ప్రేమగా ఉందాం.. ప్రేరణనిద్దాం..

ప్రేమగా ఉందాం.. ప్రేరణనిద్దాం..

తల్లి ఆలనా పాలనా బిడ్డకు ఓ పాఠశాల. నిజానికి బిడ్డ వినే తొలి శబ్దం తల్లి హృదయ స్పందనలేనట. తర్వాత తల్లి స్వరం వింటుంది. అంటే.. అమ్మ గుండె తొలి సంగీత పేటిక అయితే, తల్లి మాట తొలి బీజాక్షరం. చిత్రమైంది ఏమిటంటే.. తల్లి బొడ్డుతాడు తెంచుకుని భూమ్మీద పడక ముందే బిడ్డ తల్లినుంచి ఎంతో నేర్చుకుంటుంది. కాకపోతే తల్లి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ కడుపులో ఉన్న బిడ్డతో సంభాషించడం అలవర్చుకుంటేనే ఇదంతా ఒక క్రమశిక్షణతో కూడింది అవుతుంది. కళ్ల ముందు పాప ఉందనుకుని, తన కడుపుపై చేయి ఉంచుకుని ఆ స్పర్శతో పాటలూ, మాటలూ, సంభాషణ జరిపితే అదొక అద్భుతం. ఆ పెంపకానికి ఎంతో విలువ! ఈ విషయాన్ని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రహ్లాదుడు, అభిమన్యుడు లాంటివారిని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. పిల్లల్లో పిల్లల్లా మసులుకోవడం.. వారి మనసు తెలుసుకోవడం… అదే వారికిచ్చే నిజమైన ఆలనా పాలనా అంటారు వ్యక్తిత్వవికాస నిపుణులు. పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే శ్రద్ధను బట్టే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేదీ వాస్తవమే.

ఒకప్పుడు ఇంట్లో నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండేవారు. ముఖ్యంగా నానమ్మే వారిని పెంచేది. నిద్రపోయే ముందు రోజూ ఏదో ఒక నీతి కథ చెబుతుండేది. ఆ కథలు వింటూనే నిద్రపోయేవాళ్లు పిల్లలు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకని అంటారా? అత్తాకోడళ్ల మధ్య అంత సఖ్యత ఉండేది. ఏవో చిన్న చిన్న మనస్పర్థలు ఉండొచ్చు కానీ విడిపోయేంత దూరాలైతే ఉండేవి కావు. దాంతో ఆ ప్రభావం పిల్లల మీద అంతగా పడకపోగా వారు మరింత విలువలతో కూడిన వాతావరణంలో జీవించేవారు. కానీ ఇప్పుడు, అందరి గురించీ కాకున్నా, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కోడళ్లకి చదువులు లేకపోయినా తెలివితేటలతో సంసారాన్ని నడిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అత్తైనా, కోడలైనా ఎవరికివారు పంతాలు, పట్టింపుల మధ్య కుటుంబంలోని బాంధవ్యాలు కనుమరుగై పోతున్నాయి. సమస్యని సృష్టించుకుని, దానిని అడ్డంపెట్టుకుని పోట్లాడు కోవడం మామూలైపోతోంది. ఓర్పు, సహనం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు..కానీ అది ఎవరికీ సాధ్యం అవడం లేదు.

నేటితరం అన్నింట్లోనూ ముందున్నా కుటుంబం విషయంలో మాత్రం ఎందుకో సరైన అంచనాకు రాలేకపోతున్నారన్నది అక్షర సత్యం. కానీ ముందు తరానికి విలువలను నేర్పడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగ మించవచ్చు. ఇది మాతృమూర్తి ద్వారా మాత్రమే సాధ్యం. డబ్బు విలువ కంటే ముందు నైతిక విలువల గురించి తెలియూలి. అవి నేర్పితే రావు. ఎవరికి వారు చూసి తెలుసుకునేవి. అందుకే ఆ విలువల్ని ముందు మనం పాటించాలి.

పిల్లల పెంపకంలో తల్లి పాత్ర

పిల్లల పెంపకంలో తల్లికి విశిష్టమైన పాత్ర ఉంది. పాశ్చాత్య దేశాల్లో పిల్లలను దండించటం పెద్ద నేరం. పిల్లవాడు చెడిపోతుంటే కూడా ఏమి అనలేరు. మన దేశంలో అలా కాదు. తండ్రి భయంతో వాడు ఎప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. లేకుంటే మరి వాడు ఎలా బాగుపడతాడు. దీన్ని పూరించటానికి తల్లి పాత్ర చాలా ముఖ్యం. తల్లి పిల్లలతో ప్రియంగా ఉంటుంది.

మా పిల్లలకు అన్ని సదుపాయాలు ఇస్తున్నాం. వారిలో చాలా నైపుణ్యం ఉంది. ఏమైనా సాధించ గలరు. మంచి స్కూల్లో వేశాం.. ఇంకేం కావాలి అని అనుకుంటారు చాలా మంది పేరెంట్స్‌. ఒక్కసారి ఆలోచిస్తే ఇది కరెక్టేనా? వారికి ఇంతేనా కావాల్సింది. ఇంకేం వద్దా.. అంటే వారికి పెద్ద వాళ్లు ఇవ్వాల్సిన ముఖ్యమైన వనరు ఏమంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, మనోధైర్యాన్ని అందివ్వడం అంటారు పిల్లల నిపుణులు. నిజమే వాస్తవ జీవితంలో జీవించేలా చేయాలి. చిన్నప్పటి నుంచే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనేలా చేయాలి.

కానీ ఈనాడు తల్లులు కేవలం టీవీలకు, సీరియళ్లకు మాత్రమే అతుక్కుపోయి వ్యవహ రిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయం తప్పక కేటాయించాలి. వారికి కూడా సమయం కేటాయించలేనంత బిజీగా మారి, వారి ఆప్యాయతలకు దూరం కావొద్దు. వారికిచ్చే డబ్బు కన్నా మనం పంచే ప్రేమ, ఆప్యాయ తలే ముఖ్యం. తల్లిదండ్రుల అతి ప్రేమ, గారాబం, పంతాలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావాన్ని చూపుతాయి.

ప్రతి విషయానికి బాధ్యత వహించే తత్వాన్ని పిల్లల్లో కలిగించడం తల్లి బాధ్యత. అప్పుడే వారిలో మానసిక దృఢత్వం పెరుగుతుంది. చిన్నారులకు పనులను అప్పగిస్తే ఆలస్యంగా చేస్తారు, సరిగ్గా చేయరు అనేది చాలా మంది అభిప్రాయం. ఒకవేళ ఇచ్చిన పనిని సరిగ్గా చేయకపోయినా వారిని ఏమీ అనొద్దు. క్రమంగా వారిలో బాధ్యత పెరుగుతుంది. ఈసారి నేను కరెక్టుగా చేయాలి అని కచ్చితంగా అనుకుంటారు. అందువల్లే చిన్నప్పటి నుంచి వారి వయస్సుకు తగినట్లుగా పనులు అప్పగిస్తుండాలి. అలా చెప్పడం వల్ల వారూ సంతోషిస్తారు. భారంగా అనుకోరు. బరువులు మోస్తున్నామనే భావన రాదు. ఎదిగే కొద్దీ బాధ్యతగా ప్రవర్తిస్తారు. అదేవిధంగా మన ఇష్టాల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం మంచిది కాదు. పిల్లల్లో దాగిన అభిరుచిని తెలుసుకుని, దాన్ని మెరుగుపరచుకోవడానిక ప్రయత్నించాలి. చదువేకాదు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. వారు ప్రతీదానికీ పేరెంట్స్‌ మీదే ఆధారపడకుండా కొన్నిసార్లు స్వతంత్రవైఖరి కూడా అవలంబించేలా తల్లి ప్రోత్సహించాలి.

ఏ విధమైన వైఫల్యం ఎదురైనా వెంటనే పిల్లల్ని బోనులో ముద్దాయిలా నిలబెట్టొద్దు. వారికి అటువంటి అభిప్రాయం కలిగించేలా మాట్లాడటం చేయొద్దు. పరిస్థితి సానుకూలంగా లేదంటూ గట్టిగా ఏడ్చే పరిస్థితిని రానీయకండి. ఏదైనా చెడ్డ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం సరిగ్గా లేనప్పుడు అది అలా తన వల్లే జరిగిందంటూ పిల్లల్ని దోషుల్ని చేయడం మంచిదికాదు. వాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మార్కులు తక్కువ వచ్చాయని నిందిస్తే, పిల్లలు మానసికంగా కుంగిపోతారు. అలా కాకుండా ఈసారి చక్కగా తెచ్చుకుంటావు అంటూ అనునయించి చూడండి. మరింత రెట్టింపు ఉత్సాహంతో చదవడం ఖాయం. ఏ పని చేయాలన్నా తగినంత ప్రయత్నం అవసరమని, అందుకోసం చొరవ చూపాలని, అందుకోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలియజేయాలి. ఒకవేళ అనుకున్నది సాధించనంత మాత్రాన నిరాశ చెందనివ్వకూడదు. తిరస్కారం, వైఫల్యం లాంటివన్నీ జీవితంలో ఎదిగే క్రమంలో ఓ భాగం అని వారికి బోధించాలి.

జీవితంలోని రోజువారీ పనుల్లో నిమగ్నమైన పెద్దవాళ్లు పిల్లలకు ముఖ్యమైన విలువల ప్రాధాన్యాన్ని వివరించడం విస్మరిస్తుంటారు. జీవితంలోని విలువలు, ప్రాధాన్యాల విషయంలో కచ్చితత్వాన్ని అవగతం చేయాలి. అర్థవంతమైన జీవితాన్ని గడిపేలా వారిని తయారుచేయాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు తగవులాడుకుంటే అది వారి మనసులపై దుష్ప్రభావం చూపుతుంది. పిల్లలకు ప్రతిరోజూ కనీసం ఒక కొత్త విషయం తెలియజేయండి. అలాగే, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్నీ పిల్లలకు ఇవ్వండి. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో వివరించాలి. పిల్లలకు తాము ఒంటరిగా ఉన్నామనే భావన వస్తే అభద్రతకు లోనవుతారు. చిరాకు, కోపం లాంటి లక్షణాల ద్వారా తమ అశక్తతని ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రతిరోజూ వీలైనంత సమయాన్ని వారితో గడపటానికి ప్రయత్నించండి. సంతోషం, దుఃఖం, ఇచ్చిపుచ్చుకో వడం, బాధ… ఇలా అన్ని రకాల విషయాల గురించి వారికి వివరించండి. ముందుగా వారికి స్నేహం విలువ తెలియజేయండి. ఎదుటివారికి ఇవ్వడం నేర్పండి.. ప్రేమగా వారు చేస్తున్న అల్లరి వల్ల కలిగే నష్టాలేమిటో తెలియజెప్పాలి. వారి కోరికలు మన్నించతగ్గవే అయితే ఒప్పుకోవాలి. కానివైతే అర్థం చేసుకునేలా నచ్చజెప్పాలి. పిల్లలకు ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పాలి. సమాజం పట్ల వారి బాధ్యతలు తెలియజేయాలి. ప్రపంచంలో నెంబర్‌వన్‌ స్థాయికి ఎదిగిన మహనీయులు, మహాత్ములు, గొప్పవ్యక్తుల గురించి వివరించాలి. ఏం చేసినా వారు చిన్న పిల్లలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రేమతో, ఓర్పుతో వారికి అర్థమయ్యేలా చెప్పండి.

ఉద్యోగమా? కుటుంబమా?

కొత్తగా తల్లులు అయినవారు రోజంతా ఉద్యోగం చేయాలా, లేదా జీతాన్ని వదులుకుని అమ్మగా ఇంట్లో ఉండిపోవాలా? అన్న విషయంపై తర్జన భర్జన పడుతుంటారు. ఈ విషయంపై వాస్తవ దృక్పథంతో ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం చేయాలన్న కోరిక ఉంటే ఆ సంస్థ యజమానితో తాను పనిచేయవలసిన కాలాన్ని గురించి, దానిలోని మార్పుల గురించి చర్చించారా? లేదా? మీ సమయానుకూలంగా పనిచేయడానికి లేదా పార్ట్‌టైమ్‌గా పనిచేయ డానికి అవకాశం ఉందేమో చూసుకున్నారా? చేతినిండా కావాల్సినంత డబ్బుండి, పిల్లల పెంపకం కోసం సెలవు పెట్టే అవకాశాన్ని, పదోన్నతిని, ఉద్యోగంలో పొందే అవకాశాన్ని, ఉద్యోగంలో అదనపు బాధ్యత, పాప లేదా బాబుతో తక్కువ సమయం గడపడంలాంటి విషయాలన్నింటినీ మీరు పరిగణనలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ సరిగా అంచనా వేసుకున్న తరువాత ఉద్యోగం చేయడమే ఎక్కువ లాభసాటి అనిపిస్తే దానివల్ల పసిపాప పెంపకంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవ డానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

– సంతోషలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *