సత్యాన్ని బోధించిన ‘స్వామి వివేకానంద’

సత్యాన్ని బోధించిన ‘స్వామి వివేకానంద’

వివేకానందుని జీవితమే ఒక నిరంతర యజ్ఞం. యజ్ఞం కర్మణ్యతకు ప్రతీక. నిరంతర శ్రమ సాధించిన లక్ష్యం. యుగయుగాల సాంస్కృతిక వికాసం, భౌతిక, ధార్మిక ప్రగతి భారత సంస్కృతిలో భాగం. అలాంటి యజ్ఞానికి నిరంతర కర్మ యోగానికి ప్రతీక స్వామి వివేకానంద.

‘ఈ జీవితం వస్తుంది, పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూడునాళ్ళ ముచ్చటే. ఒక క్షుద్ర కీటకం వలె చనిపోవడం కన్నా సత్యాన్ని బోధిస్తూ మరణించడం ఉత్తమం’ అన్నారు స్వామి వివేకానంద. వారి 150వ జయంత్సుత్సవ సందర్భంగా డిశంబరు 2012 నుంచి జనవరి 2014 వరకు ఋషి పీఠంలో ధారావాహికంగా వచ్చిన వ్యాసావళిని 22 అధ్యాయాలుగా చేసి, పుస్తకంగా పాఠకుల కోసం ఋషిపీఠం వారు ముద్రించారు. రచయిత ప్రముఖ జర్నలిస్టు, రచయిత హెబ్బార్‌ నాగేశ్వరరావు . ఈ చిరు పుస్తకంలో వివేక వాణిని కనులకు కట్టినట్లు చూపించారు రచయిత.

నరేంద్రుని జీవితంలో శ్రీరామకృష్ణ పరమ హంసను కలియడం ఒక మలుపు. అది సనాతన ధర్మ పునఃస్థాపనకు ఒక గొలుసు. నరేంద్రుడు తనను కలవడానికి రాగానే ‘నీవు ఇంత ఆలస్యంగా వచ్చావేం? నీ కోసం నేను చాలాకాలంగా ఎదురు చూస్తూన్నాను’ అన్నారు పరమహంస. దైవ స్వరూపం ఎలాంటిది? నరేంద్రుడు దైవాన్ని ఎలా దర్శించాడు, ఎలా సంభాషించాడు ? అంటే – అతనికి చేతులు లేకున్నను స్వీకరించగలడు, కాళ్ళు లేకున్నను వేగంగా పయనించగలడు, కళ్ళు లేకున్నను చూడగలడు, చెవులు లేకున్నను వినగలడు. ఆయన జ్ఞానం, బలం, క్రియలు సహజములు. ఈ సత్యమైన దేవుని సాక్షాతార్కం నరేంద్రునికి కలిగింది.

రచయిత స్వామి వివేకానంద చెప్పిన పలు సత్యాలను, ధర్మాలను మనకందించారు.

‘వాస్తవానికి అనాదిగా ప్రపంచంలో ఒకటే ఉంది. అదే వేద సంస్కృతి. ఆ సంస్కృతి భారతదేశంలో పుట్టింది. అందువల్ల ఆరంభంలో ప్రపంచం ఒకటే. మానవ సృష్టి మొదట భారతదేశంలో మొదలైంది. అతి ప్రాచీనమైనది భారతదేశం. బ్రిటిషువారు ‘ఆర్య’ శబ్ధానికి వక్రభాష్యం చెప్పారు. ఆర్యుడంటే సంస్కారవంతుడు, కరుణామయుడు. అంతేకాని ఆర్యులు ఎక్కడ నుంచో వచ్చి ఈ దేశంలోని కొండ జాతుల వారిని సంహరించిన వారు కారు. అలాగే ‘ఈ దేశం మొదటి నుంచి ఒక జాతి కాదు; మొదట ద్రవిడులు, ఆ తరువాత ఆర్యులు, ఆ పిదప గ్రీకులు, యవనులు, అరబ్బులు, హూణులు, తురుష్కులు చివరగా ఐరోపియన్లు వచ్చార’న్న పిడివాదాన్ని స్వామి వివేకానంద ఖండించాడు.

విశ్వమత మహాసభలో హిందూవాణి వినిపించాలని స్వామి వివేకానంద చికాగో వెళ్ళాడు. చట్ట బద్ధమైన సంస్థ నుండి పరిచయ పత్రం ఉన్న వారికే సభలో ప్రసంగించే అనుమతి ఇస్తారని వివేకానందునికి అలస్యంగా తెలిసింది. దేశం కాని దేశంలో అలాంటి వ్రతం ఎవరిస్తారు ? దివ్య జ్ఞాన సమాజం వారు తమ సిద్ధాంతాలను అంగీకరించిన ట్లైతే ఇస్తామన్నారు. వారి కృత్రిమ సిద్ధాంతాలను వివేకానందుడు ఎలా అంగీకరిస్తాడు ? అయితే అతని మహత్త్వాన్ని, తేజస్సును గమనించిన మెట్‌లాఫ్‌లోని జె.హెచ్‌.రైట్‌ విస్తుపోయాడు. మీ నుంచి పరిచయ పత్రం కోరడమంటే ‘సూర్యునికి వెలుగు ఉంటుందా ?’ అని ప్రశ్నించడం లాంటిదన్నాడు. అతను సాహిత్య విద్వాంసుడు. అతను పరిచయ పత్రం ఇవ్వడం విధి నిర్ణయం. వివేకవాణి, హైందవధుని ఆ సభను ముంచెత్తింది. ‘వివేకానందుడు మహా సభలోని అందరికంటే ఉత్తముడు. సందేహం లేదు. ఇంతటి గొప్ప వానికి జన్మనిచ్చిన విజ్ఞాన భూమికి మతం మార్పిడి కోసం ప్రచారకులను మిషనరీలు పంపడం కంటే మూర్ఖత్వం వేరొకటి లేదు’ అన్న వార్తను న్యూయార్క్‌ హెరాల్డ్‌ ఆ మరుసటి రోజు ప్రచురించింది. వివేకానందుని స్ఫూర్తితో ఐర్లాండ్‌లో జన్మించిన ఐరోపియా వనిత మార్గరెట్‌ నోబుల్‌ భారత్‌ వచ్చి హైందవ జాతీయ తత్వ జ్ఞానురాలై నివేదితగా రూపాంతరం చెంది, జీవించి ఉన్నంత కాలం వివేకానందుని అడుగు జాడల్లో నడిచింది.

కృష్ణుని వంటి యోగి వివేకానందుడు. అర్జునుడు రూపంలో ఉన్నది కోట్లమంది భారతీయులు. కోట్లమంది ‘నరు’లకు నరేంద్రుడు సాక్షాత్కరింప జేసిన కఠోర సత్యం దరిద్ర నారాయణ విశ్వరూపం.

అంతర్ముఖ శ్రమ జీవనం గురించి మరచిన పాశ్చాత్య జాతులు కృత్రిమమైన సిద్ధాంతాలను నిర్మించుకున్నారు. ధర్మ భ్రాంతిని ధర్మంగా ప్రచారం చేసారు. ఈ వైపరీత్యానికి అడ్డకట్ట వేసి సనాతన జీవన సౌందర్య శోభలను వర్షించిన పర్జన్యుడు వివేకానందుడు.

‘రాబోయే 15 వందల సంవత్సరాలకు సరిపడే ఆహారాన్ని నేను అందిస్తున్నాను’ అన్నారు స్వామి వివేకానంద. ఏ జాతికైనా ధర్మమే జీవకర్ర. అందరు దేవతలను పక్కన పెట్టి భారతమాత పూజ చేయమని ప్రబోధించారు. తిరిగి భారతదేశం విశ్వ గురుస్థానంలో ఉండాలన్నారు. అందుకు ప్రజలను నడుం కట్టమన్నారు.

‘స్వామి వివేకానంద ఏం చేసారు ? ఏం చెప్పారు ?’ అనే ఈ చిరు పుస్తకంలో వివేకానందుని సంపూర్ణ జీవితం దర్శనమిస్తుంది.

స్వామి వివేకానంద

ఏం చేశారు?! ఏం చెప్పారు?!

రచన : హెబ్బార్‌ నాగేశ్వరరావు

పుటలు : 100

వెల : రూ.30/-

ప్రతులకు :

1) సాహిత్యనికేతన్‌, కేశవ నిలయం, బర్కత్‌పురా,

హైదరాబాద్‌ – 500 027

ఫోన్‌ : 040-27563236

2) సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌, గవర్నర్‌పేట,

విజయవాడ – 500 020

సెల్‌ : 9440643348

3) ప్లాట్‌ నెం : 1-19-46, హెచ్‌.ఐ.జి.’ఎ’-40

డా||ఎ.ఎస్‌.రావు నగర్‌, హైదరాబాద్‌-62

ఫోన్‌ : 040-27134557

– జి.ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *