స్త్రీ శక్తి…

స్త్రీ శక్తి…

వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మన దేశాన్నే ఒక స్త్రీ మూర్తిగా భావించి భారతమాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తు లుగా, మాతలుగా వ్యవహరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీల పట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం.

ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీ అనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత, సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటి తరం మహిళలకు ఎంతో ఆదర్శం.

కాని ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీల పట్ల మన ఆలోచనాధోరణి మారాలి.

నేడు స్త్రీల పరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య, విద్య, విజ్ఞాన, రాజకీయ, క్రీడా, రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.

విద్యార్థినిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ, పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు… ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి.

తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలందించి, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణి…అనే విషయాన్ని తెలుసు కుంటున్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతో పాటు స్త్రీలకు విద్య, సాధికారిత, హక్కులు, అభివృద్ధిలో భాగస్వామ్యం సమానంగా లభించినప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధిస్తుంది.

గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో తెలిసిన విషయమే.

మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్పథాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.

వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపిస్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానాలను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓ నివేదిక పేర్కొంది.

ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి కల్పించాలి.

– ప్రణీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *