ఇవి మహిళలకే సాధ్యం

ఇవి మహిళలకే సాధ్యం

సృష్టిలో మహిళలు, పురుషులు ఎవరికి వారే ప్రత్యేకం. ఇందులో వీరు ఎక్కువా వారు తక్కువా అనడానికి ఆస్కారం లేదు. కాకపోతే మగువలకు కొన్ని పత్య్రేక సామర్థ్యాలు ఉన్నాయి. అవి పురుషులలో తక్కువగా ఉంటాయి. మహిళ అంటే ఎన్నో అపూర్వ శక్తులు కలగలిసిన ఓ పవర్‌హౌజ్‌ అని చెప్పుకోవచ్చు. సహనం, మానసిక పరిణతి, ఒక విషయాన్ని ఎదుటి వారి కోణం నుంచి కూడా ఆలోచించగలగడం ఇవన్నీ మగువలకు పుట్టినప్పటి నుంచే ఉంటాయేమో! మరి మగువల ప్రత్యేకత లేంటో.. వారిపై జరిగిన పరిశోధనల ఫలితాలేంటో తెలుసుకుందామా!

ఒత్తిడిలో ఉంటే ఏమీ తోచదు అనుకోవడం చాలా తప్పు. నిజానికి పురుషులతో పోలిస్తే స్త్రీలే అధిక ఒత్తిడిలో సైతం చురుకుగా పనిచేయ గలుగుతారట. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే వారిలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువ అని జార్జియా సిలానీ అనే పరిశోధకుడు కనుగొన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఒత్తిడికి గురైనప్పుడు స్త్రీలలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిలో ఉన్న సమయంలో మరింత చురుకుగా ఆలోచించేలా చేస్తుంది. పురుషులతో పోలిస్తే ఒత్తిడి ఉన్న సమయంలో స్త్రీలు తమ సమస్యను అధిగమించడానికి ఇతరులతో మాట్లాడడమో లేదా వేరే వ్యాపకాలలోనో మునిగిపోతారు. పురుషులు అలాకాదు తమ సమస్యను ఎవరితోనూ పంచుకోకుండా లోలోపలే కుమిలిపోతారు. వారి ఒత్తిడిని కోపం రూపంలో దగ్గరి వారిపై చూపిస్తారు. దానితో సమస్య మరింత జటిలమై లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. కానీ మగువలు నలుగురితో పంచుకోవడం వల్ల సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుగొంటారన్నమాట. అందుకే మగువలు మానసిక ఒత్తిడిని జయించడంలో పురుషులకన్నా ముందున్నారు.

అది వారికే తెలుసు..

పురుషులకన్నా మహిళలు రంగులు గుర్తించ డంలో ఎన్నో రెట్లు మేలని ఇస్రాయిల్‌ అబ్రమోవ్‌ అనే సైంటిస్టు చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఆయన దాదాపు 50 సంవత్సరాల పాటు మానవ దృష్టిపై పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న కాలం నుంచి ఈ ప్రత్యేకమైన శక్తి వారికి ఏర్పడిందని ఆయన అభిప్రాయం.

శక్తిమంతురాలు..

ఆడదానివి.. నీ వల్ల ఏమవుతుంది? అని ఎవరైనా అంటే ఈసారి విని ఊరుకోకండి. వారికి తిరిగి సమాధానం చెప్పండి. ఘెంట్‌ యూనివర్సిటీ జరిపిన ఎవరికి బలం ఎక్కువ? అనే అంశంపై జరిపిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే స్త్రీలు రెండు ఎక్స్‌ క్రోమోజోముల వల్ల జన్మిస్తారు. ఎక్స్‌ క్రోమోజోము రిబో న్యూక్లియిక్‌ ఆమ్లాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొం దించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాదు స్త్రీలలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ అనేక రకాల నొప్పులను నివారిస్తుంది. అంటే పురుషులతో పోలిస్తే మగువలలో రోగనిరోధక శక్తి అధికం. అందుకే మగువలు ఏదైనా నొప్పి వచ్చినా తట్టుకోగలరు. అంతేకాదు ఈ హార్మోన్‌ వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా అంత త్వరగా బయటపడవట. అందుకే మగువల వృద్ధాప్య చాయలు అంత త్వరగా బయటపడవు.

ప్రమాదాలు పసిగట్టగలగడం

మగువలలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌, ఎస్ట్రాడి యోల్‌ హార్మోన్ల ప్రభావం వల్ల వారు ప్రమాదకరమైన వాతావరణాన్ని ముందే పసిగట్టగలరని క్యోటో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అంతేకాదు పాములను కూడా గుర్తించగల శక్తి మహిళలకు స్వతహాగా ఉంటుందని కూడా ఈ యూనివర్సిటీ పరిశీలకులు చెబుతున్నారు.

ఆదుకునే మనస్తత్వం

ఆడదానికి ఆడదే శతృవు అనే మాట మనం రోజూ వింటూ ఉంటాం. కానీ ఆ మాట చాలా తప్పు. తోటి మహిళలకు సహాయం చేయాలనే తపన మగువలో ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ చూస్తే బలహీన వర్గాలకు చెందిన మహిళల కోసం పాటు పడేవారు, తోటి మహిళలకు సాయం అందించేవారు ఎంతోమంది కనిపిస్తారు. అయితే మహిళ కేవలం మహిళలకే కాదు తోటివారందరికీ సాయం చేయాలనే తత్వం కలిగి ఉంటుంది. ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలే ముందుంటారట.

లోపాలున్నా అధిగమించి..

మనుషుల్లో లోపాలుండటం సహజం. కానీ ఆ లోపాలను తెలుసుకుని సరిదిద్దుకోవడం గొప్ప. ఇది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లేవారు ఎందరో ఉన్నారు. ఎదుటివారు తప్పులు చేసినా దాన్ని ఎత్తి చూపినప్పుడు బాధపడకుండా పాజిటివ్‌గా ముందుకు సాగాలి. ఇలాంటి లక్షణం పురుషులతో పోలిస్తే మగువలోనే ఎక్కువని అనేక అధ్యయనాల్లో రుజువైంది.

నిజాయితీపరులు

సాధారణంగా ఆడవారి నోట మాట దాగదని.. ఆడవారిని నమ్మకూడదని అంటుంటారు చాలా మంది. కానీ నమ్మకాల విషయంలో మగవారికన్నా ఆడవారిని చక్కగా నమ్మవచ్చట. మహిళలు నీతి, నిజాయితీల విషయంలో పురుషులకన్నా మెరుగేనని తాజాగా నిర్వహించిన ఓ అంతరాజ్జతీయ సర్వే తేల్చి చెప్పింది. మగవారితో పోలిస్తే ఆడవారిని నమ్మ వచ్చని, రాజకీయ రంగంలో మరింతగా వీరిపై నమ్మకం ఉంచవచ్చని ఈ సర్వే చెబుతోంది. అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యయన కర్తలు నిర్వహించిన ఓ అధ్యనంలో ఈ విషయం తేలింది. రాజకీయంగా ఎక్కువ కూడబెట్టు కుంటున్న వారిలో మగువలతో పోలిస్తే పురుషులే ఎక్కువ మంది ఉన్నారట. అదేవిధంగా అవినీతికి పాల్పడేవారిలో కూడా మగవారే ఎక్కువ మంది ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే మగవారితో పోలిస్తే మగువల్లో అవినీతికి పాల్పడే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని తేలింది. సుమారు 157 దేశాల్లో బయటపడిన కుంభకోణాలు, రాజకీయ నాయకుల ఆస్తులు, అవినీతి కేసులు.. ఇలా వివిధ రకాల సమాచారాన్ని సేకరించి ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో మగవారికన్నా మగువలే నిజాయితీపరులని తేలింది.

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ

మగువలంటే కేవలం అందంపైనే శ్రద్ధ చూపుతా రనే వాదన సరికాదు, వారికి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అధికమే. వంటింటి మహారాణి మహిళే కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని ఇస్తాయో తెలుసుకొని పాటిస్తుంటారట. అంతేకాకుండా ఏ చిన్న రోగం వచ్చినా దాన్ని తగ్గించుకునేందుకు తీవంగా ప్రయత్నిస్తారట. ఏ అనారోగ్య సమస్యకు ఏ పద్ధతి అనుసరిస్తే ఉపశమనం లభిస్తుందో మహిళలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా జబ్బులతో ప్రాణాలు కోల్పోయే మహిళలు తక్కువేనని రిపోర్టులు చెబుతున్నాయి. ఎందుకంటే వారి జీవన శైలి, శరీర క్రియలు వారి జీవితకాలాన్ని పెంచేందుకు ఉపకరి స్తాయి. అందుకే ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా పురుషులతో పోలిస్తే మగువలే ఎక్కువకాలం జీవిస్తున్నారని తేలింది.

– సంతోషలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *