అభివృద్ధి, సుస్థిరతలకే పెద్దపీట

అభివృద్ధి, సుస్థిరతలకే పెద్దపీట

– రుజువు చేసిన ఫలితాలు

– కంచుకోటలో మళ్ళీ ‘కమల’ వికాసం

– ‘చే’ జారిన హిమాచల్‌

దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు అవినీతి, అవకాశ వాద రాజకీయాల వైపు కాకుండా అభివృద్ధి, శాంతి, సుస్థిరతల వైపే అధిక ప్రజలు మొగ్గుచూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేశాయి.

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వరుసగా ఆరోసారి ఘనవిజయాన్ని సాధించి మోది జైత్రయాత్రలో మరో మైలురాయిని అందుకుంది. ఫలితాలకు ముందు వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాషాయజెండా రెపరెపలాడింది. గుజరాత్‌లోని మొత్తం 182 స్థానాల్లో బిజెపి 99 స్థానాల్లో గెలిచి మెజార్టీ సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 68 స్థానాల్లో 44 స్థానాల్లో గెలిచి జయకేతనాన్ని ఎగురవేసింది.

గుజరాత్‌లో గత ఎన్నికల్లో 115 స్థానాలను సాధించిన బిజెపి ఈసారి జరిగిన ¬రా¬రీ పోరులో కొన్ని సీట్లను కోల్పోయి 99 స్థానాలకే పరిమితం కావలసి వచ్చినా 22 ఏళ్ళ పాలనలో ఎదురైన ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్ళీ విజయం సాధించడం సాధారణ విషయం కాదు. పటేళ్ళ రిజర్వేషన్‌ వ్యవహారం ఈ ఎన్నికల్లో తీవ్రప్రభావం చూపినా సొంతరాష్ట్రంలో తన ప్రభంజనం చెక్కుచెదరకుండా జాగ్రత్త పడటంలో మోది సఫలీకృతులయ్యారన్నది నిర్వివాదాంశం. హిందుత్వ నినాదంతో పాటు ‘గుజరాత్‌ ప్రౌడ్‌’, ‘నేను లోకల్‌’ సెంటిమెంట్ల ద్వారా కూడా బిజెపి లబ్దిపొంద గలిగింది. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి తదితర ఆర్థిక సంస్కరణలు గుజరాత్‌ ప్రజలపై కొంత ప్రభావం చూపినా జాతీయవాదం, అభివృద్ధి తన ఊపిరిగా కలిగిన బిజెపి సులభంగా గట్టెక్కగల్గింది. గత 22 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ముందు తాత్కాలికంగా ఆందోళన కల్గించిన ఆర్థిక సంస్కరణలు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినప్పటికీ అర్బన్‌ ప్రాంతంలో బిజెపి చరిష్మా ఏమాత్రం చెక్కు చెదరలేదని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. అందరూ ఊహించినట్లుగానే పటేళ్ళ ఉద్యమం లేచిన సౌరాష్ట్రలో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగగా సెంట్రల్‌ గుజరాత్‌, మధ్య గుజరాత్‌లలో బిజెపి హవా స్పష్టంగా కనపడింది.

ముఖ్యంగా మహానగరాలైన సూరత్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌లలో బిజెపి విజయయాత్ర కొనసాగించింది. ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోది ‘నన్ను తప్పించేందుకు పాక్‌లో సుపారీ ఇచ్చార’ంటూ సంధించిన అస్త్రం; ఇదే తరుణంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ మోదిని ‘నీచ్‌ ఆద్మి’ అంటూ చేసిన వ్యాఖ్యలను మోది తనదైన శైలిలో తిప్పికొట్టి గుజరాత్‌ ప్రజల ఆదరణను పొందడం కమలదళానికి కలసివచ్చింది.

బిజెపితోనే సుస్థిర అభివృద్ధి

2012 ఎన్నికల్లో 115 సీట్లను సాధించిన బిజెపి ఈ సారి కొంతమేర ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగినా సీట్ల పరంగా 99కి పడిపోవటం గమనార్హం. ఒక విధంగా చెప్పాలంటే ఎంతో తెలివైన గుజరాత్‌ ప్రజలు బిజెపికి బంపర్‌మెజార్టీని కట్టబెట్టకుండా భవిష్యత్‌లో జాగ్రత్త పడండంటూ హెచ్చరించారన్నది నిర్వివాదాంశం. కౌంటింగ్‌ సందర్భంగా ఒక దశలో బిజెపి వెనుకబడడంతో సెన్సెక్స్‌ పతనం దిశగా వెళ్ళినా మళ్ళీ ఆ పార్టీ విజయం దిశగా పయనించడంతో కోలుకోగలిగింది. దీనినిబట్టి ప్రజలు బిజెపి పాలనలోనే అభివృద్ధి, శాంతి, సుస్థిరత, లభించగలవని నమ్ముతున్నారనేది స్పష్టమయింది.

కాంగ్రెస్‌పై నమ్మకం లేకే..

గతంలో 61 స్థానాలతో సరిపెట్టుకొన్న కాంగ్రెస్‌ ఈ సారి 77 సీట్లతో బలమైన విపక్షంగా అవతరించింది. ఫలితాలు వెలువడే రెండురోజులకు ముందే కాంగ్రెస్‌ రథసారధిగా రాహుల్‌ పగ్గాలను చేపట్టడం యాదృచ్ఛికమే అయినా పార్టీ అధినేతగా పరాభవ భారాన్ని మోయక తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్‌గాంధీ ప్రచార సందర్భంగా చేసిన ఆలయాల సందర్శన ద్వారా బిజెపి స్థిర హిందుత్వ ఓట్లను కూడా కొద్దిమేరకు తనఖాతాలో వేసుకోగలిగారు. అయితే హిందుత్వానికి, జాతీయవాదానికి, దేశ అభివృద్ధికి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్‌ను అధిక ప్రజానీకం నమ్మలేదని ఫలితాలు రుజువు చేశాయి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుచుకొన్న 61 సీట్లలో 15 చోట్ల కొత్తగా పాగా వేసిన బిజెపి, తాను ఇదివరకు గెలుచుకొన్న 115 స్థానాల్లో 32 సీట్లను కాంగ్రెస్‌కు వదులుకోవలసి వచ్చింది. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా కుల, మతాలే విజయాలను శాసిస్తాయను కొంటే భంగపాటు తప్పదనడానికి గుజరాత్‌ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్ర జనాభాలో 14 శాతంగా ఉన్న పాటీదారులు ఒబిసి రిజర్వేషన్లలో కోటా కోరి విధ్వంసకర ఆందోళనలకు తెగబడుతున్న తరుణంలో వారి నేత హార్దిక్‌ పటేల్‌ను అక్కున చేర్చుకోవడం, మరో రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్‌తో జతకట్టడం కాంగ్రెస్‌కు కొంత ప్లస్‌ అయినప్పటికి అధికశాతం ప్రజలను ఆకట్టుకోలేక పోయింది. అయితే 1995 తర్వాత కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఈ ఎన్నికల్లోనే వచ్చాయి. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన భారతీయ ట్రైబల్‌ పార్టీకి రెండు, ఎన్‌సిపికి ఒకటి, స్వతంత్రులకు మూడు స్థానాలు దక్కాయి. గుజరాత్‌ ఫలితాల్లో 16 స్థానాల్లో విజేతలు – పరాజితుల మధ్య ఓట్ల తేడా 2000 లోపే ఉండటం గమనార్హం.

గుజరాత్‌లో తాజా విజయంతో రెండు వరుస హ్యాట్రిక్‌లు సాధించిన కమలనాథులు సాధారణ మెజార్టీకి అదనంగా ఏడు సీట్లకే పరిమితం కావడం గమనార్హం. అలాగే నిజమైన జాతీయ భావం, భారత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకుండా కేవలం సంకుచిత భావాలు, అవకాశవాద రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టవచ్చన్న రోజులు పోయాయనే వాస్తవాన్ని రాహుల్‌గాంధీ గుర్తించవలసి ఉంది.

ఇక హిమాచల్‌ విషయానికి వస్తే అక్కడ ఎప్పటి లాగానే ఆనవాయితీ పునరావృతమయ్యింది. 1985 నుంచి బిజెపి, కాంగ్రెస్‌లకు ఒకపార్టీ తర్వాత మరొకపార్టీకి అవకాశం ఇస్తూ వస్తున్న ఆ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దించి బిజెపికి పట్టం కట్టారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో కూడా విఫలం కావడంతో కాంగ్రెస్‌పార్టీ హిమాచల్‌ను ‘చే’ జార్చుకోక తప్పలేదు. ఈ రాష్ట్రంలో 2012 ఎన్నికల్లో 38.4 శాతం ఓట్లతో 26 స్థానాలను గెలుచుకొన్న బిజెపి ఈసారి అంతకు పదిశాతం పైగా ఓట్లతో 44 స్థానాలను గెలుచుకొని విజయకేతనాన్ని ఎగురవేసినా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ఓడిపోవడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల విజయాలతో దేశంలో కమలనాథుల పాలనలోని రాష్ట్రాల సంఖ్య 14కు చేరుకొంది.

గుజరాత్‌ ఎన్నికల్లో నోటా (తిరస్కరణ మీట) కూ ఎక్కువ ఓట్లు రావడం విస్మయాన్ని కల్గిస్తోంది. రాష్ట్రంలో 1.8 శాతం మంది ఓటర్లు ఈ తిరస్కరణ మీటను నొక్కినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోది సొంత పట్టణం వడ్‌ నగర్‌లో ప్రతికూల ఫలితం కమలనాథులను విస్మయానికి గురిచేసింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి 19 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం గమనార్హం. వస్త్ర, వజ్రాల వ్యాపారానికి కేంద్రమైన గుజరాత్‌లో జిఎస్‌టి అమలు బిజెపికి తీవ్ర నష్టం కల్గిస్తుందని ప్రతిపక్షాలు భావించినా ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం తెస్తున్న ఆర్థిక సంస్కరణలపై నమ్మకంతో ఆ వర్గాలు బిజెపివైపే మొగ్గుచూపడంతో విపక్షాలు కలవర పాటుకు గురికాక తప్పలేదు.

అయితే పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యతను కొనసాగించిన బిజెపి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకట్టుకోలేక పోయింది. గుజరాత్‌ పట్టణ ప్రాంతాల్లోని 73 నియోజకవర్గాల్లో 55 స్థానాలను మాత్రమే బిజెపి గెలుచుకోగలిగింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 స్థానాల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించి తిరుగులేదనిపించుకొన్న బిజెపికి ఈ తాజా ఫలితాలు కొంతవరకు చేదు అనుభవమే.

ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు అవినీతి, అవకాశ వాద రాజకీయాల వైపు కాకుండా అభివృద్ధి, శాంతి, సుస్థిరతల వైపే అధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేశాయి.

– చతుర్వేదుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *