వ్యవసాయాభివద్ధిలో స్వచ్ఛందసంస్థల పాత్ర కీలకం

వ్యవసాయాభివద్ధిలో స్వచ్ఛందసంస్థల పాత్ర కీలకం

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఇటీవలి కాలంలో సేంద్రియ, ప్రకతి లేదా గోఆధారిత వ్యవసాయ పద్ధతులను రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవడానికి గతమెన్నడూ ఎరుగని భారీ స్థాయిలో దష్టి సారిస్తుండటం హర్షదాయకం. ఇది సమాజంలో వివిధ వర్గాల ప్రజానీకంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఇతరత్రా ప్రకతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు కొత్త ఊపునిచ్చింది.

వ్యవసాయాభివద్ధి, గ్రామీణాభివద్ధి రంగాల్లో; ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా అభివద్ధి కార్యక్రమాలు, విధానాల రూపకల్పనలో, అమలులో ప్రభుత్వ రంగానికి దీటుగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. ప్రజాస్వామిక స్ఫూర్తి ఇనుమడిస్తున్న కొద్దీ, సమ్మిళిత అభివద్ధి భావనకు సమాజంలోని అన్ని వర్గాలు ఆకర్షితులవుతున్న కొద్దీ స్వచ్ఛంద సంస్థల పాత్ర, ప్రాముఖ్యం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఆ మేరకు బాధ్యత, జవాబు దారీతనం కూడా పెరుగుతున్నదని గుర్తించాలి.

స్వచ్ఛందసేవా సంస్థలు – రకాలు

స్వచ్ఛందసేవా సంస్థలు స్వభావరీత్యా విభిన్నంగా ఉంటాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితులతో ఏకీభవిస్తూ, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే, స్పష్టంగా చెప్పాలంటే ప్రధానస్రవంతికి అనుగుణంగా పనిచేసే ‘స్వచ్ఛంద సంస్థలు’ ఒకరకం. సమకాలీన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ తదితర రంగాల్లో నెలకొన్న స్థితిగతులపై అసంతప్తి కలిగి ఉండి ఆయా రంగాల్లో గుణాత్మక మార్పులు తేవటం కోసం ఏటికి ఎదురీదే లక్ష్యంతో పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు మరొకరకం.

ఈ రెండు రకాల్లోనూ కేవలం విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే, ప్రభుత్వ విధానాల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రస్థాయిలో గుణాత్మక మార్పు తేవటం కోసం పనిచేసే సంస్థలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సంబంధమైన ఆచరణాత్మక పద్ధతులను రైతుల్లోకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యే స్వచ్ఛంద సంస్థలు ఇంకొన్ని ఉంటాయి. దేశ, విదేశీ కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో రైతుల మధ్య పనిచేసే స్వచ్ఛంద సంస్థలూ ఉంటాయి.

గ్రామీణ రైతాంగం, రైతుకూలీలు, ఇతర వృత్తి కళాకారుల జీవనోపాధులను స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో దెబ్బతీయకుండా వారిని సంక్షోభం నుంచి బయట పడేసే అసలైన వెలుగుదారులను నెత్తికెత్తుకునే స్వచ్ఛంద సంస్థలు మరికొన్ని ఉంటాయి. ఇందులోనూ చిన్న, సన్నకారు రైతుల, బడుగు, మహిళా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి పనిచేసేవి కొన్నయితే; పెద్ద రైతులు, భూస్వాముల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పనిచేసే స్వచ్ఛంద సంస్థలు మరికొన్ని ఉంటాయి. ఆధునిక సాంకేతికత లను ఉపయోగించి మొబైల్స్‌, ఇంటర్నెట్‌ ద్వారా పంటలు, తోటల సాగుదారులు, పాడి రైతులు, పశుపోషకులకు తోడ్పడే లక్ష్యంతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వివిధ స్థాయిల్లో, వివిధ రంగాల్లో దృష్టి పెట్టి పరిమిత లేదా విస్తత లక్ష్యాలతో, అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలు పరిమితులకు లోబడి పనిచేస్తుంటాయి.

స్వచ్ఛందసేవా సంస్థలు – నిధులు

స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ, ప్రైవేటు, దేశీ లేదా విదేశీ సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల నుంచి నిర్దేశిత పథకాలకు నిధులు అందుతుంటాయి. దేశీయంగా వ్యవసాయ రంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు నాబార్డ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా, ట్రస్టులు, ఫౌండేషన్ల ద్వారా, కంపెనీల నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కోటా కింద నిధులు అందుతూ ఉంటాయి.

ప్రభుత్వ పథకాల అమలుకు దేశ రాజధానిలో విడుదల చేసిన ప్రతి వంద రూపాయల్లో కేవలం 9 రూపాయలు మాత్రమే అట్టడుగు స్థాయికి చేరుతున్నాయని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చాలా ఏళ్ల క్రితమే ఒకానొక సందర్భంలో ప్రకటించారు. మిగతా నిధులన్నీ అవినీతితో నిండిన ప్రభుత్వ యంత్రాంగం స్వాహా చేస్తున్నదని అర్థం. అయితే, స్వచ్ఛంద సంస్థలకు అందే నిధులు నూటికి నూరు శాతం క్షేత్రస్థాయిలో లక్ష్య జనులకు చేరుతున్నాయని చెప్పలేం కానీ, విడుదలైన నిధుల్లో కనీసం 50 శాతమైనా సద్వినియోగం అవుతున్నాయని భావించవచ్చు. బహుళజాతి కంపెనీలు, ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారగణం కనుసన్నల్లో నడిచే స్వచ్ఛంద సంస్థలకు నిధులు దండిగానే అందుతూ ఉంటాయి. ఏటికి ఎదురీదే సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వేతర వర్గాలందించే వనరులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సోషల్‌మీడియా వ్యాప్తి చెందినందున క్రౌడ్‌ ఫండింగ్‌ భావనకు మరింత ప్రాచుర్యం పెరుగు తున్నది. ఏటికి ఎదురీదే ప్రత్యామ్నాయ ధోరణులతో ముందుకెళ్లే స్వచ్ఛందసేవా సంస్థలకు ఇది కలిసివచ్చే అంశంగా భావించవచ్చు. దేశం, రాష్ట్రం లేదా జిల్లా స్థాయిలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు నిధులను, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పనిచేసే స్వచ్ఛందసేవా సంస్థలు కూడా వ్యవసాయంలో మౌలిక మార్పుల కోసం జరిగే కషిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ప్రతి జిల్లాలో ఏర్పాటైన కషి విజ్ఞాన కేంద్రాలు కేవలం రసాయనిక వ్యవసాయ పద్ధతులను, విత్తనం నుంచి పురుగు మందుల వరకు అన్నీ కొని పొలంలో వేసే కంపెనీల ఆధారిత వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా అతికొద్ది సంఖ్యలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పనిచేసే కషి విజ్ఞాన కేంద్రాలు గతం నుంచే అక్కడక్కడా పనిచేస్తున్నాయి.

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఇటీవలి కాలంలో సేంద్రియ, ప్రకతి లేదా గోఆధారిత వ్యవసాయ పద్ధతులను రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవడానికి గతమెన్నడూ ఎరుగని భారీ స్థాయిలో దష్టి సారిస్తుండటం హర్షదాయకం. ప్రముఖ రైతు, శాస్త్రవేత్త, డాక్టర్‌ సుభాష్‌ పాలేకర్‌ గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడి లేని ప్రకతి వ్యవసాయ పద్ధతులను విస్తత ప్రాచుర్యంలోకి తేవడానికి దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. హరితవిప్లవం వల్ల పంట పొలాల్లో తిష్టవేసిన పర్యావరణ సంక్షోభాన్ని గురించి, దీన్ని ఎదుర్కొనే దీటైన ప్రకతి వ్యవసాయ పద్ధతులను సాధారణ రైతుల గుండెలకు హత్తుకునే విధంగా రోజుల తరబడి విడమర్చి చెప్పడం ద్వారా వేలాది మంది రైతులను శిక్షణా శిబిరాలకు ఆకర్షించే శక్తిని పాలేకర్‌ సంపాదించుకున్నారు. ప్రకతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై కషిచేసిన వారు అంతకు ముందు కూడా చాలా మందే ఉన్నప్పటికీ, వారి కషి చాలావరకు వారికి అందుబాటులో ఉన్న ఏటికి ఎదురీదే స్వచ్ఛందసేవా సంస్థల పరిధికే పరిమితమై పోయిందని చెప్పవచ్చు. సొంతంగా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోకుండా, నిధులను సమీకరించ కుండా, అప్పటికే ఉన్న అనేక సంస్థలు, వ్యక్తుల తోడ్పాటుతో దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం కోసం ఆవురావురంటున్న రైతుల దగ్గరకు వెళ్లగలిగింది, రైతులను రోజుల తరబడి కూర్చొని వినేలా చేసింది. ది గ్రేట్‌ ‘జీరో బడ్జెట్‌’ పాలేకర్‌ మాత్రమే.

ఈ ఊపు ఆయనను సమర్ధించే స్వచ్ఛంద సంస్థలతోపాటు కొన్ని విషయాల్లో విభేదించే స్వచ్ఛంద సంస్థలను కూడా (ఆయనతో కలిసిగాని, విడిగా గాని) వ్యవసాయరంగ సంక్షోభాన్ని పారద్రోలడానికి మరింత స్పష్టతతో, మరింత దీక్షగా పనిచేసేందుకు పురికొల్పింది.

ఈ విధంగా రసాయన ఎరువులు లేని సాగు పద్ధతుల వ్యాప్తి ద్వారా సమాజంలో వివిధ వర్గాల ప్రజానీకంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఇతరత్రా ప్రకతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు కొత్త ఊపునిచ్చింది. ఉదాహరణకు చో హన్‌ క్యు గ్లోబల్‌ ప్రకతి వ్యవసాయ పద్ధతి, చింతల వెంకటరెడ్డి మట్టి సేద్యం, డా. ఖాదర్‌ అటవీ సేద్య (కాడు కషి) పద్ధతి, వేస్ట్‌ డీ కంపోజర్‌ వాడే పద్ధతి తదితరాలు ఈ కోవకు చెందుతాయి. రసాయనిక అవశేషాలు లేని వ్యవసాయోత్పత్తులను సేకరించి శుద్ధి చేసి, ప్యాక్‌ చేసి సహ ఉత్పత్తిదారులైన వినియోగదారులకు నేరుగా అందించడం ద్వారా రైతుల నికరాదాయాన్ని గౌరవప్రదమైన రీతిలో పెంచడానికి రైతుల పరస్పర స్వయం సహాయక సంఘాల (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌)ను ఏర్పాటు చేయించటంలో కూడా ఇప్పడు ఇంతకు ముందెన్నడు లేనంత విస్తతంగా స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర వహిస్తున్నాయి. దేశీ ఆవు పాలు (ఏ-2 పాలు), స్థానిక పశుజాతులు, సన్నజీవాల పోషణపై ప్రత్యేక దష్టిసారించే స్వచ్ఛంద సంస్థలు గతంలో కన్నా ఎక్కువ వేగంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతున్నాయి.

నిబద్ధతతో రైతుల కోసం, గ్రామీణుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల ఆవశ్యకత మునుపెన్నడూ ఎరుగనంత ఎక్కువగా ఇవ్వాళ ఉంది. సేవా దష్టితో ఉన్న పట్టణ, గ్రామీణ స్వచ్ఛందసేవా సంస్థలన్నీ ప్రాముఖ్యం కాని సేవా కార్యక్రమాలతో సరిపెట్టుకో కుండా ప్రజా జీవితాలను మౌలికంగా ప్రభావితం చేసే విషయాలపై దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాల్సిన తరుణం ఇది.

రైతులకు, ప్రజారోగ్యానికి నిజంగా మేలు చేసే ఆచరణాత్మక పద్ధతులను స్వచ్ఛంద కషి ద్వారా సేవా సంస్థలు తొలుత శక్తి మేరకు అమలు చేసి చూపించాలి. ఆ కషి చిన్నదే కావచ్చు. కాని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆధునిక మైన, అవశ్యమైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సమర్థవంత అమలుకు వెలుగుబాటలు వేస్తుందన టంలో సందేహం లేదు.

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *