ఆలు మగల (అను)బంధం

ఆలు మగల (అను)బంధం

జీవితంలో ఈ అంచు నుంచి ఆ అంచు వరకు పరుచుకునే ఉండే దట్టమైన నీడ ప్రేమ. ఇందులో జీవన సహచరితో ఉండే ప్రేమకు ఎవరి జీవితంలో అయినా అసాధారణమైన స్థానం ఉంటుంది. భార్యాభర్తల నడుమ ప్రేమకు అనేక కోణాలు. జీవితం సుడిగుండంలో చిక్కుకు పోకుండా చేసినా, అందు లోకి నెట్టివేసినా భార్యాభర్తల మధ్య ప్రేమ ఫలితమే. కానీ భారతదేశంలో సంసార జీవితానికీ, భార్యాభర్తల అనుబంధానికీ ఉన్న పరిధులు వేరు. అయినప్పటికీ భార్యాభర్తల అనుబంధానికి పెద్ద స్థానమే ఉంది. ఆ స్థానాన్ని మార్చగలిగే బలం ఇంకా ఏ వ్యవస్థకీ కలగలేదు. వరిగొండ కాంతారావు ‘సాహచర్యం’ ఈ సున్నితాంశాలను చర్చించే ప్రయత్నం చేసింది. ఇది ఆషామాషీ నవల కాదు. డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమానం గెలుచుకుంది.

కాపురాలు సజావుగా ఉండడానికి, నిలబడ డానికి మొదటిగా కావలసినది – పరస్పర నమ్మకం. వేర్వేరు కుటుంబాల నుంచి, నేపథ్యాల నుంచి వచ్చే ఆ ఆడ, మగ పరస్పర అర్థం చేసుకోవడం నిలిపివేసిన మరుక్షణం కాపురంలో విస్ఫోటనాలు తప్పవు. ఇలా వైవాహిక సంబంధాలలో తలెత్తే కొన్ని క్లిష్ట సమస్యలని ఈ నవల కొత్త కోణం నుంచి చిత్రించింది. నిజమే, ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాలన్న ప్రాథమిక అవగాహన చాలామందిలో ఉండడం లేదు. ఈ లోపమే చిన్న చిన్న కారణాలతో ఒకరిని ఒకరు అనుమానించుకోవడానికి దోహదం చేస్తోంది. అక్కడ నుంచి మొదలవుతుంది నరకం. జీవిత భాగస్వామిని హింసిస్తున్నానని భ్రమలో చాలామంది ఆడ, మగ కూడా తమను తాము హింసించుకుంటూ ఉంటారు. వరిగొండ కాంతారావు ఈ అంశాన్నే ఇతివృత్తంగా స్వీకరించారు. స్త్రీలు అపవాదులను తొందరగా నమ్ముతారన్న అభిప్రాయం ఒకటి కనిపిస్తుంది. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. అందుకు కారణాలు లేకపోలేదు. మొదటిది అభద్రతా భావం. స్త్రీకి స్వేచ్ఛ పెరుగుతున్న కొద్దీ కుటుంబంలో ఆమె స్థానం బలపడుతుంది. ఆ మేరకు భర్తలు కొన్నిసార్లు బోనుల్లో నిటబడక తప్పదు. అభద్రతాభావమే నిలదీసే స్థాయికి చేరుకుందని అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిణామం చాలాసార్లు అవాంఛనీయమైన ములుపు తీసుకుంటుంది. సాహచర్యం నవలలో జగదంబ పాత్ర చిత్రణలో రచయిత ఈ అంశాన్ని బాగా ప్రతిబింబింప చేశారు. వచ్చిన అపవాదు ఎలాగూ వచ్చింది. ఇంక అడ్డేమిటి అనే ముగింపునకు మిగిలిన రెండు పాత్రలు రావడమే ఈ నవలకు ముగింపు. అయితే మధ్యలో వారి మనస్తత్వాలను, అలాంటి నిర్ణయానికి వారిని నెట్టివేసిన పరిస్థితులను చదవడమే బాగుంటుంది.

ప్రధానంగా మూడు పాత్రలు ఇందులో కనిపిస్తాయి. అవే ధర్మారావు, ఆయన భార్య జగదంబ. మరొక పాత్ర గ్రేసీ. డాక్టర్‌ ధర్మారావు ఆసుపత్రిలోనే గ్రేసీ నర్సు. స్త్రీ, పురుషుల మధ్య సహజీవనానికి, సాహచర్యానికి మధ్య ఉండవలసిన సునిశితమైన, సున్నితమైన విభజన గురించి ఈ మూడు పాత్రల ద్వారా రచయిత ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. డాక్టర్‌ ధర్మారావు భార్య అనుమానంతోను, గ్రేసీ భర్త జాన్‌ స్వార్థ చింతనతోను మెలిగిన తీరు ఈ ఇతివృత్తాన్ని కొన్ని మలుపులు తిప్పుతాయి.

వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలను నవలగానో, కథగానో మలచివలసి వచ్చినప్పుడు కొంత సంయమనం అవసరం. లేకపోతే పాఠకుడి దృష్టి వేరే తీరానికి చేరుతుంది. సాహచర్యం నవలలో కాంతారావు తను అనుకున్న ఆదర్శాలను నిస్సంకోచంగా వెల్లడించుకుంటూనే, సమాజంలో అక్కడక్కడా కనిపించే ఇలాంటి పరిణామం గురించి కూడా చెప్పగలిగారు. భార్యాభర్తల మధ్య నమ్మకం పోయినప్పుడు, ఈ సందర్భంగా ప్రవేశించే అపోహలను , వాటి అనర్థాలను రచయిత చిత్రించారు. ఇది సర్వత్రా కనిపించే సమస్య కాకపోవచ్చు. అలాగే ఇదే సమస్య వేరొక రూపంలో కూడా కనిపించవచ్చు. కానీ ఇది మన సమాజంలో ఉన్న అంతరంగిక సమస్య. ఇలాంటి అంశాన్ని చర్చించడం మంచిదే. కానీ అది నిర్మాణాత్మకంగా జరగాలి. కాంతారావు ఆ పని చేయగలిగారని అనిపిస్తుంది.

సాహచర్యం (నవల)

రచన : వరిగొండ కాంతారావు

పుటలు : 164

వెల : రూ.120/-

ప్రతులకు :

1) వరిగొండ సూర్యప్రభ

హనుమకొండ – 506 009

సెల్‌ : 94418 86824, 94400 19849

ఫోన్‌ : 0870-2507555

2) శ్రీలేఖ సాహితి, హాసన్‌పర్తి

3) నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌

4) విశాలాంద్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ

5) నవోదయ బుక్‌ హౌస్‌, హైదరాబాద్‌

మరియు

అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో

– నిత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *