63 బహుమతి కథానికలు

63 బహుమతి కథానికలు

సత్యాన్ని అన్యాపదేశంగా చెప్పి కర్తవ్య బోధ చేయడం కవులు, కథకులు చాలా కాలంగా చేస్తున్న పనే. దేశంలో నేడు అనేక అఘాయిత్యాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయన్నది కఠోర సత్యం. కలం పోటుతో వాటిని అరికట్టడం ముమ్మాటికి సాధ్యం కాదు. అయితే కథలలో ఇలాంటి అమానుషాలను జొప్పించి, లేదా కథా వస్తువుగా తీసుకొని కథలల్లితే ప్రజల్ని పారాహుషారని హెచ్చరించవచ్చు. ఆ మేరకు ఈ పుస్తక రచయిత నరసింహ ప్రసాద్‌ విజయం సాధించారనే చెప్పాలి. ఇలాంటి సామాజిక స్పృహ గల కథలు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

ఈ కథల్ని రచయిత కాలక్షేపం కోసం రాయ లేదు. పుస్తకంలో ప్రతి కథ ఒక నీతిని, సందేశాన్ని ఇస్తుంది. అలాంటి గడ్డు పరిస్థితులలో మన భూమిక ఏమై ఉండాలి!? అని పాఠకుడు కచ్ఛితంగా ఆత్మమథనం చేసుకుంటాడు.

ఈ కథల్ని సమీక్షించడం అంటే సూర్యుడికి చిరుదివ్వె చూపించడమే! సుప్రసిద్ధ రచయిత సింహప్రసాద్‌ ఆవిష్కరించిన భావ తూలికలు ఈ ’63 బహుమతి కథానికలు’. వివిధ సందర్భాల్లో కొన్ని పత్రికలు, సంస్థల నుంచి బహుమతులు పొందిన 63 కథానికలను రచయిత ఇందులో అందించారు.

‘గోమాత’ కథలో గోవును ధనముందన్న గర్వంతో మేడ మెట్లు ఎక్కించి తీరాలని గృహ ప్రవేశం చేస్తున్న దంపతులు మొండికేసి, ఊహించని పరిణామాలకు గురి అవుతారు. ఈ కథలో అద్భుత మైన నీతి ఉంది. సత్కర్మలు చేస్తే తప్పకుండా పుణ్యం వస్తుంది. కాకపోతే అది వెంటనే రావచ్చు, కొంత కాలం తరువాతైనా రావచ్చు.. లేదా మరు జన్మలో రావచ్చు. అదే దుష్కర్మలు చేస్తే ఫలితాలు వెంట వెంటనే ఉంటాయి. లంచాలతో డూప్లెక్స్‌ ఇల్లు కట్టుకున్న ఆ దంపతులు దాని ఫలితం వెంటనే అనుభవించారు.

‘గోచర’ తెలుగు కథాసాహితికి ఒక అపురూప కానుక. ఇంతకు పూర్వం ఏ రయిత రాయని, రాయలేక వదిలేసిన ఇతివృత్తం. దమ్ములున్న సింహప్రసాద్‌ రచనా కిరీటంలో ఒక కలికితురాయి! ఏమిటి విశేషం అంటే – ముస్లిం డ్రైవర్‌ ప్రమాదం చేశాడు. ఆవుదూడ చనిపోయింది, చక్రం కిందపడి. అతన్ని ఆ ఘోరం మానసికంగా వేధిస్తూ ఉంటుంది. చివరికి ప్రాశ్చిత్తం చేసుకున్నాడు – హిందూ సలహా ప్రకారం. గోవుని కొని ఇంటికి తీసుకువెళ్ళి సాకటం మొదలెట్టాడు. భార్యకి పాలుబడినై. ఆవు ఈనింది. దూడ అర్చం ఆ చనిపోయిన దూడలా ఉంది. పొంగిపోయాడు. ‘నిన్నూ నీ సంతతినీ సంరక్షిస్తాను, అల్లాకే కసమ్‌!’ అని బాస చేసున్నాడు! మనిషితనం, మానవీయతలకు మతం రంగులు అక్కర్లేదనే సందేశాత్మక కథ.

మరో కథ ‘గబ్బిలం’. ఇది 2012లో ఉత్తరా ఖండ్‌ ముఖ్యంగా కేదార్‌నాథ్‌ వరద బీభత్సం ఆధారంగా రాసినది. ఈ కథ ద్వారా మానవత్వాన్ని మించినది మరొకటి లేదని అర్థం చేసుకోవచ్చు.

ఓ ప్రముఖ మాసపత్రికలో తృతీయ పురస్కారం అందుకున్న కథ ‘చెమ్మ’. తాము ప్రారంభ విద్య నభ్యసించిన ఉన్నత పాఠశాల నూరో సంవత్సరంలో అడుగు పెడుతుతోందని తెలిసి కొందరు పూర్వ విద్యార్థులు దేశవిదేశాల నుంచి వస్తారు. తీరా వచ్చి చూసే సరికి ఆ పాఠశాల శిథిలావస్థలో ఉంటుంది. దాంతో వారి కళ్లు చెమ్మగిల్లాయి. పాఠశాలను పునఃనిర్మించాలని కంకణం కట్టుకొని విజయం సాధిస్తారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పుట్టిన ఊరిని, విద్యనభ్యసించిన పాఠశాలను మరిచిపోరాదని ఇది తెలియజేస్తుంది.

కొరివితో తల గోక్కోవడం అంటే ఏమిటో ‘ఆత్మ పదార్థం’ అనే కథ చదివితే తెలుస్తుంది. దర్పానికి పోయి లేనిది ఉన్నట్లు చెప్తే చివరకు మిగిలేది పరాభవమే.

ఈ పుస్తకంలో కథలన్నీ బాగున్నాయి. ఇలాంటి సామాజిక స్పృహ గల కథానికలు అందించిన రచయిత సింహప్రసాద్‌ అభినందనీయులు. కథలంటే ఇష్టపడే వాళ్లు ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే.న

సింహప్రసాద్‌ (63 బహుమతి కథానికలు)

రచన : సింహప్రసాద్‌

పుటలు : 36, వెల : రూ.300/-

ప్రతులకు :

శ్రీశ్రీ ప్రచురణలు, 401, మయూరి ఎస్టేట్స్‌

కె.పి.హెచ్‌.బి. కాలనీ, హైదరాబాద్‌ – 500 085

ఫోన్‌ : 9849061668

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *