విజ్ఞాన వీధులలో మన తొలి అడుగులు

విజ్ఞాన వీధులలో మన తొలి అడుగులు

ఇంత సుదీర్ఘమైన చరిత్ర, దానితో ఆవిర్భ వించిన జీవన విధానం, ఇవి అందించిన అనుభవంతో ఈ పురాతన దేశంలో విశేష జ్ఞానం పెంపొందిన మాట నిజం. కాబట్టి చింతన, కల్పన ఇక్కడ సహజ సిద్ధంగా వృద్ధి చెందాయి. ఖగోళ రహస్యాలను ఛేదించే యత్నం ఆరంభంలో ఇక్కడ జరిగింది. అంటే గణితం కూడా ప్రవర్థిల్లింది. వైద్యశాస్త్రం అద్భుతంగా పురోగమించింది. శుశ్రుతుడు వంటి ఘనులు మన చరిత్రలో కనిపిస్తారు. అలాగే పశువైద్యం కూడా. కాబట్టి రసాయనిక శాస్త్రం కూడా అంతో ఇంతో వైభవం పొందింది. ఖనిజ విజ్ఞానం కూడా కనిపిస్తుంది. వీటికి సంబంధించిన జాడలు మన చారిత్రక ఆధారాలలో స్పష్టంగానే ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్లడానికి కొన్ని భయాలు ఉన్నాయి.

ఇలాంటి భయాలను వీడి, మనదైన శాస్త్రం, కళ, చరిత్రలను వెలుగులోకి తేవడానికి అప్పుడప్పుడు కొంత ప్రయత్నం జరగకపోలేదు. డాక్టర్‌ గుడిపాటి వి. ఆర్‌. ఆర్‌. ప్రసాద్‌ రచన ‘పురాణాల్లో శాస్త్ర విజ్ఞానం’ అలాంటి ప్రయత్నమే.

ఇందులో 27 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ పురాతన కాలం నాటి మన శాస్త్ర విజ్ఞానం గురించి పరిచయం చేసేవే. కానీ ఇందులో ఆర్షవాజ్మయం ప్రస్తావన చూసి గంగవెర్రిలెత్తిపోవడం సరికాదు. లేకుంటే ఇదంతా మన పూర్వులే చెప్పేశారు చూశారా అని కూడా జబ్బలు చరుచుకుకోవడం కూడా శాస్త్రీయం కాదు. తన ముందుమాటలో డాక్టర్‌ కాకునూరి సూర్యనారాయణ మూర్తిగారు అన్నట్టు పాశ్చాత్యులు వివిధ శాస్త్రాలలో సాధించిన పురోగతిని మనం ప్రశంసించడంలో తప్పులేదు. కానీ వాటి మూలాలకీ, మన దేశం మీద జరిగిన దండయాత్ర లకీ ఉన్న సంబంధాన్ని కూడా దాచి పెట్టనక్కరలేదు. మన వైజ్ఞానిక సంపద విదేశీయుల దండయాత్రతో నశించిన సంగతి ఒక నిజం. కానీ ఇంతకాలమైనా ఆ విజ్ఞానాన్ని ప్రోది చేసుకోవాలని, వాటి మూలాలను అన్వేషించాలని మనం ఎందుకు గట్టిగా భావించడం లేదు?

మన పురాతన విజ్ఞానానికీ, ఆర్ష వాజ్మయానికి విడదీయలేని బంధం ఉంటుంది. అలా అని ఆర్ష వాజ్మయం విజ్ఞానాన్ని, ఆధ్యాతిక భావాలని కలగా పులగం చేయలేదు. భౌతిక, ఆధ్యాత్మిక వ్యవస్థలను వేర్వేరుగానే చూశారు. ‘తవ్విన కొలదీ గనులెన్నో’, ‘శక్తితత్వం’, ‘శక్తి కేంద్రాలు’, ‘అణువులే సృష్టికి హేతువులు’,’ఇదీ వైజ్ఞానిక పురోగతి’, ‘విశ్వపు అంచులు తెలియ తరమా’, ‘వృక్షోరక్షతి రక్షిత:’ ‘అగ్ని ప్రాశస్త్యము’, ‘సున్నాకే విశిష్ట విలువ’ వంటి వ్యాసాలలో రచయిత తెలియచేశారు. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసాలను రచయిత పుస్తకంగా వెలువరించడం అభినందించవలసిన విషయం.

కానీ ఏ దేశంలో అయినా శాస్త్ర జ్ఞానం ఒకే రాత్రి వెల్లువెత్తదు. ఆయా కాలాలలో, ప్రజల అవసరాలు అందుకే ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆ కాలం ఆలోచన, జ్ఞానం, రచనా పద్ధతి అనేది ఆ జ్ఞానం మీద తమ తమ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పురాతన భారతీయ విజ్ఞాన సర్వస్వం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి సంస్కృతం, వేదాల ప్రస్తావన మన ప్రాచీన విజ్ఞాన శాస్త్రంలో కనిపిస్తాయి. అంత మాత్రాన దానిని ఒక మతానికి చెందినదిగానో, పుక్కిట పురాణంగానో కొట్టి పారేస్తే నష్టపోయేది మన తరం, మన భవిష్యత్‌ తరాలే. ఈ విషయాన్ని రచయిత ముందుటి వ్యాసంలోనే చక్కగా విశ్లేషించారు. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలి. కాబట్టి అంతా చదవాలి.

పురాణాల్లో శాస్త్ర పరిజ్ఞానం

రచన : డాక్టర్‌ గుడిపాటి

వి.ఆర్‌.ఆర్‌. ప్రసాద్‌

పుటలు : 172,

వెల : రూ.150/-

ప్రతులకు : రచయిత పేరిట

సెల్‌ : 9490947590,

9849560014

అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *