ప్రత్యుపకారం చేయకపోవటం అమానుషం

ప్రత్యుపకారం చేయకపోవటం అమానుషం

 ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి

యున్నవారము గావున నుగ్ర రిపుల

పాలువడకుండ విడిపింప బాడి యితని

నెయిదు మెయిదుము రథరయ మెసకమెసగ ||                      4-3-204

మహాబలశాలియైన కీచకుడు,  ఉపకీచకులు ఒక గంధర్వునిచే చంపబడ్డారని విన్న కౌరవులు, అది భీముని పనే అని భావించి, పాండవులు అజ్ఞాతవాసము విరాటుని నగరములో చేస్తుండవచ్చని ఊహించారు. విరాటుని ఆవులమందలను కౌరవ సైన్యము ఆక్రమించి మళ్ళించుకొని వస్తుంటే, పాండవులు వాటి రక్షణకోసం యుద్ధం చేయటానికి ముందుకు రాగలరనీ, అప్పుడు వారిని బయటపెట్టి, అజ్ఞాతవాస నియమం భంగపడినట్లు చూపవచ్చనీ, దుర్యోధనాదులు పన్నాగం పన్నుతారు. నగరానికి దక్షిణాన ఉన్న విరాటుని గోవులను అతని శత్రువు, దుర్యోధనుని మిత్రుడు అయిన త్రిగర్త దేశాధిపతి సుశర్మ బహుళ అష్టమి నాడు ఆక్రమించ వలెననీ, ఆ మరునాడు (బహుళ నవమి నాడు) నగరానికి ఉత్తరాన ఉన్న విరాటుని గోవులను భీష్ముడు మొదలైన కౌరవ వీరులు సైన్యసమేతముగా వెళ్ళి ఆక్రమించాలనీ నిర్ణయిస్తారు.

మొదటిరోజు గోగణాలను మళ్ళించటానికి యుద్ధంలో విరాటుడు, ఆయన సైన్యము పాల్గొన గలరనీ, రెండవరోజున నగరంలో యుద్ధవీరులు లేనందున, విరాటుని పక్షాన మారువేషాలలో ఉన్న పాండవులు కౌరవసైన్యంతో యుద్ధానికి తలపడ గలరనీ, అప్పుడు వారు పాండవులనే వాస్తవాన్ని బయటపెట్ట వచ్చుననీ దుర్యోధనుడు ఆశించాడు. అయితే, అప్పటికే అజ్ఞాతవాసానికి నిర్ణయించిన సంవత్సరకాలము పూర్తి అయిందని దుర్యోధనుడు గుర్తించలేదు.

అనుకున్న ప్రకారం త్రిగర్త దేశపు రాజు సుశర్మ నగరానికి దక్షిణాన ఉన్న విరాటుని గోవులను ఆక్రమిస్తాడు. మళ్ళించటానికి విరాటరాజు ససైన్యంగా వెళ్తాడు. ఆయన వెంట మారు వేషాలలో ఉన్న ధర్మరాజు, భీముడు, నకులుడు సహదేవుడు కూడ యుద్ధరంగా నికి వెళ్తారు. ఆ యుద్ధంలో సుశర్మ విరాటుని బంధించి, తన రథంవిూద తీసుకొని పోతున్నపుడు, విరాటుని సైన్యము నిరుత్సాహ పడుతుంది. అప్పుడు ధర్మరాజు భీమసేనునితో విరాటుని విడిపింప వలసిందని అంటూ,

‘భీమసేనా, మనము ఇతరులకు తెలియ నివ్వకుండా, ఒక్క సంవత్సరము ఈ విరాటరాజు ఆశ్రయములోనే గదా గడిపాము. ఈయన పెట్టని కోటలాగా మనలను కాపాడాడు. మనము నిశ్చింతగా అజ్ఞాతవాసము చేసి బయటపడ్డాము. ఆయన లేకుంటే, మనకు మరొకసారి వనవాసము, అజ్ఞాతవాసము తప్పేవి కాదుకదా. అంతటి విలువైన సహాయము చేసిన విరాటరాజు ఇప్పుడు శత్రువుచేతిలో బందీయై ఆపదలో ఉన్నాడు. ఆ భయంకర శత్రువు సుశర్మ బారినుండి విరాట రాజును మనము విడిపించటం న్యాయం. అత్యవసరం కూడా. సుశర్మ రథము దూరమై పోకముందే, నీ రథాన్ని వేగంగా నడిపించి విరాటుని విడిపించు’ అంటాడు. ధర్మరాజు ఆజ్ఞను శిరసా వహించి, భీముడు సుశర్మని ఓడించి విరాటరాజును బంధవిముక్తుని చేసాడు.

ఇందులో మనమందరము పాటింపవలసిన గొప్ప న్యాయం ఒకటున్నది. ఒకవ్యక్తి ఆపదలో ఉన్నపుడు, లేదా ఏదైనా బాధకు గురైనపుడు, అతనికి వెంటనే సహాయమదించి, ఆశ్రయమిచ్చి, ఆపద నుండి గట్టెక్కించిన వ్యక్తి చేసిన ఉపకారం ఎంతో విలువైనది. బహుశా ఎప్పుడైనా ఆ సహాయం చేసిన వ్యక్తికి ఇబ్బందులు కలిగితే, ఆయన వల్ల సహాయం పొందిన వ్యక్తి బాసటగా నిలిచి, ప్రత్యుపకారం చేసితీరాలి. అట్లా చేయటం మానవత్వం. చేయకపోవటం అమానుషం.

– వ్యాఖ్యాత : అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *