ఐక్యతా మంత్రమే ఆయన ఊపిరి

ఐక్యతా మంత్రమే ఆయన ఊపిరి

ఇరవయ్యో శతాబ్దాన్ని మలచిన మహా పురుషులలో డాక్టర్‌ కేశవరావ్‌ బలీరాం హెడ్గెవార్‌ ఒకరు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన యోచన, ఆ సంస్థకు ఉండవలసిన తాత్వికతను నిర్ధారించడం, భవిష్యత్తును దర్శించడం ఇవన్నీ డాక్టర్‌ హెడ్గెవార్‌ మహోన్నతను చాటి చెబుతాయి. విజాతీయత ఈ దేశాన్ని, జీవన విధానాన్ని ఎంతగా ధ్వంసించినా మళ్లీ ఆ వైపే అడుగులు వేస్తున్న జాతి గతిని మార్చిన వారాయన. అదే జీవిత సందేశం. ఆయన జీవిత విశేషాలు, సందేశం గురించి చెప్పే పుస్తకం ‘పరమ పూజనీయ డా. హెడగేవార్‌, జీవితము, సందేశము’. ఇది నవయుగ భారతి ప్రచురణ. ఒకే రచయిత రాసినట్టు కాకుండా, చాలా విధాలుగా సేకరించిన సమాచారానికి పుస్తక రూపం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే కాబోలు రచయితంటూ ఎవరి పేరు ఇందులో లేదు.

డాక్టర్‌ హెడ్గెవార్‌ పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆ కుటుంబం నిజాం సంస్థానం నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్లింది. వందేమాతరం ఉద్యమం ఈ దేశానికి ఒక తాత్విక చింతనను ఇచ్చింది. ఈ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్‌ లోనే అతివాద నేతల ఆధ్వర్యంలో జరిగింది. 1885లో స్థాపించినప్పటికీ జాతీయ కాంగ్రెస్‌లో జాతీయ భావాలు ఆంగ్ల విధేయతకు లోబడినవి. 1905లోనే మొదటిసారి స్ఫుటమైన జాతీయతా స్వరం దాని గొంతులో పలికింది. ఇది జరిగిన ఐదేళ్లకు 1910లో కేశవరావ్‌ బలీరాం హెడ్గెవార్‌ వైద్య విద్య కోసం కలకత్తా వెళ్లారు. అది ఆయనకో అనుభవం. అప్పటికే వంగదేశంలో ఆ ఉద్యమ ప్రభావం పలచబడుతూ ఉండడం ఆయనను బాధించింది. చదువైన తరువాత స్వస్థలం నాగపూర్‌ వచ్చి సామాజిక సేవలో ఉంటూనే, జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలోను పాల్గొన్నారు. స్వాతంత్య్రోద్యమంలో అనేక ఆలోచనా వికానీ మన స్వరాజ్య ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు భిన్నంగా ఆలోచించినవారికీ, కాంగ్రెస్‌కూ విభేదాలు ఉండేవి. ఇది ఉద్యమానికి బలహీనతే. ఈ అన్ని చారిత్రక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయన స్థాపించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. జాతీయత, సాంస్కృతిక జాతీయవాదం పునాదిగా రాజకీయ ఉద్యమమైనా, సామాజిక ఉద్యమమైనా, సంస్కరణోద్యమమైనా నిర్మాణం కావాలన్నదే డాక్టర్‌జీ ఉద్దేశం. అదే సంఘమంత్రం. దీనిని ప్రవచించే పవిత్ర స్థలం సంఘ శాఖ. ఇదే ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

డాక్టర్‌జీ జీవించి ఉండగానే చేసిన సంఘ కార్యం ఒక ఎత్తయితే, ఆయన మరణానంతరం ఆయన చేసిన దిశా నిర్దేశాన్ని అనుచరులు ఆచరించిన తీరు మరొక ఎత్తు. ఈ రెండు అంశాలను కూడా ఈ పుస్తకంలో విశేషంగా చర్చించారు. డాక్టర్‌జీ జీవన యానం, అవసానదశ అద్భుతంగా వివరించారు. ఆయన అంతిమక్షణాలు, ఆ సమయంలో గురూజీని పిలిచి బాధ్యతలు అప్పగింత వంటి అంశాలన్నీ కళ్లు చమర్చే రీతిలో ఉన్నాయి. అంతిమయాత్ర సమయంలో పెద్దల ఉపన్యాసాలు, 13వ రోజు సంస్మరణ కార్యక్రమంలో ఉపన్యాసాలు, తొలి మాసికం నాటి సంగతులు, ఉపన్యాసాల గురించి పుస్తకంలో వివరంగా ఇచ్చారు. డాక్టర్‌జీ స్ఫూర్తి కాబోలు, నాటి ఏ ఉపన్యాసంలో అయినా వ్యక్తిని స్మరించే మాటలు పొదుపుగానే కనిపిస్తాయి. ప్రధానంగా డాక్టర్‌జీ మిగిల్చిన స్ఫూర్తిని గురించి వారు మాట్లాడారు. 1962లో స్మృతిమందిర ఆవిష్కరణ ఘట్టం కూడా ఉత్తేజకరంగా కనిపిస్తుంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి ఒక దశాబ్దం పూర్తయిన సందర్భంగా 1935లో డాక్టర్‌జీ ఇచ్చిన ఉపన్యాసం చదివితే రాజకీయ, సామాజిక, విద్యా రంగాలలో దేశీయమైన, జాతీయమైన చింతన కోసం ఆయన ఎంత తపన పడ్డారో తెలుస్తుంది. ఇదొక పరంపరకు సంబంధించిన చింతన. అది జాతీయ కాంగ్రెస్‌లో కూడా ఉండేది. మాలవీయ, లజపతిరాయ్‌, తిలక్‌, బిపిన్‌పాల్‌, అరవిందులు వంటివారి ఆలోచనలకు అది కొనసాగింపు. ఇలాంటి చింతన ఈ దేశానికి ఎంత అవసరమో 1935 నాటి చారిత్రక దృశ్యాన్ని చూస్తే అవగతమవుతుంది. 1935 నాటి ఆ ఉపన్యాసంలోనే డాక్టర్‌జీ హిందూ సమాజ సంఘటన ఎందుకో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సంఘం అలాగే నడుచుకుంది. ”మనం సంఘటనా కార్యం చేస్తున్నది ఇతరులు ఎవరిమీదనో దాడి చేయడానికి, వారి సంపదను దోచుకోవడానికి కాదు. వారిని నామరూపాలు లేకుండా చేసి వారి సంపదను మనం స్వాధీనం చేసుకుని ధనవంతులమై కులకడానికి కాదు. ఇతరులలో ఉన్న అన్యాయపూర్ణమైన అక్రామక వృత్తిని రూపు మాపటం కోసం మనం సంఘటిత మవుతున్నాం. ఇప్పటివరకు మన దౌర్బల్యాన్ని చూసి అనేకులు మనపై అత్యాచారాలు చేయడానికి అకృష్టులవుతూ ఉన్నారు. కానీ అటువంటి దుస్సాహసాలకు వారు పూనుకోకుండా వారిలోని ఆ దుర్మార్గపు కోరికలను వదలగొట్టడానికి మనం సంఘటనా కార్యం చేస్తున్నాం.’ ఒకవైపు భారత జాతీయ కాంగ్రెస్‌, మరొకవైపు ముస్లిం లీగ్‌ ఉద్యమాన్ని వాటి ధోరణిలో సాగించాలని యోచించిన కాలమది. లీగ్‌ పాకిస్తాన్‌ ఏర్పాటుకు అప్పుడే పునాదులు నిర్మించుకుంటోంది. దీనిని అడ్డుకునే స్పృహ జాతీయ కాంగ్రెస్‌కు లేకపోయింది. బుజ్జగింపు ధోరణి ప్రబలుతున్న కాలం కూడా అదే. హిందూ మహాసభ గొంతు స్ఫుటంగా లేదు. ఇదే విభజనకు పునాదులు వేసింది. ఇందుకు సంబం ధించిన యోచనలు 1935 నుంచి కనిపిస్తాయి. కాబట్టి ఈ దేశానికి ఏమి కావాలో ఆలోచించి, ఎలాంటి చింతన అవసరమో గ్రహించి ముందడుగు వేసినవారే డాక్టర్‌జీ. హిందువుల ఐక్యత అవసరాన్ని ఆయన గమనించడం అందుకే ఒక అద్భుతమని పిస్తుంది. ఇప్పుడు కుహనా మేధావులు లేవదీస్తున్న చొప్పదండి ప్రశ్నలన్నింటికీ కూడా డాక్టర్‌జీ ఉపన్యాసాలలో సమాధానం లభిస్తుంది.

పరమ పూజనీయ డా. హెడగేవార్‌

జీవితము – సందేశము

ప్రచురణ : నవయుగ భారతి

పుటలు : 184,

వెల : రూ.90/-

ప్రతులకు : ప్రతులకు : సాహిత్యనికేతన్‌, కేశవ నిలయం, బర్కత్‌పురా,

హైదరాబాద్‌ – 500 027

ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌, గవర్నర్‌పేట,

విజయవాడ – 500 020

సెల్‌ : 9440643348

– శ్రీరామ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *