అవి విద్యార్థికి రెండు నేత్రాల్లాంటివి

అవి విద్యార్థికి రెండు నేత్రాల్లాంటివి

విద్యార్ధి దశలో పిల్లలకు సహజంగా గెలవాలని, ఓడినా మళ్లీ గెలవాలని అనేక రకాల పట్టుదల లుంటాయి. కక్షలూ, కార్పణ్యాలుంటాయి. పిల్లలకి ప్రోత్సాహం కల్పించడం కోసం పూర్వం చాలా మార్గాలు ఉండేవి. ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, ఉపన్యాస పోటీలు, రకరకాల నాటకాలు, ఉత్సవాల సందర్భాలు. ఈ నాటకాలలో కొందరు నాయకుల పాత్రలేస్తుంటారు, మరికొందరు ప్రతి నాయకుల పాత్రలేస్తుంటారు. ఈ పాత్రలు వెయ్య డంలో అతనిలో ఉండే ప్రబుద్ధులన్నీ బయటకు వచ్చి అంతరిస్తాయి. ఆ నటనతో అతను సంతోషిస్తాడు.

ఇవాళ విద్యావిధానంలో వచ్చిన మార్పు ఏమిటంటే ‘అపాత్రం’ తప్పితే అసలు ఏ పాత్రా లేదు. చదువు, చదువు, చదువు. చదువు పేరుతో పిల్లలను నాలుగు గోడల మధ్య బిగించి గాలికూడా ఆడకుండా చేస్తున్నారు. అందులోనూ రెసిడెన్షియల్‌ కళాశాలలో అయితే ఉదయం 4 గంటలకే లేపుతారు. అక్కడి నుండి వాళ్లు పడుకునేటప్పటికి రాత్రి 11 అవుతుంది. అంటే కనీసం 5 గంటలు కూడా పడుకునే అవకాశం లేదు. విద్యార్ధి దశలో 20 ఏళ్ల వయసు దాటేవరకు 9 గంటలు పడుకోవాలి. (రాత్రి 8 గంటలు, మధ్యాహ్నం ఒక గంట). అలాగే విద్యార్ధి దశ దాటి పెద్దవయసు వచ్చాక మనిషి 8 గంటలు పడుకోవాలి. 60 ఏళ్లు దాటిన మనిషి కచ్చితంగా 10 గంటలు పడుకోవాలి. అలాగే బాల్యంలో కూడా 10 ఏళ్ల లోపు పిల్లలు కచ్చితంగా 10 గంటలు పడుకోవాలి. అందులో ఎక్కువ భాగం రాత్రి, కనీసం ఒక గంట మధ్యాహ్నం పడుకోవాలి.

ప్రస్తుత విధానంలో పిల్లలకు ఎక్కడా విశ్రాంతి దీనినే లేదు. రెస్ట్‌లెస్‌ మైండ్‌ అంటాము. విశ్రాంతి లేని మనస్సు పిచ్చి పిచ్చి అలోచనలు, నిలకడ లేని ఆలోచనలను చేస్తుంది.

అదీకాక ఇన్నిన్ని పుస్తకాలు తీసుకొని వాటిని కంఠస్థం చెయ్యమంటారు. దానివల్ల వాళ్ల బుర్ర వేడెక్కిపోతుంది. బిట్లు, బిట్లు, బిట్లు. 10 వేల, 20 వేల బిట్లు. ఎన్ని కంఠస్థం చేస్తారు ? ఓ భారతం, ఓ రామాయణం లేదా పిట్టకథ అయితే కథలు చదువుతారు. ఈ కథల్లో ఓ పద్దతి ఉంటుంది. కాస్త ఆసక్తి ఉంటుంది. ఈ బిట్లలో ఏముంటుంది ? ఇందులోనే ఎప్పటికప్పుడు పోటీ పరీక్షలు పెడుతున్నారు. పొద్దున చదవమని మధ్యాహ్నం పరీక్ష పెడుతున్నారు. అంటే ప్రతిరోజూ ఒత్తిడే. ఒక 25 మార్కుల పేపరుకు నిన్న 20 మార్కులు వచ్చి, ఇవాళ 19 మార్కులు వస్తే ఎందుకు తగ్గాయంటారు. అంటే నువ్వు చదవడంలేదు, ఇంటి మీద దృష్టి పడింది అంటూ, అక్కడ ఉన్న వార్డెను చివాట్లు పెడతాడు. వీటితో విద్యార్థి ప్రవృత్తి ఏమవుతుంది ?

ఈ భయంకరమైన పరిస్ధితులలో రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ పేరు మీద 10 ఎళ్లు, ఆ తరువాత ఇంటర్‌ రెండేళ్లు, తర్వాత ఎంసెట్‌ ఒక సంవత్సరం. భారతంలో 10+2+1 కలిపితే 13 ఏళ్లు అవుతాయి. అంటే 12 ఏళ్లు అరణ్యవాసం, యేడాది అజ్ఞాత వాసం. నిజంగా ఎంసెట్‌ కోచింగ్‌ అజ్ఞాతవాసమే. ఇంజనీరింగ్‌కు ముందు ఆటలు మానేసి, ఇంత ఒత్తిడిలో జీవించిన విద్యార్ధికి ఒక్కసారిగా ఇంజ నిరీంగ్‌లోకి వచ్చాక పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వికృతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడున్న స్వేచ్ఛ పరిమితమైనది కాదు! ఇంతకు ముందు అసలు స్వేచ్ఛే లేదు. ఆ స్వేచ్ఛ లేని కాలంలో అతని లోని ఉద్వేగాలు లోపలే ఉండిపోతాయి. కాబట్టి ఈ అపరిమిత స్వేచ్ఛా వాతావరణంలో అవి ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తాయి. ఆ సమయంలో అతడిని ఒక నాటకంలో ఫైటింగ్‌కోసం అవకాశం ఇచ్చామను కోండి! అందులో ఎదుటివాడిని నిజంగానే గుద్దే స్తాడు. అక్కడితో అతడిలోని ఆకాంక్ష తీరిపోతుంది.

మనుషులలో అతి తక్కువమంది సత్వ గుణంతో, మరికొందరు రజోగుణంతో, ఎక్కువ మంది తమోగుణంతో ఉంటారు. ఈ క్రౌర్యం, హింస, బద్దకం, నిద్ర, ఆలస్యం ఇవన్నీ తమోగుణ సంబంధ మైనవి. మన దేవతలలో ఈ ప్రవృత్తులు ఉంటాయి. శివుడు తమోగుణం కలవాడు. ఆయన రుద్రుడిని సృష్టించి ప్రళయం తెప్పిస్తాడు. ఆ ప్రవృత్తిలో అయన మూడవ కన్ను తెరుస్తాడు. మూడవ కన్ను తెరవట మంటే హింసే కదా! కాని అది అప్పుడు అవసరం.

అలాగే మనిషిలో అన్ని ప్రవృత్తులు ఉంటాయి. సత్వగుణ ప్రవృత్తి కల విద్యార్థి శాంతంగా ఉండి చదువులో ముందుకు పోతున్నాడు. వాడి గొడవ వాడే చూసుకుంటాడు. ఏదో ఒక క్యాంపస్‌లో ఉద్యోగానికి అర్హుడవుతాడు. అలాగే రజోగుణంతో ఉన్నవాడు ఎన్నికలలో పోటీ చేస్తాడు.

కానీ తమోగుణం ఉన్నవాడు తన క్రిందివాళ్లను ర్యాగింగ్‌ చేయడం మొదలుపెడతాడు. సిగరెట్టుతో కాల్చడం, పరిగెత్తమనడం, బట్టలు విప్పమనడం, ఆడవాళ్లనయితే మరీ భయంకరంగా..! ఈ ప్రవృత్తి దారుణంగా ఉంటుంది. ఇప్పుడిది ఆడపిల్లల్లో కూడా కనబడుతోంది. సీనియర్‌ విర్యార్ధినులు జూనియర్‌ విద్యార్ధినులను ఇంచుమించు మగపిల్లలు ర్యాగింగ్‌ చేసినట్టే చేస్తున్నారు. అసలు ఆడపిల్లతో ఏం మాట్లాడటానికి మోహమాటపడుతున్నామో అవన్నీ ఇప్పుడు వాళ్లు చేసేస్తున్నారు. ఇంత భయంకరమైన స్థితికి కారణం విద్యార్జన సమయంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆడుకోవడానికి కనీసం ఒక గంట సమయం ఇవ్వకపోవడం, పాడుకోవ డానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ ఇవ్వకపోవడమే.

మా పాఠశాలలో నేను చదువుకున్నప్పుడు 1 నుండి 10 తరగతి వరకు కనీసం 50 నుండి 60 ఉపన్యాసాలను ఇచ్చాను. 6వ తరగతి నుండి ప్రతి శనివారం డిబేట్‌ (చర్చ) పెట్టేవారు. అవి అప్పట్లో ఉండేవి. ఆ చర్చలలో కొన్నిటిలో నెగ్గేవాళ్లం, కొన్నిటిలో నెగ్గలేకపోయేవాళ్లం. అటువంటి వాటిని ఉపాధ్యాయులు సరిచేసేవారు. దాని వలన (స్టేజి ఫియర్‌) వేదిక భయం మెల్లగా పోయేది. పది మందిలో మాట్లాడానికి భయపడేవారం కాదు.

ఇవాళ మన తల్లితండ్రులు సూక్ష్మంగా గ్రహించ వలసింది ఏమిటంటే.. ఆట, పాటలు ఉండే పాఠశాలలోనే పిల్లలను చదువుకోసం చేర్చాలి. చదువుతో పాటుగా సంస్కృతిని, సాంప్రదాయాన్ని, దేశభక్తిని, దైవభక్తిని నేర్పే పాఠశాలలోనే చేర్పించాలి. దైవభక్తి, దేశభక్తి అనేవి విద్యార్ధికి రెండు నేత్రా ల్లాంటివి. ఇవి లేకపోతే విద్య అనవసరం.

ర్యాగింగ్‌ వ్యవస్ధ పరిష్కారం కోసం పోలీసులు, చర్చలు, భయపెట్టడాలు, కౌన్సిలింగ్‌ అనేవి ఉపయోగ పడతాయి. కానీ అవి తాత్కాలికమే. విద్యావిధానంలో మార్పులు తేవడమే దీనికి శాశ్వత పరిష్కారం. అప్పుడే దేశం ముందుకు వెళుతుంది.

– మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *