సాహిత్య జ్ఞాపకాలు
నేను మొట్టమొదటిసారిగా 1962లో ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఈస్టిండియా పరిపాలన కాలం నాటి భారతదేశ చరిత్రకు పరమ ప్రామాణికమైన ఆకర గ్రంథాలు సేకరించి తెలుగువారికి చెప్పిన వారూ అయిన దిగవల్లి వేంకట శివరావుని విజయవాడలో చూశాను.
కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన గ్రంథాలను గూర్చి, ఆయన సంఘ సంస్కరణ కృషి మూర్తిమత్వాన్ని గూర్చి పరిశోధన సమాచారం సేకరిస్తూ మిమ్మల్ని చూడటానికి వచ్చానని విన్న వించుకున్నాను. ఆయన నా సుకృతం ఫలించి ఆదరించారు. తరువాత ఎప్పుడైనా తీరికగా వస్తే ఇందుకు అవసరమైన సమాచారం రాసుకోవచ్చని చెప్పారు.
తెలుగునాట అప్పట్లో ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలం గూర్చి ఈయన దగ్గర ఉన్న చారిత్రక ఆధార సామాగ్రి మరెవరి దగ్గర లేదనే అనాలి. ఏనుగుల వీరస్వామయ్య ‘కాశీ యాత్రా చరిత్ర’ 1947 ప్రాంతానికే దిగవల్లి వేంకటశివరావు తెలుగు వారికిచ్చారు.
1872లో బందరు నుంచి ప్రారంభమైన ‘పురుషార్థ ప్రదాయిని’ అనే పత్రికా సంపుటం ఒక సంవత్సరం పూర్తి సంచికలు ఈయన వద్ద ఉండేవి. వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఈయన చిన్నతనంలో చదివారు కావున పంతులుని చూసి కూడా ఉండవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన జిల్లా చరిత్రలు, స్థానిక చరిత్రలు కూడా ఈయన వద్ద చాలానే ఉండేవి.
కొక్కొండ వేంకటరత్నం పంతులు నడిపిన ‘ఆంధ్రభాషా సంజీవని’ పత్రిక నుంచి రాసుకున్న వృత్తాంత సంగ్రహాలు శివరావు వద్ద ఉండేవి. వీటిని కొమర్రాజు వేంకట లక్ష్మణరావు సొంత పరిరక్షిత ఆధారాల నుంచి సేకరించుకున్నట్లు చెప్పేవారు. 19వ శతాబ్ది తెలుగు పత్రికలను గూర్చి నా థీసిస్లో ప్రతిపాదించిన అంశాల్లో శివరావు నోట్సులను వినియోగించుకున్నాను.
1980ల వరకు శివరావుకి వీరేశలింగం పట్ల వ్యతిరేకత, అగౌరవమూ, ఆయనను ఏదో సాధించా లనే యావ ఉండేవి కావు. 1923 ప్రాంతంలో బందరు నుంచి వచ్చిన శారద పత్రికలో దిగవల్లివారు వీరేశలింగం పంతులును నవీన తెలుగు వాఙ్మయ జనకుడని, నూతన ప్రక్రియలనెన్నిటినో తెలుగుకు చేకూర్చినవాడని ప్రస్తుతించారు కూడా. కాని 1980లో ఈయనకి బంగోరే, త్రిపురనేని వేంకటేశ్వర రావు వంటి పారిశ్రామిక కమ్యూనిస్టులతో దోస్తీ పెరిగింది. త్రిపురనేనికి వీరేశలింగం పట్ల నిరసన భావం ఎందుకో తెలియదు. వీరేశలింగం కన్నా ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు, సాహిత్య అభ్యుదయ వికాసోద్యమాలు నిర్వహించిన వారు నలుగురున్నారని, వీరిలో ఇద్దరి రూప చిత్రాలు లభించకపోయినా, వారి తలలు మాత్రం లేకుండా ఊహ చిత్రాలతో తన పుస్తకం ఒకటి అట్టహాసంగా ప్రకటించారు. దీనికి దిగవల్లి వారు వంత పాడారు. వీరేశలింగం ఆత్మస్తుతి పరాయణుడని, పరనిందా పరుడని త్రిపురనేని వారి ఢంకా బజాయింపు. దీనికి దిగవల్లి సమర్థన. ఇంతలో వీరి పరిశోధనకు బంగోరే ఆజ్యం పోశాడు. వీరేశలింగం మెట్రిక్యులేషన్ పాస్ కాకుండా పాసైనట్లు బొంకాడని, ఆయన కన్నా ముందే సంఘసంస్కరణలు, సాహిత్య వికాసం మూడు పూవులు, ఆరు కాయలుగా ఫలించిందని పిచ్చిరాతలు రాశాడు. త్రిపురనేనికి కుల దురద ఉండే దేమోనని ఆయన రాతలను బట్టి శంకించవచ్చు. నేను చాలా రోజులు పట్టించుకోలేదు. ఇంతలో వాయువుకు వహ్ని తోడైనట్లు రాజమండ్రి నుంచి బులుసు సీతారామశాస్త్రి ‘సమాలోచనం’ అనే పత్రిక ప్రారంభించి దిగవల్లి వేంకటశివరావు రచనలు- వీరేశలింగం పంతులును నిరసించేవి, నిరాకరించేవి ప్రచురించడం మొదలైంది. ఈ శిష్ట చతుష్టయం ఎప్పుడో అరవై ఏళ్ల కిందట చనిపోయిన వీరేశలింగం శీలభ్రష్టుడని, పతితుడని శివరావు తెగించటం నేను సహించలేకపోయాను. విశాలాంధ్రలో, ఆంధ్ర జ్యోతిలో నేను 18 వారాలు వీరేశలింగంపై ఆయన విరోధుల దురాలాపాలు ఖండిస్తు రాశాను. విజయ వాడ జయంతి ప్రచురణ యజమాని ఈ విమర్శను పుస్తకంగా తెచ్చాడు. దీంతో శివరావుకి ఉక్రోషం మరింత విజృంభించింది. అయినా నేను ఆయన పట్ల నాకుండే ప్రశంసాభావాన్ని, కృతజ్ఞతను వదులుకోలేదు. తరచూ కలుస్తూనే ఉండేవాణ్ణి. దిగవల్లి రామరాజుని, పొత్తూరి వేంకటేశ్వరరావుని, మా నాన్నని ఆయన దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాను. ఆయన చివరి లేఖ నాకే రాశారు.
– డా|| అక్కిరాజు రమాపతిరావు