ఎన్ని ప్రచురణలు వచ్చాయి!?

ఎన్ని ప్రచురణలు వచ్చాయి!?

‘ధూమ కేతువు కేతువనియో, మోము చంద్రుండలిగి చూడడు’ అని గురజాడ అప్పారావు ఇల్లాలు పొలయలుక తీర్చే చరణాలు రాశాడు. పొలయలుక అంటే ఏమిటో పాత ప్రబంధాలు అక్కర లేదు, కన్యాశుల్కం చూసినా తెలుస్తుంది.

గురజాడ అప్పారావు మేధావి, హేతువాది, తార్కికుడూనూ కదా! రాహుకేతువులూ, సూర్యచంద్ర గ్రహణాలూ కవిత్వం చేసుకున్నాడేమిటి? అనుకో వచ్చు ఎవరైనా? కాని ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నాడు కదా ఆయన మానసపుత్రుడు శ్రీశ్రీ.

బ్రహ్మ మానసపుత్రులు లాగా అభ్యుదయ సామాజిక విప్లవ కవితా సృష్టికి కూడా కొందరు మానసపుత్రులు అవసరమేమో! ఈ అసందర్భ యథాలాపం ఎందుకుగాని 72 ఏళ్ల వయసున నాకు కేతు మహర్దశ ప్రారంభమైంది.

రాహుకేతువులు అశుభ గ్రహాలో, శుభ గ్రహాలో నాకు తెలియదు. జాతకాలపై నాకు నమ్మకం లేదు. నమ్మిన వాళ్లతో పేచీ లేదు. నమ్మని వాళ్లతో వివాదం లేదు. వేదాంగాలలో జ్యోతిష్యం కూడా ఒకటన్నారు ఛాందసులు. నేను ఛాందసుణ్ణి అవునో కాదో నాకు తెలియదు.

మరణించి ఎక్కడున్నాడో నాకు ఆత్మీయ మిత్రుడు పేర్వారం జగన్నాథానికి మాటలో హాసపేశలత్వం ఎక్కువ. అతడంటూ ఉండేవాడు ఇవాళ మన సాహిత్యమంతా రాహుకేతువుల చుట్టూ తిరుగు తున్నదని.

నీటి కొలది తామర సుమ్మీ! అన్నట్లు మీ మీ బుద్ధి వైభవాన్ని బట్టి ఈ ‘రాహుకేతువు’లను పోల్చుకోవచ్చు. ఇంతకూ నాకు 72 ఏళ్ల వయసున కేతు మహర్దశ పట్టిందన్నాను కదా! అది సాహిత్య అకాడమీ కన్వీనర్‌ (సమన్వయకర్తను) కావటం. నిజంగా అది కేతు దశే. జాతకాలు నమ్మేవాళ్లంటారు కదా! కేతు దశలో పుణ్యక్షేత్ర దర్శన లాభం ఉంటుందని. నాకైతే కొంతవరకే గ్రహవీక్షణం లభించింది. లాభించింది. కొలకత్తా, గువాహతి, భువనేశ్వర్‌ వంటివి పుణ్యక్షేత్రాలే గదా! సాహిత్య అకాడమీ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్నాను. చెన్నై, బెంగళూరు, గోవా, గుంటూరు, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలు (మార్కెట్‌ ప్రభావం) కూడా పదే పదే దర్శించాను. ఇదంతా ‘కేతు’ మహర్దశే కావచ్చు. ఐదేళ్లు సాహిత్య రాజయోగమే అని ‘కేతు’ మహర్దశకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఏం కేతు కష్టాలు కేతువి. కేతు ఇష్టాలు కూడా కేతువే.

నేను ఐదేళ్లు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సమన్వయకర్త (కన్వీనర్‌)గా పనిచేశా నన్నాను కదా! పని చేయనివ్వకపోయినా చేశాను. సగం పదవీ కాలం గడవకుండానే నా మీద మా సలహా సంఘం వారు అవిశ్వాస తీర్మానం తెచ్చారు. పదిమందిలో ఎనిమిది మంది నన్ను తీసి పారేయాల్సిందేనన్నారు. వారితో పురస్కారాలు కాని, పనులు ఎట్లా చేయాలో, ఎట్లా చేయించుకోవాలో అనుసంధానం కాని, వాళ్లతో ఎప్పుడూ సంప్ర దించటం లేదనీ, ఇటువంటి వ్యక్తితో మన పనులు కావని నాపై అభియోగం.

పాలన వ్యవహార అధికార గణానికీ, కార్యాలయ నిత్యోద్యోగులకూ తమ పనులూ, ఇతరులతో తాము చేయించుకోవాల్సిన పనులూ ఎట్లా చేయించు కోవాలో తెలుసు.

నాకు అవి తెలియవు కదా! నేను వారికి పనికిరాను. అందువల్ల నాపై అవిశ్వాస తీర్మానం. ఎందుకో, దేనికో నాకు వీసమైనా చెప్పారు కదూ. తమ అభియోగ పత్రం నాకు చూపారు కాదు.

సత్యనారాయణశాస్త్రి, పురిపండ అప్పలస్వామి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి లాంటి వారిపై మోనో గ్రాఫ్‌లు నేను ప్రతిపాదిస్తే అమెరికా కాంగ్రెసులో ‘ఫిలిబుస్టర్‌’ అంటారే సుదీర్ఘ ప్రసంగాలు ఎత్తు కుంటారు. 5 సంవత్సరాల నా పదవీకాలంలో విధి లేక నన్ను కాదనలేకపోయినారు కాని, ఆదరమో, గౌరవమో, అభిమానమో లేకుండా వ్యవహరించారు.

తెలుగు భాషా సాహిత్యాలకు ప్రోత్సాహం, వెయ్యేళ్ల తెలుగు సాహిత్యానికి మన్నన, మర్యాద ఎందుకింత కాలం ఉపేక్ష చేశారు అంటే, ఆ తప్పంతా మాది కాదు, మీ తెలుగు పెద్దలదే అంటారు. ఇట్లా నా కేతు దశ ముగిసింది.

ఉదాహరణకు ఉత్తరాది భాషా సాహిత్యాలను మినహాయిద్దాం. దక్షిణ భాషలైన తమిళ, మలయాళ, కన్నడ, తెలుగులలో ఈ 60 ఏళ్లలో ఎన్ని ప్రచురణలు ఏ భాషలో వచ్చాయో అడిగి చూడండి.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *