పాతకాలం చిట్కాటే మేలు…

పాతకాలం చిట్కాటే మేలు…

శరీర ఛాయ కోసం ఇప్పుడంటే రకరకాల క్రీములు అందుబాటులోకి వచ్చాయి కానీ పూర్వకాలంలో ఇవేమీ లేకుండానే ముదిమి వయసు మీదపడినప్పటికీ శరీర ఛాయ మాత్రం మిసమిసలాడి పోయేది. కానీ ఇప్పుడు ఇన్నిరకాల క్రీములు, మందులు వాడుతున్నప్పటికీ శరీర అందాన్ని కాపాడుకోలేకపోతున్నారు. పైపెచ్చు వాటిలో కొన్ని చర్మానికి పడక లేనిపోని చర్మ సమస్యలు తెచ్చుకుంటున్నారు. మన పాతకాలం చిట్కాలు కొన్ని చర్మానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి ఆ అవసరం లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే. ఎందుకంటే ఆ తరం నాటి చిట్కాల వల్ల మన సౌందర్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అందుకే ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం.

కుంకుడుకాయలు

శిరోజాలకు వన్నె తేవడంలో, వెంట్రుకలను దఢంగా, ఒత్తుగా మార్చడంలో కుంకుడుకాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన పెద్దలు ఒకప్పుడు షాంపూలకు బదులుగా కుంకుడు కాయలతో తీసిన రసాన్నే తమ జుట్టుకు పెట్టుకుని తలస్నానం చేసేవారు. దీంతో వారి కేశాలు ఒత్తుగా, దఢంగా ఉండేవి. కుంకుళ్లను సహజసిద్ధమైన షాంపూగా చెప్పుకోవచ్చు. ఇవి జుట్టును శుభ్రపరచడంతోపాటు.. కండిషనర్‌గా కూడా పనిచేస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని సైతం నిరోధిస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు చుండ్రుతోపాటు ఇతర సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న కుంకుడు కాయలను మనం మరిచిపోయాం. ఇకనైనా వీటిని తప్పకుండా మన ఇంటిలోకి తెద్దాం.

పసుపు

ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ.. అంటూ పాడుతుంటారు. మనపాతతరం వాళ్లంతా ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోమని చెబుతూండేవారు. అయితే బట్టలు పాడవుతాయనో లేక ముఖం మరింత పాడవుతుందేమో అనే భయంతో చాలామంది ఈ కాలంలో పసుపు రాసుకోవడం లేదు. కానీ పసుపు శరీర సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు మొటిమల సమస్యలను రాకుండా కాపాడతాయి. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలు, గీతలను కూడా తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం మదువుగా తయారవుతుంది. అంతే కాకుండా.. శరీర ఛాయ సైతం మెరుగు పడుతుంది. కాళ్లకు పసుపు రాసుకోవడం వల్ల కాలిపగుళ్లు తగ్గి అరిపాదాల దగ్గర చర్మం సున్నితంగా లేతగా మారుతుంది. పసుపు-గంధం, పసుపు-తేనె, పసుపు-పెరుగుతో చేసిన ఫేస్‌ప్యాక్‌లు శరీర సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

పాలు

పాలల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే ఈ పాలు అందాన్ని ద్విగుణీకతం చేయడంలో కూడా అంతే శక్తివంతమైనవి అంటు న్నారు సౌందర్య నిపుణులు. ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులకు బదులుగా ఆవు పాలను వాడి చూడండి అద్భుతమైన మార్పు కనిపించడం ఖాయమంటున్నారు వాళ్లు. ఇప్పుడు చలికాలం. పెదవులు పగలడం మొదలయ్యాయి. దీన్నుంచి బయటపడడానికి మాయిశ్చరైజర్‌ రోజూ కచ్చితంగా వాడాల్సిందే. దానికి పాలు మంచి పరిష్కారం. పాలు, పాల పదార్థాలను చలికాలంలో పగిలిన చర్మానికి రోజూ రాయడం వల్ల చర్మం తిరిగి పూర్వస్థితికి వస్తుంది. పాలమీగడ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. నెయ్యిని పెదవులకు రాసుకుంటే లిప్‌బామ్‌లతో పనే లేదు. అదేవిధంగా చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పాలు, పెరుగు నలుగుపిండితో కలిపి రుద్దుకొనేవారు. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటంతోపాటు తగిన పోషణ సైతం అందుతుంది. పాలు క్లెన్సర్‌గా, స్క్రబ్బర్‌గా ఉపయోగ పడతాయి.

– సంతోషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *