వికసిత పద్మాలు

వికసిత పద్మాలు

ధైర్యం, సహనం, సేవ, పొదుపు, ప్రేమ.. ఇవన్నీ మహిళలో మూర్తీభవించిన లక్షణాలు. వీటితోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తిపును తెచ్చుకున్నారు వీళ్లంతా. ఎన్నో అవాంత రాలను అధిగమించిన వీరంతా పెద్ద గొప్పవాళ్లేమీ కాదు.. సామాన్య జనాలతో మమేకమయ్యే వారే. ఈ అసామాన్యులను గుర్తించిన భారత ప్రభుత్వం వారిని పద్మాలతో గౌరవించింది. మరి వారి గురించి మనం కూడా తెలుసు కుందామా..!!

తీజన్‌బాయి స్వస్థలం ఉత్తర భిల్కయికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గనియారి అనే కుగ్రామం. ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఆగ్రామంలో వర్థి అనే ఓ గిరిజన తెగ ఆమెది. తీజన్‌ బాయి ఆ రాష్ట్ర సంప్రదాయ కళ పండవానిని ప్రదర్శించే కళాకారిణి. పండవాని కళ అంటే మహాభారత ఘట్టాలను జానపద తరహాలో చెబుతూ, పాటల రూపంలో ఆలపించడం. ఈ కళలో పదమూడేళ్లకే అరంగేట్రం చేశారామె. అప్పట్లో ఆమె ఆ కళలో ప్రవేశమున్న మొదటి మహిళగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు పన్నెండో ఏట పెళ్లైంది. ఆ సమయంలో ఆమె ఈ రంగంలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వర్థి తెగకు ఇది నచ్చక ఆమెను ఊరి నుండి వెలేసింది. అలా ఆమె ఊరికి దూరంగా ఓ పాక వేసుకొని.. పండవాని కళను ప్రదర్శించేవారు. కొన్నాళ్లకి భర్త కూడా వదిలేశాడు. ఆమె మాత్రం కళే తన ప్రపంచం అనుకున్నారు. మొదట్లో తీజన్‌ బాయి తన గ్రామం, చుట్టుపక్కల ప్రాంతంలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఒకసారి ఆమె ప్రదర్శన మధ్యప్రదేశ్‌కు చెందిన హబీబ్‌ తన్వీర్‌ అనే కళాకారుడి కంట పడింది. అలా ఆమె ప్రతిభ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి కూడా వెళ్లింది. ప్రత్యేకంగా ఆమెను పిలిచి అభినందించడమే కాదు, దేశ విదేశాల్లోనూ ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించారు. అప్పటినుంచీ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. భారతప్రభుత్వం 1988లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్‌ ఇచ్చి సత్కరించింది. అంతేనా ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ, మారిషస్‌.. వంటి దేశాలకు సాంస్కృతిక ప్రచారకర్తగానూ కొన్నాళ్లు వ్యవహరించారు. తీజన్‌బాయి ఇప్పటికీ ఆ కళని ప్రదర్శిస్తున్నారు. కళనే తన ప్రపంచంగా మలుచు కున్న తీజన్‌బాయికి భారత ప్రభుత్వం 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్‌ బిరుదును ప్రకటించింది.

పర్వతారోహకురాలు బచేంద్రీ

ఎవరెస్ట్‌ అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌. ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ఇచ్చి సత్కరించింది. బచేంద్రీ పుట్టింది ఉత్తరాఖండ్‌లోని నకూరి. ఏడుగురు సంతానంలో ఐదో అమ్మాయి బచేంద్రి. 1954లో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే ధైర్యంగల అమ్మాయిగా గుర్తింపు పొందింది. తండ్రి కిషన్‌సింగ్‌ పాల్‌, తల్లి హన్సాదేవి. తండ్రి చిరువ్యాపారి. బచేంద్రి పాల్‌ కుటుంబంలో 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానేసి ఇంటిపనుల్లో తల్లికి తోడుగా ఉండేవారు. కాని తను అలా ఉండడానికి ఒప్పుకోలేదు. దీంతో చదుపుపై ఆమెకు ఉన్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు, బంధువులు మరింత ప్రోత్సహించడంతో, డెహ్రాడూన్‌లో ఎంఏ బిఈడీ పూర్తి చేశారు. అయితే పన్నెండేళ్ల వయసులోనే ఆమె మౌంటెనీరింగ్‌ పరీక్ష రాసి.. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేనీరింగ్‌ కాలేజీలో చదువుకునే అవకాశం దక్కించుకున్నారు. బీఈడీ పూర్తి చేశాక తాను చదువుకున్న స్కూల్‌ ప్రిన్సిపల్‌ సాయంతో 1982లో మౌంటెనీరింగ్‌ కోర్సులో చేరారు. అక్కడ బచేంద్రీ ఒక్కరే మహిళ. ఆ కోర్సు చదువుకుంటూనే గంగోత్రి, రుద్రగారియా పర్వతాలను అధిరోహించింది. ఆ తర్వాత ఆమెకు నేషనల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌లో మౌంటెనీరింగ్‌ శిక్షకురాలిగానూ ఉద్యోగం వచ్చింది. కుటుంబసభ్యులు, బంధువులు ఆ ఉద్యోగంలో చేరొద్దన్నారు. కానీ బచేంద్రీ ఒప్పుకోలేదు. పైగా 1984లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని కూడా అధిరోహించింది. అంతేకాదు ఆ సాహసం చేసిన తొలి భారతీయ మహిళగానూ గుర్తింపు సాధించారామె. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ బచేంద్రి పర్వతారోహణ చేస్తూనే ఉన్నారు.

పొదుపుకి ఆదర్శం చిన్న పిళ్లై

పొదుపు చేయాలనేది చాలా మంది కల. కానీ అది అంతగా సాధ్యం కాదు. పేదరికంతో మగ్గుతున్నవాళ్లకైతే అది చాలా కష్టసాధ్యమైన పని. కానీ చిన్నపిళ్లై తన ప్రాంతంలో పేదరికాన్ని రూపుమాపడానికి, మహిళా సాధికారతతో రుణ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన బ్యాకింగ్‌ వ్యవస్థను ప్రారంభించింది. అరవై ఏడేళ్ల పిళ్లై ‘తనవల్ల ఏమవుతుంది?’ అనుకోలేదు. అందుకే ఆమెను పద్మశ్రీ వరించింది. కలానిజమ్‌ అనే పేరిట ఆమె చేసిన సూక్ష్మ రుణ ఉద్యమం నేడు ఎంతోమంది పేద మహిళల జీవితంలో వెలుగులు నింపింది. ఈ కలానిజమ్‌ అనేది ధన్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవ ద్వారా జరుగుతుంది. దీన్ని స్థాపించింది పిళ్లై. తమిళనాడు రాష్ట్రం మధురై రాష్ట్రంలోని మధురైకి దగ్గరలోని చిన్న ఊరు చిన్న పిళ్లైది. ఆమె చేసిన ఆ రుణ ఉద్యమం ద్వారా పుల్లుచెరి గ్రామంలోని మహిళలతో పొదుపు బాట పట్టించిన మరెందరికో ఆదర్శంగా మారారు. దాదాపు అరవై వేల మంది మహిళలు ‘కలానిజమ్‌’ పేరిట స్వయంసహాయ బందాలుగా ఏర్పడి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. చిన్నపిళ్లై సేవలను గుర్తించిన కేంద్రం 2001లో స్త్రీ శక్తి పురస్కారంతో ఆమెను సత్కరించింది. ఆ పురస్కారం ఇస్తూ అప్పటి మాజీ ప్రధాని అటల్‌ బిహారి ఆమె కాళ్లకు నమస్కరించారు. 2019లో ఆమెను పద్మశ్రీ పురస్కారం వరించింది.

లేడీ టార్జాన్‌.. జమున తుడు

పచ్చదనం కోసం ప్రాణాలకు తెగించి పాటుపడు తున్నందుకు భారత ప్రభుత్వం జమునకు పద్మశ్రీ ప్రకటించింది.

పచ్చదనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. జమున తుడుకు కూడా అంతే ఇష్టం. బాల్యం నుంచి పచ్చదనం మధ్యలోనే పెరిగిందామె. తన తండ్రి వ్యవసాయదారుడు. ఒడిశాలోని రాయంగాపూర్‌ గ్రామంలో ఆమె పుట్టింది. చిన్నప్పటి నుంచే తన తోబుట్టువులతో కలిసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడేది. 18 ఏళ్లు దాటాక జార్ఘండ్‌లోని మతుర్కంకు చెందిన మాన్సింగ్‌ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. ఆయన గుత్తేదారు. గ్రామాల్లో ఇళ్లు నిర్మించేవారు. పెళ్లైన తర్వాత ఓరోజు తన అత్తయ్య, ఆడపడుచులతో కలిసి మతుర్కంలోని అడవిని చూడటానికి వెళ్లింది. 50 హెక్టార్ల విస్తీర్ణంలోని ఆ అడవి ప్రాంతం టేకు చెట్లకు పేరుగాంచింది. ఆ సమయంలో అటవీ మాఫియా, దుండగులు ఆ అడవిని పూర్తిగా ధ్వసం చేశారు. అప్పుడే ఆ అడవిని మాఫియా నుంచి రక్షించాలని నిర్ణయించుకుంది. అయితే తన ఒక్కదాని వల్ల అది అయ్యే పని కాదని తెలుసుకుని అప్పుడే గ్రామంలోని మహిళలందరినీ ఏకం చేసి వన సురక్ష సమితిని ఏర్పాటు చేస్తే అందరి సహాయంతో దాన్ని సాధించ వచ్చని అనుకుంది. కానీ మాఫియాకి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి చాలా కష్టపడింది. కొన్ని నెలల తర్వాత 32 మంది మహిళా సైన్యంతో కలిసి గొడ్డళ్లు, బాణా ల్లాంటివి పట్టుకొని మాఫియాను ఎదిరించడానికి వెళ్లింది. చివరికి అడవిని ధ్వంసం చేసే చాలా మందిపై కేసులు పెట్టించగలిగింది ఆ సమితి. తరువాత ఎంతో మంది నేరస్థులను జైలుకు పంపారు. ప్రస్తుతం మూడు వందల గ్రామాల్లో వనసురక్ష సమితులు పని చేస్తున్నాయి. ఈ మహిళా సైన్యంలో దాదాపుగా పదివేల మంది వరకు సభ్యలుగా ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వనాల పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఓసారి ఆమె ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఆమె, ఆమె భర్తపై రాళ్లతో దాడి చేశారు. ఈమె ధైర్యసాహసాలను చూసి చాలా మంది లేడీ టార్జాన్‌ అని అంటారు.

సేంద్రీయ వ్యవసాయం కమలా పూజారి

ఒక సాధారణ గిరిజన మహిళను 2019లో పద్మశ్రీ వరించింది. ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్‌ జిల్లాలోగల పత్రాపూట్‌ గ్రామానికి చెందిన కమలా పూజారి ఓ గిరిజన రైతు. పూరిగుడిసెలో నివసిస్తూ సాధారణమైన జీవితాన్ని గడుపుతూంటుంది. ఆమెకు సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రాణం. ఆమె సేంద్రీయ వ్యవసాయం చేయడమే కాదు తనతో పాటు మిగిలిన వారిని కూడా సేంద్రీయ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. దాదాపు కొన్ని సంవత్సరా లుగా వందల దేశీయ వరి వంగడాలను సేకరించి వాటిని నిల్వచేసి కాపాడుతోంది. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల కలిగే లాభాలను గురించి రైతన్నలకు అవగాహన కల్పిస్తోంది. ఆ దిశగా ప్రచారాన్నీ నిర్వహిస్తోంది. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ నుంచి శిక్షణ పొందిన ఆమె గ్రామస్థులను బృందాలుగా ఏర్పాటు చేసి వారికి సేంద్రియ వ్యవసాయంతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఆమె నిర్వహించే అవగాహన కార్యక్రమాల వల్ల ఎంతోమంది రైతులు రసాయన ఎరువుల వాడకం మానేసి సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. 2002లో సేంద్రీయ వ్యవసాయం నిర్వహణపై జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన వర్క్‌ షాపుకు పూజారి హాజరయింది. అదే సంవత్సరం దక్షిణాఫ్రికా నుంచి ఈక్వెటార్‌ ఇనిషియేటివ్‌ అవార్డు అందుకుంది. ఆమె సేవలను గుర్తించిన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు అవార్డుతో సత్కరించింది. అంతేకాక అక్కడి ప్రభుత్వం ఆమెను రాష్ట్ర ప్రణాళిక మండలిలో సభ్యురాలిగా కూడా నియమించింది. ఇప్పుడు ఆమెను పద్మశ్రీ వరించింది.

మొక్కలే తన పిల్లలు – తిమ్మక్క

కర్ణాటక తుమకూరు జిల్లా గుబ్బి గ్రామానికి చెందిన తిమ్మక్కది బాల్య వివాహం. భర్త పేరు చిక్కయ్య. పెళ్లయినప్పటికీ ఆమెకు పిల్లలు కలగకపోవడంతో చాలామంది నానారకాల మాటలు అనేవారట. దాంతో వాటన్నింటినీ భరిస్తూ ఆ మాటలనుంచి మామూలు మనిషిగా మారడానికి తిమ్మక్క తన భర్తతో కలిసి మొక్కలు నాటడం మొదలు పెట్టింది. వాటితోనే ఆమెకి కాలక్షేపం. వేసవికాలం వస్తే తను ఉండే హులికల్‌ గ్రామానికి దగ్గర్‌లోని కురూర్‌ రోడ్డుకు ఇరువైపులా ఒక్క చెట్టు కూడా లేక ప్రయాణీకులు ఇబ్బంది పడడాన్ని ఆమె గమనించింది. దాంతో ఆమె, ఆమె భర్త కలిసి రోడ్డుకు ఇరువైపులా ఓ పది మర్రి మొక్కలను నాటారు. ఏటా ఆ సంఖ్యను పెంచారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా వాటిని సంరక్షించారు. అయితే భర్త చనిపోయినప్పటికీ కూడా తిమ్మక్క మాత్రం చెట్ల సంరక్షణ ఆపలేదు. ఎనిమిది దశాబ్దాల కాలంలో మొత్తం ఎనిమిది వేల మొక్కలు నాటారు. హులికల్‌ నుంచి కడూరు వరకు నాలుగు కిలోమీటర్ల చెట్లను వరుసగా నాటడంతో ‘సాలుమరద’ తిమ్మక్కగా ఆమె పేరు మారిపోయింది. సాలుమరద అంటే కన్నడలో చెట్ల వరుసలు అని అర్థం. ఈమె సేవలను గుర్తించి 1996లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర పురస్కారం అందజేసింది. వనమిత్ర, వృక్షప్రేమి, వృక్షశ్రీగా పేరుపొందారు. ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. పిల్లలు లేరన్న బాధ లేదా ? అని ఎవరైనా అడిగారే అనుకోండి తనకు పిల్లలు లేరన్న బాధ అసలు ఎప్పుడో మరిచిపోయానని మొక్కలే తన పిల్లలు అని అని చెబుతుంటుంది తిమ్మక్క.

రాజకుమారి దేవి.. కిసాన్‌ చాచి

వ్యవసాయం చేయాలనే తపనతో వ్యవసాయం చేస్తూ దానిలో పురోగతి సాధించడమే కాకుండా ఎంతోమంది మహిళలకు మార్గదర్శకంగా నిలిచింది రాజకుమారీ దేవి. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆమెది బీహారు. ఆమె వయసు అరవై ఏళ్లు. అందరూ ఆమెను కిసాన్‌ చాచి అంటారు. వ్యవసాయం చేయాలనే తపన ఆమెకు ఎనభై దశకంలోనే మొదలైంది. కుటుంబ సభ్యులకు, ఊరివాళ్లకు నచ్చకపోయినా భర్త సహకారం, ప్రోత్సాహంతో వ్యవసాయాన్ని ప్రారంభించింది. అరటి, మామిడి, బొప్పాయి, లిచి పండ్ల మొక్కలను పెంచడం మొదలుపెట్టింది. తోటి రైతులు హేళన చేసినా.. క్రమంగా ఫలసాయం వస్తుండడంతో వాళ్లు విమర్శించడం మానేశారు. ఆ తరువాత కూర గాయల మొక్కల సాగు మొదలుపెట్టారు. క్రమంగా గ్రామ మహిళలకు ఈ పంటల సాగు నేర్పించి, వారందరిని కలిపి స్వయంసహాయక బృందాలుగా ఏర్పాటు చేసింది. సైకిలుపై దాదాపు నలభై, యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూ తోటి మహిళలకు వ్యవసాయ మెలుకువలు తెలుపుతూ ఉండేది. రైతులు, మహిళల కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలు అందరికీ అందేలా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని వివిధ గ్రామాల మహిళలు వ్యవసాయంతోపాటు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె సహాయంతో వ్యవసాయంతోపాటు పచ్చళ్లు, బొమ్మలు చేయడం, చేపల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఆమె స్థానికంగా జరిగే బాల్య వివాహాలను ఆపడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు. దాన్ని గుర్తించిన కేంద్రం ఆమెపై ఓ డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఆమెను పద్మశ్రీ వరించింది.

సామాజిక సేవలో ముందు.. ముక్తాబెన్‌, ద్రౌపది

సమాజ సేవ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. గుజరాత్‌కి చెందిన ముక్తాబెన్‌ డగ్గీకి చూపులేదు. అయినా ఆమె ఉన్నత విద్యను పూర్తిచేసి తనలాంటి వారి కోసం 1995లో ‘ప్రజ్ఞచక్షు మహిళా సేవా కుంజ్‌’ పేరుతో స్వచ్చంద సంస్థను స్థాపించారు. ఆమె భర్తకీ చూపులేదు. వారిద్దరూ పిల్లలు వద్దనుకుని చూపులేని అనాథ చిన్నారుల్ని దత్తత తీసుకుని తమ పిల్లల్లా పెంచుతున్నారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ 12వందల మందిని చేరదీసి చదివించారు. అలాగే రెండువేల మంది ప్రత్యేకావసరాలున్న వారినీ ఆదరించి పలు చికిత్సలు అందించారు. ఇప్పటికీ ఆ పనులు చేస్తున్నారు. అలాగే చూపులేని మహిళలకు పలు వృత్తివిద్యా కోర్సులు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. పలువురు దాతలు, ప్రభుత్వం సాయంతో ముక్తాబెన్‌ ఈ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సమాజసేవ అంటే చాలు ద్రౌపది గిమిరే ఎప్పుడూ ముందుంటారు. సిక్కిం వికలాంగ సహాయత సమితి అనే స్వచ్చంద సంస్థ పేరుతో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులను ఉచితంగా అందిస్తున్నారామె. అలాగే గ్రహణం మొర్రితో బాధపడే వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తున్నారు. ఆమె ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఆ సమయంలో ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకున్నవారిని చూసి వారికి మళ్లీ కొత్త జీవితం ప్రసాదించాలని కోరుకునేది. ఆ దిశగా స్వచ్ఛంద సంస్థను స్థాపించాలనే ఆలోచనతో వికలాంగ సహాయత సమితిని స్థాపించింది. అందుకోసం వివాహం కూడా చేసుకోలేదు, పైగా ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. సమాజసేవలో తపిస్తున్న ముక్తాబెన్‌, ద్రౌపది ఇద్దరినీ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

– సంతోష లక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *