నేను ఎంత చెప్పినా వినలేదు…

నేను ఎంత చెప్పినా వినలేదు…

ముదిగొండ వీరభద్రమూర్తి గొప్పకవి. ‘నా ఊళ కేదార గౌళ’ అన్నాడే శ్రీశ్రీ, అట్లా కంచు కంఠం మూర్తిది. కమ్రమూ, కమనీయమూ, గంభీరమూ అయినది ఆయన కంఠస్వరం. బహు భోళా వ్యక్తిత్వం. మనస్వి. కవితాలోలురను ఆప్యాయత, అనురాగం అనే రెండు కళ్లతో ఆయన ఆకట్టు కుంటారు. ఏ కొంచెం సంతోషం కలిగినా దాన్ని కొండంతగా భావించుకుంటారు. కాళిదాసుదంటారు కదా! ‘శ్యామలా దండకం’ (అవునో! కాదో!). దీనిని వీరభద్రమూర్తి గానం చేసినప్పుడు ఆస్వాదించటం ఒక గొప్ప అనుభూతి.

సుబంధుడనే ప్రాచీన మహాకవి వాసవదత్త కావ్యం అర్థం చేసుకోవటమే కష్టం. దీనిని వీరభద్ర మూర్తి అందంగా తెలుగు చేశారు. వీరు తెలుగు చేసిన ‘శివ పంచస్థలి’ కావ్యం అత్యద్భుతమైన శివభక్తి స్తోత్ర కావ్యం. అప్పుడు పుట్టి ఉంటే తనను ‘పెద్దన’ అనేవారని దేవులపల్లి కృష్ణశాస్త్రి గొప్పలు చెప్పు కున్నాడు. ఆయనంత విపుల పాండిత్య, విస్తృతేతివృత్త కావ్యం కృష్ణశాస్త్రి రాసి ఉండేవాడా! అప్పుడు పుట్టినా! అని కొందరికి అనుమానం కలిగే అవకాశం లేకపోలేదు. కాని ముదిగొండ వీరభద్రమూర్తిని అప్పుడు పుట్టి ఉంటే నిస్సందేహంగా ధూర్జటి అనేవారు. కౌమార వయస్కుడి వంటి తారుణ్య ఆశా జీవనోత్సాహి ముదిగొండ వారు. ఏదో ఆస్తి సంబంధ మైన కోర్టు వ్యాజ్యం, అత్యంత గడ్డు పరిస్థితులలో – శివ పంచస్థలి చెప్పి గట్టెక్కాననేవారు వీరభద్ర మూర్తి. ఎవరి విశ్వాసాలు, ఎవరి ప్రపత్తి మనస్థైర్యం వారివి. హేతువాదం, తర్కం అంటూ ఇటువంటి విషయాలలో వివదించి ప్రయోజనం లేదు. నేను కవిని కాను. కాబట్టి ముదిగొండ వారితో నాకు ఆత్మీయ పరిచయం లేదనుకోవాలి. అంతేకాక పద్యం కూడా శ్రావ్యంగా నేను చదవలేను కదా!

వీరభద్రమూర్తి ‘వందేమాతరం’ అనే పేరుతో 18 పర్వాల మహాకావ్యం రాశారు. స్వాతంత్య్రోద్యమ ఇతిహాస గాథను ఇట్లా భారతీయ భాషలలో మరొక రెవరైనా రాశారో! లేదో! ఆధునిక దేశ చరిత్రను కావ్యీకరించటం ఎంతో ప్రతిభా సాధ్యమైన పని! మూడువేల పద్యాలపైన 18 ఖండాలలో మహా భారతాన్ని తలపింపజేసే ప్రజ్ఞతో, ప్రతిభతో ఈ కావ్యం రాశారు ముదిగొండవారు.

తిలక్‌ ఖండం, వివేకానంద ఖండం, అరవింద ఖండం, త్రివిధ బహిష్కారం, కదంచంద మోహన దాస ఖండం, ఇంగ్లండు ఖండం అంటూ తన నవభారత పర్వాలకు పేరు పెట్టారు వీరభద్రమూర్తి.

దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించలేదు. విశేషమేమంటే ఈ మహాకవి వచన గీతాలు, అచ్ఛంద స్వచ్ఛంద వచన పద్య రచనలు చేశారు. ఈయన శ్రావ్యంగా చదివి సీడీ రూపమిచ్చిన ‘శ్యామలా దండకా’న్ని భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ భద్రపరచుకున్నారని విన్నాను.

ఎంత ప్రతిభావంతుడైతేనేమీ ఆయనకు ఆనరరీ డాక్టరేట్లు, కవి వృషభ (నన్నయ్య) బిరుదులు, సాహిత్య అకాడమీ పురస్కారాలు ఏవీ రాలేదు. హైదరాబాద్‌ యువభారతి సంస్థ వారు ‘ఇతిహాస లహరి’ పేరుతో ప్రసంగ వ్యాసాలు ఏర్పాటు చేసి గ్రంథస్థం చేయ సంకల్పించటంతో ఈ సంస్థ కార్యదర్శి ఉదార, ఉదాత్త, వ్యక్తిత్వ మూర్తిమంతుడు ఇరువెంటి కృష్ణ మూర్తి నన్ను వందేమాతరం కావ్య విశిష్టత గూర్చి ప్రసంగంచవలసిందని నేనెంత కాదంటున్నా వినిపించు కోకుండా అనురోధించాడు. పెద్ద వత్తిడే తెచ్చాడు. ఆ పని నేను నెరవేర్చక తప్పింది కాదు. ఈ సభకు వీరభద్రమూర్తి హాజరుకాలేదు. కాని ఎవరో చెప్పి ఉంటారు నేను బాగా మాట్లాడాను అని. ఆ తరువాత ఆయన ఒక పదిసార్లైనా నా దగ్గరికి వచ్చి తన ఖండ కావ్య సంపుటికి పరిచయ కావ్యాలు రాయాలని పట్టుబట్టారు. నేను ఎంత మొండికేసినా వినలేదు. ఈ కావ్య సంకలనం పద్యాలు, వచన గీతాలు, గద్య గీతాలు, సంకలనం చేసిన కూర్పు! ‘తెలుగు ఒక వెలుగు, జాతి ఒక జోతి’ అని ఆయన దీనికి పేరు పెట్టారు. ఈ కావ్య సంకలనానికి ప్రౌఢంగా పేరు పెట్టి నేను పరిచయం రాశాను. ఆయనకు వినిపిం చాను. అప్పుడాయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైనారు.

నేను ఎంత వారిస్తున్నా, వాదిస్తున్నా వినిపించుకో కుండా ఒక నూరు రూపాయల తళతళలాడే పచ్చనోటు నా జేబులో పెట్టి ‘టట్‌ నేను చెప్పినట్లు వినవా నీవు?’ అని బెదిరించాడు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *