పాలస్తీనాలో మోది చరిత్రాత్మక పర్యటన

పాలస్తీనాలో మోది చరిత్రాత్మక పర్యటన

– పాలస్తీనాలో పర్యటించిన మొదటి భారత ప్రధాని మోది

– చర్చలే సమస్యలకు పరిష్కారమని మోది హితవు

– మోదికి పాలస్తీనా అత్యున్నత పురస్కారం

‘తూర్పు దేశాలతో సత్సంబంధాలు’ అనే విధానాన్ని ముందుకు తెచ్చిన మోది పశ్చిమాసియాలోని మూడు దేశాల పర్యటనతో ‘పశ్చిమంతో సంబంధం లేదా పశ్చిమానికి ప్రాధాన్యం’ అనే విధానానికి తెరతీశారు. ప్రచ్చన్నయుద్ద శకం మాదిరిగా కాకుండా నేడు అన్ని దేశాలు ఇతర దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని భావి స్తున్నాయి. భారత్‌ కూడా మోది నేతత్వంలో అటు షియా, ఇటు సున్నీ దేశాలతో సున్నితమైన, సత్సంబంధాలను నెలకొల్పుకోవ డానికే ప్రయత్నిస్తోంది.

మోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటారు. పాలస్తీనాను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానిగా ఆయన నిలిచారు. ఫిబ్రవరి 10 నుండి సాగిన పశ్చిమాసియా పర్యటనలో పాలస్తీనాతో పాటు సౌదీ, ఒమన్‌ లలో ఆయన పర్యటించారు. ప్రధాని పర్యటన ప్రారంభం కావడానికి ముందే కాంగ్రెస్‌ మద్దతుదారులు ట్విట్టర్‌ యుద్దం ప్రారంభించారు. 1960లో గాజాలో మాజీ ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్యసమితి అత్యవసర బలగాలను కలిసిన ఫోటోను ట్విట్టర్లో ఉంచారు. కానీ నెహ్రూ పర్యటన అధికారికమైనది కాదు. పైగా గాజా ప్రాంతం అప్పట్లో ఈజిప్ట్‌ సైనిక నియంత్రణలో ఉంది. కాబట్టి నెహ్రూ పాలస్తీనా పర్యటన చేశారని చెప్పలేం. పాలస్తీనాకు మద్దతు తెలపడం భారతీయ విదేశాంగ విధానంలో ప్రధాన అంశంగా ఉంటోంది. 1974లో పాలస్తీనా విమోచన సంస్థ (పిఎల్‌ఒ)ను పాలస్తీనా ప్రజల చట్టబద్దమైన ప్రతినిధిగా గుర్తించిన భారత్‌ అలా చేసిన మొట్టమొదటి అరబ్బేతర దేశం. ఆ తరువాత 1988లో పాలస్తీనాను ఒక దేశంగా కూడా గుర్తించింది.

మొదటినుండి అండగా..

ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు భారత పర్యటన ముగిసిన కొన్ని వారాల లోపే మోదీ వెస్ట్‌ బ్యాంక్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు 2017లో మోది ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ విధంగా ఇజ్రాయెల్‌లో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోది గుర్తింపు పొందారు కూడా. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లతో భారత్‌ సున్నితమైన, సంతులన సంబంధాలను కొనసాగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి భారత్‌లో ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా పాలస్తీనాకు మద్దతు తెలుపడం ఆచారంగా వస్తోంది. ఇంధన అవసరాలు, అధిక ముస్లిం జనాభాతో భారత్‌ ‘అరబ్‌ల కంటే ఎక్కువ అరబ్‌’ లాగా వ్యవహరిస్తూ ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అండగా నిలిచింది. యునెస్కోలో పూర్తి సభ్యత్వం పొందడంలో, యుఎన్‌జిఎ లో పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య గోడ కట్టే ప్రతిపాదనను వ్యతిరేకించడం, ఐక్యరాజ్యసమితి ఆవరణలో పాలస్తీనా జండా ఎగురవేయాలన్న ప్రతిపాదన మొదలైనవాటిలో భారత్‌ పూర్తిగా పాలస్తీనాకు మద్దతు తెలిపింది, అండగా నిలిచింది. పాలస్తీనాకు దేశంగా అధికారిక హోదా ఇవ్వాలని భారత్‌ బేషరతుగా మద్దతు తెలిపింది. కాని పాలస్తీనా / అరబ్‌ లీగ్‌ / ముస్లిం దేశాల సంస్థ (ఒఐసి) ఎప్పుడూ కాశ్మీర్‌ విషయంలో యుఎన్‌లో భారత్‌ కు తమ సమర్ధన తెలుపలేదు. కానీ మరోవైపు వ్యవసాయం, జల నిర్వహణ, రక్షణ రంగాలలో భారత్‌ , ఇజ్రాయెల్‌ల మధ్య ఒప్పందాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఐనా విచిత్రంగా భారత్‌ మాత్రం ఎప్పుడూ అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవలేదు.

పైగా ఇప్పుడు భారతీయ ముస్లిములకు పాలస్తీనాకు మద్దతు విషయం పాతబడిపోయిన అంశం. ఇప్పుడు వాళ్ళు తమ ఆర్ధిక అభివద్ధి గురించి ఆందోళన చెందుతున్నారు. ఆలాగే షియా, సున్నీ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో పాశ్చాత్య దేశాల దష్టి కూడా పాలస్తీనా నుండి పక్కకు పోయింది. ఆఖరుకు అరబ్‌ దేశాలు కూడా ఈ పాలస్తీనా గురించి పట్టించుకోవడంలేదు. భారత్‌పై చమురు నియంత్రణ విధించే పరిస్థితిలో కూడా ఆ దేశాలు లేవు. ఎందుకంటే సంక్షోభం నుంచి ప్రపంచ చమురు మార్కెట్‌ ఇంకా కోలుకోలేదు. పైగా వేగంగా ఆర్ధికాభివద్ధిని సాధిస్తున్న భారత్‌ చమురు వాడకంలో తమకు అతిపెద్ద మార్కెట్‌ అవుతుందని అరబ్‌ దేశాలు గ్రహించాయి. భారత్‌ కూడా తన చమురు అవసరాలను తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, పునరుత్పాదక వనరులను అన్వేషిస్తోంది. పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు భారత్‌ చమురు, గ్యాస్‌ దిగుమతులను ఇతర దేశాల నుండి కూడా చేసుకుంటోంది. సహజ వాయువును అమెరికా నుండి దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఇప్పటికే జోర్డాన్‌, కువైట్‌, అరబ్‌ ఎమిరేట్‌లకు సహజ వాయువును ఎగుమతి చేస్తోంది. కనుక పాలస్తీనా పట్ల అనుసరించాల్సిన విధానంపై చమురు దిగుమతులు, దేశంలో ముస్లిముల ఒత్తిడి మొదలైన అంశాలు ఏవీ ఇప్పుడు భారత ప్రభుత్వానికి అడ్డంకి కావు. అలాగే అంతర్గత సంక్షోభం, పరిపాలన మార్పిడి మొదలైన సమస్యలతో తలమునకలై ఉన్న పశ్చిమాసియా దేశాలకు కూడా పాలస్తీనా గురించి ఆలోచించే తీరిక, సమయం లేవు. ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలకు ఈజిప్ట్‌, సౌదీ అరేబియాలు ఇప్పుడు వ్యతిరేకంగా లేవు. పాలస్తీనా విమోచన సంస్థలో కూడా పరిస్థితులు సరిగా లేవు. అంతర్గత కలహాలతో బలహీనపడిన ఆ సంస్థకు పాలస్తీనాపై పట్టుకూడా సడలింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద మేఘాలు కమ్ముకు వస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోని ఏ దేశమూ ‘మంచి తీవ్రవాదం’, ‘చెడ్డ తీవ్రవాదం’ అని తర్కించే పరిస్థితి లేదు. పాలస్తీనా విమోచన సంస్థకు చెందిన సైనిక విభాగం హమాస్‌కు చెందిన నాయకుడిని అమెరికా తీవ్రవాదిగా ప్రకటించింది. అలాగే తీవ్రవాదంపై భారత్‌ ఇటీవల అనుసరిస్తున్న విధానం కూడా పాలస్తీనా లక్ష్యాలకు అనుకూలంగా లేదు.

నిరంతర సమీక్ష

2017 డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ చేసిన ప్రకటన అరబ్‌ దేశాల్లో కలకలం సష్టించింది. ప్రకటనకు వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ యుఎన్‌జిఎ లో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాయి. ఇజ్రాయెల్‌తో ఇటీవల బలపడ్డ స్నేహసహకారాలతో సంబంధం లేకుండా భారత్‌ ఆ తీర్మానానికి మద్దతుగా ఓటు వేసింది. అలా పాలస్తీనా పట్ల తన అనుకూల వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. చారిత్రక అంశాల ఆధారంగా ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ప్రకారమే భారత్‌ ఇప్పటికీ పాలస్తీనా జాతీయత పట్ల అనుకూలంగానే వ్యవహరిస్తోంది. కానీ సమయానుసారం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లతో సంబంధాలను భారత్‌ సమీక్షించుకుంటోంది. 2017లో రామల్లా (పాలస్తీనా)కు వెళ్లకుండా ప్రధాని ఇజ్రాయెల్‌లో మాత్రమే పర్యటించడం ఈ దిశలో వేసిన అడుగే.

హిందుత్వ గుర్తింపు కలిగిన మోది ప్రభుత్వం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లతో సంబంధాలను నిరంతరం సమీక్షించుకుంటూనే ఉంది. రెండు దేశాలతోనూ సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు మోది స్పష్టమైన సంకేతాలను పంపుతున్నారు. భారతీయ దౌత్య విధానాన్ని స్పష్టం చేయడం కోసం మోది రామల్లా నుండి అమ్మాన్‌కు జోర్డాన్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించారు. దానికి ఇజ్రాయెల్‌ హెలికాప్టర్‌లు రక్షణగా వచ్చాయి. పాలస్తీనా చేరుకోగానే మోది యాషర్‌ అరాఫత్‌ సమాధిని సందర్శించి, అక్కడి మ్యూజియంను కూడా దర్శించారు. ఇది అనేకమంది అమాయక ఇజ్రాయిలీల ప్రాణాలు పోవడానికి అరాఫత్‌ కారణమని భావిస్తున్న ఇజ్రాయెల్‌కు పెద్దగా మింగుడుపడని విషయం.

మోదికి పురస్కారం

మోదికి ఘనస్వాగతం చెప్పిన అధ్యక్షుడు అబ్బాస్‌ భారత్‌తో బలమైన స్నేహసంబంధాలను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 50 మిలియన్‌ డాలర్ల విలువైన ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అందులో బెత్లెహామ్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, జాతీయ ముద్రణాలయం, మహిళలకు సాధికారత కేంద్ర నిర్మాణం, అనేక పాఠశాలల నిర్మాణం ఉన్నాయి. చర్చల తరువాత భారత, పాలస్తీనా సంబంధాలు బలపడేందుకు కషి చేసినందుకు మోదికి పాలస్తీనా అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ ను అబ్బాస్‌ అందించారు. జెరూసలెం ప్రస్తావన ఎక్కడా రాకుండా జాగ్రత్త వహించిన మోది చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘హింస, గతకాలపు చేదు జ్ఞాపకాల నుండి పాలస్తినాకు చర్చలు, దూరదష్టి మాత్రమే విముక్తి కలిగించగలవు. అది అంత సులభం కాదని తెలిసినా భవిష్యత్తు కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అని ఆయన అన్నారు.

మోదికి అత్యున్నత పురస్కారాన్ని అందించిన తరువాత అధ్యక్షుడు అబ్బాస్‌ ‘అంతర్జాతీయంగా భారత్‌ కు ఉన్న గౌరవం, పేరు ప్రతిష్ఠలు, అలీన ఉద్యమంలో భారత్‌ నిర్వహించిన పాత్ర, నేడు వ్యూహాత్మకంగా, ఆర్ధికంగా వేగంగా ఎదుగుతున్న భారత్‌ బలం వంటివి చూసినప్పుడు మా ప్రాంతంలో శాంతి నెలకొనడంలో భారత్‌ చురుకైన పాత్ర పోషించగలదని భావిస్తున్నాం’ అన్నారు.

‘తూర్పు దేశాలతో సత్సంబంధాలు’ అనే విధానాన్ని ముందుకు తెచ్చిన మోది పశ్చిమాసియాలోని మూడు దేశాల పర్యటనతో ‘పశ్చిమంతో సంబంధం లేదా పశ్చిమానికి ప్రాధాన్యం’ అనే విధానానికి తెరతీశారు. ప్రచ్చన్నయుద్ద శకం మాదిరిగా కాకుండా నేడు అన్ని దేశాలు ఇతర దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌ కూడా మోది నేతత్వంలో అటు షియా, ఇటు సున్నీ దేశాలతో సున్నితమైన, సత్సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రయత్నిస్తోంది. ‘అంటరాని’ దేశాలంటూ ఇప్పుడు ఏవీ లేవు. స్వప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని, వాటిని నెరవేర్చుకునే విధంగా అన్ని దేశాలతో సంబంధాలను కలిగి ఉండడం నేటి అవసరం.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *