అమ్మలకే అమ్మ ఈ ఎఎన్‌ఎం

అమ్మలకే అమ్మ ఈ ఎఎన్‌ఎం

సాధారణ ఎఎన్‌ఎం..

అమ్మలా సేవలందిస్తారు..

ఆరోగ్యపరంగా సలహాలిస్తారు..

ఆమె ప్రజలతో మమేకమై పని చేస్తారు..

పద్దెనిమిదేళ్ళుగా ఈ వృత్తిలో కొనసాగుతు న్నారు..

ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విజయాలు..

తన పనితీరుకు ఫలితం ఈ సంవత్సరం ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు..

విజయలక్ష్మి బ్యాగరి. ఓ సాధారణ మహిళ. పదవ తరగతి వరకు చదువుకున్నారు. భర్త ప్రోత్సాహంతో ఎఎన్‌ఎం కోర్సులో చేరారు. 1993లో ఎఎన్‌ఎంగా విధుల్లో చేరారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా, కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్‌ఎంగా పనిచేస్తున్నారు.

పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్యంపై సరైన అవగాహన ఉండదు. విధుల్లో భాగంగా వారిని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ, మెరుగైన ఆరోగ్య పరిరక్షణ కోసం సలహాలు, సూచనలు ఇస్తూంటారు విజయలక్ష్మి. వారి ఆరోగ్య భద్రత కోసం నిరంతరం కృషి చేస్తూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించినందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుతో విజయలక్ష్మిని సత్కరించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆరోగ్య సమస్యలెక్కువగా ఉంటాయి. మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అక్కడ ఉండవు. కొన్ని గ్రామాల్లో అయితే అర్‌ఎంపి, పిఎంపిలు మాత్రమే ఉంటారు. అలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతంలో తన వంతుగా ప్రభుత్వ విధుల్లో భాగంగానే గ్రామీణ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు విజయలక్ష్మి.

‘ఏఎన్‌ఎంగా ప్రజలకు సేవలందించడం నేను అదష్టంగా భావిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కాన్పు అనేది ఓ పెద్ద సమస్య. వాళ్లకేమీ తెలియదు కాబట్టి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం మన బాధ్యత. పద్దెనిమిది ఏళ్లు నిండకుండానే ఆడపిల్లలకు పెళ్ళి చేస్తారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోరు. పోషకాహారం తీసుకోమంటే కూడా పట్టించుకోరు. ఆడపిల్ల పుడితే అదేదో తప్పుగా భావిస్తారు. వారిని చూస్తే జాలేస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్లతో మమేకమై ఉంటున్నాను కాబట్టి వాళ్లు నన్ను అమ్మా అని పిలుస్తుంటారు’ అని గర్వంగా చెబుతారు విజయలక్ష్మి.

‘కొండాపూర్‌లో పని చేస్తున్నపుడు ఓ ప్రసవంలో పాప పుట్టింది. కానీ ఆ పాప ఏడవలేదు. కదలికలు కూడా లేవు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడ ఉన్నవాళ్ళెవరూ పట్టించుకోవటంలేదు. పాప ప్రాణాలు పోతున్నాయనే విషయం జీర్ణించుకోలేకపోయాను. శిక్షణలో ఉన్నప్పుడు పిల్లలను, నవజాత శిశువులను ఎలా చూసుకోవాలి ? అనే విషయాలు తెలుసుకున్నాను. అవి గుర్తొచ్చి వెంటనే పాపకు నోటిద్వారా శ్వాస అందించడం ప్రారంభించాను. హాస్పిటల్‌కు చేరుకునే దాకా శ్వాస అందిస్తూనే ఉన్నాను. హాస్పిటల్‌ చేరగానే పాప ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. అది నా తొలి ప్రయత్నం. చావు, బతుకుల మధ్య పాప ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లలో చూసిన దిగులే నన్ను శ్వాస అందించేలా ప్రేరేపించింది’ అని తనకెదురైన అనుభవాలను తెలిపారు.

ఇలాంటి ఎన్నో సందర్భాల్లో తన చాకచక్యంతో పరిస్థితులను సరిదిద్దారు విజయలక్ష్మి. ఎంతోమంది గర్భిణీ మహిళలను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. అంతేకాకుండా నవజాత శిశువుల సంరక్షణలో ఎంతోమందికి సూచనలిచ్చారు. ఒక్కోసారి గ్రామీణ గర్భిణీ మహిళలు నెలవారీ పరీక్షలు చేయించుకోవటానికి నిరాకరించేవారు. ఇంటికెళితే మోహం మీదే తలుపేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి వారిని తీసుకొచ్చి అవగాన కల్పించి, పరీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయని చెబుతారు విజయలక్ష్మి.

ఆమె చేసిన ఈ సేవ గురించి తెలుసుకోవటానికి ఢిల్లీ నుంచి ఎంక్వయిరీకి వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెస్ట్‌ సర్వెంట్‌గా విజయలక్ష్మికి అవార్డు కూడా ఇచ్చారు. ఇలా మొత్తం ఏడు జిల్లాస్థాయి అవార్డులు, పిహెచ్‌సి స్థాయిలో మూడు అవార్డులు అందుకున్నారు ఆమె. యూనిసెఫ్‌ నుంచి కూడా బందం వచ్చి ఈ విషయం గురించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.

‘రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. ఒకానొక దశలో ప్రాణాంతక వ్యాధులను చూసి భయపడి కుటుంబ సభ్యులు కూడా దగ్గరకురాని పరిస్థితిలో అన్నీ తామై రోగులను అమ్మలా లాలిస్తూ, సపర్యలు చేస్తారు. రోగులు కోలుకునే వరకూ వాళ్ళతో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు. అదే ఈ వృత్తి గొప్పదనం’ అంటారామె. ఒకవైపు ఏఎన్‌ఎంగా చేస్తూనే అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఎస్సీ పూర్తి చేశారు విజయలక్ష్మి.

మొదట్నుంచీ డిపిఎస్‌ఎన్‌ఓ ఒలీవియా బెంజిమన్‌ మేడమ్‌ ఆమెను ప్రోత్సహించారు. ఆమెతో కలిసి పనిచేస్తున్నప్పుడే దేశవ్యాప్తంగా పేరెంటల్‌ ఎడ్యుకేషన్‌ అనే కార్యక్రమం ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ఆ కార్యక్రమానికి విజయలక్ష్మి పనిచేస్తున్న కేంద్రం నుంచే శ్రీకారం చుట్టారు. తను పని చేస్తున్న కేంద్రం నుంచే ఆ కార్యక్రమం మొదలు కావటం తనకెంతో గర్వంగా ఉందంటారామె.

‘నేను ఎన్నడూ అవార్డుల కోసం పని చేయలేదు. పని చేస్తేనే అవార్డులొచ్చాయి. ఆ సంతప్తి నాకు చాలు. నర్సు కోర్సు చదువుతున్నప్పుడే నైటింగేల్‌ సేవలు తెలుసుకొని స్ఫూర్తి పొందాను. అలాంటి అసమాన సేవకురాలి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుకు నేను ఎంపిక కావడం, అది రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది’ అంటారు ఆమె.

– ప్రణీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *