అమ్మలెలా ఉండాలి?

అమ్మలెలా ఉండాలి?

నేటి సమాజంలో కొంతమంది తల్లిదండ్రుల్ని మనం గమనించినట్లైతే వాళ్లు చిన్నప్పుడు సాధించలేని కళల్ని తమ పిల్లలకు నేర్పించి, వాళ్ళకు శ్రద్ధాసక్తులు కలిగించి, అందులో రాణించేలా చూస్తారు. అలా తయారైన డ్యాన్సర్లూ, సింగర్లు ఎంతోమందిని చూస్తుంటాం. ‘మా అమ్మ ప్రేరణ వల్లే నేను ఈ స్థాయి పొందాను’ అని చాలా మంది చెబుతుంటారు. ‘మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. అప్పట్లో ఆయనకి కుదరక నేర్చు కోలేదట’ అని చెప్తారు చాలామంది గొప్పవాళ్ళు. కాని నేటి తల్లిదండ్రులు (ముఖ్యంగా తల్లులు 75 శాతం) పిల్లలకు మన సంస్కృతీ, సంప్రదాయాల పట్ల, మన కళల పట్ల ప్రేమానురాగాలు కలిగించట్లేదు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి చక్కగా బాబ్డ్‌కటో, బాయ్‌కటో చేయిస్తున్నారు. (జడేసే శ్రమ తప్పుతుందని). ఇదివరటి లాగా పట్టు లంగా, పట్టు జాకెట్టూ వేసుకున్న అమ్మాయిలు కనిపించట్లేదు. పండగలో, పుట్టిన రోజులో వస్తే షర్టులూ, ప్యాంట్లూ, గాగ్రా చోళీలు, లేదా పంజాబీ డ్రస్సులు కొనిస్తున్నారు.

బొట్లు, గాజులు ఎప్పుడో పోయాయి. కొన్ని స్కూళ్ళల్లో బొట్టు పెట్టుకుంటే శిక్షవిధిస్తారు. చేతులకు గాజులుంటే ఆశ్చర్యపోవాలి ఇక. రిబ్బన్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. నేడు ఏ తల్లికీ రిబ్బన్‌ ముడికట్టడం రాదంటే ఆశ్చర్యపోకండి. (ఎవరికైనా వచ్చి ఉంటే అందుకు కారణం తమ చిన్నప్పుడు చెల్లెళ్ళతో పెరగడం కావొచ్చు)

ఈ తరం అమ్మలు 10 శాతం జడ వేసుకోకుండా క్లిప్పు పెట్టి, జుట్టు విరబోసి, దానికీ చికాకనిపించిన మీదట రెండు వేళ్ల వెడల్పు, ఒక బెత్తెడు మాత్రం అంటూ నడుం పైకీ, మెడ కిందకీ జుట్టు కట్‌ చేస్తున్నారు.

మరి వాళ్ళ కటింగ్‌ వాళ్ళకే చండాలంగా ఉందని ప్రొఫెషనల్‌ లేడీ బార్బర్లు (సారీ, బ్యూటీషియన్సు) దగ్గరకెళ్లి లెవల్‌ చేయించే నెపంతో మరికొంత కట్‌ చేస్తున్నారు. మిగిలినదాంతో సమకూరిన అందం (?) తో అపహాస్యం పాలవుతున్నారు.

ఈ మధ్య ‘మధ్య వయస్సు’ స్త్రీలు తమకు కొడుకులూ, కూతుళ్ళూ ఎంత పెద్దవాళ్ళున్నా ‘డ్రస్‌’ మోజులో పడిపోతున్నారు. తామేదో చిన్న పిల్లలు అయిపోయినట్లు చాలా ఏకాగ్రతతో అద్దం ముందు మురిసిపోతూ దానికి సరైన సైజు దొరికే దాకా ఓ చోట బిగువనీ, ఓ చోట లూజనీ మార్పులూ, చేర్పులూ చేసుకుంటూ, చేయించుకుంటూ ఎట్టకేలకు సరిపోయిందని మురిసిపోతారు. తమ కూతుర్ని ‘డామినేట్‌’ చేయడానికా ఈ తిప్పలు ?

చీర ఎంత డిగ్నిటీ, ఎంత అందం- అనే సంగతి మన వాళ్ళకి పట్టట్లేదు. అందుకే ఈ మధ్య నేనో వంద పద్యాలు చీర గురించి రాశాను. అన్ని కంద పద్యాల్లో రూపొందించిన ఈ ‘చీర పజ్యాలు’ సరదా శతకంలో ఆడవారికి స్త్రీ గౌరవం చూపించడానికి చీరకి మించిన ‘కాస్ట్యూమ్‌’ లేదని నొక్కి వక్కాణించాను నూటొక్కసార్లు. అందులో మచ్చుకు రెండు పద్యాలు .

కం|| పెద్దల కలవగపోవన్‌

ఒద్దికగా చీరకట్ట నొప్పున్‌! అట్లే

బుద్ధిగ గుడికేగు తరిన్‌

వద్దనదా ఫ్యాన్సి డ్రస్సు వనితల మనసే!

కం|| పరిగెత్తుకు బస్సెక్కగ

ఉరుకట కిబ్బంది చీర ఒప్పగ వలయున్‌

మరి ఇంటి పట్టనున్నను

పరువా చీరొదిలి మేక్సి పైజమ కుర్తాల్‌!

ఇలా కట్టు తప్పి కన్నవాళ్ళకి మరింత ఫార్వర్డ్‌ బాట చూపిస్తున్న మోడ్రన్‌ తల్లి(దండ్రులు) మారాలా? అంటే, పిల్లలకు మన భారతీయతను, దాని విశిష్టతను చెప్పాలని పేరెంట్స్‌ అనుకుని తీరాలి కదా!

– చిల్డ్రన్‌ అండర్‌స్టాండింగ్‌ పుస్తకం ఆధారంగా

– బ్నిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *