సాహిత్య పోటీ

సాహిత్య పోటీ

1968వ సంవత్సరం. అప్పటి ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి’ సాహిత్య విషయమై పోటీ నిర్వహించింది. అంటే రాతప్రతులను ఆహ్వానించట మన్నమాట. అంతకు రెండేళ్లముందే ఇటువంటి పోటీ రాతప్రతుల పరీక్షలు ఆరంభించినట్లున్నది సాహిత్య అకాడమి. ఈ సంవత్సరం పోటీ రాతప్రతుల విషయం ఏమిటంటే ‘వ్యవహారిక భాషాచరిత్ర- వికాసం’.

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి అలనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి కార్యనిర్వాహకవర్గ సమావేశాలలో, భాషా సాహిత్య పరిశోధనలలో, వికాస పథకాలలో ప్రముఖ పాత్ర నిర్వహించేవారు. బహుశా ఈ పోటీ విషయం ఆయనే సూచించి ఉంటారు. ఆయనే సూచిస్తే ఇక చర్చ కోరేవారెవ రుంటారు?

గిడుగువారి కుటుంబంతో మాకు వియ్యపు సంబంధం ఉండేది. అది అప్పటికి మూడేళ్ళ ముందటే సంభవించింది. గిడుగు సీతాపతిపంతులు గారికి నా పట్ల చాలా ప్రేమాభిమానాలుండేవి. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు గిడుగువారి వ్యవహారిక భాషావాదాన్ని సమర్థించారు. నేను కందుకూరి వీరేశలింగం పంతులు గారి సాహిత్య సామాజిక చైతన్యోద్ధోక యుగకర్త్వత్వం గూర్చి పరిశోధన చేసినవాణ్ణి. అందువల్ల సీతాపతి గారికి నా పట్ల దొడ్డ (ఆ వైపు నుడికారంలో చెప్పాలంటే చెడ్డ) అభిమానం. నేను కనబడకపోతే నా గూర్చి ఆరా తీసేవారు.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ‘వ్యవహారిక భాషా వికాసం- చరిత్ర’ అనే అంశం మీద పోటీ రాతప్రతులాహ్వానించారని వారికి చెప్పాను. నేను ఈ పోటీలో పాల్గొంటున్నానోచ్‌ అన్నారు. నేనెంతో సంబరపడ్డాను. ఈ పోటీకి రాతప్రతులు సమర్పించ టానికి గడువు 6 నెలలు. కాని దురదృష్టవశాత్తూ సీతాపతిపంతులు గారు ఈ ప్రకటన వెలువడిన మూడు నెలలకే మరణించారు. నాకు చాలా సంతాపం కలిగింది. సీతాపతిగారు తన డైరీలో నా గురించి రెండు సార్లు ప్రస్తావించారు కూడా. ఆయన ఎప్పుడూ నాతో ఆ రచన చదివాననో, ఈ రచన చూశాననో చెప్పేవారు. నా క్షేమసమాచారాలు అడిగి తెలుసుకునేవారు. కాబట్టి వారి కోరిక తీర్చటం నాకు తప్పదు అనుకున్నాను. అప్పటికి వ్యవహారిక భాష అంటే ఎమిటో? ఎందుకో? ఏం సాధించిందో? నాకు ఈషణ్మాత్రం తెలియదు. వ్యవధి కూడా లేదు! ఏం పోగు చేశానో, ఎట్లా పోగు చేశానో గానీ చాలా సమాచారం సమకూర్చుకున్నాను. సీతాపతి గారి గ్రంథ సముదాయంలో తండ్రిగారి సరంజామా కొంత ఉంది. రామ్మూర్తిపంతులు గారు నడిపిన తెలుగు పత్రికల సంచికలు ఐదో, ఆరో దొరికాయి. ఎలాగైతేనేం గడువు నాటికి రెండు ప్రతుల రూపంగా అకాడమి కోరిన పోటీ గ్రంథం సమర్పించాను. ఒక మూడు నెలల తర్వాత ఈ విషయమై సంతృప్తికరమైన ప్రతులు రాలేదు. ఇప్పుడు రాసినవారు, ఇంకా కొత్తవారు తమ ప్రయత్నాలను మరింత మెరుగుపరచి పునః సమర్పించవచ్చునని పునఃప్రకటన వెలువడింది. అసలేం జరిగిందంటే ఈ పోటీ ప్రతుల సత్తా నిర్ణయకులుగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, తిరుమల రామచంద్రగారు వ్యవహరించారని, భద్రిరాజు బూదరాజును పసందు చేశారని, రామచంద్ర నన్ను మెచ్చారని నాకు తెలిసింది. ఈ పోటీ పరీక్షల్లో మొత్తం ఐదు ప్రతులే బరిలో ఉన్నాయి. నాది, జాస్తి సూర్యనారాయణ, బూదరాజు రాధాకృష్ణ, కె.ఆర్‌.కె. మోహన్‌లవి.

బూదరాజు రాధాకృష్ణ నేను పనిచేస్తున్న తెలుగు అకాడమిలో నా పై అధికారి. ఇతడి ప్రతిని బాగా మెరుగుపరచుకోవటానికే భద్రిరాజు గడువు పొడిగింపు సూచించారని అనధికారంగా గుసగుసలు వినపడకపోలేదు. అప్పుడు బూదరాజు అగ్గిరాముడైనాడు. ఆత్మ ప్రశంస, పరదూషణలేమీ ఎరుగని, ఇసుమంత కూడా ఒల్లని పండితుణ్ణి నన్నూ, అక్షరాలు రాని ఆ శుంఠను ఒకే స్థాయిన పరిగణిస్తారా? చ్చు చ్చు చ్చా చ్చా అని నినద భీషణ శంఖం పూరించి, అటు తర్వాత మా ఇద్దరికి కలిపి ఆ బహుమానం పంచుతున్నామన్న ప్రకటన వచ్చినప్పుడు రాధాకృష్ణ ఆ బహుమానాన్ని తిరస్కరించాడు, నిరాకరించాడు. వెటకారించాడు.

మా ఆఫీసులో నా స¬ద్యోగులు కొందరు సంతోషించారు. బూరాను పూరాగా అభినందిం చారు. బూరా మరింత చెలరేగిపోయాడు. పోనీ ఆ మొత్తం సొమ్ము నాకే ఇవ్వకూడదు (2వేలు) అని నేనభ్యర్థిస్తే అట్లా నిబంధనలు ఒప్పుకోవన్నారు అకాడమివారు. ఈ పోటీలో పాల్గొనటం నా కొంప ముంచుతుందని అనుకోలేదు. విధిని తప్పించడం ఎవరి తరం కాదు. అసలు ఈ విషయమంతా నీకు ఎట్లా తెలుసంటే మా ఇద్దరి మధ్య ఈ తుని తగువు పరిష్కరించినట్లూ, ఇద్దరూ అర్హులే (చస్తే ఒప్పుకోడు రాధాకృష్ణ) అని తానన్నట్లూ సి.నారాయణరెడ్డిగారు నాకు చెప్పారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *