తండ్రి బాటలోనే…!

తండ్రి బాటలోనే…!

– ఉన్నతోద్యోగం వదిలి.. సేంద్రియ వ్యవసాయం వైపు..

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ఆరోగ్యం విలువ అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే తెలుస్తుందంటారు. అది నిజమే. అజ్మీర్‌లో నివసిస్తున్న పూల్‌చంద్‌కి తన కూతురు అంకిత కామెర్ల వ్యాధికి గురైనప్పుడే ఆరోగ్యం విలువ తెలిసింది.

పూల్‌చంద్‌ సాధారణ రైతు కుటుంబంలోనే జన్మించినప్పటికీ ఉన్నత చదువులు చదివి డీడబ్ల్యూడీలో ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. ఇద్దరు కూతుళ్లు. అంకిత, ప్రణవి.

అప్పుడు అంకిత వయస్సు మూడేళ్లు. కామెర్ల వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. జబ్బు నయం కావాలంటే ప్రతిరోజు కల్తీ లేని పాలు తాగించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కాని పూల్‌చంద్‌కు ఎంత ప్రయత్నించినా కల్తీ లేని పాలు దొరకలేదు. దాంతో తనే ఒక ఆవును పెంచాలనే నిర్ణయానికి వచ్చాడు. రూ.3500 పెట్టి ఒక దేశీ ఆవును కొన్నాడు. స్వచ్ఛమైన ఆవు పాలు తాగిన అంకితకు అతికొద్ది రోజుల్లోనే జబ్బు నయం అయ్యింది.

కల్తీ పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాయో పూల్‌చంద్‌ గ్రహించాడు. ఎలాగైనా సరే తన పిల్లలకు కల్తీ లేని ఆహారాన్ని అందించాలనుకున్నాడు. కాని అది సాధ్యమయ్యే పనేనా ? ఎందుంటే ప్రస్తుతం మనం తింటున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు.. అన్నీ కల్తీమయమే.

ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక మిత్రుడు సేంద్రియ వ్యవసాయం గురించి సలహా ఇవ్వడంతో దాని గురించి పూర్తిగా అధ్యయనం చేశాడు. తన కుటుంబానికి అవసరమైన ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవన్నీ సేంద్రియ ఎరువులు వాడి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా మొదటి అడుగు వేశాడు.

మరో పది ఆవులు కొన్నాడు. నెమ్మదిగా పాల ఉత్పత్తి కూడా పెరిగింది. కుటుంబానికి సరిపడా ఉంచుకొని మిగతా పాలు అమ్మేవాడు. కల్తీ లేని పాలు గనుక కొనేవారి సంఖ్య రోజురోజుకి పెరిగింది. ఆవుల సంఖ్య పెరిగే కొద్దీ వాటి నిర్వహణ కష్టంగా మారింది. దాంతో పూల్‌చంద్‌ ఉద్యోగం మానేశాడు. పిల్లలు కూడా పెరిగి పెద్దయ్యారు. పెద్ద కూతురు అంకిత కలకత్తాలో ఐఐఎం కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసి ఒక మల్టినేషనల్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

అయితే ఆమెకు ఆ ఉద్యోగం తృప్తిని ఇవ్వలేక పోయింది. ఉద్యోగ జీవితం చాలా యాంత్రికంగా అనిపించేది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి బాటలో నడిచింది. సేంద్రియ వ్యవసాయంలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టి ఎన్నో విజయాలు సాధించింది. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేయడమేంటని స్నేహితులు విమర్శించినా పట్టించుకోలేదు.

‘నేనూ అందిరిలాగే ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని అనుకున్నాను. ఆ దిశగా విజయం కూడా సాధించాను. అయితే డబ్బు సంపాదించడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు. మా నాన్నకు వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఉన్న మమకారమే నన్ను ఈ రంగంలోకి నడిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేస్తున్నాను’ అంటూ తనను విమర్శించేవారికి అంకిత సమాధానం చెబుతుంది.

ప్రస్తుతం అంకితకు రెండు డెయిరీ పాంలు న్నాయి. అందులో దాదాపు 100 ఆవులున్నాయి. ఒక సేంద్రీయ ఎరువుల తయారీ సంస్థ కూడా ఉంది. ఈ మధ్యనే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటి వృథాను అరికట్టి అధిక దిగుబడులు పొందుతోంది. ఐఐఎంలో తాను నేర్చుకున్న మేనేజ్‌మెంట్‌ పాఠాలను వ్యవసాయానికి అన్వయిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తోంది.

కార్పొటేట్‌ ఉద్యోగం కన్నా వ్యవసాయ వృత్తి గౌరవప్రదమైనదని అంకిత అభిప్రాయం.

‘సేంద్రియ వ్యవసాయంతో మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చు. రాబోయే తరాలకు కల్తీలేని ఆహారాన్ని అందించొచ్చు’ అని ఆమె చెబుతుంది.

-‘హర్ష’

– ‘ది బెటర్‌ ఇండియా సౌజన్యంతో..’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *