అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా

– దేశ విభజన పచ్చి దగా

‘దేవుడు ఒకరిగా కలిపి రూపొందించిన వారిని మానవుడు విడదీయటం అతడికి శక్తికి మించిన పని. అది మానవ సాధ్యంకాదు’ – (హరిజన్‌ పత్రిక 6-4-1940).

‘దేశ విభజన అనేది పచ్చి దగా. అంతకన్న అసత్యం ఇంకొకటి ఉండదు. ఆ ఆలోచన వస్తేనే నా ఆత్మ పరిపూర్ణంగా అందుకు ఎదురు తిరుగు తుంది. తిరుగుబాటుకు సంసిద్ధమవుతుంది. దీన్ని ఒప్పుకోవడమంటే దైవాన్ని నిరాకరించడమే. దేవుడంటూలేడని అనడమే’ – (అదే పత్రిక 14-4-1940).

‘హిందూ-ముస్లిం సమస్య స్వరూపాన్ని పూర్తిగా వక్రీకరించడమే అవుతుంది, దేశ విభజన అనే ఆలోచన. అది అక్రమం, ఈ సమస్యను పూర్తిగా ఇది తప్పుదోవ పట్టించింది. ఇది ఒక ఘోరమైన అనృతంగా భావిస్తాను. ఈ వికృత అసత్యంలో ఎటువంటి సామరస్యం సాధ్యం కాదు. పొసగదు. న్యాయబద్ధంగా అంగీకారపూర్వకంగా అది ఏర్పడదు.’ -(అదే పత్రిక 4-5-1940).

‘భారతదేశాన్ని రెండుగా విభజించడమంటే, ఖండించడమంటే అంతకంటే మ¬త్పాత పాతక మైన అరాచకం ఇంకొకటి ఉండదు. అది దేశాన్ని నరికివేయడమే. దీన్ని ఎవరూ ఎంత మాత్రమూ సహించకూడదు. సహించలేరు. నేను హిందూవును కాబట్టి హిందూ మనస్సుతో ఇట్లా ఉద్వేగపూరితంగా చెప్పడం లేదు. ఈ సందర్భావకాశాన్ని, ఈ వేదికను నేను హిందువుల, ముస్లింల, పార్శీల, ఇంకా ఇతర సమస్త దేశీయుల ప్రతినిధిగా భావించుకుంటూ చెపుతున్నాను. అయితే ఒక మాట చెపుతానువాళ్లకు. భారతదేశాన్ని ఖండించటానికి పూనుకోవటానికి ముందు నన్ను ఖండించండి. ముక్కలు చేయండి. ఎన్నో శతాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపా లించిన మొగలాయిలు కూడా చేయని ఈ పనిని మీరు చేయకూడదు. తలపెట్టకూడదు’

– (అదే పత్రిక 22-9-1940)

‘పాకిస్తాన్‌ ఏర్పాటు అంటే అది ఎంత మాత్రమూ సత్కార్యం కాదు. ఒక ఆదర్శంగా వాంఛితం కాదు. నేను ఆ ఆలోచనను ఒక పెను అబద్ధమంటాను. భారతదేశ ముస్లింలలో ఒక దుష్ప్రచారం జరుగు తున్నది. ఈ ప్రచారాన్ని గూర్చి వాళ్లను హెచ్చరించక పోతే నేను నా కర్తవ్య నిర్వహణలో విఫలుణ్ణి అయినట్లే. ఈ విషయంలో ఎటువంటి రాజీలేదు. ఇందులో గౌరవపూర్వకమైన ఒడంబడికకు చోటు లేదు. ఈ విషయంలో క్వయిది-ఎ-అజమ్‌ (జిన్నా గారు) తన అనుచర పక్షంలోని వారి నిర్దిష్ట వ్యతిరేకతను పరిగణించినట్లు నేను అనుకోను. వాళ్లకాయన ప్రాతినిధ్యం వహించటం లేదు. ఆయన ఉద్దేశంలో పాకిస్తాన్‌ అంటే సారాంశంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక ప్రాంతాన్ని చీల్చి దాన్ని స్వతంత్ర రాజ్యంగా రూపొందించడమే. ఇందుకే ఆయన పట్టుబడుతున్నాడు. ఇంకా ఆయన నిశ్చితమైన విశ్వాసమైతే. అవిభక్త భారతదేశం అనేది నా విషయంలో కూడా తిరుగులేని విశ్వాసం అని నేనంటాను’- (అదే పత్రిక 26-7-1942)

‘నేను అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాణ్ణి కాబట్టి, బలప్రయోగం ద్వారానే నేను ఇప్పుడు కోరుతున్న దేశ విభజనను నిరోధించటానికి ఇష్టపడను. భారతీయ ముస్లింలు నిజంగా విభజనకు పట్టుబడుతూ ఉంటే, అందుకు నేనెంత మాత్రమూ అంగీకరించను. నాకు సమ్మతం కానే కాదు అది. ఇట్లా భారతదేశాన్ని ఖండించటాన్ని అహింసాయుత పద్ధతులలో నేను అడ్డుకోవటానికి తప్పక పూను కుంటాను. ఎందుకంటే శతాబ్దాల పర్యంతం హిందువులు, ముస్లింలు అసంఖ్యాకంగా ఏకజాతిగా సమరసంగా సఖ్యతతో జీవించటానికి చేసిన ప్రయత్నమూ, సాధించిన సత్ఫలితమూ ఇప్పుడీ దేశ ఖండన ఉపద్రవంతో పూర్తిగా భగ్నమై పోతుంది కాబట్టి. దేశ విభజన అనేది ఒక పెద్ద బొంకుగా పరిణమిస్తుంది.’- (అదే పత్రిక 13-4-1940)

‘జాతిలోని ఒక్కొక్క ఉప విభాగమూ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటే అప్పుడిక జాతి ఉనికి ఏమైపోతుంది. ఒక జాతిగా అది మనుగడ సాగించలేదు. అప్పుడిక ఆ జాతికి స్వాతంత్య్రం ఎట్లా ఉంటుంది? స్వాతంత్య్రం సంభవం కాదు. నేను పదే పదే చెప్పాను. పాకిస్తాన్‌ అనే భావం సత్య విరుద్ధం. దానికి అస్తిత్వం లేదు. పాకిస్తాన్‌నే ఏర్పాటుని చేయాలని అనుకుంటున్న వారు అందుకు సన్నాహ కార్యక్రమం ప్రారంభించగానే అది కార్యాచరణ ఫలితం ఇవ్వలేదని వాళ్లకు అవగతమవుతుంది. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను నమ్ము తున్నాను. నా ఆశయ సంకల్పం జాతి యావత్తులో ఐకమత్యం నెలకొల్పడం అందరి బాగు కోసం, అందరి దైవ సమాన ఉన్నతి కోసం కృషి చేసి లక్ష్యసిద్ధి సాధించడం’ (అదే పత్రిక 18-5-1940)

‘భారతదేశాన్ని చీల్చడం ఒక మహాపాపంగా నేను పరిగణిస్తున్నాను. నా పొరుగు వ్యక్తి ఒక పాప కృత్యానికి పూనుకొంటూ ఉంటే నేను నిరోధించలేను. రాజగోపాలాచారి ఈ పాపంలో పాలు పంచుకుంటూ ఉండవచ్చు. కాని నేను మాత్రం ఈ పాపంలో పాలుపంచుకొను.’ (అదే పత్రిక 31-5-1942)

మహాత్మాగాంధీ ఈ అభిప్రాయాలన్నీ భారతదేశ విభజన జరగక ముందు నాటివి. అయినా విభజన కాలానికి ఆయన ఉద్దేశాలు మారినట్లు ఏ విధమైన దాఖలాలు లేవు. ఆయన భారతదేశ ఖండనకు సమ్మతించిన వైనం తెలియరాదు. అంతేకాదు 1-4-1947న నాటి వైస్రాయ్‌ ఆయనను సంప్ర దించడానికి రాగా, ప్రతిష్ఠంభన తొలగించడానికి గాంధీజీ సలహా అర్థించగా, గాంధీజీ ఈ తన అభిప్రాయం వెల్లడించినట్లు అక్షర సాక్ష్యాధారం కనపడుతుంది.

గాంధీజీ ఏమన్నారంటే ‘ప్రస్తుతమున్న కేబినెట్‌ (మంత్రివర్గం)ను వైస్రాయ్‌ వెంటనే తొలగించి, జిన్నాగారిని ఆహ్వానించి పూర్తిగా అందరూ ముస్లింలే ఉండే పాలన పరమైన ఏర్పాటు చేయాలి’ (ఆల్‌ ముస్లిం అడ్మినిష్ట్రేషన్‌).

ఇంకా వైస్రాయ్‌కి గాంధీజీ ‘పూర్వపు వైస్రాయ్‌ల పాపాలను స్థిరచిత్తంతో తుడిచి పెడుతూ ఇప్పుడు సంభవిస్తాయేమోననే పరిణామాలను దృఢంగా ఎదుర్కోవాలి. బ్రిటీషువాళ్లు ఎంతో పకడ్బందీగా ‘విభజించు-పాలించు’ అనే నీతి సూత్రాన్ని అమలు చేశారు. ఇందువల్ల బ్రిటిష్‌ వారి పరిపాలన కన్న భారతీయులకు మరొక గత్యంతరం కల్ల అనీ, అధవా బ్రిటీషు పాలన ముగిస్తే భారతదేశం రక్తపుటేరుల పాలవుతుందని నిరూపించడమే వారి ఆశయంగా వాళ్లు వ్యూహరచన చేశారు. బ్రిటీషు పాలనలో తప్ప శాంతిభద్రతలు, పాలన రక్షణ ఉండవని భ్రమింప చేయడమే వాళ్ల పథకం. కాబట్టి అటువంటి రక్త పాతాన్నైనా ఇప్పుడు ఎదుర్కోవలసి వస్తే ఎదుర్కోవాలి. ధైర్యంగా అంగీకరించాలి’ అని ఉద్భోదించాడు.

ఆయన రక్త పాతాన్ని కోరలేదు. ఊహించలేదు. అందుకు పరిష్కారంగా, దాన్ని నివారించటానికి గానూ జిన్నా- ముస్లింలీగు ప్రభుత్వాధికారాన్ని సమ్మతించి ఆ ప్రతిపాదన తెచ్చారు. ఆయన ప్రతిపాదన దీర్ఘదర్శిత్వంలో ఎంతో ఉదారంగా ఉంది.

అయితే అప్పటి కాంగ్రెసు నాయకత్వానికి ఈ హితోపదేశం తలకెక్కలేదు. వాళ్లు ఇందుకు అంగీకరించటానికి ఇష్టపడలేదు. బ్రిటీషు వారి కోరిక సిద్ధింపచేయడానికే ఉబలాట పడ్డారు. ముస్లింలీగు నాయకుల సుహృద్భావాన్నే ఆ నాటి కాంగ్రెసు నాయకులు ఆకాంక్షించారు. గాంధీజీని తోసి రాజన్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు, కార్యనిర్వాహక వర్గం (వర్కింగ్‌ కమిటి), కేంద్రీయ శాసన సభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), చివరకు రాజ్యాంగ రచనా సభ (కానిస్టిట్యుయెంట్‌ అసెంబ్లీ) దేశవిభజనను సమసమ్మతించాయి. అప్పటికే అవి సమావేశమై ఉన్నాయి. కాబట్టి గాంధీజీ భావించినట్లు పాపకృత్యం, దైవ వ్యతిక్రమణం, కూహకం, గొప్ప వంచన, ఘోరాతి ఘోరం, నేరం, నేరాతి నేరం, క్రూరాతి క్రూరం – అనే విషాదాలాపాలు ఆనాటి పెద్దమనుషుల కెవరికీ పట్టలేదు.

1947 జూన్‌ 4వ తేదిన మౌంట్‌బాటన్‌ తన ప్రణాళిక ప్రకటించాడు. అప్పుడు ప్రార్థనంతర సమావేశంలో మహాత్మాగాంధీ ఇట్లా అన్నట్లు పత్రికలు నొక్కివక్కాణించాయి ‘భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు విడిపోయిన ఈ రెండు భాగాలు మళ్లీ ఒకటి కావడం సత్యం, తథ్యం. అది నా ప్రగాఢ విశ్వాసం’ అన్నారుట. అంతేకాదు మరి 1947 జూన్‌ 15న సమావేశమైన ఏఐసీసీ తమ హైకమాండ్‌ ఆమోదాన్ని అనుమోదిస్తూనే ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఆమోదించినట్లు కాంగ్రెసువారి లిఖిత చారిత్రకాధారాలు చెపుతున్నాయి.

ఆ తీర్మానం –

‘ప్రస్తుత కాలపు ఈ ఉద్రేకాలు చల్లారిపోయి, భారతదేశ భవితత్యం, సంక్లిష్ట పరిస్థితులు యధార్థంగా, నిరుద్వేగంగా పర్యాలోచన చేసే ఒక తరుణం వచ్చినప్పుడు ‘ద్విజాతి సిద్ధాంతం’ అనే దుర్మార్గ భావన రూపు మాసి, ఎవరూ ఆ ఊసెత్తకుండా ఉండేకాలం వస్తుంది’

ఇది ఏఐసీసీ తీర్మానమంటే ఈ కాలం వారికి చాలా ఆశ్చర్యమనిపించదా? కాబట్టి భారతదేశం సుదృఢమైన, సుభిక్షమైన, బల సంపన్నమైన జాతీయ సమైక్యంగా త్వరలో వర్ధిల్లాలని ఆకాంక్షించడంలో అత్యాశ ఏమైనా ఉందా?

(‘గోష్ఠి’ పత్రికలో ప్రచురితమైన వ్యాసం ఆధారంగా)

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *