అర్థమయ్యేలా చెబుతాం !

అర్థమయ్యేలా చెబుతాం !

భారతీయ సనాతన ధర్మం ఇంకా పదిలంగా ఉందంటే దానికి కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థే. హిందూ సంప్రదాయంలో మహిళకు సముచిత గౌరవం ఉంటుంది. భర్తకు తగిన భార్యగా, పిల్లల్ని సన్మార్గంలో నడిపించే తల్లిగా, బాధ్యతల్ని నెరవేర్చే కోడలిగా, పెళ్లికి ముందు తల్లిచాటు బిడ్డగా.. ఇలా ప్రతి అమ్మాయి తన జీవితంలో కీలక దశలను.. అందులో తన బాధ్యతలను నెరవేరుస్తుంది. అయితే ఈ దశలన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాలంటే చిన్నప్పటి నుంచే వారు జీవిత పాఠాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇంట్లో అమ్మ కంటే మరెవరూ సరిగ్గా నేర్పలేరు. తల్లి చెప్పే మంచి విషయాలు నేర్చుకోవడం వల్ల సమాజంలో తన విలువ పెరగడం మాత్రమే కాదు, ఆ తల్లి విలువ కూడా రెట్టింపవుతుంది. మరి ఆడపిల్లలకు ఒక తల్లిగా వారికి అర్థమయ్యేలా ఎలాంటి విషయాలు చెప్పాలో తెలుసుకుందామా!

అణకువగా ఉండాలి!

అమ్మాయిలు అల్లరి పనులు చేస్తుంటే.. ఆడపిల్ల అంటే అణకువగా ఉండాలి. అల్లరి చేయకూడదని మన పెద్దలు అంటుంటారు. వాళ్ల మాటలు అక్షరాల నిజం. ఆడపిల్లకు అణకువ ముఖ్యం. ఎందుకంటే వారు ఆలిగా, కోడలిగా, తల్లిగా తమ బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేర్చాల్సి ఉంటుంది. వీటి నిర్వహణలో ఓపిక చాలా ముఖ్యం. లేకపోతే పుట్టినింటి నుంచి మెట్టింటి దాకా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే కూతురికి ఓ వయసు వచ్చిన తర్వాత నుంచి పెళ్లికి ముందు మెలిగే తీరు.. పెళ్లయ్యాక అత్తామామ, భర్త, మెట్టినింటి వారితో ప్రవర్తించే విధానం.. వంటి అన్ని అంశాల గురించి తల్లులు చెబుతుంటారు. వీటిని పెడచెవిన పెట్టకుండా చక్కగా నిర్వర్తిస్తే.. అత్తారింట్లో అటు కోడలిగా మీకు.. ఇటు విలువలు, బాధ్యతలు నేర్పిన మీ తల్లికి మంచి పేరు వస్తుందనడంలో అస్సలు సందేహం లేదు.

ఓపిక ముఖ్యం

తల్లిదండ్రులు ఆడపిల్లలకు నేర్పించే జీవిత పాఠాలలో అణకువ మాత్రమే కాదు ఓపిక, మర్యాద, ప్రేమపూర్వక వైఖరి, సహనం వంటివి కూడా ముఖ్యమే. ఇవన్నీ వారి వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాదు సమాజంలో వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో కూడా ఉపయోగపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మెలగాలో, ఎదుటి వారు ఏం చెప్పినా ఆవేశపడకుండా వినడం, నెమ్మదిగా కోపగించుకోకుండా సమాధానం చెప్పడం వంటివి నేర్పించడం అవసరం. అలాగే తోటి అబ్బాయిలతో ఎలా మెలగాలి, స్నేహితులతో ఏ విధంగా ఉండాలి? మొదలైన విషయాలన్నింటిని వారికి చక్కగా వివరించాలి. సాధారణంగా పెరిగే క్రమంలో హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లల్లో కోపం వస్తుంటుంది. అలాంటప్పుడు ఓపిక, సహనంతో ఉండడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో వారికి వివరించగలగాలి. ఈ విషయాలన్నింటిని తల్లులు ఓపికగా వారికి చెప్పాల్సి ఉంటుంది. వారు కూడా వీటిని కేవలం వినడం మాత్రమే కాదు.. పాటించాలి. అప్పుడే తల్లీబిడ్డలిద్దరికీ మంచి పేరొస్తుంది.

ధైర్యాన్నిద్దాం !

సాధారణంగా ఆడవాళ్లు ఊరికే భయపడతారని అంటుంటారు చాలామంది. కానీ అది తప్పు. నిజానికి మగవారి కన్నా ఆడవారికే ధైర్యం ఎక్కువ. కానీ అది వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవాటవుతుంది. అందుకే ఆడపిల్లలను ధైర్యంగా పెంచాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంది. అందుకే వాళ్లకు చిన్నప్పటి నుంచే ఝాన్సీరాణి, చెన్నమ్మ, రుద్రమ్మ వంటి ధీశాలుర కథలను చెప్పండి. వారెలా విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నారో, వాటిని ఎలా ఎదురించాలో విడమర్చి చెప్పండి.

సాధారణంగా ఆడవారి బాధలు ఆడవాళ్లకే తెలుస్తాయంటారు పెద్దలు. అందుకే పిల్లలకు అర్థం చేసుకొనే వయసొచ్చిన తరువాత తల్లితో వారు ప్రతీ విషయాన్ని పంచుకునే స్థితిలో ఉండాలి. అందుకు తగ్గట్లుగా తల్లుల ప్రవర్తన ఉండాలి. అలా ఉండగలిగతేనే వారిలోని భయాలు, ఆందోళనల్ని తొలగించడంలో తల్లిని మించిన వారు లేరని వారికి అనిపిస్తుంది. అందుకని తల్లులు వారికి పూర్తి స్వేచ్ఛ నివ్వాలి. ఏది తప్పో? ఏది ఒప్పో? అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ, వారికి అన్ని విషయాలూ తెలియ జేస్తూ ఉంటే ఆడపిల్లలు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా దఢంగా తయారవుతారు.

భరోసా ఇవ్వండి !

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం పరిపాటి. ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడం సర్వసాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే మగవారి కంటే ఆడవారే చదువుల్లో ముందుంటున్నారు. ఆడపిల్లకు చదువెందుకు? పెళ్లయితే భర్త పైనే ఆధారపడాలి కదా! లాంటి ఆలోచనల్ని తల్లిదండ్రులు దరికి రానివ్వొద్దు.

ఆడపిల్లలకి చిన్నతనం నుంచే విద్యాబుద్ధులు నేర్పించడం, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం, వారికి సమాజంలో విలువైన స్థానాన్ని కల్పిచండం కోసం తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలి. తద్వారా వారు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడానికి వీలుంటుంది. జీవితంలో ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కుంగి పోకుండా తనకాళ్లపై తాను నిలబడి బతకగలను అనే భరోసా వారికి ఇవ్వాలి.

ఆటపాటలన్నింటిలోనూ..

కాలం మారింది. నేడు ఆడపిల్లలు కూడా మగ వారితో సమానంగా అన్నీ రంగాల్లో ముందుండాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే తల్లులు కూడా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి చిన్నప్పటి నుంచి ఆటపాటలు, డ్యాన్సులు, కరాటే, క్రికెట్‌లాంటి అంశాల్లో.. పిల్లలకు ఆసక్తి ఉన్న వాటిల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. అటు చదువుని కూడా నిర్లక్ష్యం చేయనివ్వట్లేదు. ఇలా ఆల్‌రౌండర్‌గా నిలిచేలా తమ పిల్లలని తల్లులు ప్రోత్సహించాలి. అంతేకాని ఇంటిపట్టునే ఉండాలి, ఆడపిల్ల బయట తిరగొద్దు లాంటి ఆంక్షల్ని విధించకూడదు.

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *