మహిళా శక్తిని చాటే రోజు

మహిళా శక్తిని చాటే రోజు

మహిళ..

మానవతా మూర్తి..

మ¬న్నత భావాలు కలగలిసిన వ్యక్తి..

కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన శక్తి..

తల్లిగా, ఇల్లాలిగా, సోదరిగా ఇలా ఆమె సేవలు ఋణం తీర్చుకోలేనివి. అందుకే పురాతన కాలం నుంచి నేటివరకు మన సమాజంలో మహిళలకు ప్రత్యేకస్థానం కల్పించారు. వారిని దేవతలా భావించి పూజిస్తున్నారు. ఇక్కడ పుట్టిన నదీనదాలను, చెట్లను కూడా తల్లిలాగానే గౌరవిస్తున్నాం. మనదేశాన్ని కూడా భారతమాత అని తల్లిలా గౌరవించి భావించి పూజిస్తున్నాం.

అలాంటి మహిళాశక్తిని లోకమంతటికీ చాటేలా వారికోసం ఒక రోజునే కేటాయించారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఐ.డబ్ల్యు.డి.)’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మగువలంతా ప్రతి సంవత్సరం ముచ్చటపడి జరుపుకునే రోజు అది. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు వారం రోజుల ముందునుంచే మహిళా దినోత్సవ ఉత్సవాలు జరుగుతాయి.

అసలేంటీ మహిళా దినోత్సవం ?

ఏదైనా ఉత్సవమో, పండుగో, ప్రత్యేక సందర్భమో జరుపుకోవడానికి ఒక నేపథ్యం అంటూ ఉంటుంది. అలాగే మహిళా దినోత్సవం జరుపుకోవ డానికి కూడా ప్రత్యేక నేపథ్యం ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. ఫిబ్రవరి 28, 1909న మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 1910 ఆగస్టులో అంతర్జాతీయ సామ్య వాద సమావేశానికి ముందు అంతర్జాతీయ మహిళా సమావేశం డెన్మార్క్‌ నగరంలోని కోపెన్‌హెగెన్‌లో జరిగింది. ఆ సమావేశంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని తీర్మానించారు. మహిళలు పురుషులతో సమానంగా ఓటు హక్కుతో పాటు సమాజిక సమానతను సాధించడానికి ఇదే మంచి అవకాశమని వారు భావించారు. ఆ తర్వాత సంవత్సరం 1911, మార్చి19న ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలలో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. తర్వాత 1913లో జరిగిన చర్చల ఫలితంగా 1914 నుంచి మార్చి 8న దీన్ని జరుపుకోవడం ప్రారంభించారు.

మహిళాదినోత్సవం రోజున కొన్ని దేశాలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు వంటి వాటిల్లో అధికారిక శెలవు దినంగా ప్రకటిస్తారట. దీంతో పాటు ఈ రోజున ప్రజలంతా ఊదా రంగు (పర్పుల్‌ కలర్‌) రిబ్బన్లు ధరించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. ఎందుకు ఆ రంగే అంటే.. మహిళల సమానత్వానికి, హుందాతనానికి పర్పుల్‌ కలర్‌ను గుర్తుగా భావిస్తారు. అలాగే ఈ రోజున మహిళలకు ప్రత్యేకమైన కానుకలను ఇచ్చి, వారికి శుభాకాంక్షలు తెలిపి వారిపట్ల తమ అను బంధాన్ని, కృతజ్ఞతను చాటుకుంటారు

ఒక్కో సంవత్సరం ఒక్కో అంశం

1914 నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళాశక్తి బలోపేతం అవుతున్నప్పటికీ, 1975 నుంచి ఐరాస ఏటా మహిళా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. దీంతోపాటు ఆ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా’ గుర్తించింది. ఈ నిర్ణయానికి 150 దేశాలు మద్దతు పలికాయి. స్త్రీలపై జరుగు తున్న అన్యాయాలు, అసమానతలు, వివక్షతలు వంటివాటిని తొలగిస్తామని ఈ సందర్భంగా ఆయాదేశాలు ప్రకటించాయి. మహిళలకు సంబంధించి సంవత్సరానికో అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆ థీమ్‌తో ఏటా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.

భారత రాజ్యాంగంలో మహిళల కోసం

భారత రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు పొందుపరిచి ఉన్నాయి. మహిళల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలనూ ఆమోదిం చింది. కొన్ని సవరణలకు కూడా అయ్యాయి. నేడు ఎంతోమంది మహిళలు విద్యా వంతులు అవుతున్నా, వారి కాళ్ల మీద వారు నిలబడు తున్నా, ఎక్కడో ఒకచోట వివక్ష ఎదురవుతూనే ఉంది. చట్టాలపై అవగాహనా లేమి కూడా ఇందుకు కొంత కారణం.

జాతీయ మహిళా కమిషన్‌, నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌, నేషనల్‌ పాలసీ ఫర్‌ ఎంపవరింగ్‌ విమెన్‌ లాంటివే కాక మహిళలపై హింసను తగ్గించేలా నిర్భయ, అక్రమ రవాణా నిరోధక చట్టాలు వంటివాటిని కూడా రూపొందించారు. మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, వారి రక్షణ కోసం కేటాయించిన చట్టాలను గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ప్రతి మహిళకూ అవసరం. అప్పుడే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లీగల్‌గా, ధైర్యంగా ఎదుర్కోగలం.

మార్పు రానంతవరకూ అభివృద్ధి ఉండదు

ఏ దేశంలో అయినా అక్కడి స్త్రీల స్థితిగతులు మహిళా ఉన్నతిపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశంలో ప్రవేశించిన వ్యాపారాత్మక ధోరణి మానవ విలువలలో, భావజాలంలో పెను మార్పులు తెచ్చింది. ఆ మార్పులో మహిళను ఇరికించారు. తమ వ్యాపార వృద్ధి కోసం మహిళను బజార్లోకి (మార్కెటైజ్‌) తెచ్చారు. ఈ ధోరణి మహిళల జీవితాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. పెట్టుబడికి అవసరమైన దిశలో ఆమె గమనాన్ని బాహ్యశక్తులు నిర్దేశిస్తున్నాయి. వారి ఉత్పత్తుల ప్రచారం కోసం మహిళలను వ్యాపార వస్తువులుగా చూపిస్తున్నారు.

ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా అవి ఉపన్యాసాల వరకే పరిమితం అవుతున్నాయి. వారి స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మార్పు ఇంకా రాలేదు. మహిళల పట్ల వ్యాపారాత్మక ధోరణి మారలేదు.

మన పురాతన సంప్రదాయంలో మహిళను మాతృమూర్తిగా గౌరవించాం. కానీ నేడు స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రతి మహిళను తల్లిగా చూసి, ఆమెకు సమాజంలో పరిపూర్ణ గౌరవాన్ని కల్పించే రోజు వస్తుందో అప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధించినట్లు లెక్క. ఈ మార్పు రానంత వరకు దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించలేదనేది అక్షరసత్యం.

– సంతోషలక్ష్మి దహగాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *