ఎండమూరితో అనుబంధం

ఎండమూరి సత్యనారాయణరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ తర్వాత హైదరాబాద్‌ కేంద్రంలోనూ కార్యక్రమ నిర్వహణాధికారిగా పని చేయటం నాకు తెలుసు. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం ఉండేది.

నేను రాసిన ‘జారుడు మెట్లు’ అనే నవలకు ఆనాటి తెలుగు సాహిత్య సృజనా ప్రపంచంలో చాలా పేరు రావటానికి ఎండమూరి నారాయణరావే కారణం. ఈయన ‘శ్రీవాత్సవ’ అనే కలం పేరుతో రచనలు చేసేవారు.

దక్షిణ దేశ తెలుగు సాహిత్య జగత్తును గూర్చి ‘శారదా ధ్వజం’ పేరుతో సత్యనారాయణరావు ఒక గ్రంథం రాశారు. ఈయన కాకినాడ ప్రాంతానికి చెందినవారనుకుంటా. మొట్టమొదటిసారి ఈయన్ను నేను విజయవాడ ఆకాశావాణి కేంద్రంలో చూశాను.

నా ఇరవై ఏళ్ల నుంచి ముఫ్పై ఏళ్ల మధ్య ఎండమూరిని పదిసార్లైనా కలుసుకుని ఉంటాను. నేను సి.నారాయణరెడ్డిని విజయవాడలో వీరింట్లోనే చూసినట్లు జ్ఞాపకం. అది 1956 కావచ్చు… అప్పటికి ‘జారుడు మెట్లు’ తెలుగు స్వతంత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితం కావటం.. వెంటనే ‘దేశీ కవితా మండలి’ అనే ఆనాటి ప్రముఖ తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ దానిని ప్రచురించటం వెంట వెంటనే జరిగాయి. ‘బాపు’ దానికి ముఖచిత్రం చేకూర్చారు. విజయవాడ రైల్వే బుక్‌స్టాల్‌లో ఈ పుస్తకం మురిపంగా నేను ఎన్నోసార్లు కొనుక్కున్నట్లు జ్ఞాపకం ఉంది.

ఆ తరువాత కాలంలో నారాయణరావు హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రానికి బదిలీ అయి వచ్చారు. అప్పుడు కూడా నేను మూడు, నాలుగు సార్లు కలుసుకున్నాను.

1960లలో అని జ్ఞాపకం. ఎండమూరివారు తెలుగు స్వతంత్ర వారపత్రికలో ‘సాహిత్య సింహావ లోకనం’ పేరుతో ఉగాది సందర్భంతో మొదలు పెట్టి వరుసగా ఐదారు వారాలు గడచిన సంవత్సరంలో వచ్చిన తెలుగు సాహిత్యాన్ని సమీక్షించారు. ఈ శీర్షికను అప్పట్లో తెలుగు సాహిత్యాభిమానులంతా ఆసక్తితో, ఉత్కంఠతో చదివేవారు. ఆ గడచిన సంవత్సరం తాను లోపాలుగా భావించే వాటిని విమర్శిస్తూ ఆకర్షకంగా సమీక్షించేవారు. ఆయన మెప్పుపొందని వారు ఉడుక్కునే వారు. పొందినవారు సంతృప్తి చెందటం సహజమే కదా! ఈ నియత శీర్షికా రచన తెలుగు స్వతంత్రలో ఐదారు సంవత్సరాలు వచ్చినట్లు జ్ఞాపకం.

ఈయన నా సృజనా రీతిని ఆకాశానికెత్తేసేవారు. చదివేవాళ్లకు కాస్త అతిశయోక్త్యలంకారం కూడా కనిపించేట్లుగా ఉండేవి ఆయన నా రచనలపై వెలువరచే అభిప్రాయాలు.

ముఖ్యంగా భాష, భావం, శైలి, భావుకత నా రచనలలో ఉంటున్నట్లు ఈ సాహిత్య సింహావ లోకనంలో రాస్తూ ఉండేవారు. ‘జారుడు మెట్లు’ (నవల లేదా నవలిక)కు వచ్చిన పేరు, రచనా లోకంలో గుర్తింపును బట్టీ అమ్మకాల పర్యవ సానంగానూ ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ ప్రచురణ మొదలు పెట్టినప్పుడు నన్ను పుస్తక ప్రపంచానికి (పుస్తక ప్రచురణ, సమాచార మాసపత్రిక) సంపా దకత్వ సహాయం కోరారు. ఆ పుస్తక పరంపరకు నా రచనలు కూడా కావాలని అడిగారు. నేను బడాయిగా పుస్తక ప్రపంచానికి సహ సంపాదకుణ్ణని నా పేరు వేసుకున్నాను ఒక ఏడాదిపాటు.

‘ఎమెస్కో వారి యాభై పుస్తకాలు’ అని ఒక విఫులమైన సమీక్ష కూడా పుస్తక ప్రపంచంలో ప్రకటించాను. ఇందులోనే రంగనాయకమ్మ ‘స్వీట్‌ హోమ్‌’ అనే నవలికను ఆమెకు అప్రియం కలిగేట్లు సమీక్షించినట్లున్నది. అదేదో భారత, భాగవత, రామాయణాల ప్రస్తావన.

మధురాంతకం రాజారం, వాకాటి, బలివాడ, రంథి సోమరాజు, అవసరాల, సి.ఆనందారామం వంటి ప్రముఖ రచయితల రచనలు స్వయంగా కోరి, లేఖలు రాసి, మోహమాటపెట్టి తెప్పించుకునేవాణ్ణి.

1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా నాకు చాలా సంతృప్తి కలిగిన సంపాదకీయం రాశాను. అప్పటికింకా నాకు ముఫ్పై ఏళ్లు కూడా లేవు. ఎమెస్కో ప్రచురణలలో నా నాలుగు పుస్తకాలు వచ్చాయి. అప్పటికది చెప్పుకోదగిన సంగతే.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *