సామాన్యుల పోలీస్‌

సామాన్యుల పోలీస్‌

ఆమెను అందరూ ‘సామాన్యుల పోలీస్‌’ అని పిలుచుకుంటారు. పోలీస్‌ అంటే ఎలా ఉండాలో చూపిన ధీశాలి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే మనస్తత్వం ఆమెది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడని క్రమశిక్షణ ఆమె సొంతం. ఆమెను చూసి స్ఫూర్తి పొంది ఎందరో పోలీసులయ్యారు. ఆ మహిళా పోలీస్‌ ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని బడుగుల సుమతి, ఐపిఎస్‌.

ఒక మహిళా పోలీస్‌ అధికారి అంటే ఎలా ఉండాలో సుమతిని చూసి నేర్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో డిఎస్‌పి నుంచి ఐపిఎస్‌గా పదోన్నతి పొందిన వ్యక్తి ఎవరంటే? అందరూ సుమతి ఐపిఎస్‌ పేరే చెబుతారు. ఎందరో మహిళలకు ఆదర్శం ఈ మహిళా పోలీసు.

సుమతికి వరంగల్‌ తొలి పోస్టింగ్‌. డిఎస్‌పిగా తొలి పోస్టింగ్‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సష్టించారు. నేరగాళ్లకు సింహ స్వప్నంగా నిలిచారు. క్రమశిక్షణ తప్పిన పోలీసులనూ దారిలోకి తెచ్చారు. ఎంతో మంది బాధితులకు ఆపన్న హస్తం అందిచారు. ఆమె దగ్గరికెళ్తే న్యాయం దక్కుతుందని ప్రజల భరోసా. ధర్మాన్ని వీడవద్దన్న తన నాయనమ్మ మాటలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు సుమతి.

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆలంపూర్‌ తాలూకా కలుగోట్ల సుమతి స్వస్థలం. ఆమె తండ్రి తిరుపతి రెడ్డి. వ్యవసాయం ఆయన వృత్తి. దాన, ధర్మాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. సుమతికి అన్న, అక్క, ఇద్దరు చెల్లెళ్లు. సుమతి తండ్రికి డబ్బు చింతన లేదు. ఏడాది పొడవునా శ్రమించగా వచ్చిన ఆదాయం కాస్తా దాన ధర్మాలకే ఖర్చు చేసేవారు. నడక దారిలో శ్రీశైలం వెళ్లే శివ భక్తులకు ఉగాది సమయంలో ఓ వారంపాటు రోజూ వందలాది మందికి అన్నదానం చేసేవారు.

సుమతి తల్లికి చదువంటే చాలా ఇష్టం. పిల్లలు చదువుకుంటేనే వారి భవిష్యత్‌ బాగుంటుందని ఆమె భావించారు. ఊళ్లో పాఠశాల లేకపోవడంతో వారిని కర్నూలులో హాస్టల్‌లో ఉంచి చదివించారు. పాడి ద్వారా వచ్చిన డబ్బులను ఒక్కో రూపాయి పోగుచేసి పిల్లల ఫీజులకు కట్టేవారు.

ఎల్‌కెజి నుంచే సుమతి హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. మూడో తరగతి వచ్చేసరికి వారి కుటుంబం కర్నూలుకు మారింది. సుమతి ఏడవ తరగతిలో ఉండగా తిరిగి సొంత ఊరికి మకాం మార్చారు.అప్పుడు సుమతి బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఇంటర్‌ నిమ్మకూరు రెసిడెన్షియల్‌ కాలేజీలో పూర్తి చేశారు. మొత్తం 33 మంది విద్యార్థుల్లో 31 మంది మెడిసిన్‌లో చేరారు. కాలేజీ టాపర్‌ అయినప్పటికీ సుమతి మాత్రం డిగ్రీ అగ్రికల్చర్‌ కోర్సును ఎంచుకున్నారు.

2000 సంవత్సరంలో గ్రూప్‌-1 సెకండ్‌ టాపర్‌గా నిలిచి డిఎప్‌పిగా ఎంపికయ్యారు. చిన్న నాటి నుంచి ఉన్న పట్టుదలే ఆమెకు ఈ విజయాన్ని తెచ్చిపెట్టింది. 2007లో ఐపిఎస్‌గా పదోన్నతి సాధించారు. ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్‌-1 అధికారి ఐపిఎస్‌ కావడం తెలుగు రాష్ట్రాల్లో అదే తొలిసారి. ఇప్పటికీ ఈ రికార్డు ఆమె పేరునే ఉంది. విధి నిర్వహణలో ఆమె చూపిన ప్రతిభ కారణంగానే ఈ గౌరవం దక్కింది. సైబర్‌ క్రైమ్స్‌ విభాగానికి వన్నె తెచ్చారు. ఎంతో మంది సైబర్‌ నేరగాళ్లను బోనులో నిలబెట్టారు.

సుమతి చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. ఊళ్లో అందరితో కలిసి పోయేవారు. సుమతమ్మ ఎప్పటికైనా పెద్ద పోలీసాఫీసరో, కలెక్టరో అవుతుందని ఊళ్లోవాళ్లు అనే వారు. ఆ ఊళ్లో పోలీసుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఏ చిన్న కష్టం వచ్చినా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళేవారు. ఆ ప్రభావం సుమతిపై బాగా పడింది.

చిన్నతనంలో అందరూ వేసవి సెలవుల్లో సరదాగా ఊళ్ళకు పయనమైతే, సుమతి మాత్రం వాళ్ల అమ్మకు నచ్చచెప్పి ఏదైనా కోచింగ్‌లో చేరేవారు.

చిన్నప్పటి నుండే సుమతిపై ఇంట్లో వాళ్ళకు నమ్మకం ఎక్కువ. తను ఏదో సాధిస్తుందనే భరోసా. అందుకే అమెకు ఏం కావాలన్నా సమకూర్చేవారు.

సుమతి లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండేది. ఆటలైనా, చదువులైనా మొదటి స్థానం రావాల్సిందే. 1998లో డిగ్రీ పూర్తయిన వెంటనే గ్రూప్స్‌ కోచింగ్‌కు హైదరాబాద్‌ పయనమయ్యారు. ఆమెకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న వసంత అనే ఓ అధికారి బస్‌లో పరిచయమైంది. గ్రూప్స్‌ సాధించాలన్న లక్ష్యంతో వెళ్తున్నానని చెప్పిన సుమతి మాటలకు ఆమె ముగ్ధురాలైంది. ఇంటికి ఆహ్వానించి మరీ మంచి కోచింగ్‌ సెంటర్‌తోపాటు హాస్టల్‌ వెతికి పెట్టింది. రెండేళ్లు పుస్తకాలే ప్రపంచంగా శ్రమించి గ్రూప్‌-1 విజేతగా నిలిచారు సుమతి.

‘నాకు చిన్నప్పటి నుంచి ధైర్యం చాలా ఎక్కువ. ఒకసారి నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌కు వెళ్లేందుకు పయనమయ్యాను. విజయవాడలో దిగేసరికి రాత్రి 9 అయింది. అక్కడి పరిస్థితి చూసి అమ్మాయిలకు రక్షణ లేదని భావించాను. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండొద్దని నిర్ణయించు కుని బస్‌ ఎక్కాను. నిమ్మకూరు చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. హైవే నుంచి ఊళ్లోకి 1.5 కిలోమీటర్లు నడవాలి. రోడ్డుపైన తాగుబోతులు ఉన్నారు. అయితే బతుకుతాను.. లేదంటే చస్తాను.. అని మనసులో ధైర్యం తెచ్చుకుని నడక సాగించి మా ప్రిన్సిపల్‌ ఇంటికి చేరుకున్నాను. నా ధైర్యాన్ని చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు’ అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు సుమతి.

తన డిగ్రీ క్లాస్‌మేట్‌ శ్రీనాథ్‌ రాజుని సుమతి ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహం, భర్త సహకారంతో తనదైన శైలిలో దూసుకు వెళుతున్నారు. వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమతి ఎందరికో ఆదర్శం.

‘మనసులో బలమైన సంకల్పం ఉండాలేగానీ ఏదైనా సాధించవచ్చు’అని సుమతి ఎప్పుడూ చెబుతారు.

– ప్రణీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *