చిలక ముద్ద.. పిచిక ముద్ద

చిలక ముద్ద.. పిచిక ముద్ద

‘మా అబ్బాయికి అసలు తిండి మీద ధ్యాసే లేదు వాడికిష్టమైన వేపుడో, పోపన్నమో చేసి, బలవంతంగా ముద్దలు చేసి పెడితే సరిగ్గా ఇంత తింటాడు’ అని నిమ్మకాయ సైజు హస్తముద్ర పెడుతుంది తల్లి. ‘అదే మా ఆడపడుచు పిల్ల అయితే సుబ్బరంగా ఇంత తిని, మళ్ళీ గంటకే ఆకలంటుంది’ అంటూ వాపోతారు తల్లులు.

పిల్లలు తినట్లేదు, తినట్లేదు అనడమే తప్ప, వారు ఎందుకు తినట్లేదో ఆలోచించ లేకపోతున్నారు ఈ తల్లులు. గడచిన తరం పిల్లలకి కథలు చెబుతూ ‘ఇది చిలక ముద్ద. ఇది పిచిక ముద్ద, నాన్న ముద్ద, బాబాయ్‌ ముద్ద’ అంటూ చుట్టాల్ని, చుట్టూ ఉన్న పశుపక్ష్యాదుల్ని చూపిస్తూ, పరిచయం చేస్తూ, మాటలు నేర్పిస్తూ, చందమామ పాటలు పాడుతూ ప్రేమగా తినిపించేవాళ్ళు. ఇప్పుడు సెల్‌ఫోన్‌ చేతికిచ్చో, టామ్‌ అండ్‌ జెర్రీ ప్రోగ్రాం చూపించో వాళ్ల నోట్లో కుక్కేయాలని చూస్తున్నారు.

రాముడు, కృష్ణుడు కూడా చిన్నప్పుడు అన్నం తినడానికి మారం చేశారట. చందమామని ఇస్తే గాని ‘ఆమ్‌’ తిననని రాముడు మారాం చేశాడట. ఇక అల్లరి కిట్టయ్యకి ఇంటి వెన్న కన్నా పొరుగింటి వెన్నే ఇష్టం. పాలు తాగితే జుట్టు బాగా వస్తుందని ఆశ పెడితే ఓ బుక్క తాగి జుట్టు తడుముకుని ‘పెరిగిందా? చూడు’ అని అడిగేవాడట. ఇవన్నీ ఎంత అందమైన ఊహలో కదా !

ఒకరోజు ఒక పదార్థాన్ని ఇష్టంగా తిన్నాడని పిల్లాడికి రోజూ అదే పెడితే ‘ఛీ’ ‘థూ’, ‘యాక్‌’ అని మంచినీళ్ళు ఎక్కించి, పిచికారీ చేసేస్తాడు. రుచి, రంగు, వాసన ఈ మూడు బాగుంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు

పిల్లలు అన్నం సరిగా తినకపోతే పిల్లల స్పెషలిస్టు దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్స్‌, సిరప్స్‌ రాయించుకుని వస్తే మాత్రం వాళ్లు మాయాబజార్‌ సినిమాలో లాగా ఘటోత్కచుడిలా అవురావురంటూ తినేస్తారా? ఒక్క విషయం మాత్రం నిజం. ప్రేమగా సమయాన్ని కేటాయిస్తూ గోరుముద్దలు కొంతసేపు, స్పూను ముద్దలు కొంతసేపు, అంటే మెత్తగా, పలుచగా కొంచెం కొంచెం తినిపిస్తే వారు ఖచ్చితంగా తింటారు. కాని ఈ తల్లులకు టైం ఉండదు పాపం.

ఓ మహాతల్లికి పెరుగు పడదు. ఆమెకు దాని వాసనంటే పరమ చిరాకు, రోత. కావున తన పిల్లలకు పెరుగు పెట్టదు. కొందరు తల్లులకు నెయ్యి పడదు. వాళ్ళ పిల్లలు నెయ్యి రుచిని ఎరుగరు.

కొన్ని అధ్యయనాల వల్ల తేలిందేమిటంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ లాంటివి తల్లుల అలవాట్లను బట్టే పిల్లలకు పెడతారంట. దాంతో పిల్లలు చాక్లెట్లు, జంక్‌ఫుడ్స్‌, చిప్స్‌ వంటివి అలవాటు చేసుకుంటున్నారు. ఇది దారుణం. మనం చేజేతులా వాళ్ళకి ఒబేసిటీలు, మిగిలిన జబ్బులు సరఫరా చేసేస్తున్నాం.

అన్నం తినని పిల్లాడికి ఓ చిన్న పిల్లల డాక్టరు చుక్కల మందులు, టానిక్‌లు రాసి దాంతో పాటు ప్రిస్కిప్షన్‌లో ‘రుచిగా వంటలు చేయడం ఎలా?’ అనే పుస్తకాన్ని కూడా తల్లులకు ఇచ్చాడట. తప్పదు మరి. లేకపోతే ఎంచక్కా వాళ్లు పెద్దయ్యాక బయట రుచికరమైన హోటల్‌ తిండికి అలవాటు పడతారు.

అందుకే తల్లులు ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకుని పిల్లలకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.

– బ్నిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *