రుచుల పండు.. పోషకాలు మెండు.. రేగుపండు

రుచుల పండు.. పోషకాలు మెండు.. రేగుపండు

రేగుపండు.. ఈపేరు ప్రస్తావన తేగానే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ… పుల్లపుల్లగా.. తీయతీయగా నోరూరించే రేగుపండ్లు చూస్తే నోరు కట్టేసుకుని ఉండలేం.. ఇప్పుడు రేగుపండ్లు బాగా దొరికే సీజన్‌. ఈ పండ్లలో కమ్మని రుచే కాదు, వాటిలో బోలెడు పోషకాలూ ఉన్నాయంటున్నారు ఆహార నిపుణులు. మరి వాటితో చేసుకునే వెరైటీలేంటో తెలుసుకుందాం పదండి..!

రేగుపండు పచ్చడి

కావలసిన పదార్థాలు:

రేగుపండ్లు – కప్పు, పచ్చిమిర్చి – 5 , పచ్చికొబ్బరి – అర కప్పు , వెల్లుల్లి – 5 రెబ్బలు, అల్లం – చిన్న ముక్క, పుదీనా ఆకులు – 10, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు..

పోపు కోసం.. మినప్పప్పు – టీ స్పూన్‌, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్‌, ఎండుమిర్చి – 2 , కరివేపాకు – రెమ్మ, నూనె – 3 టీ స్పూన్లు..

తయారీ

శుభ్రమైన పుల్లటి రేగుపండ్లను తీసుకొని, గింజలను వేరుచేసి, గుజ్జు తీసుకోవాలి. కడాయిలో టీ స్పూన్‌ నూనె వేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించి ఉంచుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అల్లం, రేగుపండ్ల గుజ్జు, ఉప్పు… వీటిని రోట్లో/మిక్సర్‌జార్‌లో వేసి (మెత్తగా లేదా కచ్చాపచ్చాగా) రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ పోపును పచ్చడిలో వేసి కలపాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి, రేగుపండ్ల పచ్చడి కలిపి తింటే రుచిగా ఉంటుంది.

రేగుపండ్ల పప్పు

కావలసిన పదార్థాలు:

రేగుపండ్ల ముద్ద – రెండు కప్పులు (గింజలు తీసేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి), కందిపప్పు – ఒకటిన్నర కప్పు, ఆవాలు – రెండు టీ స్పూన్లు, సెనగపప్పు, మినప్పప్పు – మూడు టీ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు – మూడు, ఉప్పు – తగినంత, నూనె – ఒక కప్పు, ఎండు మిర్చి – ఆరు, పచ్చిమిర్చి – ఆరు, కొబ్బరి తురుము – రెండు టీ స్పూన్లు..

తయారీ

ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో పావు కప్పు నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత రేగుపండ్ల ముద్ద వేయాలి. అది వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఉడికించిన పప్పును రేగుపండ్ల మిశ్రమంలో కలపాలి. సన్నని మంటమీద ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పప్పు దగ్గరికి వచ్చిన తర్వాత దించేయాలి. అంతే కమ్మని రేగుపండ్ల పప్పు రెడీ. ఇది అన్నంలోకి మాత్రమే కాదు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది.

రేగుపండ్ల వడియాలు

కావలసిన పదార్థాలు:

రేగుపండ్లు – పావుకిలో, పచ్చిమిర్చి- ఆరు, బెల్లం తురుము- నాలుగు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- టేబుల్‌ స్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.

తయారీ

రేగుపండ్లలో విత్తనాలు తీసేసి (కావాలంటే ఉంచవచ్చు), గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, బెల్లం తురుములను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో రేగుపండ్ల గుజ్జు కూడా వేసి బాగా కలిపి, చిన్నచిన్న అప్పాలుగా చేసుకొని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేయించుకున్నా, అలాగే తిన్నా చాలా బాగుంటాయి.

రేగుపండ్ల వడలు

కావలసిన పదార్థాలు:

మినప్పప్పు – ఒక కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, రేగు పండ్ల ముద్ద – ఒక కప్పు, పచ్చిమిర్చి – 8 (సన్నగా తరగాలి), జీలకర్ర – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, అల్లం – చిన్న ముక్క, కొబ్బరి తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె – వేయించడానికి సరిపడా..

తయారీ

ముందుగా మినప్పప్పును రెండు గంటల పాటు నానబెట్టుకుని తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి ఈ పిండిని వడల్లా అద్ది వేయాలి. ఎర్రగా వేగాక తీసేస్తే.. వేడివేడి రేగు పండు గారెలు రెడీ. సాయంకాలం స్నాక్స్‌లా పిల్లలకు చేసిపెట్టొచ్చు.

రేగుపండ్ల జామ్‌

కావలసిన పదార్థాలు:

పుల్లటి రేగుపండ్లు – 1/4 కిలో, ఎర్ర మిరపకారం – టేబుల్‌ స్పూన్‌, బెల్లం – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – సరిపడా..

తయారీ

రేగుపండ్లను బాగా కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఒక పాత్రలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి చేతితో బాగా కలపాలి. పండ్ల నుంచి గుజ్జు బయటకు వచ్చేలా చెయ్యాలి. దానిని గాజు సీసాలో వేసి, ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. రేగుపండ్లు కొంచెం పుల్లగా, వగరుగా ఉంటాయి. అందువల్ల అదనంగా అవసరాన్ని బట్టి రెండు స్పూన్ల బెల్లాన్ని కలుపుకోవచ్చు. తయారీకి కావలసిన పదార్థాల మోతాదు మీ రుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. గింజలు పూర్తిగా తొలగించి జామ్‌ని ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. లేకపోతే వాటి నుంచి మొలకలు రావడం, బూజు పట్టడం వంటి సమస్యలు రావొచ్చు.

రేగుపండ్ల పాటోళి

కావలసిన పదార్థాలు:

గింజలు తీసేసి మరీ మెత్తగా కాకుండా చేసిన రేగుపండ్ల ముద్ద – రెండు కప్పులు, కందిపప్పు – ఒకటిన్నర కప్పు, ఆవాలు – రెండు చెంచాలు, శనగపప్పు, మినప్పప్పు – ఐదు చెంచాలు, కరివేపాకు రెబ్బలు – రెండు మూడు, ఉప్పు – సరిపడా, నూనె – కప్పు, ఎండుమిర్చి – ఆరు, పచ్చిమిర్చి – ఆరు, కొబ్బరి కోరు – రెండు చెంచాలు.

తయారీ

ముందుగా కందిపప్పును నానబెట్టుకుని నీటిని వంపేయాలి. తడి లేకుండానే పొడిపొడిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాన్‌లో పావుకప్పు నూనె వేడిచేసి, ఆవాలూ, మినప్పప్పూ, శనగపప్పూ, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తరువాత పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక రేగుపండ్ల ముద్ద వేయాలి. కాసేపటికి అదీ మగ్గుతుంది. అందులో సరిపడా ఉప్పు, కొబ్బరికోరు వేసి, బాగా కలపాలి. ఆ తర్వాత కందిపప్పు ముద్దనూ వేయాలి. మంట తగ్గించి, మధ్యమధ్య నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. కాసేపటికి కందిపప్పు మిశ్రమం కూడా వేగి, కమ్మని వాసన వస్తుంది. అప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.

రేగుపండ్ల ఊరగాయ

కావలసిన పదార్థాలు:

రేగుపండ్లు- కప్పు, కారం – పావుకప్పు, మెంతులు – ఒకటిన్నర చెంచా, ఆవాలు – ఐదు చెంచాలు, శనగపప్పు, మినపప్పు – రెండు చెంచాల చొప్పున, నూనె – ముప్పావు కప్పు, ఇంగువ – అరచెంచా, ఉప్పు – తగినంత.

తయారీ

పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలూ, మెంతులు వేయించుకుని పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి, మెత్తగా పొడి చేసుకోవాలి. పాన్‌లో మిగిలిన నూనె వేడిచేసి, ఇంగువ వేసి దింపేయాలి. ఇందులోనే కారం, తగినంత ఉప్పు ముందుగా చేసిపెట్టుకున్న పొడి, కడిగి తుడిచి అక్కడక్కడ గాట్లు పెట్టుకున్న రేగుపండ్లు వేసి కలపాలి. ఐదారుగంటలయ్యాక మరోసారి కలపాలి. దీనిని పొడి సీసాలో పెట్టి భద్రపరచుకోవాలి. ఇక నోరూరించే ఊరగాయ వేడివేడి అన్నంలో తినడమే ఆలస్యం.

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *