ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు..

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు..

మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు.. మనం చేరుకోవాల్సిన లక్ష్యం గురించి ఏ విధంగా కృషి చేస్తున్నామన్న దానిపైనే మన కల సాకారమవుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. మనం రెక్కలను ఎంతగా విస్తరిస్తే అంత సులభంగా ఎత్తుకు ఎగరడానికి సాధ్యమవుతుందని నమ్మింది ఓ అమ్మాయి. ఇంకో అమ్మాయేమో క్రికెట్‌ దిగ్గజాలను సైతం తన ప్రతిభతో అబ్బురపరిచేలా చేసింది.. మరో అమ్మాయి ప్రాణాంతకమైన మెదడు క్యాన్సర్‌కి మందును కనిపెట్టింది. ఇలా తన ఆశయాలను చేరుకోవడానికి వీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. విజయాన్ని సాధించారు. మరి ఆ అమ్మాయిల గురించి మనం కూడా తెలుసుకుందామా!!

సాహసమే శ్వాసగా ముందుకు..

సాధారణంగా చాలామంది యువతులు డాక్టరో.. ఇంజీనీరో.. కావాలని అనుకుంటారు కానీ, అనీదివ్య మాత్రం వారందరిలో కెల్లా భిన్నంగా ఆలోచించింది. ఆకాశాన్నే తన లక్ష్యంగా నిర్ణ యించుకుంది. పక్షి వలె ఆకాశంలో విహరించాలని కలలు కన్నది. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవాలనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకుంది. ఇప్పుడు ప్రపంచం లోనే అతి పెద్ద విమానయాన సంస్థ బోయింగ్‌ ట్రిపుల్‌ సెవెన్‌ (777) కమాండర్‌గా అతి చిన్న వయసులో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. 30 ఏళ్ల వయసులో బోయింగ్‌ ట్రిపుల్‌ సెవెన్‌ విమెన్‌ కమాండర్‌గా అనీదివ్య ఎంపికయ్యింది. ఆమె పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. అనీకి 17 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో యూపీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ్‌ ఉడాన్‌ అకాడమీలో చదువుకునే అవకాశం వచ్చింది. పెద్ద చదువులు చదివించేందుకు అంతగా డబ్బు లేదు. అయినా బ్యాంక్‌ లోన్‌ తీసుకున్నారు. ఆర్ధిక వెసులుబాటు కలిగింది కానీ.. ఓ చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ఆమె ఇంగ్లీష్‌లో సరళంగా మాట్లాడలేక పోయింది. దాంతో ఇతరులు హేళనగా చూసే చూపు ఆమెను చాలాసార్లు గాయపరిచింది. వెనక్కి వెళ్లిపోతే బాగుండనిపించింది. కానీ తల్లిదండ్రుల సహకారం, వాళ్లు పడుతున్న శ్రమ చూసి ఆగిపోయింది.

19 ఏళ్లకే ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. 21 ఏళ్ల వయసులో స్పెయిన్‌కు శిక్షణ కోసం పంపిన సమయంలో బోయింగ్‌ 737 విమానాన్ని నడిపి తన సత్తా చాటింది. ఆ తరువాత బోయింగ్‌ 777 నడిపేందుకు లండన్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హద్దుల్లేని ఆకాశంలో ప్రపంచ మంతా ప్రయాణించి తన సత్తా చాటింది. ఎంతో సమర్ధవంతంగా విమానాలను నడిపి అందరి చేత శభాష్‌ అనిపించుకున్న దివ్య ఇప్పుడు బోయింగ్‌ ట్రిపుల్‌ సెవెన్‌ కమాండర్‌. తనకు ఈ గౌరవం దక్కడానికి కారణం తన తల్లిదండ్రులేనంటుంది దివ్య. పిజీ చదివిన దివ్యలో మంచి కవయిత్రి కూడా దాగుందండోయ్‌. ఈమె ఉర్దూ భాషలో సుమారు 30కి పైగా కవితలు రాసింది. కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఎదిరించి నిలబడితే దేన్నయినా సాధించవచ్చని నిరూపిస్తోంది దివ్య.

బ్రెయిన్‌ క్యాన్సర్‌కి చెక్‌ పట్టేందుకు!

ఏ వ్యాధి అయినా త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే తొందరగా నయం చేసుకోవచ్చు కానీ కొన్నిసార్లు సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్లనో లేక నిర్లక్ష్యం వల్లనో ఆ వ్యాధి ముదిరే వరకు గుర్తించలేక.. ఫలితంగా దాని కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయే వారు చాలా మందే ఉన్నారు. దీన్ని గుర్తించింది ఓ అమ్మాయి. అందుకే ప్రాణాంతకంగా భావించే బ్రెయిన్‌ క్యాన్సర్‌కి ఔషధాన్ని కనుగొన్నది. ఫలితంగా 2019 జాతీయ స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ ఎడ్యుకేషన్‌) అవార్డుకు ఎంపికైంది. దీని ద్వారా ఆమెకు రూ.7.10 లక్షల (10 వేల డాలర్లు) నగదు బహుమతి అందజేస్తారు. ఆమె పేరు కావ్య కొప్పారపు. ఉండేది అమెరికాలో. భారతీయ సంతతికి చెందిన ఈమె గ్లియోబ్లాస్టోమా నివారణకు గ్లియోవిజన్‌ అనే ఔషధాన్ని ఆవిష్కరించింది. హార్వర్డ్‌ వర్సిటీలో కావ్య కంప్యూటర్‌ సైన్సెస్‌, జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. తాజాగా ఆమె ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ సహాయంతో ప్రతిష్టాత్మక గ్లియోవిజన్‌ ఔషధాన్ని ఆవిష్కరించింది. డీఎన్‌ఏ శాంపిల్‌తో కంటే బయాప్సీ చిత్రాన్ని స్కాన్‌ చేసి సంప్రదాయ పద్ధతుల్లో బ్రెయిన్‌ క్యాన్సర్‌ లక్షణాలు గుర్తించవచ్చునని నిర్ధారించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు వైద్య చికిత్స అందించడంలో ఇది మెరుగైన పురోగతి అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కంప్యూటర్‌ సాయంతో లోతైన అధ్యయనం ద్వారా జన్యు పరంగా, కణజాలాన్ని విశ్లేషించి 100 శాతం కచ్చితత్వంతో బ్రెయిన్‌ క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించడానికి వీలవుతుంది. అరుదైన, ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి మెచ్చుకోదగిన కృషి చేసినందుకు కావ్యకు ఈ గుర్తింపు లభించింది.

కావ్య ఇంతకు ముందుకూడా తన తాతయ్య కోసం ఓ ఆవిష్కరణని చేసింది. డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు వచ్చే రెటినోపతి (కంట్లోని రెటీనాకి సంబంధించిన రక్తనాళాలను పూర్తిగా దెబ్బతీసి చూపును నష్టపరిచే ఓ వ్యాధి) ప్రారంభ దశను కనుగొనే ఓ యాప్‌ను తన 16వ ఏటనే రూపొం దించింది. ఈ వ్యాధి తన తాతయ్యకు రావడంతో తట్టుకోలేని కావ్య.. తన కంప్యూటర్‌ సైన్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. తమ్ముడు నీయంత్‌, క్లాస్‌మెట్‌ జస్టిన్‌ ఝంగ్‌తో కలిసి ఈ యాప్‌ను డెవలప్‌ చేసింది. దీనికి ఐయాగ్నోసిస్‌ అనే పేరు పెట్టింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌ నుంచి కళ్లను ఫొటో తీస్తే రెండు గంటల్లోనే వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలియజేస్తుంది. ఈ విధానంతో వేల డాలర్ల ఖర్చును తగ్గించుకోవచ్చని చెబుతోంది కావ్య. అంతేకాదు కంప్యూటింగ్‌లీగ్‌ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక సీఈవోగా కావ్య 3,800 మందికి పైగా అమెరికన్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామింగ్‌ కోసం లక్ష డాలర్లకు పైగా నిధులు సమీకరించి వారికి చదువు చెప్పిస్తోంది.

తండ్రి స్ఫూర్తితోనే..

తనియా భాటియా.. తాజాగా ఐసీసీ వరల్డ్‌ టాప్‌ 5 బ్రేకౌట్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ చంఢీగర్‌ అమ్మాయికి ఆ స్థానం ఆషామాషీగా దక్కలేదు. తనియా తండ్రి కూడా క్రికెట్‌ ప్రియుడే. జాతీయ జట్టుకు ఆడాలనుకున్న అతడి కల నెరవేరక బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఆ క్రమంలోనే తండ్రి కల నెరవేర్చాలని భావించింది తనియా. అయితే చంఢీగర్‌లో క్రికెట్‌పై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపకపోవడంతో తొలినాళ్లలో పురుషుల జట్టుతోనే తలపడాల్సి వచ్చింది. 11 సంవత్సరాలకే పంజాబ్‌ అండర్‌19 జట్టులో ప్రవేశించి చరిత్ర సృష్టించిన తనియా కేవలం ఐదేళ్లలోనే సీనియర్‌ జట్టులో ప్రవేశించింది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఒకానొక దశలో క్రికెట్‌ వదిలేద్దామనుకున్న ఆమెలో తన తల్లి ఆత్మస్థైర్యాన్ని నింపింది. అంతే పడిలేచిన కెరటంలా మళ్లీ ఆటపై పట్టు సాధించింది. చంఢీగర్‌ నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. ఆ రాష్ట్రం నుంచి మహిళా జట్టులో స్థానం సంపాదించిన ఏకైక మహిళగా నిలిచింది. తన వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక డిస్మిసల్స్‌ సాధించిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించింది.

– సంతోషలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *