మల్లీ లంగా ఓణీలు..

మల్లీ లంగా ఓణీలు..

ఇవ్వాళ మనదేశంలో ఎక్కడ చూసినా వివాహం కాని యువతులు చుడీదార్‌ లేదా జీన్స్‌-టీ షర్ట్‌, ఇంకా రకరకాల నవీన మోడల్‌ వస్త్రాలు ధరిస్తున్నారు. కానీ ఇంతకుముందు అంటే ఓ 30 ఏళ్ల క్రితం ఇన్ని రకాల మోడల్‌ వస్త్రాలు లేవు. ఇప్పుడున్న ఫ్యాషన్‌ ప్రపంచం అప్పుడు లేదు. అంటే అప్పుడు అంతా అంధకార యుగం అని అనుకోకండి సుమా ! అప్పుడు వేరే ష్యాషన్‌ వస్త్రాలు ఉండేవి. అవి అచ్చుపోసినట్లు భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవి. అవే లంగా జాకెట్‌ లేదా లంగా ఓణీలు.

బడికి వెళ్లే ఆడపిల్లలు లంగా, జాకెట్‌లు ధరిస్తే, పెళ్లీడు వచ్చిన యువతులు ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి చెందిన యువతులు చక్కటి లంగా ఓణీలో కనిపించేవారు. అందుకే ఇప్పటి సినిమాలో ఏ హీరోయిన్‌ అయినా లంగా ఓణీలో కనిపిస్తే తెలుగింటి అమ్మాయా ! అంటూ ఆరా తీస్తుంటారు. అప్పట్లో తెలుగు లోగిళ్లలో పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా ఈ లంగా ఓణీలే ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ప్రతి దర్జీ (టైలర్‌) కొత్త కొత్త కుచ్చులు, కొత్త మోడల్స్‌లో లంగాలను కుట్టడానికి ప్రయత్నించేవారు. రకరకాల రంగుల్లో, మ్యాచింగ్‌లలో, కొత్త మెరుపులతో, చక్కటి అంచులతో, చక్కటి పొడుగుతో వీటిని తయారుచేసేవారు. పండుగకు ముస్తాబైన కొత్త లంగా, ఓణీలను ధరించి, వెనుక పొడవాటి జడ, దానికి అడుగున జడగంటలు కట్టేవారు. అలా ముస్తాబైన జడను ముందుకు వేసుకుని యువతులు తెగ మురిసిపోయేవారు. నుదుటిన చక్కటి కుంకుమ బొట్టు, చెవులకు వేలాడే బంగారు బుట్టలు, ముక్కుకు ముక్కెర ధరించేవారు. ఇలా ముస్తాబైన యువతులను చూడటానికి రెండు కళ్లు సరిపోయేవి కావంటే అతిశయోక్తి కాదు. పైగా కాళ్లకి వెండి పట్టీలు ధరించేవారు. ఆ పట్టీలకు ఉన్న గజ్జెలు నడుస్తుంటే ఘల్లుఘల్లుమని ఒక చక్కటి శబ్దాన్ని వినిపించేవి. అలా ఆ ఇంటి ఆడపిల్లలు ఇంట్లో ఆనందంతో తుళ్లుతూ, గెంతుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు, మేనత్త మేనమామలు, బామ్మలు తాతలు చూసి మురిసిపోయేవారు. ఇంటిలో సాక్షాత్తూ లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అనుభూతి చెందేవారు. అందుకే ఆడపిల్ల ఏది కావాలన్నా కాదనకుండా ఉండేందుకు ప్రతి తల్లీ, తండ్రీ కష్టపడేవారు. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి వచ్చినట్లేననే సామెత అందుకే వచ్చింది. ఆడపిల్ల ఉన్న తండ్రి ఆ బిడ్డకు ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు తాను ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించేవాడు.

ఇక సంక్రాంతి పండుగకు ఇంట్లోని ధాన్యపు రాశులన్నీ వడ్లతో నిండిపోయేవి. ఆ సంతోషం అంతా ఆ ఇంటి ఆడపిల్లల వస్త్రాలలోనూ, వారు ధరించే నగలలోనూ కనిపించేది. అలా ఉండేది అప్పుడు పండుగ అంటే.

అంతటి శోభనిచ్చే ఆనాటి లంగా ఓణీలు ఆ తరువాత రకరకాల నూతన మోడళ్లలో వస్త్రాలు రావడంతో మెల్లగా కనుమరుగయ్యాయి. గ్రామాల లోని ఆడపిల్లలు సైతం ఇప్పుడు చుడీదార్‌లే ధరిస్తున్నారు.

అయితే సమాజంలో ఎప్పుడూ ఒకే పద్ధతి నిలవదు. ఎప్పటికప్పుడు కొత్తను ఆహ్వానించి, నూత నోత్సాహంతో ఉరకలెత్తే భారతీయ సమాజంలో అది సహజం. అదుగో..! ఆ పద్ధతిలోనే ఇప్పుడు మళ్లీ లంగా ఓణీలు కొత్త తరాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి యువతరానికి అప్పటి లంగా ఓణీలు కొత్తగా కనిపిస్తున్నాయి. అందుకే మళ్లీ లంగా ఓణీలు దర్శనమివ్వటం ప్రారంభించాయి. ముఖ్యంగా ఇది ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ అయిపోయి శివరాత్రి వస్తున్న సందర్భం. ఆ తరువాత మన నూతన సంవత్సరం ఉగాది. ఈ వరుస పండుగల సందర్భంలో మళ్లీ అప్పటి లంగా- ఓణీలను ఆహ్వానించటం, కొత్త మార్పుకు నాంది పలకడం సంతోషదాయకమే.

– ప్రణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *