సేంద్రియంతో ఎన్నో ప్రయోజనాలు

సేంద్రియంతో ఎన్నో ప్రయోజనాలు

– హరిత విప్లవం రైతును దెబ్బతీసింది

– రైతు పతనంతో సమాజం పతనమైంది

– రసాయనాలతో రోగాలపాలయింది

– బి.పి., మధుమేహం, క్యాన్సర్‌ విజృంభించాయి

– వీటన్నింటికి పరిష్కారం సేంద్రియమే

అత్యంత ఆవశ్యక్తమైనది, ఉపయుక్తమైనది, ఎన్నో ప్రయోజనాలు కలది సుస్థిర సేంద్రియ వ్యవసాయం. ఇందులో రైతు తనకు అవసరమైన వనరులను తన వ్యవసాయ క్షేత్రంలోనే సమకూర్చుకోగలడు. విత్తనం, సత్తువ, సస్యరక్షణ వంటి అవసరాలకు లాభాపేక్ష కలిగిన ఇతర వ్యక్తులపైన గాని, మార్కెట్‌ శక్తులపైగాని ఆధార పడనవసరం లేదు. సుస్థిర సేంద్రీయ వ్యవసాయంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గడం వలన వ్యవసాయ కోసం అప్పులు చేయాల్సిన అవసరం అరుదు.

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి తీవ్రమైన ఆహార కొరత ఉండేది. ఆకలి చావులు, అర్ధాకలి కడుపులు, పోషకాహార లోపాలు.. వెరసి, ఇతర దేశాల నుండి ధాన్యం దిగుమతి చేసుకొని సామాన్య ప్రజల ఆకలి తీర్చే పరిస్థితి స్వాతంత్య్రానంతరం దాదాపుగా రెండు దశాబ్దాల పాటు కొనసాగింది.

రైతును ముంచిన హరిత విప్లవం

1960వ దశకంలో మొదలైన హరిత విప్లవం గోధుమ ఉత్పత్తిని రెట్టింపుచేసి ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాల దిగుమతిని అవసరం లేకుండా చేసింది. 1970వ దశకంలో విడుదలైన వరి వంగడాలు, వరిధాన్య ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశానికి సంపూర్ణమైన ఆహారభద్రతను సమకూర్చ గలిగాయి. కాని, ఆహార కొరత నుండి భారతదేశాన్ని గట్టెక్కించిన హరిత విప్లవం, తదనంతర కాలంలో రైతుల పాలిట శాపంగా మారింది. హైబ్రిడ్‌ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, యాంత్రీకరణ మొదలగు హరిత విప్లవ చోదకాలు రైతులను ఉత్పత్తిదారుల స్థితి నుండి బహుళజాతి సంస్థల వినియోగదారులుగా మార్చివేశాయి. పెట్టుబడుల పర్వంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోసాగారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, చీడ పీడల విజృంభణ, కూలీల కొరత, మార్కెట్‌ అనిశ్చితి, దళారుల దోపిడి, రైతుల ఆదాయంలో అస్థిరతను నింపాయి. 5 వేల సంవత్స రాల వ్యవసాయ చరిత్రలో చెక్కు చెదరని భారతీయ రైతుల ‘ఉత్పత్తి సామర్థ్యాన్ని’ 50 వసంతాల హరిత విప్లవం తునాతునకలు చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ భుజస్కంధాలపై మోసిన మన రైతులు నేడు ర్కెలు తెగిన పక్షులయ్యారు.

రసాయనాల ఫలితం – రోగాల మయం

వ్యవసాయం పంచభూతాల సంగమం. (నింగి, నేల, నిప్పు, గాలి, వాన) రైతు విత్తనాన్ని నేర్పుతో, ఓర్పుతో ఈ పంచభూతాలకు అనుసంధానిస్తాడు. ఆరుగాలం శ్రమించి ఆహారోత్పత్తి చేస్తాడు. గ్రామసీమలలో రైతులే కథానాయకులు. ఇతర వృత్తులవారు సందర్భానుసారం రైతులకు సేద్య ప్రక్రియలో తమవంతు సహకారాన్ని ‘బేషరతుగా’ అందించేవారు. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు తమకు వ్యవసాయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహాయం చేసిన వారికి తమ ఫలసాయంలో న్యాయమైన వాటా పంచి ఇచ్చేవారు. ఇదివరకటి కాలంలో రైతులు పది రకాల వస్తువులను పండించి, తమకవసరమైన ఒకటో, రెండో వస్తువులను మార్కెట్‌లో కొనుక్కొనేవారు. కాని నేడు, అధిక శాతం రైతులు ఒకటో, రెండో పంటలు పండించి, తమ ప్రతి చిన్న అవసరాలకు మార్కెట్‌పై ఆధారపడు తున్నారు. ‘అమ్మబోతే అడవి, కొనబేతే కొరివి’ అన్న చందాన తాము పండించిన ఉత్పత్తులను గంపగుత్తగా టోకు ధరలకు, కారుచవకగా ధారపోసి, తమకు కావలసిన వస్తువులను ముందుగానే నిర్ణయించి, ముద్రించిన అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పని దుస్థితిని నేడు మన రైతులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన, విషరహిత, తాజా ఆహారోత్పత్తు లను సమృద్ధిగా అందించిన గ్రామసీమలు నేడు విషరసాయనాలు చల్లిన కూరగాయలు, మందులతో మాగిన పళ్ళు, యాంటిబయోటిక్స్‌ సహాయంతో పెంచిన కోళ్ళు, గుడ్లు, కల్తీ నూనెలు, సింథటిక్‌ పాలు వంటి ప్రమాదకరమైన ఆహారాన్ని తినవలసి వస్తోంది. తత్ఫలితంగా నాడు భాగ్యవంతుల రోగాలుగా పిలిచే కాన్సర్‌, డయాబెటిస్‌, బి.పి, గుండె జబ్బులు నేడు గ్రామసీమలలో కాయకష్టం చేసుకొనే సామాన్యుల ఇళ్ళలోకి కూడా చొరబడ్డాయి.

‘సమాజంలో పేదరికం కన్నా రోగం బహు ప్రమాదకారి’. అప్రతిహతంగా కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా; నిమ్మకు నీరెత్తిన వ్యవస్థలు నిర్వీర్యమౌతున్నా; నేలలు, నదులు నిర్జీవమౌతున్నా; జీవ వైవిధ్యం కనుమరుగవు తున్నా, ప్రజారోగ్యం పడుకేస్తున్నా, ఉత్పత్తిదారులు అప్పుల పాలవుతున్నా, వినియోగదారులు ఆస్పత్రుల పాలవుతున్నా, రాజుల సొమ్ము రాళ్ళపాలవుతున్నా ఏమి చేయలేని పరిస్థితి.

సేంద్రియమే సుస్థిరం

రైతు పతనం, సమాజ పతనానికి నాంది కాగలదు. అటువంటి పరిస్థితిని నిలువరించడం మన సమిష్టి బాధ్యత, కర్తవ్యం కూడా. గ్రామసీమలు పునర్‌వైభవం సంతరించు కోవాలంటే వ్యవసాయ దారులు బానిస సంకెళ్ళను తెంచుకోవాలి. పెట్టు బడులు, వడ్డీ చట్రాల బంధనాల నుండి విముక్తులు కావాలి. అందుకు అత్యంత ఆవశ్యక్త మైనది, ఉపయుక్త మైనది, మరెన్నో ప్రయోజనాలు కలది సుస్థిర సేంద్రియ వ్యవసాయం. ఇందులో రైతు తనకు అవసరమైన వనరులను తన వ్యవసాయ క్షేత్రంలోనే సమకూర్చుకో గలడు. విత్తనం, సత్తువ, సస్యరక్షణ వంటి అవసరాలకు లాభాపేక్ష కలిగిన ఇతర వ్యక్తులపైన గాని, మార్కెట్‌ శక్తులపైగాని ఆధార పడనవసరం లేదు. సుస్థిర సేంద్రీయ వ్యవసాయంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గడం వలన వ్యవసాయ కోసం అప్పులు చేయాల్సిన అవసరం అరుదు.

దశాబ్దాలుగా హైబ్రిడ్‌ వంగడాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులపై అతిగా ఆధారపడి సాగుతున్న నేటి వ్యవసాయం, ఇప్పటికిప్పుడు సేంద్రియం కావాలంటే బహుకష్టం. అందునా హరిత విప్లవ కాలంలో పుట్టిన నేటితరం రైతులకు, కొన్ని నమూనా క్షేత్రాలను స్థిరపరచి చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. హరిత విప్లవ ప్రారంభ దినాలలో నాటి రైతులు రసాయనిక ఎరువులు వాడకానికి బొత్తిగా ఆసక్తి చూపని రోజులలో, వ్యవసాయ ప్రదర్శనకారులు ఎంతో శ్రమించి, వాటిని రైతులకు అలవాటు చేశారు. కనుక నేటి రైతులకు సుస్థిర సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నమ్మకం కలిగించాలంటే నమూనా క్షేత్రాలను సృష్టించి, ప్రదర్శించవలసిన అవసరం ఉంది. వీటి సృష్టి, నిర్వహణ, బాధ్యత వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సహకార సంఘాలు తీసుకోవాలి.

సుస్థిర సేంద్రియ నమూనా క్షేత్రంలో ప్రధానమైన అంశాలు

1. పాడిపశువుల అనుసంధానం.

2. మిశ్రమ పంటలు (పట్టుపురుగులు, కోళ్ళు, చేపలు, గొర్రెలు, మొదలైనవి).

3. వాననీటి సంరక్షణ, సమర్థవంతమైన సాగునీటి వినియోగం.

4. భూసార పరిరక్షణ, సహజ పోషక యాజమాన్యం.

5. హరిత వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు తయారి.

6. సృజనాత్మకమైన జీవ వైవిధ్య నిర్మాణం, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ.

7. జీవనశైలి, సహకారం.

మచ్చుకు పాడిపశువుల అనుసంధానం ఒక ఉదాహరణగా తీసుకుందాం.

సుస్థిర సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పాడిపశువులు అత్యంత ప్రధానమైన వనరు. స్వచ్ఛమైన పాలు లభించటం వలన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు దృఢంగా ఎదుగుతారు. పాలను అమ్మడం వలన సమకూరే సొమ్ము కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతుంది. కోడెలు, దూడల అమ్మకం ద్వారా కూడా కొంత ఆదాయం సమకూరుతుంది. ఎడ్లు బండ్లను లాగడానికి, దుక్కులు దున్నడానికి, అంతర కృషి చేయడానికి ఉపయోగ పడతాయి. పశువుల మలమూత్రాలు భూమిని సారవంతం చేస్తాయి. ఆవుల మలమూత్రాల ద్వారా జీవామృతం, పంచగవ్య, అమృత మట్టి, అమృత జలం, వర్మీకంపోస్టు వంటి వాటిని తయారుచేసుకో వచ్చు. పంటలనాశించే చీడ, పీడలను నివారించగల కషాయాలు, ఇతర మిశ్రమాల తయారీలోను గో ఆధారిత ఉత్పత్తులు ప్రధాన భూమిక పోషిస్తాయి. పంటకోత సమయంలో ధాన్యం సేకరించిన తర్వాత మిగిలిన గడ్డిని పశువుల మేతగా వాడుకోవచ్చు. ఆవు మూత్రాన్ని శుద్ధిపరచి ఔషధాల తయారీలో ఉపయోగించవచ్చు. ఆవుపేడతో తయారుచేసిన పిడకలను వంట చెరకుగా ఉపయోగించవచ్చు. పశువుల పేడతో గోబర్‌గ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేయ వచ్చు. ఇలా ఒక్కో వనరు ఒకదానితో ఒకటి అను సంధానమై పలు విధాలుగా ఉపయోగపడుతుంది.

రైతు జీవనశైలి పర్యావరణంతో మమేకమై పోవాలి. రైతులందరూ ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి. ఉత్పత్తి గణాంకాలపై కాక నికర ఆదాయంపై దృష్టి పెట్టాలి. దేశానికి ఆహారభద్రత ఎంత ముఖ్యమో, రైతుకు ఆదాయ భద్రత అంతే ముఖ్యం. అది సుస్థిర సేంద్రియ వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యం. దానిని సుస్థిర సేంద్రియ వ్యవసాయ నమూనా క్షేత్రాల ద్వారా సహేతుకంగా నిరూపించాల్సిన తరుణం ఆసన్నమైంది.

–  డా|| గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్, డిఅనుబంధ అధ్యాపకులు, ఐ.ఐ.ఐ.టి, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *