రాజు రాజనీతిని అనుసరించాలి

రాజు రాజనీతిని అనుసరించాలి

అరిది విలుకాని యుజ్జ్వల

శరమొక్కని నొంచు; దప్పి చనినం జను; నే

ర్పరి యైనవాని నీతి

స్ఫురణము పగరాజు నతని భూమిం జెఱుచున్‌||    5-2-36

ధృతరాష్ట్రుడు విదురునితో ‘సంజయుని ద్వారా నేను చెప్పి పంపిన సందేశానికి ధర్మరాజు ఏమన్నాడో తెలియలేదు. దానితో నా మనసు కలవరపడుతున్నది. నీవు బుద్ధిమంతుడవు. ధర్మాధర్మాలు తెలిసిన వాడవు, రాజనీతి ఎరిగినవాడవు. నీవు విషయాన్ని విశదపరచి నా మనసు కుదుట పరచుము” అని అంటాడు. ఆ సందర్భంలో విదురుడు అనేకమైన నీతులు బోధిస్తూ, పాండవుల భాగం వారికిచ్చి వారిని దగ్గరకు తీసుకోవటం శ్రేయస్కరం అని చెబుతాడు. అది మహారాజుకు నచ్చకపోవటంలో వింత ఏవిూ లేదు. ఆ సందర్భంలో విదురుడు చెప్పిన మాటలివి.

‘రాజా, నేర్పరియైన విలుకాడు బాగా సానపెట్టిన బాణాన్ని గురి చూసి ఎవరి విూదనైనా వదలితే, అది వానిని పడగొడుతుంది. లేకపోతే, ఒక్కొకప్పుడు తప్పిపోవచ్చును కూడా. అంతేగాని ఆ బాణం ఒక జనసమూహాన్ని ఏవిూ చేయలేదు. విలుకాని నైపుణ్యం, పదునుపెట్టిన బాణం ఒక సమూహాన్ని లొంగ దీసుకోలేవు. కాని, చతురుడైన రాజనీతిజ్ఞుడు ప్రయోగించిన నీతి శత్రురాజును, వాని రాజ్యాన్ని, ధ్వంసం చేయగలదు. విలుకాడు ప్రయోగించిన బాణం కంటికి కనిపిస్తుంది. శత్రువును తాకి వానిని కూల్చివేయటం కూడా కనిపిస్తుంది. అయితే, రాజనీతిజ్ఞుడు ఉపయోగించిన నీతి, పన్నిన వ్యూహం ప్రక్కనున్నవారు కూడా గుర్తించలేరు. దేనిని కూల్చి వేయటానికి అది ప్రయోగించారో, ఏవిధంగా అది కార్యాన్ని సాధిస్తుందో, ఇతరులు తెలుసుకోలేరు. కంటికి కనపడకుండా అది కార్యాన్ని సాధిస్తుంది. కనిపించే బాణం లాగా ఒకే లక్ష్యాన్నిగాక, కనిపించని రాజనీతి అనేక లక్ష్యాలను ఒకే పర్యాయం సాధిస్తుంది. అందువల్ల శస్త్రాస్త్రముల కంటే రాజనీతి శ్రేష్ఠం. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రభువు కేవలం తన సైనికబలం విూద ఆధారపడక, ఉత్తమమైన రాజనీతిని అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అతని రాజ్యం, సంపద సుస్థిరంగా ఉంటాయి.

దుర్యోధనుడు తనకు సహాయకులుగా అనేకమంది రాజులను వారి సైన్యాలను, ఆయుధసామగ్రిని కూర్చుకొంటున్నాడు. పదకొండు అక్షౌహిణుల బలాన్ని కూడగట్టుకొన్నాడు. ఇదంతా అందరికి కనిపించే వస్తురూపమైన బలం. ధర్మరాజు దగ్గర కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉన్నది. అయితే, ఆయన వద్ద మరొకరకమైన బలమున్నది. అది చతురమైన రాజనీతి. ‘ధృతరాష్ట్రుడు, ఆయన కొడుకులు అధర్మపరులు. మోసగాండ్రు. పాండవుల రాజ్యభాగాన్ని వారికియ్యక అపహరించటానికి ఎత్తులు వేస్తుంటారు’ అని ప్రజలు వారిని నిందించేటట్లు, తమపట్ల సానుభూతి కలిగేటట్లు పాండవులు చేస్తున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, యదుకులమణి అయిన శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. అంతటి నీతిజ్ఞుడు కౌరవపక్షాన లేడు. దుర్యోధనుని సైనికబలాన్ని ధర్మరాజు ప్రయోగించే చతుర రాజనీతి జయిస్తుంది. కౌరవులను, వారి సంపదను, రాజ్యాన్ని, వారి సహాయకులను, సమూలంగా నాశనం చేసితీరుతుంది, అని అన్యాపదేశంగా విదురుడు చెప్పినట్లైనది.

– వ్యాఖ్యాత : అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *