సమభావన, సౌశీల్యాల సంగమం ద్రౌపది

సమభావన, సౌశీల్యాల సంగమం ద్రౌపది

పాంచాల దేశ మహారాజైన ద్రుపదుడి కుమార్తె ద్రౌపది. ఆమె యుక్తవయసుకు రాగానే ఆమె తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి హాజరైన వారిలో ఏ రాజు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడో అతడిని ద్రౌపది వరిస్తుందని ద్రుపదుడు ప్రకటిం చాడు. మత్స్యయంత్రాన్ని కొట్టే పోటీలో నెగ్గి పంచ పాండవుల్లో ఒకడైన అర్జునుడు ద్రౌపదిని గెలిచాడు.

ద్రౌపదిని వెంటబెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చిన పాండవులు ఒక విలువైన బహుమతిని తీసుకు వచ్చామని తమ తల్లి కుంతీదేవికి చెప్పారు. ఆ బహుమతి ఏమిటో చూడకుండానే కుంతీదేవి, అన్నదమ్ములు అయిదుగురూ దానిని సమానంగా పంచుకోవాల్సిందిగా ఆదేశించింది. అమ్మ మాట మీరరానిది కావడంతో, ద్రౌపది పంచపాండవులకు పత్ని అయింది.

ఎంతో ధైర్యసాహసాలు, అపారమైన గౌరవ మర్యాదలున్న మహిళగా ద్రౌపది ప్రసిద్ధురాలు. అన్యాయాన్ని సహించలేని ఆమె అలాంటి విషయా లపై ధైర్యంగా తన అభిప్రాయాల్ని వెలిబుచ్చేది.

రాజసూయ యాగ సమయంలో పాండవులు తమ సోదరుడైన కురురాజు దుర్యోధనుణ్ణి తాము కొత్తగా నిర్మించుకున్న ఇంద్రప్రస్థంలోని రాచనగరా నికి ఆహ్వానించారు. అక్కడి రాజప్రాసాదంలోని మయసభను దుర్యోధనుడు సందర్శించాడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసే అద్భుత మైన వాస్తుశిల్పకళా చాతుర్యానికి చిహ్నం మయసభ. ఆ సభలోకి ప్రవేశించిన దుర్యోధనుడు అక్కడ ఒకచోట ఇంద్రనీల మాణిక్యరాశితో నిర్మితమైన ఒక ప్రదేశాన్ని చూసి జలాశయంగా పొరపడి, కట్టుబట్ట లను ఒకింత పైకి పట్టుకొని నడిచాడు. తీరా చూస్తే, అది జలాశయమని భ్రమింపజేసేలా చేసిన నిర్మాణం. కొంతదూరం వెళ్ళాక, స్ఫటికరత్న కాంతిలో స్వచ్ఛ స్వరూపంతో ప్రకాశిస్తున్న ఒక కొలను దుర్యోధనుడికి ఎదురైంది. అది కూడా ఇందాక ఎదురైన దానిలా తెలితెలి మణులు పొదిగిన సమానతలం అనుకొని, దుర్యోధనుడు రాచఠీవితో దానిపై కాలుమోపాడు. ఫలితంగా దానిలో జారిపడి, దుస్తులు తడవగా అవమానంగా భావించాడు. అతని దురవస్థ చూసిన ద్రౌపది అనాలోచితంగా నవ్వింది. ద్రౌపది పరిహా సంతో దుర్యోధనుడిలో కోపం కట్టలు తెంచుకుంది. అభిమానధనుడైన ఆతడు పగ ఆమెపై తీర్చుకోవా లనుకున్నాడు. అలా మహాభారత యుద్ధానికి బీజం పడింది.

ఆ తరువాత పాచికలాటలో యుధిష్ఠిరుడు తన సర్వస్వాన్నీ కోల్పోవడమే కాక సోదరులనూ, తననూ, భార్య ద్రౌపదినీ పందెంగా ఒడ్డి ఓడిపోయాడు. పెద్దలందరూ ఉన్న కౌరవసభలో దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేయబోయాడు. అప్పుడు ద్రౌపది సభలో కలయదిరిగి, ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణాది పెద్దలను న్యాయం చెప్పాల్సిందిగా కోరింది. కానీ, ఆమె రక్షణకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆమె ‘ధర్మం, న్యాయం లేనప్పుడు ఇక ఇది రాజాస్థానమే కాదు. వట్టి దోపిడీదొంగల ముఠా’ అని ఆక్రోశించింది. ముందుగా రాజ్యాన్నీ, ఆ పైన సోదరుల్నీ, స్వయంగా తనను తాను పందెంగా పెట్టి ఓడిపోయిన ధర్మరాజుకు ఆ తరువాత తనను (ద్రౌపదిని) పందెంగా ఒడ్డే హక్కు లేదంటూ ఆమె ధర్మసూక్ష్మాన్ని ఎత్తిచూపింది. ఆ విధంగా ఆమె ధైర్యంగా రాజసభనే సవాలు చేసింది.

చిట్టచివరకు ఆమె శ్రీకృష్ణపరమాత్మను శరణు వేడింది. శ్రీకృష్ణుడి కృపాకటాక్షం ఆమెకు కలిగింది. దాంతో, దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ అనంతంగా చీరలు వస్తూనే ఉన్నాయి. చివరకు అలసిసొలసి దుశ్శాసనుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అలా శ్రీకృష్ణుడి కరుణతో ద్రౌపదీ మానసంరక్షణ జరిగింది. దుశ్శాసనుడి చేత చిక్కి ముడి వీడిన ద్రౌపది శిరోజాలను అతని వక్షస్థలం (గుండె భాగం) చీల్చి వచ్చిన రక్తంతో తడిపి, ముడివేస్తానని భీముడు శపథం చేశాడు. దుర్యోధనాదుల దుస్సాహసంపై ద్రౌపది సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాసాధ్వీమణి అయిన ద్రౌపది ధర్మాగ్రహం చివరకు భీకర కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. జీవితంలోని కష్ట సుఖాలన్నిటిలోనూ ఆమె తన భర్తలైన పాండవులనే అనుసరించింది. అజ్ఞాతవాస సమయంలో కూడా ఆమె తన భర్తలలో మహోన్నత శక్తినీ, విశ్వాసాన్నీ నింపింది.

ఆ తరువాత జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో చివరకు పాండవులు విజేతలుగా నిలిచారు. ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావాల్సి ఉంది. అయితే, సోదరులైన దాయాదులనూ, బంధువులనూ యుద్ధంలో చేతులారా పొట్టనబెట్టుకొని పాపం చేశానంటూ ధర్మరాజు వాపోయాడు. యుద్ధంలో జయించిన రాజ్యమంతా పరిత్యజించాలని భావించాడు. ధీరోదాత్తురాలైన ద్రౌపది ఆ సమయంలో కల్పించుకొని, ధర్మరాజుకు నచ్చజెప్పి సింహాసనాన్ని అధిష్ఠించి, రాజ్యపాలన చేయాల్సిందిగా కోరింది. ‘ఇది ధర్మాన్ని కాపాడటం కోసం జరిగిన యుద్ధం. అధర్మ కార్యకలాపాల ద్వారా కౌరవులు తమకు తామే వినాశనం కొనితెచ్చుకున్నారు. ఇప్పటికీ ప్రాణాలతో బతికి ఉన్న ప్రజల్ని కాపాడి, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది’ అంటూ ఆమె ధర్మరాజుకు నచ్చజెప్పింది. రాజ్యపాలన చేపట్టిన ధర్మరాజు ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడు. కౌరవుల తల్లి గాంధారినీ, పాండవుల మాతృమూర్తి కుంతీదేవినీ సమానంగా చూస్తూ, ఆదర్శ గృహిణిగా ద్రౌపది తన బాధ్యతలను నిర్వర్తించింది.

కొన్నేళ్ళ తరువాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. తీవ్ర పరితాపానికి గురైన పాండవులు మనుమడైన పరీక్షిత్తుకు రాజ్య పట్టాభిషేకం జరిపి, తాము హస్తినాపురం విడిచి అడవులకు వెళ్ళిపోయారు. పాండవులు, ద్రౌపది – అందరూ హిమాలయాల మీదుగా పయనిస్తూ, స్వర్గారోహణ చేశారు.

మహిళల్లోని ధైర్య స్థైర్యాలకూ, శక్తి సామర్థ్యాలకూ ద్రౌపది ప్రతీక. జీవితంలో ఎదురైన కష్టనష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎంతో సహనంతో వాటిని భరించింది. తనకూ, పాండవులకూ ఎన్నో కష్టాలొచ్చినా ఆత్మవిశ్వాసంతో, హుందాగా ముందుకు సాగింది. అదే సమయంలో కౌరవుల తల్లి గాంధారి పట్ల కూడా ఆమె దయాదాక్షిణ్యాలతో వ్యవహరించింది. ఉపద్రవాలు ఎదురవుతున్నా ధైర్యాన్ని వీడకపోవడం, త్యాగభావం, నైతిక ప్రవర్తనల కారణంగా ప్రాచీన భారతావనిలోని మ¬న్నత స్త్రీమూర్తుల్లో ఒకరిగా ద్రౌపది నిలిచింది.

మహాభారత యుద్ధానంతరం గురుపుత్రుడైన అశ్వత్థామ ఆవేశంతో ద్రౌపది కుమారులైన అయిదుగురు ఉపపాండవులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అతడిని బంధించి తీసుకువచ్చి అర్జునుడు ద్రౌపది కాళ్ళముందు పడవేసాడు. ద్రౌపది తనలోని క్షమాగుణాన్ని ప్రదర్శిస్తూ తనకు ఎలాగూ పుత్రశోకం కలిగింది, అటువంటి శోకం మరో తల్లికి కలగరాదనీ, అతడిని క్షమించి వదిలివేయమంది. ఇంతటి మహోన్నత గుణాలకు ప్రతీక ద్రౌపది.

– భారతీయ ఆదర్శ నారీమణులు గ్రంథం నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *