లౌకిక ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించొచ్చా ?

లౌకిక ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించొచ్చా ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో ముఖాముఖి

రాష్ట్రంలో హిందుత్వం, హిందూ ఆలయాల అభివృద్ధి, శివరాత్రి పర్వదిన ఏర్పాట్లు మొదలైన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో జాగృతి ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..

ప్రశ్న : హిందూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటి?

సమాధానం : ఆ రోజుల్లో షెడ్యూల్డు కులాలు, తెగలు, మత్య్సకారులు దేవాలయాలకు దూరంగా ఉండేవారు. దేవాలయాలకు ప్రతినిధులుగా వ్యవహరించే అర్చకులు సైతం వారిని దూరం పెట్టేవారు. ఆ పరిస్థితిని అంతమొందించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాల నుంచి ఆయా ప్రాంతాల్లో అనేక ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నాం. ఆ ఆలయాల నిర్వహణ బాధ్యతలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారే చూసుకుంటారు. ఈ విధంగా హిందూ ధర్మాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం.

ప్ర : హిందూ ధర్మ సాహిత్య ముద్రణ, ధర్మ ప్రచారం కోసం టిటిడి మాత్రమే పనిచేస్తున్నది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఏమైనా కృషి చేస్తున్నదా ?

స : టిటిడితో పాటు రాష్ట్రంలోని అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీశైలం, కాణిపాకం మొదలైన అన్ని ప్రముఖ దేవాలయాలకు ముద్రణ వ్యవస్థలున్నాయి. అన్ని ఆలయాల నుంచి మాస పత్రికలు ముద్రిస్తున్నాం. అంతేకాకుండా ధార్మిక పుస్తకాలు ముద్రించి భక్తులకు పంపిణీ చేస్తున్నాం. దేవాదాయ శాఖకు కూడా ఒక పత్రిక ఉంది. దీని ద్వారా కూడా ధార్మిక భావనను ప్రజల్లో కలిగిస్తున్నాం.

ప్ర : షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలు నివసించే బస్తీలలో ఆలయం నిర్మించాలనుకునే వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం లభించే పథకాలు ఏమైనా ఉన్నాయా ?

స : వాళ్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. దేవాదాయ శాఖ, టిటిడి సహకారంతో ఆయా బస్తీల్లో ఆలయాలను నిర్మిస్తున్నాం. గత రెండేళ్ల నుంచి వాటి నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగిస్తున్నాం.

ప్ర : అన్ని ప్రముఖ ఆలయాలలో కొంతమంది భక్తులు ఉచిత దర్శన సౌకర్యం పొందుతున్నారు. కొంతమంది రుసుము చెల్లించి దర్శనం చేసుకుంటున్నారు. దీనివలన భగవంతుడి సన్నిధిలో కూడా ‘ధనిక, పేద’ అనే తేడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ‘అందరికీ ఉచిత దర్శనం’ అనే పద్ధతి అనుసరిస్తే ఈ తేడాలు మాయమవుతాయి. అటువంటి రోజులు వస్తాయని ఊహించవచ్చా ?

స : అన్ని దేవాలయాల్లో ఆలయం తెరిచి ఉన్నంత సేపు ఉచిత దర్శనం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకత కోరుకునే వారి కోసం ప్రత్యేక దర్శనం ఉంటుంది. అంతేగాని ఉచిత దర్శనం లేకుండా కేవలం ప్రత్యేక దర్శనం మాత్రమే ఉన్న దేవాలయం ఏదీ లేదు. ప్రజల నుంచి ప్రత్యేక దర్శనం అవసరం లేదనే భావన వస్తే తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకుంటాం.

ప్ర : టిటిడిలో అన్య మతాలకు చెందిన ఉద్యోగులు 44 మంది ఉన్నారని వార్తలు వచ్చాయి. వీరిని తొలగించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా ?

స : అవును నిజమే. గతంలో ఎండోమెంట్‌ డిపార్డ్‌మెంట్‌ 55 మంది అన్య మతస్తులను తొలగించింది. అయితే వాళ్లు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని కొనసాగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. కోర్టు తీర్పు ఆధారంగా ఈ విషయంపై చర్యలు తీసుకుంటాం. టిటిడిలో ఉన్న 44 మంది అన్య మతస్తులకు కూడా నోటీసులు జారీ చేశాం. మీ ఆలోచనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఏ మతానికి చెందిన సంస్థల్లో కూడా అన్య మతస్తులు ఉండకూడదు. అది చర్చి కావొచ్చు, మసీదు కావొచ్చు, హిందూ దేవాలయం కావొచ్చు.

ప్ర : ప్రముఖ ఆలయాలలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, ఒడుగు వంటి సేవల కోసం భక్తుల వద్ద అక్కడి అర్చకులు ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. దీనివలన పేదవారు ఆలయంలో ఇటువంటి సేవలు పొందలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా?

స : ఈ ప్రశ్న అర్చకులను తప్పుదారి పట్టించే విధంగా ఉంది. అలా ఏ అర్చకుడూ బలవంతంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయరు. అన్ని దేవాలయాల్లో ఆ సేవలన్ని ఉచితమే. భక్తులెవరైనా ఇష్ట పూర్వకంగా డబ్బులు ఇస్తే మాత్రమే పూజారులు తీసుకుంటారు. ముందు ముందు ఈ సేవలన్నిటినీ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఉచితంగా నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నాం.

ప్ర : ‘ప్రముఖ ఆలయాలలో ఉండే కొంతమంది అర్చకుల ఆదాయంతో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగి కూడా పోటీ పడలేడు’ అనేది భక్తుల అభిప్రాయం. దీనిపై ప్రభుత్వ నిఘా ఉందా ?

స : ఇది నాకు సంబంధించిన వ్యవహారం కాదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసే పి.ఆర్‌.సి.నే అర్చకులకు కూడా అమలు చేస్తున్నాం. దాని ప్రకారమే ఎండోమెంట్‌ డిపార్ట్‌ మెంట్‌లో అర్చకులకు, ఉద్యోగులకు జీతాలిస్తున్నారు. టిటిడి లాంటి ప్రముఖ దేవాలయాల్లో పని చేసే అర్చకులకు ఎంత రాజభోగం లభిస్తుందో.. గ్రామాల్లో ఉండే అర్చకులు అంత పేదరికంలో ఉన్నారు. కావున అందరినీ ఒకే కోణంలో చూడలేం. వారికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే వంశపార పర్యంగా కూడా వారికి అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో చిన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కొంతమేరకు జీతాలు పెంచాం. వారి గురించి మరోసారి ఆలోచన చేయాల్సి ఉంది. మీరు కేవలం నాలుగైదు పెద్ద దేవాలయాల్లో చూసి మాత్రమే ఇలా అడుగుతున్నారు. కాని నిజానికి అర్చకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పరిస్థితి బాగున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అర్చకునితో పోల్చలేం. ఎందుంటే వేద మంత్రాలు, పంచాంగాలు నేర్చుకోవడం సాధారణ విషయం కాదు. దానికి ఎంతో శక్తి, కాలం అవసరమవుతుంది. ఈ విషయంపై మనందరం ఆలోచన చేయాల్సి ఉంది. కేవలం భగవంతుడిని నమ్ముకొని బతికే వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ప్ర : సంక్రాంతి, దసరా, రక్షాబంధన్‌, ఇంకేదైనా పెద్ద పండుగలు, జాతరల సమయాల్లో ఆర్‌.టి.సి. వారు ప్రయాణీకుల నుండి రెండు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమస్య నుండి హిందువులకు ఎప్పటికైనా విముక్తి లభించగలదని ఆశించవచ్చా ?

స : మీ ప్రశ్నతో నేను ఏకీభవిస్తున్నాను. ఆర్‌.టి.సి. రద్దీ సమయాల్లో ధరలు పెంచడం సరైంది కాదు. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. రాబోయే రోజుల్లో హిందూ సమాజం సంఘటితమై చైతన్యవంతమైతే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదు.

ప్ర : దేవాలయాలలో ధర్మకర్తృత్వ మండలి ఏర్పాటు చేయాలని ఇదివరలో ప్రభుత్వం భావించింది. ఈ పని ఎంతవరకు వచ్చింది ?

స : అన్ని దేవాలయాల్లో ధర్మకర్తృత్వ మండళ్ళు ఉన్నాయి. కాని వాటికి రాజకీయ రంగు పులుముకొంటోంది. అయితే ఈ పరిస్థితి మారాలంటే ముందుగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అసలు ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించడం ఎంత వరకు సబబు ? ఒక లౌకిక వాద ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించొచ్చా? ప్రభుత్వాలు దేవాలయాలను నిర్వహిస్తున్న పూరీ లాంటి ఆలయాల్లో సదుపాయాలు ఉండటం లేదు. అనేక సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. అందుకే రాజకీయాలకు అతీతంగా ధార్మిక సంస్థలు మాత్రమే దేవాలయాలను నిర్వహించాలి. వాటికి ఎలక్షన్‌ కమిషన్‌ లాగా స్వయం ప్రతిపత్తి ఉండాలి.

ప్ర : శివరాత్రి పర్వదినం రోజున భక్తుల కోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ?

స : రాష్ట్రంలో శివాలయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో స్థానిక రెవెన్యూ, హెల్త్‌, పోలీసు, ఆర్‌.టి.సి., అలాగే నదులు పక్కన ఉన్న పుణ్యక్షేత్రాల్లో అయితే ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వారితో చర్చించి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. శివరాత్రికి భక్తులు ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకొనేందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ప్ర : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందువులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి ?

స : ఈ విషయంపై హిందూ సమాజమంతా సంఘటితమై పోరాడాలి. అయితే ఎవరి మనోభావాలకైతే భంగం వాటిల్లిందో వారు కేసు పెడితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

ప్ర : జాగృతి పాఠకులకు మీరిచ్చే సందేశం ?

స : జాగృతి పత్రిక హిందూ సనాతన ధర్మాన్ని, సామాజిక విషయాలను పాఠకులకు తెలియజేస్తూ చైతన్యవంతుల్ని చేస్తోంది. ఈ ఇంటర్వ్యూ చదివిన పాఠకులు దేవాలయాలు నిర్వహించేందుకు ఎటువంటి ప్రత్నామ్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేయాలో తమ అభిప్రాయాలు, సూచనలను ఏ.పి. దేవాదాయ శాఖకు ఈ క్రింది మెయిల్‌కు పంపొచ్చు.

endowmentsministerpydikondala@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *