శ్రీ జయ జయ జయేంద్ర సరస్వతీ స్వామి

శ్రీ జయ జయ జయేంద్ర సరస్వతీ స్వామి

భారతదేశ సంస్కృతిలో ఒక చిరంతన సంప్రదాయముంది. కాలం ఎంత ముందుకు గమించినా వేద, వేదాంత తత్త్వచింతన మనదేశంలో స్థిరంగా ప్రభావం ప్రసరింపచేస్తూనే ఉంది. వేల సంవత్సరాలుగా మనకు తెలిసిన చరిత్రలో భారతీయ సమాజంలో అది గణతంత్ర వ్యవస్థ అయినా, రాచరికపు వ్యవస్థ అయినా పాలన నిరుపద్రవంగా అంటే సాంఘిక, ధార్మిక, నైతిక, ఆదర్శమహితంగా ప్రవర్తిల్లినప్పుడల్లా అక్కడ ఒక ఆచార్యుడు, బోధకుడు, తత్త్వవేత్త పాలక వర్గాన్ని కాపాడుతూ రావటం కనపడుతుంది. రామాయణ కాలం నుంచి, మహా భారత ఇతిహాస కాలం నుంచి ఈ ఆచార్యత్త్వం నుతికెక్కతూ ఉండటం ఆయా కాలాల రాచరికపు సుస్థితిని ప్రభావితం చేస్తూనే ఉంది. శ్రీమద్రామా యణం కాలంలో వశిష్ఠ, విశ్వామిత్రులు రఘువంశ చరిత్రను సంరక్షించారు. మహాభారత కాలంలో వ్యాసమహర్షి, భీష్ముడు ఆయా వంశాల ధర్మ పరిపాలనకు ద్రష్టలై మార్గదర్శకత్వం వహించారు.

గడిచిన సహస్రాబ్దాల, శతాబ్దాల భారతదేశ చరిత్రలో ‘ఆరు స్వర్ణ పత్రాలు’ అనే విశ్లేషణ వ్యాఖ్యానంలో ప్రముఖ దేశభక్తుడు వినాయక దామోదర సావర్కార్‌, మౌర్య సామ్రాజ్య అజేయ చరిత్ర పథ నిర్దేశకుడు ఆర్య చాణక్యుడని సిద్ధాంతీ కరించారు. ఈ ఆరు పత్రాల వివరణను సమకాలీన సాహిత్య మేరువు పుట్టపర్తి నారాయణాచార్యులు ఎంతో ఆసక్తికరంగా, చక్కగా తెలుగులో చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర ఏమిటి ? సమర్థ రామదాసస్వామి రాజనీతి ప్రబోధం వల్లనే కాదు శివాజీ రణనీతిలో ప్రాతః స్మరణీయుడయ్యాడు. జాతీయ భావ ప్రేరితులైన భారతీయులకు విద్యారణ్య స్వామి వల్లనే కదా విజయనగర సామ్రాజ్య స్థాపనం జరిగింది. అక్కన్న, మాదన్నలు రాజనీతిలో విధులు కావటమేకాక హిందూ సంప్రదాయ, సంస్కృతి పరిక్షకులు కూడా అని నిన్న మొన్నటి చరిత్ర చెపుతుంది. స్వామి జయేంద్ర సరస్వతి కూడా ఆ కోవలోకే వస్తారు.

లోకమాన్య బాలగంగాధర తిలక్‌ మహాశయుడు భగవద్గీత ప్రబోధం కర్మ మార్గానుష్ఠానమే అని విశదీకరించారు. ఆయన ఇండాలజీ (పురా హిందూ సంస్కృతి)లో మేరు శిఖరం వంటివారు. గీతా రహస్యం వంటి గ్రంథం ఆధునిక కాలంలో హిందూ తత్త్వ శాస్త్ర పారమ్యాన్ని వివరించగలది ఇంకొకటి లేదు. ఈ కనపడుతున్న జగత్తు జగదీశ్వరుడి వివర్త ప్రకాశనమే కాబట్టి జగత్యేవే ప్రధానంగా గీతాశాస్త్రం బోధిస్తుందని లోకమాన్యుడి నిష్కర్ష.

సమాజాన్ని కాపాడుకోవటమే దేశ సంస్కృతి సంరక్షణకు, మత నిష్ఠకు, వేల సంవత్సరాల పరంపరాగత చతుర్విద పురుషార్థ సంయగ్‌ యోగానికి ప్రాతిపదిక అని స్వామి జయేంద్ర సరస్వతి ఆశంస. 60 సంవత్సరాల తన జీవితంలో దీనిని స్వామి లక్ష్యం చేసుకున్నారు. 1970లో కంచి పరమాచార్యులు ఖైరతాబాద్‌లో విడిది చేసినప్పుడు నేను నా తల్లిదండ్రుల చేత వారి పాదపూజ, నిర్వర్తింప చేయగలిగాను. అది నా జీవితంలో గొప్ప అదృష్టం. కంచిలో కూడ ఒకసారి పీఠాన్ని దర్శించాను. అన్నట్లు పొద్దుటూరి నుంచి కొన్నాళ్ళు వెలువడ్డ ‘కామకోటి’ పత్రికకు పుట్టపర్తి నారాయణా చార్యులు సంపాదకులు.

18,19 సంవత్సరాల యవ్వనంలోనే స్వామి జయేంద్ర సరస్వతి సన్యాసాశ్రమ స్వీకారం చేసి యోగ పట్టనామధారణ చేశారు. పూర్వాశ్రమంలో ఆయన మహాదేవ సుబ్రహ్మణ్యులు. వర్తమాన కాలంలో కంచి పరమాచార్యులు. జగద్గురువు సంప్రదాయానికి ఆయన రత్నదీపం.

నేను అప్పుడప్పుడు కంచి కామకోటి పీఠ పరమాచార్యులు, ఆయన సంప్రదాయ పరంపరనంతర స్వాముల కథలు వింటూ వచ్చాను. పది, పదిహేను సార్లు దర్శించుకున్నాను కూడా. పరమాచార్యులతో జంకు గొంకులు లేకుండా అధిక ప్రసంగం కూడా చేశాను. మొట్టమొదటిసారి 1968లో స్వామివారు సికింద్రాబాద్‌ కవుతా వారి స్వరాజ్య నిలయంలో బసచేసినప్పుడు దర్శించాను. అప్పుడు జయేంద్ర సరస్వతీ స్వామి ఉత్తరాధికారి. కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు, ఆయన సోదరుడు వీరభద్రశాస్త్రి కంచికామకోటి పీఠ అనుగృహీతులు. సుబ్రహ్మణ్య దీక్షితులు తమ గురు అనంతర కృపాల హరిని, ఆయన సొంత ప్రతిని మధ్యమధ్యలో తెల్లకాగితాలు కూర్చి నాకు దయచేశారు. ఇది సంస్కృత భాషలో గొప్ప గురుస్తుతి కావ్యం. ఇందులో పరమాచార్యుల గురించి, వారి తరువాత పీఠాధిరోహణ చేయాల్సిన జయేంద్ర సరస్వతీ గూర్చి ఎన్నో విశేషాలున్నాయి. పరమాచార్యులు ఆర్ద్రకరుణా హృదయ సంశోభిత ప్రేమమూర్తులు కాగా, స్వామి జయేంద్ర సరస్వతీ నిత్య నిరంతర ఉత్సాహ సోల్లసిత స్మితాదర వదనలు. ఒకసారి వారి పరిచయాదృష్టం పొందితే రోజూ కొన్ని వేలమంది వారిని దర్శిస్తూ వచ్చినా, తమదరి చేరి పరిచయ భాగ్యం పొందిన వారి పేరు కూడా ఆ తరువాత కాలంలో గుర్తించగల వారు. ఇది నా స్వానుభవం.

కర్నూలులో 1983లో జయేంద్ర సరస్వతీ స్వామి అనంతర పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతీ స్వామితో కలిసి పెద్దస్వామి చాతుర్మ్యాస్వం నిర్వహించారు. తుంగభద్ర నదిలో వారి స్నానాలు, పూజలు దర్శించే భాగ్యం నాకు కలిగింది. ఆ తరువాత మళ్ళీ కర్నూలు సమీపంలోనే కాశీబుగ్గ అనే చోట వారిని దర్శించాను. అప్పుడు నాకు పరమాచార్యుల సన్నిధి సుమారు 45 నిమిషాలు లభించింది. జయేంద్ర సరస్వతీ స్వామితో ఉల్లాస ప్రవృత్తిలో ‘చిన్నస్వామి వారు’ అంటూ ఏదో ప్రసక్తి తెచ్చాను. అప్పుడు ఆ స్వామి నవ్వుతూ ‘చిన్న, పెద్ద పరిగణన అదికాదు స్వామీ తెలుగులో చిన్నం అంటే బంగారు ఎత్తు తూగె గురిగింజ ప్రమాణం’ అన్నారు. అదే నా ఆంతర్యం కాబోలు అన్నానేను. అప్పుడు స్వామి బంగారు వన్నెతో మెరిసిపోతూ పద్నాలుగేళ్ళ కౌమారస్వామి మాటలకు జయేంద్ర సరస్వతీ పకపక నవ్వారు. ఇది తలచుకున్నప్పుడల్లా నా జీవితానికి కూడా ప్రమోదావహమైన అదృష్టం ఏదో ఉందనిపిస్తుంది.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *