అత్యాచారాలకు కారణమేంటి?

అత్యాచారాలకు కారణమేంటి?

టివి ఛానళ్ళలో షోలూ, వినోద కార్యక్రమాల పేరిట చూపుతున్న అసభ్య ప్రవర్తన, ద్వంద్వార్థాల భాషకు అంతే లేదు. అటువంటి కార్యక్రమాలను చూడకుండా నియంత్రించవలసిన తల్లి దండ్రులూ, బాధ్యత కలిగిన టీచర్లూ స్వయంగా తామే వాటిని చూస్తున్నారు. ఇక యువత సవ్యమైన మార్గంలో ఎలా పయనిస్తుంది ?

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఇటువంటి దారుణాలను అదుపు చేయడానికి కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్లు రావడంతో ఏప్రిల్‌ 21 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఒక కీలకమైన అత్యవసర ఆదేశానికి (ఆర్డినెన్సు) ఆమోదం తెలిపింది. ఇకపై 12 ఏళ్ళలోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించడం దాని ఉద్దేశ్యం. అయితే ప్రభుత్వం చట్టాలను రూపొందించడం ద్వారానే ఇటువంటి దారుణ సంఘటనలు పూర్తిగా ఆగిపోతాయా ? మనమేం చెయ్యనవసరం లేదా ? అన్నదే ప్రశ్న.

పాశ్చాత్య వెర్రి అనుకరణ

మనిషికి వివేకాన్నీ, సంస్కారాన్నీ ఇచ్చి పశు స్థితి నుండి ఉద్ధరించి అతనికి మానవత్వాన్ని నేర్పే సమున్నత సంస్కృతి మన భారతీయ సంస్కృతి. కథువా సంఘటనను పరిశీలించినపుడు, ఆ నేరానికి పాల్పడ్డ నేరగాళ్ళకు గానీ, వారికి సహకరించిన కొందరు ప్రభుత్వోద్యోగులకు గానీ సమాజానికి మంచి చేసే సుగుణం ఒక్కటి కూడా లేదని మనం గ్రహించవచ్చు. దానికి ప్రధాన కారణం యువత పూర్తిగా పాశ్చాత్య దేశాలలో వ్యాపించి ఉన్న విచ్చలవిడి సంస్కృతిని గుడ్డిగా అనుకరించడమే అని చెప్పక తప్పదు. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికతను అందించే భారతీయ విద్యను, సంస్కృతిని క్రమంగా విడిచి పెడుతూ, ప్రజలు దేహాత్మ భావనకు (నేను అంటే ఈ శరీరం మాత్రమే అనుకోవటం) గుడ్డిగా దాసులవ్వడానికి కారణం టివి, సినిమా, అంతర్జాలం ద్వారా వారికి అందుతున్న పాశ్చాత్య జీవన రీతులే.

‘విదేశాల నుండి వచ్చిన ఏదైనా గొప్పదే’ అనే మూఢ నమ్మకం కారణంగా పెద్దలు పిల్లల పాశ్చాత్య అనుకరణను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా పిల్లలు చిన్నతనం నుండీ అటువంటి జీవన విధానాన్నే అనుకరిస్తున్నారు.

‘పరస్త్రీని తల్లిలాగా చూడాలి’, ‘పెద్దలను గౌరవించాలి’, ‘భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ధర్మబద్ధమైన జీవనం గడపాలి’ వంటి బోధనలకు పాఠశాలల్లో గానీ, దేవాలయాల్లో గానీ, చివరికి ఇళ్ళలో గానీ చోటు లేకుండా పోతోంది. అబద్ధం చెప్పడం, ఒక అమ్మాయిని తనను ప్రేమించ మని వేధించడం, పరుల సొమ్మును కాజేయటం వంటివి చేయకూడని పనులుగా చూపడానికి బదులు, అవి చేయడం ‘లౌక్యం కలిగిన తెలివైనవాడి లక్షణం’లా సినిమా, టివిలలో చూపిస్తున్నారు.

ఇక టివి ఛానళ్ళలో షోలూ, వినోద కార్యక్రమాల పేరిట చూపుతున్న అసభ్య ప్రవర్తన, ద్వంద్వార్థాల భాషకు అంతే లేదు. అటువంటి కార్యక్రమాలను చూడకుండా నియంత్రించవలసిన తల్లిదండ్రులూ, బాధ్యత కలిగిన టీచర్లూ స్వయంగా తామే వాటిని చూస్తున్నారు. ఇక యువత సవ్యమైన మార్గంలో ఎలా పయనిస్తుంది ?

ఒళ్ళంతా కప్పి ఉండేటట్లుగా ఉండవలసిన దుస్తుల స్థానంలో చిరుగులూ, అతుకులూ ఉండే దుస్తులనూ, జుగుప్సాకరమైన వస్త్రధారణనూ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అలాగే అబ్బాయిల విషయంలో కూడా వారేది కావాలంటే అది వెంటనే ఏర్పాటు చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో వెళుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే ‘ఇది ఇవ్వాల్టి ట్రెండండీ’ అంటూ అదేదో ఘనకార్యం చేస్తు న్నట్లు సమాధానం చెప్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు బ్రహ్మచర్యం, పాతివ్రత్యం, వినయం, తమకంటే వయసులో చిన్నవారిపట్ల దయాగుణం కలిగి ఉండడం వంటి సద్గుణాలను కలిగి ఉంటారనుకోవడం అత్యాశే అవుతుంది !

ఆదర్శం – భారతీయ జీవన విధానం

తన జీవితంలోని ప్రతి నిముషాన్నీ ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా గడిపిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని గురించి మన పిల్లలకు ఏ రోజైనా చెప్పామా? తన వదిన ముఖాన్ని ఏనాడూ తలెత్తి చూడని లక్ష్మణుని బ్రహ్మచర్య నిష్ఠ గురించి మన ఉపాధ్యాయులు క్లాసులో విద్యార్థులకు వివరిస్తారా? లేదు. ఎందుకని అడిగితే మనది లౌకిక రాజ్యం అంటారు. మతం గురించి చెప్పకూడ దంటారు. మరి పాఠశాల కార్యక్రమాలలో పిల్లల చేత జుగుప్సాకరమైన దుస్తులు ధరింపచేసి, డి.జె. సంగీతం పెట్టి వాళ్ళచేత పిచ్చిగంతులు వేయిం చొచ్చా! పాశ్చాత్య సంస్కృతిలోని విచ్చలవిడితనాన్ని ‘ట్రెండ్‌’, ‘ఫ్యాషన్‌’ పేరుతో వారిపై రుద్దొచ్చా ! అలా చేయడానికి మన రాజ్యాంగ నిబంధనలూ, లౌకిక చట్టాలూ అడ్డురావా !

అలాగే ఆడపిల్లలను ఎంతగా ఒదిగి ఉండమని చెబుతామో.. అంతకంటే ఎక్కువగా ఒదిగి ఉండమని మగ పిల్లలకు చెప్పటం నేటి అవసరం. ఆడపిల్లల పట్ల మగపిల్లల్లో గౌరవం పెంపొందించాలి. సాటి ఆడపిల్ల అంటే సాక్షాత్తూ తల్లికి మారు రూపం అని నొక్కి మరీ చెప్పాలి.

మీ పిల్లల్లో విలువలు పెరగాలంటే, వారికి వారంలో మూడు రోజులైనా టివి కార్యక్రమాలను ‘త్యాగం’ చేసి, సమాజ విలువలను తెలియచెప్పే రామాయణ, భారతాల గురించి చెప్పండి. పాఠశా లలో వాటిని చెప్పమని పాఠశాల యాజమాన్యానికి సూచించండి. సమస్య దానంతట అదే పరిష్కార మౌతుంది.

– లక్ష్మణ సేవక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *