విరిసిన బంధం

విరిసిన బంధం

భారత్‌-మయన్మార్‌ సంబంధాలు

– మయన్మార్‌ సందర్శించిన మోది

– వాణిజ్య అభివృద్ధికి ఇరు దేశాల పిలుపు

– ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గట్టి మద్దతు

– వివిధ చారిత్రక ప్రదేశాల సందర్శన

తన మయన్మార్‌ సందర్శనతో శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను పునరు ద్ఘాటించిన మోదీ సున్నిత, మృదు దౌత్యంతో ప్రాంతీయ బంధాన్ని తిరిగి నెలకొల్పారు. పాశ్చాత్యులు చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వాదనను పట్టించుకోకుండా రోహింగ్యా సమస్యను తప్పించారు. మయన్మార్‌కు అభివృద్ధి సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన మోది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విస్తరించడానికి, వేగవంతం చేయడానికి వాగ్దానం చేస్తూ అంతకంటే ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గట్టి మద్దతు ఇచ్చారు. భారతదేశ మయన్మార్‌ విధానాన్ని పునశ్చరణ చేయడం ద్వారా భారతదేశ భౌగోళిక రాజకీయ భద్రతా ఆందోళనలను సమతుల్యపరచిన మోది, మయన్మార్‌ చైనా ప్రభావంలోకి జారిపోకుండా నిరోధించారు.

ముదురుతున్న రోహింగ్యా సంక్షోభం పట్ల అంతర్జాతీయ ఖండనలు వెల్లువెత్తుతున్న సందర్భంలో సెప్టెంబరు 5 నుండి 7 వరకు ప్రధాని మోది 3 రోజుల మయన్మార్‌ ద్వైపాక్షిక సందర్శన జరిపారు. ఇంతకు పూర్వం నవంబర్‌ 2014లో ఆసియాన్‌ సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల నిమిత్తం మోది మయన్మార్‌ సందర్శించినప్పటికీ, ఇటీవల ముగిసిన సందర్శనే మయన్మార్‌కు మోది మొదటి ద్వైపాక్షిక అధికార సందర్శన. ఇది చాలాకాలంగా ఎదురుచూస్తున్న సందర్శన. నిజానికి గత 25 సంవత్సరాలలో ఇది భారత ప్రధాని చేసిన సందర్శనలలో మూడవది.

‘పొరుగువారికి మొదటి ప్రాధాన్యం’ విధానం ప్రకారం భారతదేశం ఈ ప్రాంతంలో సంబంధాలను పునరుద్ధరించినప్పటికీ, మయన్మార్‌తో భారత సంబంధాలు తగినంతగా వృద్ధి చెందలేదని పరిశీలకులు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా పొరుగు దేశాలను మోది ఆహ్వానించినప్పటికీ మయన్మార్‌ను మినహాయించడం గమనార్హం. మయన్మార్‌తో 1600 కిలోమీటర్ల భూ సరిహద్దును, బంగాళాఖాతంలో జల సరిహద్దును భారతదేశం పంచుకుంటున్న నేపథ్యంలో భారతదేశ ఈశాన్య ప్రాంత భద్రత విషయంలో మయన్మార్‌కు గణనీయమైన ప్రభావం ఉంది.

నిరసనలు

2012లో వెల్లువెత్తి 1,00,000 మందికి పైగా రోహింగ్యాల స్థానభ్రంశానికి కారణమైన ఆకస్మికంగా పెరిగిన హింసాకాండ వలెనే ప్రస్తుతం కూడా మయన్మార్‌లో హింసాకాండ పెచ్చరిల్లుతోంది. దేశం విడిచి పారిపోతున్న రోహింగ్యాల సంఖ్య రెట్టింపు అవుతుండగా; మయన్మార్‌ ప్రభుత్వమూ, నోబెల్‌ గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీలు అనూహ్యంగా ప్రపంచ వ్యాప్త ఖండన ఎదుర్కొంటున్నారు. పౌరుల మరణాలకు, బలవంతపు వలసలకు కారణమైన రోహింగ్యాల పట్ల మయన్మార్‌ భద్రతా దళాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి కూడా ఖండనలు ఎదురవుతున్నాయి. మౌనాన్ని వీడి, ‘ఉగ్రవాదులను’ నిందించిన స్టేట్‌ కౌన్సిలర్‌ మరియు విదేశాంగ మంత్రి, సూకి ప్రస్తుత సంక్షోభం ‘ఒక పెద్ద సమాచార లోపం’గా అభివర్ణించారు. రాఖైన్‌ రాష్ట్రంలో తెగల మధ్య అశాంతిని తగ్గించడానికి మయన్మార్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఐరాస మాజీ సెక్రటరి జనరల్‌ కోఫి అన్నన్‌ సారథ్యంలో ఒక స్వతంత్ర కమిషన్‌ నియామకం జరిగింది. ఈ సంఘం చేసిన సిఫార్సులు, పరిశీలనలను స్వాగతించిన సూకి, వలసకాలం ముందు నుంచి ఉన్న ఈ సమస్యను 18 నెలల్లో పరిష్కరించడం కష్టమని అభిప్రాయపడ్డారు.

పక్షపాత విధానాలను ముగించాలి

అనేక పక్షాల నుండి – ముఖ్యంగా ముస్లిం ఆధిపత్య దేశాల నుండి విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో మోదీ మయన్మార్‌ పర్యటనకు వచ్చారు. దాదాపుగా అదే సమయంలో, భారతదేశ భద్రతకు భయంకరమైన ముప్పుగా ప్రకటించిన నిఘా నివేదికలపై ఆధారపడి, 40 వేల మంది చట్ట విరుద్ధ రోహింగ్యాలను బహిష్కరించాలని భారత హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. దేశీయంగా ముస్లిం గ్రూపులు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) లు భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ సుప్రీంకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశాయి. అయితే, మయన్మార్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చలలో రోహింగ్యాల గురించి నేరుగా ప్రస్తావించని మోది, ‘ఉగ్రవాద సంఘటనలు, తీవ్రవాద ప్రేరేపిత హింస’ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్‌ యాత్రికులపైనా, సరిహద్దుల్లో జరుగుతున్న ఇతర ఉగ్రవాద చర్యలను మయన్మార్‌ ఖండించగా, మయన్మార్‌ ఉత్తర రాష్ట్రం రాఖైన్‌లో ఎందరో భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడులను భారతదేశం ఖండించింది. ‘ఉగ్రవాదం మానవ హక్కులను ఉల్లంఘించిందని, అందువలన ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించరాదని’ ఇరుదేశాలు అంగీకరించాయి. ఉగ్రవాద పోరాటంలో పక్షపాత విధానాలను ముగించాలని, ఐరాసలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం – CCIT ‘ విషయంలో త్వరగా తుది నిర్ణయానికి రావాలని ఇరు దేశాలు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి.

ఉగ్రవాద కార్యకలాపాలలో రోహింగ్యాలు

రాఖైన్‌ రాష్ట్రంలో భద్రతా దళాలపైనా, బౌద్ధులపైనా దాడులు చేస్తున్న అరకన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ (ARSA) కి తీవ్రవాద బృందాలు, పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐల నుంచి ఆర్థిక సహాయం, శిక్షణ లభిస్తున్నాయని తెలిపే గట్టి సాక్ష్యాధారాలు లభించడం గమనార్హం. బుద్ధ గయ పేలుళ్ళు, కశ్మీర్‌ తిరుగుబాటులలో చట్ట విరుద్ధ రోహింగ్యాల ప్రమేయం ఉన్నట్లు భారత నిఘా సంస్థల నివేదికల ద్వారా తెలుస్తున్నది. కశ్మీర్లో చట్ట విరుద్ధంగా రోహింగ్యాలు స్థిరపడడాన్ని కుట్ర సిద్ధాంతంగా పూర్వ పాలకులు తోసిపారేసి నప్పటికీ, లష్కర్‌-ఎ- తోయిబా వారిని కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు ధృవీకరించాయి.

మోది విధానానికి ప్రతిస్పందనగా సూకి, రాఖైన్‌ రాష్ట్రంలోని రోహింగ్యాల సమస్యను భారతదేశంలో కశ్మీరు తిరుగుబాటుతో పోల్చారు. ‘ఉగ్రవాదులు, అమాయక సామాన్య ప్రజల మధ్య తేడాను ఎలా గుర్తించాలో మనం ఆలోచించాలి. భారతదేశంలో ఈ విషయంలో మీకు అనుభవం ఉంది. భారీ ముస్లిం జనాభా ఉన్న భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్న కశ్మీర్‌ వంటి ప్రాంతంలో, ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యాలతో సంబంధం లేని అమాయక పౌరులను వేరుగా గుర్తించడానికి ప్రాధాన్యం ఉంది’ అన్నారు సూకి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢవైఖరి అవలంబిస్తున్న మోదికి కృతజ్ఞతలు తెలిపిన సూకి, తమ దేశంలో ఉగ్రవాదం వేళ్ళూను కోవడాన్ని ఒప్పుకోం అని అన్నారు. ఇంతకు ముందు వలె ముస్లిం దేశాలతో గొంతు కలపని భారతదేశం మయన్మార్‌ను విమర్శించలేదు.

సత్సంబంధాలు ముఖ్యం

మంచి సరిహద్దు యాజమాన్యానికి మయన్మార్‌ తో సత్సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యం. మయన్మార్‌లో తలదాచుకొంటున్న తీవ్రవాదులను వేటాడేందుకు 2015లో భారత దళాలు సరిహద్దు దాటాయి. ఐరాస భద్రతా మండలి ఆంక్షలను నిరోధించేందుకు మయన్మార్‌ చైనా, రష్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. భారతదేశ విమర్శలు మయన్మార్‌ను చైనాకు దగ్గర చేయగలవు. మోది ద్వైపాక్షిక పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే – రాఖైన్‌ రాష్ట్రంలో హింస పట్ల ఆందోళన వ్యక్తంచేసిన-ఇండోనేషియాలోని వరల్డ్‌ పార్లమెంటరీ ఫోరం వారి బాలి ప్రకటనను భారతదేశం తిరస్కరించింది.

బంగాళాఖాతంలో బహుళస్తర సాంకేతిక ఆర్థిక సహకారం (BIMSTEC) ద్వారా మయన్మార్‌తో సంబంధాలను భారతదేశం గణనీయంగా పెంపొందించింది. అధ్యక్షుడు యుహైన్‌ క్యావ్‌, స్టేట్‌ కౌన్సిలర్‌ సూకి, రక్షణ బలగాల కమాండర్‌ – ఇన్‌- చీఫ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌ల ఉన్నత స్థాయి అధికార సందర్శనలతో వేగవంతమైన సంబంధాలకు స్థిరత్వం కలిగింది. ప్రస్తుతం మయన్మార్‌ అభివృద్ధికి భారతదేశ నిబద్ధత 2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉండి ఇతర దేశాలు చేస్తున్న సహాయం కంటే అధికంగా ఉంది. ఎంతో కాలంగా ఆలస్యం అవుతున్న కలాదాన్‌ మల్టీ- మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు, ఇండియా మయన్మార్‌ – థాయ్‌లాండ్‌ ట్రైలేటరల్‌ జాతీయ రహదారి నిర్మాణాన్ని భారతదేశం ఇప్పుడు వేగవంతం చేసింది. రక్షణ, సముద్ర సహకారాన్ని మరింత పెంచేందుకు, మానవతా సహాయం, విపత్తు యాజమాన్యాలపై దృష్టి పెట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. చైనాకు భిన్నంగా, పారిశ్రామిక శిక్షణ కేంద్రాల స్థాపన, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, వ్యవస్థాపకత అభివృద్ధి, వ్యవసాయ పరిశోధన, ఆంగ్ల భాష శిక్షణ, ప్లానిటోరియంల కోసం సహాయం చేయడానికి భారతదేశం సంసిద్ధత తెలిపింది. సాంఘిక – ఆర్థిక అభివృద్ధితో రాఖైన్‌ రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుందని ఇరు దేశాలు నమ్ముతున్నాయి. ఈ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి సహాయం చేయడానికి భారత్‌ సంసిద్ధత తెలిపింది. పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తుల అన్వేషణ, ఉత్పత్తిలో పాలుపంచుకోవడానికి మయన్మార్‌ ప్రభుత్వం భారతీయ కంపెనీలను ఆహ్వానించింది.

స్నేహపూర్వక శైలి

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం 2.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. వాణిజ్యాభివృద్ధికి అడ్డంకు లను తొలగించడానికి ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే దిశలో ఇంఫాల్‌ నుండి మాండలేకు బస్సు సౌకర్యం కల్పించడానికి ఒప్పందం కుదిరింది. భారతదేశం, మయన్మార్‌లు 11 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత, మయన్మార్‌ దేశాల ఎన్నికల సంఘాల మధ్య అవగాహన ఒప్పందం, సాంస్కృతిక వినిమయ కార్యక్రమం, ప్రెస్‌ కౌన్సిళ్ళ మధ్య సహకారం, మయన్మార్‌ సమాచార సాంకేతికత విద్యా సంస్థ (Myanmar Institute of Imformation Technology -MIIT) స్థాపన, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మహిళా పోలీసు కేంద్రాల స్థాయి పెంచడం వీటిలో ఉన్నాయి. ఈ – వీసా మినహా అన్ని వర్గాలలో జాతీయ ఉచిత వీసా ఇవ్వడానికి భారతదేశం అంగీకరించింది. 40 మంది మయన్మార్‌ జాతీయులకు ప్రత్యేక్ష క్షమాభిక్ష మంజూరుచేసి స్నేహపూర్వక సంకేతం ఇచ్చిన భారతదేశం సరిహద్దు ఒప్పందానికి సంప్రదింపులు చేసింది.

చారిత్రక ప్రదేశాల సందర్శన

అధికారిక కార్యక్రమాలతోపాటు బగాన్‌, యాంగన్‌లలోని చారిత్రక, మత, సాంస్కృతిక ప్రాముఖ్యం గల ప్రదేశాలను మోది సందర్శించారు. మయన్మార్‌లోని ప్రాచీన దేవాలయాలలో ఒకటైన, సుమారు 1105లో రాజు కియాన్జితచే నిర్మిత మైందని విశ్వసిస్తున్న ఆనంద దేవాలయాన్ని మోది దర్శించారు. మయన్మార్‌, భారతీయ శిల్పకళల సమ్మేళనానికి ఆనంద దేవాలయం ప్రతీకగా ఉంది. భూకంపాల వలన 1975, 2015లలో ఈ దేవాలయం నష్టాలకు గురైన తరువాత, పునరుద్ధరణ, మరమ్మత్తుల కొరకు భారత పురావస్తు సర్వే శాఖ చేపట్టిన కార్యక్రమానికి భారతదేశం 3 మిలియన్‌ డాలర్లు కేటాయించింది. యాంగాంగ్‌లోని తువున్నా స్టేడియంలో మోది భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత సంతతి ప్రజలను బర్మీస్‌, తమిళ భాషలలో పలకరించిన మోది, భారత స్వాతంత్య్రోద్యమం సందర్భంగా బర్మీయుల సహకారాన్ని ప్రశంసించారు. బర్మాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ ను గుర్తుచేసు కున్నారు. దాంతోపాటు, భారతదేశ తాజా పరిణామాలను తెలియ జేశారు. సూకీతో కలసి అమరవీరుల సమాధివద్ద జనరల్‌ ఆంగ్‌సాన్‌కు నివాళి అర్పించి బోగ్యోక్‌ ఆంగ్‌ సాన్‌ మ్యూజియం సందర్శించారు. 1871లో తమిళ వలసదారులు నిర్మించి వారి నియంత్రణలో, నిర్వహణలో ఉన్న యాంగాన్‌లోని కాలిబారి ఆలయంలో పూజ చేశారు. 1857 సిపాయి తిరుగుబాటు తరువాత రంగూన్‌ వెళ్ళిపోయిన చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ దర్గాను కూడా మోది సందర్శించారు. అత్యంత పవిత్ర బౌద్ధ దేవాలయం శ్వేదగాన్‌ పగోడా సందర్శనతో ప్రధాని తన ద్వైపాక్షిక సందర్శన ముగించారు.

తన మయన్మార్‌ సందర్శనతో శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను పునరుద్ఘా టించిన మోదీ సున్నిత, మృదు దౌత్యంతో ప్రాంతీయ బంధాన్ని తిరిగి నెలకొల్పారు. పాశ్చాత్యులు చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వాదనను పట్టించుకో కుండా రోహింగ్యా సమస్యను తప్పించారు. మయన్మార్‌కు అభివృద్ధి సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన మోది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విస్తరించడానికి, వేగవంతం చేయడానికి వాగ్దానం చేస్తూ అంతకంటే ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గట్టి మద్దతు ఇచ్చారు. భారతదేశ మయన్మార్‌ విధానాన్ని పునశ్చరణ చేయడం ద్వారా భారతదేశ భౌగోళిక రాజకీయ భద్రతా ఆందోళనలను సమతుల్యపరచిన మోది, మయన్మార్‌ చైనా ప్రభావంలోకి జారిపోకుండా నిరోధించారు.

– డా . రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *