శ్రీఆంజనేయం… ప్రసన్నాంజనేయం…

శ్రీఆంజనేయం… ప్రసన్నాంజనేయం…

మే 10న హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

శ్రీరాముని భక్తుడైన హనుమంతుడు వైశాఖ మాసం, బహుళపక్షం, పూర్వాభాద్ర నక్షత్రం, వైధృతియోగం, కర్కాటక లగ్నం, శనివారం మధ్యాహ్నం కౌండిన్య గోత్రంలో కేసరి – అంజనా దంపతులకు జన్మించాడు.

సాక్షాత్తు సూర్యభగవానుడినే తన గురువుగా చేసుకున్న ఆంజనేయుడు సకల శాస్త్రాలు, వేదాంగాలు అభ్యసించాడు. హనుమంతునికి తెలియని విద్య లేదు. శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయస్వామి రామాయణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు.

హనుమజ్జయంతి రోజున ఆంజనేయస్వామిని పూజించడం వలన భక్తులకు బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. రోగాలు నశిస్తాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగిపోయి, మానసిక రుగ్మతల నుంచి బయటపడతారని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమాన్‌ జయంతినాడు హనుమాన్‌ చాలీసాను పారాయణం చేయడం ద్వారా కూడా భక్తులు మరిన్ని ఫలితాలు పొందొచ్చని అర్చకులు చెబుతున్నారు.

కలి ప్రభావ విపరీత, వైచిత్ర దృక్కులు గల మనిషిని కూడా అనుగ్రహించి సమాధాన పరచగల భక్త సులభుడు, దయాళువు ఆంజనేయుడు. అందుకే ఆయన్ను అందరూ కలౌకపిః అంటారు.

శ్రీరాముని చరిత్ర తెలుసుకోవడానికి రామాయణం, శ్రీకృష్ణుని చరిత్ర తెలుసుకోవడానికి భారతం ఉన్నట్లే హనుమంతుని చరిత్ర ‘పరాశర సంహిత’ ద్వారా తెలుసుకోవచ్చు.

పరమాత్మ అంశయైన శ్రీరామచంద్రమూర్తిని, ప్రకృతి అంశయైన సీతాదేవిని కలపడానికి హను మంతుడు తన బుద్ధియోగం ద్వారా జరిపిన అన్వేషణే సుందరకాండం. రామాయణంలోని కాండములన్నీ ముక్తి సాధనాలే అయినప్పటికి వాటిలో సుందర కాండం ప్రముఖమైంది, విశేషమైంది, భక్తులు అనుసరింపదగినది.

కార్యసాధకుడు ఆటంకాలకు భయపడకుండా, ఆకర్షణలకు లొంగకుండా, నిశ్చల బుద్ధితో చేపట్టిన పనుల్లో ఏ విధంగా విజయం సాధించవచ్చో తెలిపేదే సుందరకాండం. హనుమంతుని భక్తి శ్రద్ధలతో కొలిచి తులసీదాసు హనుమత్‌ సాక్షాత్కారాన్ని పొందాడు.

హనుమాన్‌ జయంతి నాడు స్వామికి సహస్ర నామార్చన చేసి, అష్టోత్తరాలతో తమలపాకులు సమర్పిస్తే శుభం కలుగుతుంది. ఆరోజు శతవృద్ధ జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమ ప్రతిమను పూజించడం శ్రేయస్కరం. అరటిపండ్ల సమర్పణ, సింధూర సమర్పణ, శని, మంగళవారాల్లో తమల పాకులలో సింధూర పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి.

హస్త, మృగశిర నక్షత్రాలతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. ఆంజనేయస్వామి మహిమల గురించి పరాశర సంహిత, ఉమా సంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతాయి. రామ భజన ఎక్కడ జరిగినా అక్కడికి హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల అచంచల విశ్వాసం, నమ్మకం.

రావణుడితో యుద్ధం జరుగుతున్న సందర్భంలో లక్ష్మణుడు మూర్ఛపోయి పడిపోతాడు. రాముడు లక్ష్మణుడు మరణించాడని తీవ్రంగా దుఃఖిస్తాడు. అపుడు హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. వానర వైద్యుడైన సుశేణుడు ఆ పర్వతంలో ఉన్న నాలుగు మూలికలతో లక్ష్మణునికి వైద్యం చేయగా అతడు నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇవన్నీ మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు.

హనుమంతుడు ఆ సంజీవని పర్వతాన్ని తిరిగి తీసికొనిపోయే సందర్భంలో శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో ఆ సంజీవని పర్వత శకలాలు పడ్డాయని పురాణాల్లో రాశారు. అవి గాలెకొండ మీదున్న రామశాల, ఉత్తర లంకలో కచ్చఅవు, మన్నార్‌లోని తలాడి, దోలుకంద, రితిగ్‌ ప్రదేశాలు.

శ్రీలంకలోని రామశాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇక్కడికి వాహనాలు వెళ్లే వీలులేదు. ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం పర్వతం చేతిలో ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని రకాల ఔషధ మూలికలు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతారు.

సీతాదేవి క్షేమ సమాచారాలను రాముడికి అందించేందుకు హనుమంతుడు మహా సముద్రాన్ని సైతం అవలీలగా దాటాడు. అపుడు ఆంజనేయుడిని సీతాదేవి ‘అంతటి మహాసముద్రాన్ని నువ్వు ఒంటరిగా ఎలా దాటావు ? అని అడగగా ‘తల్లీ స్వామి సంకల్పబలం తోడైతే ఏదైనా సాధ్యమే’ అని బదులిచ్చి శ్రీరాముడి పట్ల తన నిజమైన భక్తిని చాటుకున్నాడు.

వానరసేనతో శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకలోనికి ప్రవేశించి, రావణుని ఎదిరించి మిమ్మల్ని తీసుకొనిపోతాడని హనుమంతుడు సీతతో చెప్పినపుడు ఆమె వానరజీవులు మహాకాయులైన రాక్షసులను ఏం చేస్తారని మనస్సులో అనుకుంటుంది. సీతాదేవి ఉద్దేశాన్ని గ్రహించిన పవనసుతుడు ‘తల్లీ కొమ్మలపై సంచరించే వానరులం మేం. మాకు బుద్ధి, బలాలు ఎక్కడ నుంచి వస్తాయి ? ఆ శ్రీరాముడు సంకల్పిస్తే సాధ్యం కానిది ఏదైనా ఉంటుందా? స్వామి సంకల్పిస్తే సర్పం కూడా గరుడపక్షిని ఎదిరించగలదు’ అని బదులిస్తాడు. అలా శ్రీరామునికి సహకరిస్తూ సీతమ్మ జాడను తెలుసుకొనుటలో హనుమంతుడు కీలకపాత్ర పోషించాడు. ఈ ఘట్టాలన్నీ శ్రీరామునిపై ఆయనకు ఉన్న భక్తిని చాటుతాయి.

హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ మెట్టమెదట లంకలోని ‘రాంబోడా’ అనే పర్వతం మీదికి చేరుకున్నట్లు వాల్మీకి రామాయణం తెలుపుతుంది. ఆ పర్వతంపై చిన్మయ మిషన్‌వారు 166 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్‌ విగ్రహం హైదరాబాద్‌- విజయవాడ హైవే రోడ్డులో కంచికచర్ల సమీపంలో శ్రీరామపాద క్షేత్రంలో ఉంది. 135 అడుగుల ఈ భారీ విగ్రహం బరువు 2500 టన్నులు. ఇక్కడ రోజుకు 108 సార్లు హనుమాన్‌ పారాయణం జరుగుతుంది.

శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వ్యాసరాయుడు వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ స్వయంగా దాదాపు 701 దేవాలయాలకు ఆంజనేయ ప్రతిష్ఠ కార్యక్రమాలను, దేవాలయాలను కట్టించాడని పురాణాల్లో పేర్కొన్నారు.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. వాటిలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, విశాఖ జిల్లాలోని గాజువాక ఆంజనేయస్వామి ఆలయం, రాజోలు ఆంజనేయస్వామి (తూ.గో.జి), విజయవాడలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయం, కోదాడ పంచముఖ ఆలయం, ప్రకాశం జిల్లాలోని పంచముఖ ఆంజనేయ ఆలయం, అద్దంకి సమీపంలో శింగరకొండ ఆంజనేయాలయం ప్రముఖమైనవి.

కడప జిల్లాలో గరిడి వీరాంజనేయస్వామి దేవాలయం, (టిటిడి దత్తత) కర్నూలు జిల్లా బేతంచెర్ల ఆంజనేయ దేవాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో కసాపురం వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందినవి. గాలి చేష్టలు, దయ్యం పట్టినవారు, భూతాలు ఆవహించినవారు కసాపురం ఆంజనేయస్వామిని దర్శిస్తే మంచి జరుగుతుంది.

చిత్తూరు జిల్లాలో అర్ధగిరి కొండపై వెలిసిన శ్రీవీరాంజనేయస్వామికి చాలా ప్రసిద్ధి. ఇక్కడ కోనేరులో స్నానమాచరిస్తే ఎలాంటి రోగాలైన తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

తెలంగాణలో తాడుబందు (సికింద్రాబాద్‌) హనుమాన్‌ ఆలయం, 1950లో నిర్మించిన దిల్‌సుక్‌నగర్‌ మారుతీ మందిర్‌, డిచ్‌పల్లిలో గల ఆంజనేయాలయం, కొండగట్టు ఆంజనేయాలయం, ఖైరతాబాద్‌ హనుమాన్‌ మందిరం, లాలాగూడలోని విఠల్‌ హనుమాన్‌ గుడి చాలా ప్రసిద్ధి చెందినవి.

ఈ నెల 10వ తేదీన, గురువారం నాడు హనుమజ్జయంతి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రులవ్వండి.

– సంగుభొట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *