ఇంతవరకు గుర్తించలేదు..

ఇంతవరకు గుర్తించలేదు..

అరవై ఏళ్ల నా సాహిత్య వ్యాసంగంలో కార్యకారణ సంబద్ధం ఇతమిత్థంగా తెలియని ఒక జిజ్ఞాస అప్పుడప్పుడు నాకు ఎదురవుతుంటుంది? నాలో నేనే మథనపడకుండా ఒకవేళ ఎవరినైనా అడిగినా వాళ్లు సంతృప్తికరమైన సమాధానం చెపుతారన్న నమ్మకమో, లేదా హామీ ఏమీ ఉండదు.

ఈ ప్రశ్న ఏమిటంటే నేను వేళ్ల మీద ప్రస్తావించాల్సిన ప్రతిభావంతుడైన రచయితను ఏమీ కాకపోవచ్చు. కాని నిర్లక్ష్యానికి, నిరాదరణకు అంతో ఇంతో గురి అయినానేమోనని నా శంక. అప్పుడప్పుడు ఇది నాకు ఒక న్యూనతగా కూడా కన్పిస్తుంది. నా గూర్చి నాకు బాగా తెలియనైనా తెలియాలి, లేదా లోకాన్ని గూర్చి అయినా బాగా తెలియాలి ఈ ‘ముళ్ల’ నుడికట్టు అర్థం కావాలంటే. నా వృత్తి జీవితంలో నాకన్ని ఆశాభంగాలు, కొండొకచో చీదరింపులు. నా మొట్టమొదటి అచ్చు రచన 1953 డిసెంబర్‌ మొదటి వారంలో తెలుగు స్వతంత్రలో వచ్చినట్లు జ్ఞాపకం. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు. ఆ తరువాత 19 ఏళ్ల వయసులో ‘జారుడు మెట్లు’ అనే నవల (లేదా నవలిక) ఆ పత్రికలోనే ధారావాహికగా వచ్చింది. దానికి విస్మయావహంగా చాలా పేరు వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఎం.ఏ. చదివినప్పుడు నా సహపాఠులు, సమ వయస్క రచయితలు నన్నెంతో ఆప్యాయంగా, అభిమానంగా చూసేవారు. నా ఎం.ఏ. బ్యాచ్‌ విద్యార్థులలో మొట్టమొదటి పిహెచ్‌.డి. తీసుకున్నవాణ్ణి నేనే. ఎం.ఏ. చదువుకునే కాలానికే నా పుస్తకాలు ఐదు అచ్చైనాయి.

1964లో వీరేశలింగం పంతులు – సమగ్ర పరిశీలన – అనే విషయమై పరిశోధన పట్టా పొందాను. 1972లో నేషనల్‌ బుక్‌ ట్రస్టు, అఖిల భారత యువజన మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రచయితల సభలో పాల్గొన్నాను. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నా ‘వ్యావహారిక భాషా వికాసం – చరిత్ర’కు బహుమానమిచ్చింది.

అఖిల భారతీయ రచయితల సభలకు దేశ వ్యాప్తంగా అన్ని భాషా సాహిత్యాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వీరంతా సుమారు వంద మంది దాకా ఉన్నారు. ఈ సభలు జరిగే నాటికే నా థీసిస్‌ అచ్చులో వచ్చింది. వీరేశలింగం డైరీలు – లేఖలు కూడా అప్పటికే నేను ప్రచురించాను. ఈ సందర్భంగా భారతీయ భాషల పుస్తక ప్రదర్శన జరిగింది. దేశంలోని గొప్ప రచయితలందరూ ఈ సభలలో పాల్గొన్నారు. దామోదరం సంజీవయ్య విశాలమైన భవన ప్రాంగణంలో వీరేశలింగం – సమగ్ర పరిశీలన అనే థీసిస్‌ ఆవిష్కరణ జరిగింది. వీరేశలింగం.. రాజారామ్‌ మోహనరాయ్‌, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, మహదేవ గోవింద రనడేలతో పోల్చదగినవాడు కదా! ఆయన దినచర్య పుస్తకాలు – లేఖలు 1972కే నేను ప్రకటించాను కదా! ఇటువంటి పని బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడం లాంటి భాషలలో జరిగి ఉంటే ఆ సంకలన సంపాదకుడికి ఎంతో గౌరవం, గుర్తింపు కలిగి ఉండేవి. ఇంచుమించుగా ఇది యాభై ఏళ్లనాటి సంగతి. నా నవలలు రెండు ఆకాశవాణి హైదరాబాద్‌, చెన్నై కేంద్రాల నుంచి ధారావాహికగా ప్రసారమైనాయి. నేషనల్‌ బుక్‌ ట్రస్టు వారి తెలుగు సలహా సంఘంలో సుమారు పదేళ్లపాటు నేను సలహాదారును. ఒక్క విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో కూడా నాకు ప్రవేశం లభించలేదు. 1969 నాటికి గిడుగు వారి భాషోద్యమ కృషిని గూర్చి గ్రంథం రాసి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం పొందాను. 1989 నాటికి గిడుగు వారి ‘ఉద్యమం – జీవితం’ అనే పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి నా రచనలపై పిహెచ్‌.డి., ఎం.ఫిల్‌లు కూడా వచ్చాయి.

ఈ సోదంతా ఎందుకంటారా? తెలుగు భాషా సాహిత్యాభిమానులందరికీ తెలుసు అమెరికాలో ‘తానా’ (దక్షిణ అమెరికా తెలుగు సంఘం) తెలుగు భాషా సాహిత్యం ఆధునిక పురోభివృద్ధికి, వికాసానికి గణనీయమైన సేవ చేస్తోంది. భారతీయ ద్రవ్యమానం ప్రకారం ఇప్పటికి నూరు కోట్ల్లు ఖర్చు చేసి ఉంటారు. తెలుగు భాషా సాహిత్యానికి నిత్య స్మరణీయుడు గిడుగు రామమూర్తి పంతులు పేరిట ‘తానా’ వారు ఒక గౌరవ సంస్మరణీయ పురస్కారం సుమారు ఇరవై ఏళ్లకిందట నెలకొల్పారు. ఇప్పటికి 10 మంది దాకా ఈ పురస్కారం పొంది ఉంటారు. అమెరికా తెలుగు భాషా సాహిత్యాలకు పెద్దదిక్కు వెల్చేరు నారాయణ రావు కనుక ఆయనకు ఈ పురస్కారం ప్రప్రథమంగా ఇచ్చారు. తరువాత చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి, సి. ధర్మరాజు ఇత్యాదులకిచ్చారు. నన్ను ఇంతవరకు గుర్తించలేదని వేరే చెప్పాలా? ఈ గోడు అంతా అందుకే కదా?

గిడుగు రామమూర్తి ‘జీవితం- ఉద్యమం’ తెలుగు విశ్వవిద్యాలయం పునఃప్రచురణ కూడా వచ్చింది. దీనికి భద్రిరాజు పరిచయం రాశారు. ‘రమాపతిరావు కన్నా ఈ విషయం ఇంకెవరు రాయగలరు?’ అని కితాబు ఇచ్చారు ఆయన. అయినా ‘తానా’ పట్టించుకోలేదు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *