అది చూసి చలించిపోయాను – అప్పుడే నిర్ణయించుకున్నాను

అది చూసి చలించిపోయాను – అప్పుడే నిర్ణయించుకున్నాను

‘టీచ్‌ ఫర్‌ ఇండియాస్‌ ఆపరేషన్స్‌’ సంస్థలో సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేసి, తర్వాత ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న చెన్నైకి చెందిన నిషా సుబ్రహ్మణ్యంతో ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రశ్న : ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏ ఉద్దేశ్యం ఏమిటి ?

జవాబు : ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తుంది. అంతేకాకుంగా వారికి మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తుంది.

ప్ర : మీరు చెన్నైకి చెందినవారు. అంతేకాదు, ముంబయి లాంటి మహానగరంలో ఉపాధ్యాయు రాలిగా కూడా పనిచేశారు. అలాంటి పట్టణాల్లో నివసించిన మీకు మారుమూల తీరప్రాంతమైన కన్నార్‌పేట్‌కు వెళ్లి సేవ చేయాలని ఎందుకు అనిపించింది?

జ : నేను ‘టీచ్‌ ఫర్‌ ఇండియాస్‌ ఆపరేషన్స్‌’లో పనిచేస్తున్నపుడు ముంబయికి దగ్గరలో గల గోవండిలోని ఓ పాఠశాలలో చదువు చెప్పేదాన్ని. నేనుండే చోటు నుంచి అక్కడికి నడిచే వెళ్లేదాన్ని. ఆ దారిలో రైల్వేట్రాక్‌ల పక్కన నివసిస్తున్న కొంతమంది పిల్లల దుర్భర పరిస్థితుల్ని చూసి చలించిపోయాను. వారికి ఉండటానికి ఇళ్లు లేవు. తినడానికి తిండిలేదు. ఈ ప్రాంతం ముంబయికి దగ్గరలోనే ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఆకాశ హర్మ్యాలు, సుందరమైన భవంతులు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఏదీ లేదు. వీరంతా నిత్యం బతకడానికి పోరాటం చేస్తున్నవారే. వీరిలో చాలా మందికి పాఠశాల అంటేనే తెలీదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. గ్రామాల్లో నివసిస్తున్న పేదలకు అండగా నిలవాలని. అందువల్లనే కన్నార్‌పేట్‌కి వచ్చాను. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.

ప్ర : గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభివృద్ధి విషయంలో మీరు ఏ ఏ అంశాలపై దృష్టి పెడతారు?

జ : ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏ గత 50 సంవత్సరాలుగా తమిళనాడులో గ్రామీణ క్షేత్రాలలో బాలబాలికలను విద్యావంతుల్ని చేసేందుకు కృషి చేస్తోంది. నేను, నా భర్త గౌతమ్‌ చాలా ఏళ్లుగా ఈ సంస్థలో పని చేస్తున్నాం. మా పెళ్లి అయిన కొన్నాళ్లకే నా ఆలోచనల్ని ఆయనతో పంచుకున్నాను. నా ఆలోచనల్ని గౌరవించి నాతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం మేం కన్నార్‌పేట్‌ తీరప్రాంతంలో గల ఐదు గ్రామాలలో పనిచేస్తున్నాం.

అక్కడ పేద పిల్లలకు చదువుతోపాటు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా మహిళలకు చేతి సంచులు, బెడ్‌ కవర్లు, కళంకారి బట్టలు తయారు చేయడం నేర్పిస్తున్నాం. ప్రస్తుతం వారు నెలకు దాదాపు 2500 రూపాయల నుండి 3000ల వరకు సంపాదించగల్గుతున్నారు. ఆర్థికంగా అట్టడుగు పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ కాస్త ఆదాయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తూ తమ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. కొంతమంది మహిళలు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని కుట్టుమిషన్లు కూడా కొనుగోలు చేసి, తమ ఉత్పత్తుల్ని పెంచుకొని లాభాలు ఆర్జిస్తున్నారు.

ప్ర : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్ని మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలిగారు?

జ : పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా కలుపుగోలుగా ఉంటారు. ఒకరికొకరు సాయపడతారు. కన్నార్‌పేట్‌లో మహిళలు నన్ను చాలా ప్రోత్సహించారు. మహిళలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వారి కళ్లలో నా పట్ల గౌరవం, అభినందన గమనించాను. నేను చెప్పే మాటలన్నీ వారు చాలా శ్రద్ధగా విని ఆచరించేవారు. నాతో తమ భావాల్ని పంచుకునే వారు. ఒక గ్రామంలో మేం క్యాంప్‌ నిర్వహించి నపుడు కొంతమంది మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అప్పుడు మా సంస్థ తరుఫున ప్రతి గ్రామంలో తిరుగుతూ మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాం. దాంతో చాలా మంది ముందుకొచ్చారు. కొంతమంది మహిళలు తమ బంగారు ఆభరణాల్ని సైతం అమ్మి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మరికొంతమంది బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మరుగుదొడ్లు కట్టుకున్నారు. ఈ విషయంలో ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏ పాత్ర చెప్పుకోదగినది.

ప్ర : మున్ముందు మీ పని తీరు ఎలా ఉంటుంది?

జ : నేను, నా కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం ఏఎస్‌ఎస్‌ఈఎఫ్‌ఏలో పనిచేస్తున్నాం. మేం నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వయో భేదం లేకుండా సమాన వేతనాలు కల్పిస్తున్నాం. దీనివల్ల స్త్రీ, పురుషులలో సమానత్వ భావన నెలకొంటుంది. తద్వారా మహిళలు, పురుషులతో పోటీ పడి మరి పనిచేస్తారు. రాబోయే కాలంలో మేం మరిన్ని గ్రామాల్లో తిరుగుతూ మా సంస్థ లక్ష్యాల్ని ప్రచారం చేయాలను కుంటున్నాం.

అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది నిరుపేద విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. కావున వారికి ప్రోటీన్లు గల ఆహారాన్ని అందించాలనుకుంటున్నాం.

ప్ర : ఆదర్శ విద్యా విధానం అంటే ఏమిటి?

జ : ఆదర్శ విద్యా విధానం అంటే పట్టణ ప్రాంతాల వారికి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఒకే రకమైన విద్య నందించడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా గ్రామాల్లోని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు సైతం ఉండటం లేదు. కొన్ని స్కూళ్లలో బాలికలకు టాయ్‌లెట్స్‌ కూడా లేవు. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలకు వయస్సు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు. మధ్యలోనే బడి మానేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి.

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

– అనిల్‌. కె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *