ఆధునిక మహిళకు కరదీపిక ‘కాత్య’

ఆధునిక మహిళకు కరదీపిక ‘కాత్య’

మహిళ పట్ల భారతీయుల చింతన వేరు. కానీ, వర్తమాన భారతదేశంలో, మారిన ప్రపంచ పరిస్థితులతో ఆ చింతన కుదుపులకు గురి అవుతున్న మాటా కాదనలేనిదే. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశ్వ వ్యాప్తంగా వస్తున్న పరిణామాలను మనమూ స్వాగతించాం. మారిన పరిస్థితులను అంటరానివిగా భావించే తత్వం ఇక్కడ లేకపోవడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే, పాశ్చాత్య పోకడలతో ప్రవేశిస్తున్న ధోరణులకీ, ఇక్కడి మూలాలే పునాదిగా సాగుతున్న జీవన విధానానికీ ఘర్షణ అనివార్యమవుతున్నది. ఇందులో ప్రధానమైన ఘర్షణ ఆధునిక జీవితంలో మహిళ స్థానం, స్త్రీ స్వేచ్ఛ అనే అంశాల మీదనే అంటే సత్యదూరం కాబోదు. అలాగే పరాయి ఆలోచనల ప్రభావంతో స్త్రీ స్వేచ్ఛను పునర్‌ నిర్వచించాలనుకునే వారి వాదనలు మళ్లీ మహిళకే చేటు తెస్తున్న కఠోర సత్యాన్నీ నిరాకరించలేం. ఈ నేపథ్యంలో భారతీయత ఆధారంగా స్త్రీ స్థానాన్ని, స్వేచ్ఛను విశ్లేషించడానికి జరిగిన ప్రయత్నమే ‘కాత్య’ నవల. రచయిత-ఆచార్య రాణి సదాశివమూర్తి.

‘కాత్య’ వంటి నవలలు తెలుగులో అరుదు. వర్తమాన సమాజం మహిళ పట్ల ఏర్పరుచుకున్న చులకన భావం మీద ఒక సాధారణ యువతి చేసిన తిరుగుబాటే ఇందులో ఇతివృత్తం. ఆ తిరుగుబాటుకు భారతీయతను చోదకశక్తిగా ఆమె స్వీకరించింది. పేరు కాత్య. ఎంతో భావ గాంభీర్యం, విశాలమైన దృష్టి కలిగిన ఈ ఇతివృత్తాన్ని ఆధునిక నవలగా మలచడానికి రచయిత కొంచెం గహనమైన శైలిని ఎంచుకున్నారు. లైంగిక స్వేచ్ఛ ఇటీవలి స్త్రీవాదానికి ఉన్న ఒక పార్శ్వం. అలాగే కుటుంబం పట్ల వ్యతిరేకత కూడా. వీటి ద్వారా భారతీయ స్త్రీకి ‘విముక్తి’ని కల్పిస్తున్నామని వాదిస్తున్నవారు నిజంగా చేసినది- ఆమె పరిస్థితిని ఇంకొంచెం దిగజార్చడమే. ఇలాంటి అవాస్తవిక, విచ్ఛిన్నకర ధోరణులతో ఆధునిక అబలగా మారుతున్న మహిళను సబలగా నిలబెట్టేందుకు తనవంతుగా ఏం చేయగలదో భారతీయ ధర్మం నుంచి ఒక మార్గం ఎంచుకున్నది కాత్య. అవాంఛనీయ వాదాలు, సామాజిక వాతావరణం, మహిళను భోగవస్తువుగా చూపే విశృంఖలత్వం ‘ఆధునికత’ పుణ్యమేనని నిరభ్యంత రంగా చెప్పవచ్చు. ఆడ శిశువులను కాదనడం దగ్గర నుంచి, రైలు ప్రయాణాలలో, కార్యాలయాలలో, కళాశాలల్లో ఎక్కడ బడితే అక్కడ మహిళను చులకన చేయడం ఒక వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కాత్య ఏం చేసింది? కాత్య కాస్తా కాళిక అయింది. ఇలాంటి దుర్మార్గాలను భరిస్తూనే మౌనంగా ఉండిపోతున్న ఆధునిక అబలలను రక్షించేందుకు తనకు ప్రేరణ ఎలా వచ్చింది? కొన్ని అధిభౌతిక అనుభూతులకు కాత్య గురవుతుంది. చింతనాపరమైన, మానసికమైన ఈ మార్పంతా ఆమె దేవభూమి యాత్రకు వెళ్లినప్పుడు సంభవిస్తుంది. ఆమె పనిచేసే పాఠశాల నుంచి ఒక గోష్టి కోసం దేవాధ్రుమపురం (డెహ్రాడూన్‌) వెళ్లి, అక్కడ నుంచి కేదార్‌, బదరీ… ఆపై బ్రహ్మ కపాలం వరకు యాత్ర సాగిస్తారు. ఈ ఘట్టాలను రచయిత ఆవిష్కరించిన తీరు రమణీయంగా ఉంది. కాత్య ఆశయం ఆకృతి దాల్చడానికి అనువైన నేపథ్యం అదే కూడా.

ఈ యాత్రలోనే ఆమె కొన్ని అనుభూతులకు లోనైంది. కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ పుట్టిన ‘భద్ర’ అనే మహిళే ఇప్పుడు కాత్యగా మనుగడ సాగిస్తున్నదని ఆమెకు నమ్మకం ఏర్పడుతుంది. తిరిగి వచ్చి తన ఆస్తిని కొంత అమ్మి అపరాజిత పేరుతో సంస్థను ఏర్పాటు చేస్తుంది. అటు తనను తాను రక్షించుకునే శక్తిమంతురాలిగా స్త్రీని తీర్చిదిద్దడం, ఆధునిక ప్రపంచంతో బంధం తెంచుకోకుండానే విచక్షణతో ఉండేందుకు తర్ఫీదు ఇవ్వడం, అదే సమయంలో భద్రమైన కుటుంబ వ్యవస్థ నుంచి దూరం కాకుండా మెలగడం వంటి అంశాలను బోధించేందుకు ఆ సంస్థ ద్వారా కాత్య కృషి చేస్తుంది. ఇదంతా నిర్వర్తించిన తరువాత మళ్లీ హిమ సానువుల వైపు నడిచింది. అంటే స్త్రీ జీవితానికి సంబంధించి భద్ర ఒక కోణానికి, కాత్య ఒక కోణానికి ప్రతీకలుగా నవల సాగుతుంది. ఇద్దరూ వేర్వేరు మాత్రం కాదు. ఇది గతానికీ వర్తమానానికీ ఉన్న బంధం.

కాత్య పాత్ర చిత్రణలో రచయిత చూపిన మెలకువలు, ఆచితూచి రాసిన వాక్యాలు, వ్యక్తీకరణలు ఈ నవలను ఆపకుండా చదివించేటట్టు చేశాయి. ఆమె చిన్నతనం నుంచి ఒంటరే. ‘జీవితంలో కారం తెలుసు. ఉపకారాలను పొంది ఆమె ఉప్పు తిన్నవారూ ఉన్నారు. కాని ఆమెకు కన్నీటి ఉప్పదనాన్ని చవి చూపించిన వారే వారంతా.’ అన్నారు రచయిత. ‘ఆమె జీవితానికి ప్రేక్షకులే కాని జీవితంలో ప్రవేశించినవారు లేరు’ అన్న వ్యాఖ్య కూడా లోతైన భావననే ఇస్తుంది. మరో అద్భుత వాక్యం, ‘ఒకరి మౌనం నడత నేర్పే మౌనం. మరొకరి మౌనం జీవితాన్ని చదువుతూ ఎదిగే మౌనం’. ఇది చాలామంది స్త్రీల లక్షణం కూడా.

ఆధునిక అవగాహన, భారతీయతల మేళవింపుతో ఏర్పడిన ‘అపరాజిత’ ఆవిష్కర ణోత్సవంలో మైత్రేయి (కాత్య ఆధ్యాత్మిక గురువు, సన్యాసిని) చేత చెప్పించిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. మహిళల సాధికారత పట్ల, రక్షణ పట్ల, ధర్మం పేరుతో వారికి సంకెళ్లు వేయకుండా కాపాడడం పట్ల రచయితకున్న సదాశయ స్ఫూర్తి వాటి ద్వారా స్పష్టమవుతుంది. ‘మహిళ అంటే సౌందర్యారాధకుల సౌందర్య పిపాసను తీర్చే నిర్జీవ కళాఖండం కాదు. మహిళంటే భర్త సంపాదించి పడేస్తే వండి పెట్టే వంటగత్తె కాదు. బట్టలుతికి పెట్టే పనిమనిషి కాదు. అలాగే స్త్రీవాదమంటే గృహిణులుగా తమ బాధ్యతలను విస్మరించి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసుకుని విశ్వవేదికలపై విశృంఖల ప్రసంగాలను చేస్తూ తమ భర్తలను, పిల్లలను తృణీకరించటము కాదు.’ అంటారామె. ఇదే ఈ నవల ఇతివృత్తంలోని ఆత్మ. దీనిని మరింత రమణీయంగా, విస్పష్టంగా చెప్పిన వాక్యం, ‘మానవ ప్రపంచంలో సగభాగమంతా స్త్రీలు. మిగిలిన సగ భాగం స్త్రీగర్భ జనితులే’. గొప్ప ఆశయంతోనే కాదు, నిజాయితీతో, వాస్తవిక దృక్పథంతో రచనకు ఉపక్రమిస్తే తప్ప ఇలాంటి వాక్యాలు కలాల నుంచి రావు.

కాత్య (నవల)

రచన : ఆచార్య రాణి సదాశివమూర్తి

పుటలు : 118,

వెల : రూ.80/-

ప్రతులకు : శివతరుణీ పబ్లికేషన్స్‌,

‘సుమేరు’, 23-2-204, ఫ్లాట్‌ నెం. 17, టిటిడి ఫేజ్‌ 2 ఫ్లాట్స్‌, ఎం.ఆర్‌. పల్లి, తిరుపతి-517502.

– రామ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *