు కూడా పోవచ్చునని సవినయంగా అంగీకరించారు. మేనిఫెస్టోలో గోరక్షణకు కాంగ్రెస్‌ పాటు పడుతుందని హామీ ఇచ్చారు. దీనినే ప్రధాని మోదీ బీజేపీకి అనుకూలంగా మలుచుకుంటారని ఆ పార్టీ ఊహించలేదు. పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ గోరక్షణ నినాదం ఇచ్చింది. ఆ పార్టీ కేరళ కార్యకర్తలు నడిరోడ్డు మీద ఆవుదూడను క్రూరంగా చంపి తింటారు, ఇదేం ద్వంద్వ నీతి అంటూ నరేంద్ర మోదీ ఆ పార్టీ గాలి తీసేశారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాలుగోసారి కూడా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నది. పోయిన వైభవం కోసం కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. 2003లో పోయిన అధికారం కోసం కాంగ్రెస్‌ తపిస్తున్నది. పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పెద్ద సమస్య. వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి ఉందా అని మోదీ నిలదీయడంలోని అంతరార్థం ఇదే. హంగూ ఆర్భాటం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన ముఖ్యమంత్రిగా శివరాజ్‌ చౌహాన్‌కు కీర్తి ఉంది. సర్వేల ప్రకారం ఇక్కడ బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మూడుసార్లు వరసగా అధికారం చేపట్టడం వల్ల ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా చౌహాన్‌ మీద మాత్రం ఆ వ్యతిరేకత పడలేదు. ఇది కూడా సర్వేలే చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పాత పోకడలను వదిలిపెట్టి పూర్తిగా సామాజిక మాధ్యమాల మీద ఆధారపడుతున్నది. ఈ మాధ్యమాన్ని క్షుణ్ణంగా ఉపయోగించుకోగల వారికే టిక్కెట్లు ఇచ్చారు కూడా.

ఈ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ 62 ఏళ్లలో కాంగ్రెస్‌, బీజేపీ రెండు మాత్రమే ప్రధానంగా ఆధిపత్యం వహిస్తున్నాయి. తరువాత ఇతర పార్టీలు ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ ఎన్నికలలో కూడా ఎస్పీ, బీఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, జై ఆదివాసీ యువశక్తి, సాఆన్య పిచాదా ఎవుమ్‌ అల్పసంఖ్యాక వర్గ అధికారి కర్మచారి సంస్థ, ఆప్‌, జేడీ(యు) కూడా పోటీ చేస్తున్నాయి.

 

భిన్నత్వాన్ని గౌరవించడానికే…

‘మిజోరం ప్రాంత సంస్కృతినీ, వారి మతాన్ని, ఆహారపు అలవాట్లను బీజేపీ గౌరవిస్తుంది’… ఇది నవంబర్‌ 28న పోలింగ్‌ జరగబోతున్న మిజోరంలో బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్‌ చెప్పిన మాట. ఆయనే ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొత్తం 40 స్థానాలలోను తన అభ్యర్థులను పోటీకి దింపుతున్నది. మిజోరం క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం. ఈ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క స్థానం కూడా లేదు. అయినప్పటికీ ఇక్కడ తమ పోటీ నామమాత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో ఉండాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ గడచిన పదేళ్లుగా అధికారంలో ఉంది. 2013 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ 34 స్థానాలు గెలిచింది. లాల్‌ తన్హాలాల్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ నాయకుడు లాల్‌ తన్హావాల్‌ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఈ ఒక్క రాష్ట్రమే ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌ ఖాతాలో ఉంది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ. ఈ ఫ్రంట్‌కూ బీజేపీకీ మైత్రి ఉంది. ఫ్రంట్‌ పరోక్షంగా బీజేపీయేనన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈశాన్యంలో బలపడడానికి 2016లో బీజేపీ ఈశాన్య భారత ప్రజాస్వామిక కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో నాగా పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌, అసోం గణపరిషత్‌, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉన్నాయి. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కూడా భాగస్వామే. ఈ ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల తరువాత అవగాహనకు అవకాశాలు ఉన్నాయని కూడా రామ్‌మాధవ్‌ తెలియచేశారు.

ఎంఎన్‌ఎఫ్‌ అభ్యర్థుల మీద కూడా పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు రామ్‌మాధవ్‌ వెల్లడించారు. ఫ్రంట్‌కు మాజీ ముఖ్యమంత్రి జోరంతంగ్‌ నాయకుడు. కొద్దిరోజులలో పోలింగ్‌ జరుగుతూ ఉండగా లాల్‌ తన్హాలాల్‌ మంత్రి మండలిలో రెండోస్థానంలో ఉన్న నాయకుడు, హోం మంత్రి మిజో నేషనల్‌ ఫ్రంట్‌లో చేరిపోయారు. లాల్‌ తన్హాలాల్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఛత్తీస్‌గఢ్‌ మళ్లీ రమణీయమే

కర్ణాటకలో పొడిచిన అనైతిక పొత్తు ప్రభావం ఈసారి ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల మీద ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తుందో మాత్రం తెలియదు. ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌ సింగ్‌కు ప్రజలలో ఎంతో ప్రతిష్ట ఉంది. నక్సలైట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిగా ఆయనకు పేరు. కర్ణాటక ఎన్నికలలో మూడో స్థానంలో ఉన్న జేడీఎస్‌ పార్టీ అభ్యర్థి కుమారస్వామి గౌడ ముఖ్యమంత్రి అవకాశాన్ని అయాచితంగా పొందారు. ఇలాంటి రాజకీయ పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లోను తలెత్తుందన్న ఆశతో పావులు కదిపినవారు అజిత్‌ జోగి. నవంబర్‌ 1, 2000 సంవత్సరంలో రాష్ట్రం ఆవిర్భవించి నప్పుడు తొలి ముఖ్యమంత్రి ఆయనే. అలాగే దాదాపు 37 శాతం గిరిజనులు ఉన్న ఈ రాష్ట్రానికి ఆయన ఒక్కరే ఆ వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా మొదటి నుంచి కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే పోరు ఉంది. అజిత్‌ జోగి కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం వహించేవారు. నిరుడే ఆయన మాతసంస్థను వీడి ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించారు. నాడు ఆయన అధికారంలోకి వచ్చినది మొదలు బీజేపీ నుంచి వలసలను ప్రోత్సహించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 38 నుంచి 40, బీజేపీకి 34 నుంచి 36, జోగికి 18 నుంచి 14 స్థానాలు వస్తాయని ప్రాథమిక సర్వేలు లెక్కలు ఇచ్చాయి. ఇదే జోగికి ప్రేరణ. కర్ణాటక పరిస్థితి పునరావృతమై కాంగ్రెస్‌ సాయంతో తనకు అవకాశం వస్తుందని జోగి వ్యూహం.

నిజానికి కాంగ్రెస్‌కు ఇక్కడ నాయకత్వం లేదు. చాలామంది సంవత్సరం క్రితం నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు బలయ్యారు. మిగిలినవారు వద్ధులు. కాబట్టి జోగి కాంగ్రెస్‌లో కొనసాగినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయినా ఆయన కొత్త పార్టీ పెట్టారంటే అధిష్టానంతో ఉన్న భేదాభిప్రాయాలు ఎలాంటివో !

మూడు దఫాలు అంటే పదిహేనేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. కానీ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యం అన్న సర్వేలో రమణ్‌ సింగ్‌ ముందంజలో ఉండడం విశేషం. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా 2013 ఎన్నికలలో బీజేపీ 49 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎన్నికలను భగ్నం చేయాలని మావోయిస్టులు తీవ్రంగానే ప్రయత్నం చేశారు. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అంతా అక్కడికి చేరుకున్నారని, జరిగిన విధ్వంసం దాని ఫలితమేనని ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలదా? ఈ ప్రశ్న సహజం. ఎందుకంటే జోగి వంటి బలమైన నాయకుడు ఆ పార్టీని విడిచిపెట్టారు. పైగా రెండు ప్రధాన పార్టీల తరువాత కొంత బలం ఉన్న బీఎస్పీ జోగితో కలసింది. కాబట్టి త్రిముఖ పోటీ జరుగుతుందనడమే సబబు. ఈ పోటీ తమకు నల్లేరు మీద నడక వంటిదేనని బీజేపీ భావిస్తున్నది. పైగా రమణ్‌ సింగ్‌ ప్రతిష్ట, మోదీ ఖ్యాతి కూడా తోడుగా ఉంటాయి.

 

రాజస్థాన్‌లో హోరా హోరీ

రాజస్థాన్‌ బ్యాలెట్‌ సమరానికి అనేక దశలు, కోణాలు ఉన్నాయి. సర్వేలను బట్టి బీజేపీ కష్టకాలంలో ఉందన్న అభిప్రాయం ఉంది. మరొక చిత్రమైన రాజకీయ వాతావరణం కూడా ఉంది. ఈ ఎన్నికల ప్రకటన తరువాత ఒక నినాదం వినిపిస్తున్నది. ‘మోదీ గారూ! మేం మీకు వ్యతిరేకం కాదు, రాణీ వసుంధరరాజే మీదే మా వ్యతిరేకత. అందుకే ఈ ఎన్నికలలో మిమ్మల్ని కూడా ఉపేక్షించలేకపోతున్నాం’ అన్నదే ఆ నినాదం. ఇది బీజేపీ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. మొదటిగా గుర్తు చేసుకోవలసిన అంశం- ఇక్కడ 1998 నుంచి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఎంపిక సంప్రదాయం బలంగా కనిపిస్తుంది. ఒకసారి బీజేపీ నెగ్గితే, ఆ తరువాత దఫా కాంగ్రెస్‌ గెలుపొందడం అనవాయితీ. అదే తమకు రాజకీయంగా అందివస్తుందని, ఈసారి అధికారం కాంగ్రెస్‌ వంతని ఆ పార్టీ గట్టిగానే విశ్వసిస్తున్నది. కానీ ఈ ఎన్నికలతో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టాలనీ, మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ శ్రమిస్తున్నది.

తాజా సర్వేలు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూశాక కొన్ని వాస్తవాలను అంగీకరించక తప్పదు. ఇందులో కొన్ని కాంగ్రెస్‌ ప్రచారం చేసినవి ఉండవచ్చు. రాజే సర్కారుకు ఆ పార్టీ సష్టించిన సమస్యలు కూడా తక్కువేమీ కాదు. అయినా బీజేపీ శ్రేయస్సును కోరేవారు వాస్తవాలను విస్మరించలేరు. కొన్ని పరిణామాలు బీజేపీ నాయకత్వాన్ని కలవరపెట్టేటట్టు ఉన్నాయన్నదీ నిజమే. కానీ వాటిని అధిగమించే అవకాశాలు కూడా అసంఖ్యాకంగానే కనిపిస్తున్నాయి. 2003లో వసుంధరా రాజే తొలి మహిళా ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తరువాత ఇప్పటిదాకా ఆ పదవికి ఆమెనే పార్టీ ఎంపిక చేస్తున్నది. 2013 ఎన్నికలలో రాజే నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. ప్రధాని అభ్యర్థిగా దేశమంతా అప్రతిహతమైన ప్రతిష్టతో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ ప్రచారం ఆనాడు అమోఘంగా ఉపయోగపడింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలలో 163 కమలం ఖాతాలో జమై, అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఆరంభంలో రెండు ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పాలయింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నది. ఆ తరువాత రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా మదన్‌ లాల్‌ సయానీని ఏకాభిప్రాయంతో నియమించవలసి వచ్చింది. మొదట ఈ పదవికి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను అనుకున్నారు. ఈ మార్పుతో ప్రజలలోకి వేరే సంకేతాలు వెళ్లిపోయాయి. ఆ రాష్ట్రంలో 2009 నుంచి సాగుతున్న కొత్త రిజర్వేషన్ల ఆందోళనలు, గుజ్జర్‌, మీనాల కేంద్రంగా సాగుతున్న అల్లర్లు బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. కానీ ఈ పరిస్థితి నుంచి పార్టీ, ప్రభుత్వం బయట పడతాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌లో పరిస్థితి సజావుగా లేదు. సచిన్‌ పైలట్‌ను ఆ పార్టీలో కొందరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. కానీ అశోక్‌ గెహ్లాట్‌ పేరు కూడా వినిపిస్తున్నది. ఇలా ముఖ్యమంత్రి పదవి కోసం బహుళ అభ్యర్థుల బాధ బీజేపీకి లేదు. మోదీ స్థాయి ప్రచార సారథి కూడా ఆ పార్టీకి లేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *