రేఖాచిత్రాలకి ఈ మధ్య వార్తాపత్రికలలో కొత్త ప్రాధాన్యం కనిపిస్తోంది. కేరికేచర్స్, స్కెచెస్ పేరుతో లేదా ఇంకా మరేవో వేరే పేర్లతో పిలుస్తున్న ఈ చిత్రాలు నిజంగానే పత్రికలకు కొత్త శోభను ఇస్తున్నాయి. విశేషమైన వార్తాకథనాలను ప్రచురిస్తున్న సమయంలో పత్రికలలో మామూలు ఫొటో కాకుండా ఈ కేరికేచర్ లేదా ఇలస్ట్రేషన్‌ను వాడడం వైవిధ్యంగా కనిపిస్తున్నది. ఇందులో కేరికేచర్ కొత్త ప్రక్రియ అయినా, ఇలస్ట్రేషన్ పాత శైలిలోదే. ఏమైనా వీటి ద్వారా వార్తాకథనానికి చక్కని శోభ చేకూరుతున్నది. ఇక వ్యంగ్య చిత్రం లేదా కార్టూన్ సంగతి. ఈ మధ్య వీటికి కొంచెం ప్రాధాన్యం తగ్గినట్టు చెప్పక తప్పదు. ఒకటి మాత్రం వాస్తవం. తెలుగునాట వీటికి ప్రాధాన్యం తగ్గినా ప్రపంచవ్యాప్తంగా మంచి విలువే కనిపిస్తున్నది. ప్రఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు శంకర్ పిళ్లై గురించి నండూరి రామమోహనరావు రాసిన ఒక సంపాదకీయంలో వ్యంగ్య చిత్రం ఎంత భావ గాంభీర్యంతో ఉంటుందో చెప్పారు. ఒక పెద్ద వార్త చెప్పలేని భావాన్ని, మూడు కాలాలలో చోటు చేసుకునే కార్టూన్ చెప్పగలుగుతుందని అన్నారాయన. ఇది ఎంతో నిజం.
ఇటు కార్టూనింగ్, అటు ఇలస్ట్రేషన్ లేదా స్కెచ్ కళ తెలిసిన వారు సత్తిరాజు శంకరనారాయణ. ఈయన ప్రసిద్ధ పెన్సిల్ చిత్రకారులు. హాసరేఖలు (సంగీత కళాకారుల రేఖాచిత్రాలు), నాదరేఖలు (శాస్త్రీయ సంగీత విద్వాంసుల రేఖాచిత్రాలు), గీతార్చన (ఆధ్యాత్మికవేత్తల రేఖాచిత్రాలు), కలం రేఖలు (కవులు, రచయితల రేఖాచిత్రాలు) సంకలనాలుగా వెలువరించారు. తాజాగా ‘మన కార్టూనిస్టుల రూపురేఖలు’ (Pencil Portraits of cartoonists) అనే వైవిధ్యభరితమైన సంకలనం వెలువరించారు. 148 మంది తెలుగు కార్టూనిస్టులు, ఓ పాతికపైగా ప్రసిద్ధులైన దేశ, విదేశీ కార్టూనిస్టుల పెన్సిల్ స్కెచ్‌లు- వారి చిత్రాలతో పాటు 7-10 లైన్లలో వారి క్లుప్త పరిచయం ఇందులో ఉన్నాయి. ఇది ఓ కార్టూనిస్టుల ఆల్బం. వారి ఆటోగ్రాఫ్ పుస్తకం!
తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి రామారావు (1896-1947) మొదలు బాపూ, బుజ్జాయి, సత్యమూర్తి, చంద్ర, బాలి, శంకు, జయదేవ్ రాగతిపండరి వంటి కార్టూనిస్టుల రేఖాచిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వాళ్ల కార్టూన్లు మనకి పరిచయమే. కానీ వారి ముఖరేఖలు పరిచయం లేవు కదా! వయసులో పెద్దవారిని ఓ పదిమంది ప్రముఖుల తర్వాత ఆంగ్ల అక్షరాది క్రమంలో వీరిని కూర్చి, కూర్చోబెట్టారు. ఏవిఎమ్ నుంచి జాకీర్ హుస్సేన్ వరకు. దీనితోపాటు బోనస్‌గా ఇందులో కొలువైన వారందరివీ ఒక్కోటి చొప్పున దాదాపు 150 కార్టూన్లు చివరలో ఇచ్చారు.
ఈ పుస్తకానికి వెంకట్ (అక్షజ్ఞ-USA) నిర్మాత అయితే, ప్రసిద్ధ కార్టూనిస్టు, రచయిత బ్నిం దర్శకుడు. బాపూ సోదరుడు శంకర్ హీరో!
ఇంతమంది కార్టూనిస్టుల ఫోటోలు సంపాదించటం, వాటిని చిత్రాలుగా అందించటం, వారిని గురించిన మాటలు అందించటం ఓ పెద్ద యజ్ఞమే. దీనిని చక్కగా నిర్వహించారు శంకర నారాయణ. వీరి ఉత్సాహం యువతకు స్ఫూర్తి ప్రదాయకం!
హాస్యానందం పేరుతో ‘కార్టూనిస్టులను – కార్టూన్ ఇష్టులకు’ కలుపుతోన్న రాము పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
లబ్ధ ప్రతిష్టితులైన అబూ అబ్రహాం (బ్లిట్జ్ ఫేం), కేశవ (ది హిందూ ఫేం), శంకర్ ది జయన్ (శంకర్స్ వీక్లీ), ఆర్కేలక్ష్మణ్ (కామన్‌మేన్ సృష్టికర్త) ఇలా ఎందరో కార్టూనిస్టులను మనకి దర్శనం చేయిస్తుంది ఈ అపురూప పుస్తకం!
ఈ సందర్భంగా అబూ అబ్రహాం కార్టూన్ ఒకటి గుర్తు చేసుకుందాం. 1975లో ఇందిర ఎమర్జెన్సీ విధించిన నాటి ఉదంతం మీద ఆయన విసిరిన పదునైన వ్యంగ్య బాణమది. ఇందిర అర్ధరాత్రి ఆదరాబాదరా ఎమర్జెన్సీ ప్రకటన చేయించారు. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ నీటి తొట్టిలో స్నానం చేస్తూ ఉంటారు. గోడ చాటు నుంచి చాచిన చేతికి తొట్టిలో ఉండగానే సంతకాలు చేసిన కాగితాలు ఇస్తూ అంటారు ‘ఇంకేమైనా సంతకాలు కావాలంటే కొంచెం సేపు ఆగు’ అని. ఇక ఆర్కే కామన్‌మ్యాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకే గర్వకారణంగా నిలిచిపోయాడు. శంకర్ పిళ్లైని భారత కార్టూనింగ్ పితామహుడిగా పేర్కొనడం సబబే. ఆనాటి వైస్రాయ్‌లు, నెహ్రూ, ఆయన తరువాతి తరం రాజకీయవేత్తలు తమను కార్టూనించమని ఆయన వెంట పడేవారంటే అది ఎంత గొప్ప యుగమో ఆలోచించాలి. ఇలాంటి విఖ్యాత కార్టూనిస్టులవే ఇందులో ఇంకా పరిచయాలు ఉన్నాయి. అవన్నీ ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇంకా లోతుగా ఆలోచిస్తే గొప్ప వ్యంగ్య వైభవాన్ని, మన తింగర పనులను చూసి మనమే నవ్వుకోగల సహృదయతని మరచిపోయామేమోనని అనిపిస్తోంది.
కార్టూనిస్టుల చరవాణి సంఖ్య, ఈమెయిల్ ఇవ్వటం వల్ల అభిమానులు ఆయా కార్టూనిస్టులతో స్నేహం చేసుకోవచ్చు.
పుస్తకాల గూటికి శోభనిచ్చేదిగా ఉన్న ‘మన కార్టూనిస్టుల రూపురేఖలు’ ఓ మంచి వినూత్న ప్రయోగం. కార్టూన్ల చరిత్రను ఒకింత ఆదిలో వివరించి వుంటే బావుండునని అనిపిస్తుంది! తెలుగులో ఇంతమంది కార్టూనిస్టులు ఉన్నారని గర్వించే ఈ పుస్తకం అందరి దగ్గరా ఉండాలి. ఎవరికైనా బహుమతిగా ఇవ్వదగ్గ పుస్తకాల జాబితాలో చేరాలి!
మన కార్టూనిస్టుల
రూపు రేఖలు
రచన : సత్తిరాజు శంకర్ నారాయణ
పుటలు : 420
వెల : రూ.350/-
ప్రతులకు :
1) నవోదయ బుక్ హౌస్
2) అక్షజ్ఞ పబ్లికేషన్స్
విద్య : +919000466461
బ్నిమ్ : +918341450673
అరుణ : +919390545657
– బి.ఎస్.శర్మ